సరీగ్గా అప్పుడే జరిగింది అనూహ్యమైన ఆ సంఘటన.
రేంజర్ మెడమీద ఏదో ఒత్తిడి. ఉలిక్కిపడి కదలబోయాడు.
"కేవలం ముందుచూపే వుంటే ఏం జరుగుతుందో అదే జరగబోతోంది. నీ చేతిలోని రైఫిల్ ని కిందపడేయ్" అంటూ ఆ నిశీధిలో గంభీరంగా వినిపించిందో కంఠం.
"వీరూ" అంటూ ఒక గార్డ్ భయంతో కేకవేశాడు.
"మమ్మల్నేం చేయకు. మాకేం తెలీదు" మరో గార్డ్ దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో అర్థిస్తున్నట్లుగా అన్నాడు. అలా అన్నారేతప్ప వెనక్కి తిరిగిచూసే ప్రయత్నం చేయలేదు.
అప్పటికే రేంజర్ కి అర్థమయిపోయింది. శత్రువులు తన ఏమరపాటుని ఆసరాగా తీసుకొని వెనుక నుంచి వచ్చారని. తన మెడకు గురిపెట్టబడింది. రైఫిల్ అనికూడా అర్థం చేసుకున్నాడు. గత్యంతరం లేక చేతిలోని రైఫిల్ ని క్రిందపడేసి, ప్రక్కనున్న గార్డ్స్ కేసి సహాయం కోసం చూశాడు. వాళ్ళప్పటికే పేరలైజ్ అయిపోయారు. వచ్చింది వీరూనా? అన్న ఆలోచన రాగానే మాదప్ప రక్తం గడ్డకట్టుకుపోయింది. శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు.
మరికొద్దిక్షణాల్లోనే ఐదు లారీలు ఆ చెక్ పోస్టుని దాటి ముందుకి దూసుకుపోయాయి.
మాదప్ప తేరుకొని చుట్టుపక్కలకు చూశాడు. తను, నలుగురు గార్డ్సు తప్ప మరెవరూ లేరు.
తన పరిస్థితికి తానే సిగ్గుపడిపోయాడు. వచ్చింది వీరూ అయివుండవచ్చేమో అన్న ఆలోచనే....కేవలం ఆలోచనే తనని స్తంభింపజేసిందంటే ఏమిటర్థం?
అతని గురించి, అతను వేసే ఎత్తుల గురించి, వేలాడే విధానం గురించి కథలు కథలుగా విని వుండటంతో తనకు తెలియకుండానే తనలో భయం చోటుచేసుకుంది "వీరూ" అని తెలీటంతో.
"చేతికందినట్లే అంది ఎంతలో అదృష్టం చేజారిపోయింది? మీరు అలర్టుగా వుండి వుంటే వీరూని పట్టుకొనివుండేవాళ్ళం. కనీసం అతనెలా వుంటాడో కూడా చూడలేకపోయాను" మాదప్ప స్వగతంలో అనుకున్నా గార్డ్సుకి వినిపించింది.
"అవునవును. మేం అలర్టుగా వుండి వీరూ అని అరవబట్టే తమరు, మేమూ బ్రతికిపోయాం" అన్నాడో గార్డ్ ఊపిరి తీసుకుంటూ.
"నాకర్థంకాలేదు మీరన్నది"
"వచ్చింది వీరూ కాదు" మరో గార్డు అన్నాడు.
ముందు తను విన్నదేమిటో అర్థంకాలేదు. అర్థంకాగానే_"వ్వాట్?!" అంటూ అరిచాడు రేంజర్ మాదప్ప.
"అవును"
"ఎందుకలా అబద్ధం చెప్పారు?"
"తమరి ధైర్యం ఏపాటిదో తెలుసుకుందామని"
"యూ....స్టుపిడ్" రేంజర్ కళ్ళెర్రజేస్తూ అరిచాడు.
"రాకముందు వరకు అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్నారు. కేవలం పేరు చెప్పగానే ఎందుకు భయపడిపోయారు? ఇంత చిన్నదానికి వీరూ వస్తాడా అనికూడా ఆలోచించలేదు. మరి మా పరిస్థితీ అంతే. మీరు, మేం బతికి బట్టకట్టటానికే అలా వీరూ అని అరిచాం. వీరూ నుంచి మనల్ని రక్షించింది వీరూ అన్న మా కేకే. అలా అరవబట్టే మీరు బిగుసుకుపోయి రైఫిల్ వదిలేశారు. అలా జరగబట్టే లారీల్ని వదిలేయగలిగాం. వదిలేశాం గనుకే మనకీ భూమిమీద ఇంకా నూకలున్నాయి" నిర్లక్ష్యంగా అన్నాడో గార్డు.
"ఆ వచ్చిన వ్యక్తెవరు?" మాదప్ప ఆశ్చర్యపోతూ అడిగాడు.
"ఎవరూ రాలేదు" మా నలుగురిలో ఒకరు మీ వెనక్కి వెళ్ళి గొంతు మార్చి అలా మాట్లాడారు"
చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం అలముకుందక్కడ. ఒడలు జలదరించే భయం పేరుకుందక్కడ.
"మీ నీతీ, నిజాయితీల్ని నిరూపించేందుకు మేం బలిపశువులంకాలేం. అందుకే అలా మేమే నాటకం ఆడాం. అరిచి, గోలచేసి, మా పర్సనల్ ఫైల్స్ మీద మీరు రిమార్క్ రాస్తే, మీరు వీరూ ఆతిథ్యం స్వీకరించక తప్పదు. మీ దుస్సాహసం అన్నివేళలా మంచిదికాదు. మా పెళ్ళాం బిడ్డల్ని దిక్కులేనివాళ్ళని చేయలేం. మీరేం చేసినా సరే...." ఒక గార్డు మొండిగా అన్నాడు.
రేంజర్ హఠాత్తుగా అడ్డం తిరిగిపోయిన గార్డ్సుని చూసి తెల్లమొఖం వేశాడు.
"ఒక వ్యక్తి బ్రతుక్కీ, మృత్యువుకీ మధ్యవుండే సన్నని సరిహద్దుని ఈ అటవీ ప్రాంతంలోనివాళ్ళు తరచూ చూస్తుంటారు. ఆ సరిహద్దు అలాగే వుండాలా చెదిరిపోవాలా అన్నది నిర్ణయించేది వీరూనే. ఇక్కడ యమపాశం కనిపించని యముడి చేతుల్లో వుండదు. అనిపించే, వినిపించే వీరూ చేతుల్లో వుంటుంది. బ్రతకాలనుకుంటే వెళ్ళి రెస్టు తీసుకోండి. మీ వాటా మీకందుతుంది...." అంటూ ఆ గార్డ్ మిగతా గార్డ్స్ వేపు తిరిగి "నిద్రొచ్చేస్తుంది పడుకుందాం పదండి. రేపందే వీరూ మామూళ్ళతో మా అమ్మకు కంటి ఆపరేషన్ చేయించాలి. మా పిల్లాడ్ని స్కూల్లో చేర్పించాలి" అంటూ ఆ గార్డు చెక్ పోస్టు ఛాంబర్ లోకి వెళ్ళిపోయాడు నిర్లక్ష్యంగా. రేంజర్ మాదప్పలో తొలిసారి నిజంగానే, అతనికి తెలిసే భయం చోటుచేసుకుంది.
ట్రెడ్ర్రైన్ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ బోర్డర్.
అటవీ పర్వతశ్రేణుల్లో పొంచివున్న మృత్యువు. ఇక్కడ ఒక వ్యక్తి బ్రతకాలా లేదా అన్నది నిర్ణయించవలసింది ఆ వ్యక్తి ఆరోగ్యమో, తెలివితేటలో, రక్షణ పాటవమో, నీతి నిజాయితీలో కాదు. వీరూ పెదవుల నుంచి వెలువడే మాట.
అతని కళ్ళల్లో తింగిచూసే సంజ్ఞ....
అతని చేతివేళ్ళ చివర దాగిన నేర్పు....
రేంజర్ మాదప్ప నిట్టూర్చాడు.
గార్డ్స్ మానసిక క్షోభని, భయాన్ని, ఆవేదనని అర్థం చేసుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి క్యాబిన్ లో వున్న బల్లమీద నడుం వాల్చాడు.
గార్డ్స్ క్రింద చాప పర్చుకొని నిద్రలోకి జారుకున్నారు. జారుకోబోయేముందు ఒక గార్డ్ అన్నాడు. "మన డ్యూటీని మనం నిజాయితీగానే నిర్వర్తించాం. ఇటువేపు దొంగ సరుకేది రాలేదు. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా కాపు కాశాం. దట్సాల్...."
భయం బ్రతకటమెలాగో నేర్పింది.
ఆ బ్రతకటం బాధ్యతల్ని నెత్తినేసుకుంది. నెల జీతాలతో తీరని అవసరాలు కొత్త నెలవుల్ని చూపించాయి....అంతే.
* * * *
"ఎవరీ అమ్మాయి?" మైసూర్ జిల్లా ఫారెస్ట్ విభాగానికి ఎస్.పి.గా యుద్ధ ప్రాతిపదికపై రప్పించబడ్డ రంజిత్ ప్రశ్నించాడు.
అతని కంఠం శాసిస్తున్నట్లుగా గంభీరంగా వుంది. అప్పుడు సమయం ఉదయం పదిన్నర గంటలు. ఫారెస్ట్ విభాగం ఎస్.ఐ. ఆఫీసులో పనిచేస్తున్న పోలీస్ అధికారులు రంజిత్ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయారు.
రంజిత్ లాంటి పరమ కర్కోటకుడైన ఐ.పి.ఎస్. ఆఫీసర్ చాలా రేర్ అని అనుకోవటం ఆ సిబ్బందికి తెలుసు. దయాదాక్షిణ్యాలు మచ్చుకైనా లేని నరరూప రాక్షసుడని రంజిత్ కి పేరు. నేరస్థుల గుండెల్లో నిద్రపోతాడని, ఎవర్నీ లెక్కచేయడని, దేనికీ ఎవరికీ భయపడడని అతని గురించి డిపార్టుమెంటులో కథలు కథలు చెప్పుకోవటం వారికి స్ఫురణకు వచ్చే, వాళ్ళు బిగుసుకుపోయారు.
కావాలనే డి.జి.పి. రంజిత్ ని ఆ పోస్టులోకి రప్పించినట్లు మాత్రమే వారికి తెలుసు.
"చెప్పండి....ఎవరీ పిల్ల? నిజంగా, నిజాయితీగా పట్టుకోవాలనుకుంటే పట్టుకోలేరా పోలీసులు అని రాసిందంటే ఏమిటర్థం? ఊఁ...." గద్దించాడు రంజిత్ తిరిగి తన చేతిలోవున్న మూడురోజులనాటి ఇంగ్లీష్ డైలీని విసిరికొడుతూ.
"మహిమ....అని ఓ ఇంగ్లీషు డైలీ రిపోర్టర్ సార్" ఒకతను ఒకింత ధైర్యంచేసి అన్నాడు.
"మాకది తెలీదు మరి? నా చేతిలో వున్నది న్యూస్ పేపర్ అనీ, ఈ తిక్కిరి వాక్యం రాసింది మహిమ అని, క్రిమినల్స్ గురించి రాసే రిపోర్టర్ క్రైమ్ రిపోర్టర్ అని కూడా తెల్సుకోలేని స్థితిలో వున్నానని మీ అభిప్రాయం, అంతేనా?" కేప్ తీసి టేబుల్ మీదకి విసురుతూ కోపంగా అన్నాడు రంజిత్.