Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 16

 

    "జీవితం ముళ్ళబాట అని మీరూ అన్నట్లు సర్వర్ చెప్పాడు" అన్నాడు అతన్తో.
    "ఏమిటి? ఏమిబాట?" అయోమయంగా అడిగాడతను.
    "అదే! 'జీవితం ఓ ముళ్ళబాట' అని మీరూ అన్నారని...."
    "నేనన్నానా?"
    "అవును! సర్వర్ అన్నారని చెప్పాడు!"
    "ఏ సర్వర్?"
    "అదే! ఈ హోటల్ సర్వర్! పేరు సురేష్!"
    "ఓ! ఐసీ! ఏమన్నాడతను! జీవితం ఓ ముళ్ళబాటంటాడా?"
    "అతను కాదు! మీరన్నారట! అతడు నాతొ చెప్పాడు!"
    "అలాగా!" కొద్దిక్షణాలు ఆలోచించాడతను. "ఏమో! బహుశా అనే ఉంటాను! కానీ 'ముళ్ళబాట ' అన్నానా, 'ముళ్ళబాట' అంటే మీరు 'ముళ్ళతోట' అని చదువుకోండి!"
    "ఓకే, ఓకే" అభయమిచ్చాడు భవానీశంకర్.
    "కానీ ఆ సర్వర్ తో నేను మాత్రం జీవితం ఒక 'ముళ్ళబాట' నే అన్నాను!"
    అతను ఆశ్చర్యపోయాడు.
    "మీరూ అన్నారా?"
    "అవును! అప్పుడే అంతకుముందు మీరూ అదే మాట అన్నట్లు సర్వర్ నాతొ చెప్పాడు! అంటే మీరు నాలాగానే ఏదో గడ్డు పరిస్థితిలో ఉండి ఉంటారని ఊహించాను!....."
    "ఎగ్జాక్ట్ లీ!' అంగీకర సూచకంగా తలూపుతూ అన్నాడతను. "కాస్తా కూస్తా కాదు! ప్రాణాల మీద కొచ్చింది పరిస్థితి! అందుకే చాలా వర్రీగా ఉన్నాను! ఇంతకూ మీరెందుకు వాడారా పదం? ఏం జరిగింది ?" అడిగాడతను.
    "మా బాస్ నన్ను టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగంలో నుంచి డిస్ మిస్ చేసి పారేశాడు?"
    "ఎందుకని?"
    "రాంగ్ కనెక్షన్!"
    "ఆ మాత్రానికే డిస్ మిస్సా!"
    "అవును! బార్బారిక్ కదూ!"
    "అంతేకాదు ఇన్ హ్యూమన్?"
    "పొరపాట్లనేవి ఎవరికయినా జరుగుతాయి కదా!"
    "అసలు అవే చేస్తారందరూ ఎక్కువగా!"
    "ఓ లీడింగ్ జర్నలిస్ట్ - టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేస్తే - అవి ఇంకొంచెం ఎక్కువ జరిగేందుకు అవకాశం ఉంది కదా!"
    "అంటే మీరు జర్నలిస్టా?"
    భవానీశంకర్ కి ఆ ప్రశ్నతో పోయిన ఉత్సాహమంతా కేరితలు కొడుతూ తిరిగి వచ్చేసింది.
    "జర్నలిస్టా అని మెల్లిగా అడుగుతారేమండీ! బోర్న్ జర్నలిస్ట్! నేను జర్నలిజం ఎగ్జామినేషన్ రాసిన సంవత్సరం ఏం జరిగిందో తెలుసా?"
    "ఏం జరిగింది?"
    "గోల్డ్ మెడల్ వచ్చింది మనకి!"
    "గోల్డ్ మెడల్?"
    "ప్యూర్ గోల్డ్ మెడల్!"
    "ఒండరపుల్!"
    "థ్రిల్లింగ్ ! మా ప్రిన్సిపాలే నమ్మలేదు. - ఆ విషయం! మెడల్ స్టేజి మీద అందుకుని బయటకొచ్చాక కూడా "నాకు ఇంకా డౌట్ గానే ఉంది" అన్నాడు!"
    "మరి జర్నలిజంలో గోల్డ్ మెడలుండి - టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం ఏమిటి?"
    భవానీశంకర్ ని మళ్ళీ దిగులు అల్లుకుపోయింది.
    'అందుకే 'జీవితం ముళ్ళబాట' అన్నాను సర్వర్ తో! అన్నట్లు మీ పేరు?"
    "ఆర్ .కే. చిరంజీవి!"
    "ఆ! ఆర్. కే. చిరంజీవి?" ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు ఉలిక్కిపడి అడిగాడు భవానీశంకర్.
    "డోంట్ బాదర్ ఎబౌట్ ఆర్కే! చిరంజీవి అంటే చాలు!"
    భవానీశంకర్ 'చిరంజీవి, చిరంజీవి, అని వల్లిస్తూ కొద్ది క్షణాలు అలోచించి చటుక్కున ముందుకు వంగాడు.
    "కొంపదీసి మీరు సెయింట్ మేరీస్ స్టూడెంట్ కాదు గదా?"
    చిరంజీవి ఆశ్చర్యపోయాడు.
    "సెయింట్ మేరీస్ స్టూడెంట్ నే! మీకెలా తెలుసా విషయం?" భవానీశంకర్ లోని ఆత్రుత, ఉత్సాహం చొచ్చుకొచ్చేసినయ్.
    "అయితే మీది సెవెంటీత్రీ - హెచ్. యస్.సి. బాచ్ కాదు కదా?"
    "సెవెంటీత్రీ హేచ్చేస్సీ బాచే!"
    "చంపేస్తున్నారు - హేచ్చేస్సీలో 'బి' సేక్షనేనా?"
    "అవును!"
    భవానీశంకర్ స్పృహ తప్పుతున్నట్లనిపించింది ఆనందంతో.
    "అయితే ఇంక అనుమానం లేదు! మీరు ఆర్.కె. చిరంజీవే!"
    చిరంజీవికి చిరాకేసుకొచ్చింది.
    "ఆర్. కె. చిరంజీవినని నేనే చెప్పాను కదా!"
    "చెప్పావోయ్! అయితే నువ్వు నన్నింకా గుర్తుపట్టలేదన్నమాట!" కూలింగ్ గ్లాసెస్ తీస్తూ అన్నాడు భవానీ.
    చిరంజీవి పరీక్షగా భవానీశంకర్ వైపు చూశాడు. కానీ ఖచ్చితంగా ఏమీ గుర్తుకు రావటం లేదు. అతని ముఖం అదివరకే పరిచయమున్నట్లు మాత్రం అనిపిస్తోంది.
    "నేనేరా పక్షీ! భవానీశంకర్ ని!"
    "భవానీశంకరా?" ఆలోచిస్తూ అడిగాడు చిరంజీవి.
    "సెంట్ పర్సెంట్ భవానీశంకర్ ని! ఇంకా గుర్తు రాలేదా?"
    "వస్తోంది ! వస్తోంది..." గుర్తుకి తెచ్చుకుంటూ అన్నాడు చిరంజీవి.
    "ఎంత మతిమరుపు పక్షివిరా నువ్వు? మనిద్దరం మన ప్రిన్సిపాల్ రూమ్ లో అర్ధరాత్రి ఎనిమిది నీటిపాముల్ని వెంటిలేటర్ లోనుంచి పడేశాం! గుర్తులేదా?"
    చిరంజీవికి టక్కున గుర్తుకొచ్చేసింది. ఆశ్చర్యానందాలతో భవానీ శంకర్ చేయి గట్టిగా పట్టుకున్నాడు.
    "నువ్వు.....నువ్వు.....ఆ భవానీశంకరానివా?"
    "యస్ మైడియర్ ఫెలో! నా రోల్ నంబర్ ఫార్టీ సిక్స్!"
    "గుర్తుందిరా! మనం లాస్ట్ బెంచిలో కూర్చునేవాళ్ళం!"
    "ఎగ్జాక్ట్ లీ!"
    చిరంజీవి ఇంక ఆలస్యం చేయలేదు. చటుక్కున లేచి టేబుల్ చుట్టూ తిరిగివచ్చి భవానీశంకర్ ని అమాంతం కౌగలించుకున్నాడు.
    "ఎంత మారిపోయావురా నువ్వు? అందుకే సడెన్ గా గుర్తుపట్టలేక పోయాను."
    అప్పుడే పక్క టేబుల్ దగ్గరకొచ్చి నిలబడ్డ సర్వర్ సురేష్ వారిద్దరూ కౌగలించుకోవటం చూచి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా సినిమాల్లో హీరో హీరోయిన్లు కౌగలించుకుంటారు గానీ ఇలా ఇద్దరూ హీరోలే కౌగలించుకోవటమేమిటి? అనిపించిందతనికి.
    "ఆయామ్ వెరీ హాపీ బ్రదర్! అన్నాడు చిరంజీవి. "ఎన్నో ఏళ్ళ తరువాత ఎంత హటాత్తుగా - కలుసుకున్నామో చూడు!"
    "అవును, వేరీవేరీ ఫ్లూక్" వప్పుకున్నాడు భవానీశంకర్.
    "ఎన్నిసార్లు నీ గురించి తలుచుకునేవాడిని! కానీ నీ ఆచూకీ ఏమాత్రం తెలీలేదు. ఏమైపోయావ్ ఇంతకాలం?"
    "అది చాలా పెద్ద కధ బ్రదర్! మొదలు పెట్టానంటే ఇద్దరం ఇక్కడే రిటైరయిపోతాం! కనుక వీలు దొరికినప్పుడల్లా ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో చెప్తాను. అదిసరే మన బెంచిమేట్స్ ఇంకొంతమంది ఉండాలి కదా? వాళ్ళందరూ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో నీకేమయినా తెలుసా?" ఉత్సాహంగా అడిగాడు భవానీ శంకర్.
    "ఒకే ఒక్కడు కనబడ్డాడీమధ్య!"
    "ఎవరది?"
    "జయకర్ ప్రకాష్!"
    "అన్నట్లు నువ్వేం చేస్తున్నావిప్పుడు ?" అడిగాడు భవానీ శంకర్.
    చిరంజీవి కేం చెప్పాలో తెలీలేదు! తన పరిస్టితి తల్చుకుంటే గుండె బరువెక్కిపోతోంది గాడంగా నిట్టూర్చి "నధింగ్!" అన్నాడు దీనంగా.
    "అయితే మరి ఏమీ చేయకుండా - ఎలా గేటాన్ - అవుతున్నావ్? అన్నట్లు నీకెవరో ఓ మావయ్య ఉండాలి కదా! పెద్ద మేడా , కారూ...."
    'అవును! ఈ మధ్యే మా మావయ్య చనిపోయాడు! ఆ ఆస్తికి నేను వారసుడిని!"
    "వ్వాట్!" ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు భవానీశంకర్! 'అంటే నువ్వు ఇప్పుడు లక్షాధికారివన్న మాట! అంతేనా?"
    చిరంజీవి కొంచెం ఇబ్బందిగా తలూపాడు.
    భవానీశంకర్ ఈసారి తనే చిరంజీవిని కౌగలించుకున్నాడు. సర్వర్ సురేష్ వాళ్ళిద్దరూ మళ్ళీ కౌగలించుకోవటం చూచి మళ్ళీ ఆశ్చర్యపోయాడు.
    "అద్భుతంగా ఉంది గురూ సెటప్! ,మన ఫ్రెండ్స్ సర్కిల్ లో అంతా అష్టదరిద్రాలే అనుకుంటుంటే - నువ్వొక్కడివాయినా లక్షాధికారిగా కనిపించావ్! ఎంతయినా ఓ మాంచి ఫ్రెండ్ లక్షాధికారి అయింటే జీవితం చాలా త్రిల్లింగ్ గా ఉంటుంది కదూ!" అడిగాడు భవానీశంకర్.
    "అవును! చాలా త్రిల్లింగ్ గా వుంటుంది. బైదిబై నీ దగ్గర అరవై పైసలుంటే అప్పిస్తావా?" అడిగాడు చిరంజీవి.
    భావానీశంకర్ కి మతి పోయినట్లయింది.

 Previous Page Next Page