Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 18


    ఒక్కసారి శృతి రిలాక్స్ అయ్యింది. ఆనందంతో కాదు.... సస్పెన్స్ వదలడంతో.
    "సరే....వస్తున్నాను" ఫోన్ పెట్టేసి మదన్ కేసి తిరిగింది.
    ప్రశ్నార్థకంగా చూసాడు మదన్.
    నెమ్మదిగా తల అడ్డంగా వూపింది.భృకుటి ముడిచాడతను.
    "ఏం జరిగి వుంటుంది? అంతా సవ్యంగానే జరిగిందే. ఇంట్లో ఎవ్వరూ లేరు. అంకుల్ మత్తుగా పడుకున్నారు. సాగర్ యింట్లోకి వెళ్ళాడు."
    మదన్ నెమ్మదిగా రిలాక్స్ అయ్యాడు.
    "సర్లే బెటర్ లక్ నెక్ట్స్ టైం.... నువ్విక ఎక్కువగా యిక్కడుండటం మంచిది కాదు. గెట్ గోయింగ్, మరో విషయం_ఇక కొంతకాలం పాటు ఎక్కువగా నువ్వు నన్ను కలవకపోవడమే మంచిది."
    ఒక్క ఉదుటున వచ్చి మదన్ ని చుట్టుకుపోయింది శృతి.
    "అంతా సవ్యంగానే జరుగుతుంది కదూ?" బేలగా అడిగింది.
    "డోంట్ వర్రీ....ఎవ్రిథింగ్ విల్ బీ ఆల్ రైట్."
    "నన్ను వదిలిపెట్టవు కదూ?"
    "ఛీ ఛీ....నెవ్వర్...."
    "మదన్! కిస్ మీ...."
    "యూ ఆర్ స్వీట్ శృతీ!"
    శృతి పెదవుల్ని గాఢంగా చుంబించాడతను.
    బయటికొచ్చింది శృతి. వందగజాల దూరం నడిచాక ఆటో దొరికింది.
    ఎక్కి కూర్చుని అడ్రస్ చెప్పింది. కదిలింది ఆటో.
    వెనక్కివాలి కళ్ళు మూసుకుంది శృతి.
    మదన్ ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముట్టాయామెను.
    వయసులో వున్న ఓ ఆడపిల్ల ఓ మగవాడితో ఎంత లోతుగా ప్రేమలో పడగలదో అంత లోతుగానూ మదన్ తో ప్రేమలో పడింది. శృతి రెండు సంవత్సరాల క్రితం, అప్పటికి మదన్ ఇన్స్ పెక్టర్, పోలీస్ డిపార్ట్ మెంటులో.
    తను, మదన్ ప్రేమించుకుంటున్న సంగతి భరద్వాజకి తెలియడంతో తిరిగింది తన జీవితం అనుకోని మలుపు. కొందరికి కొందరి పట్ల సదభిప్రాయం వుండకపోవటానికి కొన్ని కారణాలుండకపోవచ్చు.
    భరద్వాజకి మదన్ అంటే ఎందుకు గిట్టదో తనకు తెలియదు.... తను మదన్ ని కలవకుండా వుండాలని చాలా ప్రయత్నించాడు. తానందుకే పుట్టినట్లుగా మదన్ ని అనేక రకాల కష్టాలకి గురిచేశాడు. చివరికి ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కల్పించాడు.
    కేవలం మూడు నెలలపాటు సస్పెన్షన్ లో వుండటంతో బయటపడ్డాడు మదన్. అయితే ఈ సంఘటనలతో అతనికున్న కొద్దిపాటి ఆస్థి కూడా చాలా వరకూ హరించుకుపోయింది.
    చాలా ఆలోచించినమీదట ఎలాగయినా సరే భరద్వాజను తమ దారినుండి తొలగించి తను శృతి కోట్ల ఆస్థితో హాయిగా వుండక తప్పదని, అయితే ఈ పని తామిద్దరూ కాక మరో మూడో వ్యక్తితో చేయించటమే సబబనీ నిర్ణయించుకుని శృతితో చెప్పాడు.
    ఆహత్య చేయడానికి ఓ హంతకుడు దొరకటం మదన్ కేమంత కష్టమైన పనికాదు. అయితే అతనిప్పుడున్న పరిస్థితులలో ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని నియమించి సుడిగుండంలో పడి కొట్టుకుంటున్న తన ఉద్యోగ జీవితంలో మరోసారి రిస్క్ తీసుకోదలచుకోలేదు.
    సరిగ్గా అలాంటి తరుణంలో అదృష్టంకొద్దీ హోటల్ లో బేరర్ గా తారసపడ్డాడు సాగర్.
    అతనికి తనపట్ల పూర్తి నమ్మకాన్ని కలిగించింది తమ ప్లానుతో.
    పావుగా దింపడానికి చాలా టైమ్ వేస్ట్ అయ్యింది.
    ఆటో సడన్ బ్రేకుతో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడంతో ప్రస్తుతానికొచ్చింది శృతి.
    ఇంతకీ సాగర్ ఏమైనట్టు....
    అసలింట్లో ఏం జరిగింది....
    కొంపదీసి సాగర్ రెడ్ హాండెడ్ గా పట్టుబడలేదుకదా....
    మరో పదిహేను నిమిషాలకల్లా ఆటో యింటిముందాగింది. ఆటోని పంపేసి వడివడిగా లోపలికి నడిచింది శృతి.
    హాలులో ఎదురుపడ్డాడు హబీబ్.
    "ఎవరో వచ్చారన్నావే ఏరి....?"
    "ఇందాకే వెళ్ళిపోయారు...."
    "అంకుల్ నిద్రపోతున్నారా....?"
    "ఊఁ...."
    శృతి గబగబా మెట్లెక్కి తన గదిలోకెళ్ళి తలుపులు మూసి_గొళ్ళెం పెట్టి నిట్టూర్చింది.
    సాగర్ ఏమైనట్టు....అప్పటికి సాగర్ తో తను ఫోనులో మాట్లాడి రెండున్నర గంటలు కావస్తోంది.
    గడగడా మంచినీళ్ళు త్రాగి, హుక్స్ విప్పి, జాకెట్ తీసి మంచం మీద పడేసింది. చీర విప్పేసి మాక్సీ అందుకుంటూ యధాలాపంగా నిలువుటద్దంలోకి చూసి కెవ్వుమని అరవబోయి ఆఖరిక్షణంలో తమాయించుకుంది.
    చెదిరిన జుట్టుతో, ఎర్రటి కళ్ళతో, బట్టలు నలిగిపోయి అర్ధరాత్రి రోడ్డుపక్క పడిపోయిన పచ్చి త్రాగుబోతులా మంచంకింద నుండి నెమ్మదిగా బయటకొచ్చాడు సాగర్.
    "సాగర్...."
    "మంచినీళ్ళు?"
    శృతి అందించిన నీళ్ళు త్రాగి ఉసూరుమంటూ మంచం మీద కూర్చొని జరిగింది క్లుప్తంగా వివరించాడు.
    అతనికి చెమటలు కారిపోతున్నాయి.
    కర్చీఫ్ కోసం జేబులో చెయ్యిపెట్టాడు సాగర్.
    అదిలేదక్కడ.
    "శృతీ...." అతని కంఠంలో తొణికిన ఆందోళనకి చిన్నగా ఉలిక్కిపడింది శృతి.
    "ఏవిఁటి సాగర్?"
    "నువ్వు నాకు ప్రజెంట్ చేసిన కర్చీఫ్...."
    "యేఁ....ఏవయ్యింది?"
    "ఇందాక మీ అంకుల్ గదిలో హడావుడిలో పడిపోయినట్టుంది."
    "బాగా గుర్తుచేసుకో సాగర్! అసలు తేవడం మర్చిపోయావేమో?"
    "లేదు శృతీ నాకు బాగా గుర్తు. తెచ్చుకోవడమే కాదు, మీ అంకుల్ గదిలో బయటికి తీశాను కూడా."
    "ఓ మై గాడ్....! ఇప్పుడెలా? వుండు...." ఎందుకయినా మంచిదని ముందు తన గదంతా వెదికింది. కర్చీఫ్ కన్పించలేదు.
    భరద్వాజ గది వెదికింది. చివరికి వంటగదితోసహా ఇల్లంతా వెదికింది. ఎక్కడా కనిపించలేదు కర్చీఫ్. ఆమె వెన్ను జలదరించింది. గుండెవేగం పెరిగింది.

 Previous Page Next Page