రెండోసారి మోగింది బెల్.
తలుపు గడియపెట్టలేదు తను.
చెమటలు పోశాయతనికి.
వచ్చిన వాళ్ళు తలుపు తోసుకుని లోపలికి రావడానికి ఎంతోసేపు పట్టదు.
ఏం చేయాలి తను? ఏం చేయాలి?
కర్చీఫ్ తీశాడు.
మొహం తుడుచుకున్నాడు.
మెరుపులా తట్టిందా ఆలోచన.
అంతే.... ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటకొచ్చి, మేడ మీదకి పరిగెత్తాడతను.
క్రింద తలుపులు తెరుచుకున్నాయి.
శృతి పడక గదిలోకి దూరాడు సాగర్. తలుపు దగ్గరగా వేసేశాడు.
సందులోంచి చూశాడు.
హబీబ్, అతనితోపాటు పూలబొకేతో మరో వ్యక్తి వచ్చారు లోపలికి.
వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి హబీబ్ మెట్లెక్కసాగాడు.
మేడమీది గదుల్లో శృతికోసం కాబోలు ఒక్కో గదే వెదుకుతూ ఆమె పడక గది దగ్గరికొచ్చాడు.
మంచం దగ్గరకెళ్ళి నిల్చున్నాడు సాగర్.
అతని గుండె కొట్టుకొంటున్న శబ్దం అతనికే స్పష్టంగా వినిపిస్తోంది.
"అమ్మాయి గారూ...." పిలిచాడు హబీబ్.
"అమ్మాయి గారూ...."
డెస్పరేట్ గా చుట్టూ చూశాడు సాగర్ దాక్కునే దారేడైనా కన్పిస్తుందేమోనని.
ఏమీ తోచలేదతనికి.
నెమ్మదిగా తెరుచుకోసాగాయి. శృతి పడగ్గది తలుపులు....
8
అశోక్ నగర్ లోని ఓ ఇంటి ముందాగింది ఆటో.
ఆటో దిగి డబ్బులిచ్చి పంపేసింది శృతి.
గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టి మళ్ళీ గేటు మూసింది.
వేగంగా నడుచుకుంటూ లాన్ దాటింది.
మూడు వందల గజాల స్థలంలో ఓ ఎనిమిది వందల యాభై చదరపుటడుగులలో నిర్మించబడిన చిన్న రెండతస్థుల బంగళా అది.
చుట్టూ రకరకాల చెట్లు.
పొందిగ్గా వుందా ఇల్లు.
ఆ ఇంటి స్వంతదారుకి ఇదికాక మరో రెండిళ్ళున్నాయి.
కాలింగ్ బజర్ నొక్కింది శృతి.
రెండు నిమిషాల తరువాత తలుపులు తెరుచుకున్నాయి.
"రా శృతీ"
లోపలికి అడుగుపెట్టింది శృతి.
తలుపులు మూసి వెనక్కి తిరిగాడతను.
చిన్న హాలది. ఓ సోఫా, రెండు కుర్చీలు, టీపాయ్, గోడలకి అతను పోలీస్ డ్రెస్ లో తీయించుకున్న ఫోటోతో కలిపి సుమారు నాలుగు ఫోటోలు తగిలించి వున్నాయి.
సోఫాలో కూర్చుంది శృతి.
"ఏం జరిగింది శృతీ?"
"ఈ పాటికి అంతా అయిపోయే ఉంటుంది."
"అంటే...."
"అంటే మన ప్లాన్ ప్రకారం సాగర్ కి అవకాశం కల్పించి అతడింట్లోకి వెళ్ళాడని నిర్ధారించుకుని వచ్చాను."
అతను నెమ్మదిగా సోఫా దగ్గరికి నడిచి శృతి నుదురు చుంబించాడు.
"ఐ లవ్ యూ శృతీ...."
"ఇప్పటికీ మరో వ్యక్తిని ఇన్ వాల్వ్ చేయకుండా మనమే పనిపూర్తిచేసేసి వుంటే పోయేదనిపిస్తోంది మదన్...."
"లాభం లేదు శృతీ.... ఏదో ఓ ఏంగిల్ లో పొరపాట్న దొరికిపోతే మొదటికే మోసం వచ్చేది. ఇంత చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేది.
నా మీద ప్రేమతో సర్వస్వాన్నీ ధారపోయగలిగే నీ ప్రేమను పొందటం నిజంగా నా అదృష్టం. ఇలాంటి తరుణంలో నిన్ను మళ్ళీ పోగొట్టుకోవడం నేను సహించలేను.
అన్నీ పోగొట్టుకున్నాను. మీ అంకుల్ చలవవల్ల. ఆఖరికి బికారిగా రోడ్డుమీద పడే స్థితి కొచ్చాను. ఎటు చూసినా మన జీవితం అంధకారం అయ్యే అవకాశాలే....
మనమున్నస్థితిలో ఇదితప్ప మరో మార్గం కనిపించలేదు శృతీ...." అయిదు నిమిషాలు నిశ్శబ్దం.
"కాని.... రేపు పోలీసులకి దొరకితే సాగర్ మొట్టమొదటగా వేలెత్తి చూపేది నన్నే మదన్."
"నీకా భయం అక్కర్లేదు శృతీ.... అన్ని రకాలుగానూ తాను స్వయంగా ఇరుక్కుపోతున్నాడీ వూబిలోకి. ఎవరూ నీకేసి అనుమానాన్ని కదపలేరు."
"కాని__ ఒక్కటి మర్చిపోతున్నావు మదన్. సాగర్ కి మోటివ్ లేదు."
"నాది పోలీసు బుర్ర శృతీ. మొట్టమొదటగా నా మెదడు ఆలోచించే విషయం అదే."
ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు. దానిక్కూడా మార్గం ఆలోచించే వుంచాను...."
అతను టెలిఫోన్ కేసి నడిచాడు.
"కమాన్.... ఫోన్ చేసి ఇంట్లో స్థితి ఓ సారి చూడు."
డయల్ చేశాడు.
అవతల రింగవుతోంది.
ఫోను శృతి కందించాడు.
ఫోను అందుకొని చెవికానించుకొంది శృతి.
ఎనిమిదో రింగ్ కి తీశారు అవతల ఫోను ఎవరో.
"హలో...."
"హలో....నేను శృతిని మాట్లాడుతున్నాను.... ఎవరు....? హబీబా....?"
"అవును. యిందాక మీ కోసం యిల్లంతా వెదికాను. ఎక్కడికి వెళ్ళారు?"
శృతి గుండె వేగంగా కొట్టుకోసాగింది.
"ఏం ఏం జరిగింది?"
"ఏమీలేదు. ఎవరో కలవడానికొచ్చారు అయ్యగారిని. ఆయన పడుకొని వుంటే మీకోసం చూశాను. బయట వీధి తలుపులు కూడా తెరచి ఉన్నాయి...." అతని గొంతులో నిష్టూరం స్పష్టంగా వినిపించింది శృతికి.
"ఓ....అంకుల్ లేచారా?"
"ఆ....ఇప్పుడే మందిచ్చి మళ్ళీ పడుకోబెట్టాను."