Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 16


    ఇక్కడ__
    తలుపు పైన వున్న కాలింగ్ బజర్ నొక్కాడు సాగర్.
    ఏమీ రెస్పాన్స్ లేదు.
    మళ్ళీ నొక్కాడు.
    ఈసారి కూడా లోపల అలికిడిలేదు.
    మెల్లిగా అతని గుండెల్లో దడ ప్రారంభమయ్యింది.
    తలుపు పైన చెయ్యి వేశాడు, కరెంటు లేదేమో తడదామని.
    నెమ్మదిగా తెరుచుకున్నాయి తలుపులు.
    ఒక్కసారి అతని గుండె లయ తప్పింది.
    మెల్లిగా లోపలికి అడుగుపెట్టాడు.
    "శృతీ ...."
    సమాధానం లేదు.
    "శృతీ...." అతని గొంతు అతనికే విచిత్రంగా వినిపించింది.
    ఒక్కో గది చూశాడు. శృతి ఎక్కడా కనిపించలేదు.
    బాత్ రూం కెళ్ళిందా?
    ఆ అనుమానం కూడా తీర్చుకున్నాడు.
    బాత్ రూం తలుపులు బార్లా తీసి వున్నాయి.
    శృతి లేదందులో.
    క్రమంగా భీతి ఆవహించసాగింది అతని మనసును.
    ఉన్నట్టుండి అతని గుండె అదిరేవిధంగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మ్రోగసాగింది టెలిఫోన్.
    ఎత్తాలా? వద్దా? ఎత్తాలా? వద్దా?
    ఫోన్ మ్రోగుతూనే వుంది.
    వణుకుతున్న చేత్తో రిసీవర్ ఎత్తి చెవి దగ్గర వుంచుకున్నాడు.
    "హలో...."
    ఒక్కసారి ప్రాణం లేచివచ్చింది సాగర్ కి.
    ఆ గొంతు శృతిది.
    "హలో....శృతీ....ఏమైపోయావ్?"
    "సారీ సాగర్. అనుకోని విధంగా నిక్ ఆఫ్ ది మూమెంట్ లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. అప్పటికే హబీబ్ ని పంపేశాను. అంకుల్ కి నిద్రమాత్రలు ఇచ్చేశాను. ఆయన మత్తుగా నిద్రపోయారు కూడా. ఏ క్షణంలో నైనా నువ్వు వచ్చేస్తావని తెలుసు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదని కూడా తెలుసు. ఆ అమ్మాయిని కూడా వెంటబెట్టుకొని రాక తప్పింది కాదు. కానిచ్చెయ్యి. సాయంత్రం అయిదు గంటలకి మామూలు చోట కలుద్దాం."
    అతను మాట్లాడటానికి నోరు తెరిచే లోపల అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది.
    నిస్సత్తువతో ఫోన్ క్రెడిల్ చేశాడు.
    ఒక్కక్షణం వెనక్కి వెళ్ళిపోదామనిపించింది.
    మనసు కీడును శంకించ సాగింది.
    కాళ్ళు తడబడ సాగాయి.
    గొంతు తడారిపోసాగింది.
    వెనక్కి తిరిగాడు సాగర్.
    "ఐ లవ్ యూ సాగర్....ఐ నీడ్ యూ డార్లింగ్"
    "నా కోసం ఏమైనా చేస్తావా సాగర్?"
    "నీ కోసం ప్రాణం ఇస్తాను శృతీ....నీతో నరకానికయినా స్వర్గతుల్యంగా ఎంచి వస్తాను శృతీ.... ఐ లవ్ యూ"
    అతని చెవుల్లో మార్మోగసాగాయా వాక్యాలు.
    శృతీ....డబ్బు....శృతీ....డబ్బు....
    బలవంతంగా కాళ్ళని భరద్వాజ బెడ్ రూం వైపుకి నడిపించాయి.
    గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉందది.


                             *    *    *    *


    ఫోన్ డిస్కనెక్ట్ చేసి పబ్లిక్ ఫోన్ దగ్గర్నుండి రోడ్డు మీదకి వచ్చింది శృతి. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. సరిగ్గా ఇంటికో రెండు వందల గజాల దూరంలో వుంది ఆ ఫోన్. రోడ్డుకి ఓ వారగా నిలబెట్టబడి వుంది సాగర్ స్కూటర్. దానికేసి ఓసారి నిశితంగా చూసి అక్కడికో యాభయ్ గజాల దూరంలో ఆపబడి వున్న ఆటోకేసి నడిచింది.
    ఆటో ఎక్కి...."వూఁ....అశోక్ నగర్ పోనీ" అంది.
    ఆటో స్పీడందుకుంది....
    అక్కడ__
    పంక్చర్ వేయించుకొని సైకిలెక్కాడు హబీబ్.
    బొకే కొని స్కూటర్ బాగ్ లో పడేసి, కాలుస్తున్న సిగరెట్టుని క్రింద పడేసి బూటు కాలితో నలిపి, స్కూటరెక్కి పోనిచ్చాడు జాగిర్దార్. అక్కడ నుండి భరద్వాజ ఇల్లు ఆరు కిలోమీటర్లు.
    బెడ్ రూమ్ తలుపు నెమ్మదిగా తెరిచాడు సాగర్.
    లోపల కిటికీలకి బ్లైండ్ లాగేయబడి వుంది.
    గదిలో మసక వెలుతురు....
    మంచంపై గొంతుదాకా కప్పుకొని భరద్వాజ గాఢమైన మత్తు నిద్రలో వున్నాడు.
    అతని ఎడం చెయ్యి మంచంపై నుండి క్రిందికి జారివున్న భంగిమ చూస్తే అతను మరణించాడేమో అనే అనుమానం ఆశాకిరణంలా కలిగింది అతనికి.
    పరీక్షగా చూశాడు.
    అతని ఛాతీ ఉచ్చ్వాస నిశ్వాసలకు ఎగిరిపడుతోంది.    
    ఉన్నట్టుండి మొండి ధైర్యం ఆవహించిందతణ్ని.
    మెల్లిగా అడుగుతీసి అడుగువేస్తూ మంచం దగ్గరికి వెళ్ళాడు.
    ఆ క్షణం ఎందుకో నిద్రపోతున్న భరద్వాజ మొహం చూస్తే జాలి వేసిందతనికి కొద్దిగా.
    మరో నిమిషంలో ఈ మనిషి మరణించబోతున్నాడు.
    అదీ తన చేతిలో.... అన్న భావన చాలా విచిత్రంగా అనిపించిందతనికి.
    ఇతనెవరు? తానెవరు?.... తామిద్దరికీ అసలేవిఁటి సంబంధం? అసలితనేం అన్యాయం చేశాడు తనకి? తల ఒకసారి విదిలించి అలాంటి ఆలోచనలని తరిమేశాడు.
    తప్పదు. తన కోసం, తన శృతి కోసం, తానిది చేయక తప్పదు.
    బలవంతుడిదే రాజ్యం....
    డబ్బే బలం....
    డబ్బే ప్రేమ....
    ప్రేమే జీవితం....
    దిండులో మొహం, ముక్కూ నొక్కి, చంపేద్దామని భరద్వాజ కాలి దగ్గరి దిండు అందుకున్నాడు.
    తలకేసి అడుగు కడపబోయాడు.
    సరిగ్గా అప్పుడు వినిపించింది....
    గుడ్లగూబ కేకలా.... నక్క అరుపులా....
    కుక్క ఏడుపులా.... రాక్షసి ఆర్తనాదంలా....
    గుండెలదర, ఆకాశం పగిలి నెత్తురు కళ్ళ రాకాసి నేలజారి నోరు తెరిచి చేసిన వికట్టహాసంలా....
    ఆ భయంకర నిశ్శబ్దంలో....
    కాలింగ్ బెల్.
    చేయి జారి పడిపోయింది దిండు. స్థాణువులా నిలబడి పోయాడు సాగర్.

 Previous Page Next Page