సుమతికి నిజంగానే మతి చలించలేదుగదా? అని హడలిపోయింది తులసి. అప్పటి సుమతి ముఖ భంగిమ చూసి.
తెల్లబోయి చూస్తున్న తల్లి చెయ్యి పట్టుకుని, బొమ్మలా నిలబడ్డ తండ్రిని మరొక చేత్తో ఈడ్చుకుంటూ బయటికి వచ్చి, ఒక ఆటోని ఆపి, అందులో తల్లినీ, తండ్రినీ కూచోమని, తనూ కూలబడింది. ఆటోలో కూచున్నాక జానకి కడుపుమంట ఆగక, దాన్ని ఎలా కక్కాలో తెలియక సాధింపులలోకి దిగింది.
"దానికిలాంటి సంబంధం తీసుకొచ్చి, దాని బ్రతుకు నాశనం చేశారు. అసలు సంబంధాల కోసం తిరిగితేనా? ఎంతసేపూ తన సుఖం....తన స్వార్థం...."
జగన్నాథం పంతులు కూడా ఏమాత్రం తక్కువ తినలేదు.
"ఏమిటీ? నేను స్వార్థపరుణ్నా? నా సుఖం నేను చూసుకున్నానా? కాళ్ళకు చెప్పులయినా లేకుండా చిరుగుల పంచెలు కట్టుకుని, రాత్రనక పగలనక మీ అందరికోసం చాకిరీ చేసింది. స్వార్థంతోనా? అసలీ సంబంధం చేసింది నువ్వు, నేను కాదు. నేను బంగారంలాంటి సంబంధం తీసుకొచ్చాను. బంగారం లాంటి సంబంధం_రెండో పెళ్ళి వాడయితేనేం? బోలెడు ఆస్తి! అక్కడికీ నేనేదో దాని బ్రతుకు పాడు చేస్తున్నానని తిట్టిపోసి, ఎవరినో పట్టుకుని, నన్ను అప్పులపాలు చేసి ఈ సంబంధం చేశావు. చూశావుగా "ఈడూ_జోడూ' ఎంత సుఖంగా ఉందో?"
"అదీ! అప్పుల పాలయ్యానో అని ఏడ్చుకుంటూ చేశారీ పెళ్ళి! ఆ ఘోషే కొట్టింది దానికి...."
"ఏమిటీ? నేను...."
తులసి రెండు చెవులూ గట్టిగా మూసుకుని "అమ్మా! నాన్నా! కొంచెంసేపు ఊరుకోండి. హోటల్ కి వెళ్ళగానే పోట్లాడుకోవచ్చు. ఆటో డ్రైవర్ మననిచూసి నవ్వుతున్నాడు" అంది.
ఏ కళ నున్నారో, ఆ దంపతులిద్దరూ పరస్పరం నమిలి మ్రింగేసేలా చూసుకుంటూ అప్పటికి నోరు మూసుకున్నారు.
హోటల్ లో ఒక్కరోజు వుండేసరికే తులసి తెచ్చిన డబ్బులో సగం అయిపోయింది. సుమతి సంసార పరిస్థితి చూస్తే సుమతికే కాక. చూసే వాళ్ళకు కూడా మతిపోయేలా ఉంది. నీలకంఠం తన జీతంలో రెండువందలు సుమతి కిచ్చి, అక్కడితో తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. మరే విషయంలోనూ కల్పించుకోడు. కుటుంబానికి కావలసిన యే పనీ చెయ్యడు. పిల్లలకు రోగాలొచ్చినా అతనికి పట్టదు,అన్నీ సుమతి చూసుకోవలసిందే! ఏ కారణం వల్లనైనా ఒక నెల ఇంటి ఖర్చు ఎక్కువయితే, సుమతి అప్పులు చేసి తీర్చుకో వలసిందే తప్ప, అతడు రెండు వందలకంటే ఒక్క నయాపైస ఎక్కువ ఇవ్వడు. ఆ రకంగా పుస్తెలు తప్ప సుమతి వంటిమీది బంగారమంతా హరించుకుపోయింది. తులసి ఆలోచించి ఆలోచించి అద్దె ఎక్కువయినా, సుమతి ఇంటిపక్కనే మరొక వాటా అద్దెకు తీసుకుంది. పాపం జానకి తన తిండి తను తింటూ సుమతికి సాయంగా ఉండసాగింది. అయినా ఆ యింటి పరిస్థితులేమంత మెరుగుపడలేదు. మనసు తూట్లుపడే మాటలతో నీలకంఠం సుమతిని రెచ్చగొడతాడు. సుమతి పిచ్చిదానిలా నోటికొచ్చినట్లు అరిచి మూర్ఛపోతుంది. రోజు రోజుకీ ఎదుగుతోన్న ముగ్గురు పిల్లల విషయం భార్యాభర్తలలో ఎవరూ పట్టించుకోరు.
పేపర్లలో కనిపించే ఉద్యోగ ప్రకటనల కన్నింటికీ దరఖాస్తులు పెట్టుకుంది తులసి. ఇంటర్వ్యూలకు వెళ్ళి రావటం వల్ల డబ్బు ఖర్చవుతోందేకాని, ఉద్యోగం రావటంలేదు. సుమతి ఇంట్లో తానేమీ తినకపోయినా, ఎదురు తమ ఇంట్లో చేసుకున్నదే ఏదో సుమతి ఇంట్లో ఇస్తున్నా, నీలకంఠం, "మీ వాళ్ళు ఇంటిపక్క చేరారుగా! ఇక డబ్బేం సరిపోతుంది?" అని తను వినేలా అనటం మానలేదు.
"ఆయన మాటలు పట్టుకుని నన్నొదిలిపోకండే! ఈ మహానుభావుడు నన్ను పిచ్చాసుపత్రిలో పారేసి, రెండోనాడు మరోదాన్ని కట్టుకొస్తాడు. నాకయితే ఈ ఇంటికంటె పిచ్చాసుపత్రే మేలు కాని, నా పిల్లలు దిక్కులేని పక్షులయి ముష్టి అడుక్కోవలసి వస్తుంది" అని బావురుమనేది సుమతి.
సుమతి క్షోభ చూడలేక, అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో సుమతిని నిర్దాక్షిణ్యంగా వదలలేక_ సుమతి ఇంటిపక్క ఇంట్లోంచి మారకుండా అక్కడే ఉండటానికి నిశ్చయించుకుంది తులసి.
ఏదో ప్రైవేట్ కంపెనీలో స్టెనో పోస్ట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళింది తులసి. రికమండేషన్ ఉంటేనే కాని, ఆ కంపెనీలో ఉద్యోగం రాదని ముందరే అందరూ తులసిని భయపెట్టారు. కానీ విచిత్రంగా ఆ ఉద్యోగం తులసికి వచ్చింది. జాయినింగ్ రిపోర్ట్ ఇస్తోంటే "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు మేనేజరు. తులసి కాస్త తెల్లబోయి "థాంక్యూ సర్!" అంది వినయంగా.
అతడు మళ్ళీ నవ్వుతూ "ఈ కంపెనీలో రికమెండేషన్ ఉంటే కాని ఉద్యోగం రాదు తెలుసా!" అన్నాడు.
తులసి మరింత ఆశ్చర్యపోతూ "కానీ..... నాకు ఏ రికమెండేషనూ లేదే!" అంది.
"లేకపోవటమేం? మిమ్మల్ని నేనే రికమెండ్ చేశాను"
"మీరా!"
"అవును"
"ఎ.....ఎందుకు?"
తులసి కంగారు చూసి, అతడు గట్టిగా నవ్వాడు కొంటెగా. "మీ అందం చూసి.... ఇంతకంటే అందమైన వాళ్ళెవరూ కనపడక....." అన్నాడు అల్లరిగా.
తులసి కళ్ళు పెద్దవిచేసి భయంగా చూసింది.
అతడు పసిపిల్లవాడిలా పకపక నవ్వేసి, అంతలో గంభీరంగా అయిపోయి "మీ సీట్ లోకి వెళ్ళి పనిచూసుకోండి. రేపు మాట్లాడుకుందాం!" అన్నాడు.
తులసి తలవంచుకుని రకరకాల ఆలోచనలతో అతని దగ్గరనుంచి బయటపడింది.
ఆ మరునాడు మేనేజర్ పిలిపిస్తే దడదడలాడుతున్న గుండెలతో అతని గదిలోకి వెళ్ళింది.
అతడు చిరునవ్వుతో, "అయితే, మీరు నన్ను గుర్తుపట్టలేదన్నమాట!" అన్నాడు.
తులసి జంకుతోనే అతని ముఖములోకి పరీక్షగా చూసింది. తెలిసిన వాళ్ళెవరూ గుర్తురాలేదు.
"ఇది చూడండి!" అంటూ టేబుల్ మీది ప్లాస్టిక్ కవరు విప్పారు. తప్పుల తడకలతో, అస్తవ్యస్తంగా అల్లిన స్వెట్టర్.....