Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 16


    తల్లిని సముదాయించ లేకపోయింది తులసి..... 'అమ్మా! ఒక పని చేద్దాం! మనంకూడా అక్కడికే వెళ్ళివుందాం! దగ్గిరుండి సంగతేమిటో తెలుసుకుందాం! అక్క కాపురం పాడయిపోకుండా జాగ్రత్త పడదాం! నేను అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. అది సిటీ కనుక ఏదో ఒక ఉద్యోగం త్వరగా దొరుకుతుంది" అంది. యీ ఆలోచన జానకికి, జగన్నాథం పంతులుకీ ఇద్దరికీ నచ్చింది. తర్వాత కొన్ని రోజులకే జగన్నాథం పంతులు కుటుంబం ఆ ఊరు వచ్చేసింది.


                                    9


    తన అత్తగారినీ, మావగారినీ, మరదలినీ చూడగానే నీలకంఠం కనుబొమలు ముడిచి, "ఇదేమిటి? మీ అమ్మాయినీ, పిల్లలినీ తీసుకెళ్ళమని రాస్తే, మీరంతా ఇక్కడికి తయారయ్యారు!" అన్నాడు గుమ్మంలో వుండగానే. నీలకంఠంకి మంచి, చెడ్డ, సంస్కారం, సభ్యత ఇవేమీ అక్కరలేదు. ప్రస్తుతం తన మావగారు రిటైరయ్యారనీ, ఆ కుటుంబం కూడా కట కట లాడే స్థితిలో వుందనే అతనికి తెలుసు. అంచేత ఆ కుటుంబంలో వ్యక్తులెవరినీ గౌరవించవలసిన అవసరం లేదని అతని అభిప్రాయం.....
    తులసి గిర్రున వెనక్కు తిరిగి, "పదండి నాన్నగారు మనం ఈ పూట హోటల్ లో వుందాం అంది.
    జగన్నాథం పంతులు కంగారుగా, హోటల్ లోనా బోలెడు డబ్బవుతుంది" అన్నాడు.
    నీలకంఠం హేళనగా నవ్వాడు. తులసికి మండిపోయింది. ఒక్క మాట మాట్లాడకుండా తండ్రి చెయ్యి పట్టుకుని బరబర బయటకు ఈడ్చుకుపోయింది. జానకి మాత్రం అంతతేలిగ్గా కదిలి రాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే సుమతి వచ్చి తల్లిని వాటేసుకుని బావురుమని ఏడవటం ప్రారంభించింది. అలా ఏడుస్తున్న కూతుర్ని విదిలించి రావటం జానకికి వీలుకాలేదు. తులసి కూడా వెనక్కు తిరిగి ఏడుస్తున్న అక్కను చూసింది. అలా నిస్సహాయంగా ఏడుస్తున్న అక్కను చూస్తోంటే, తులసికి మనసు కలత పడింది. కానీ బయటే నిలబడింది, తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని.....
    సుమతి కళ్ళు తుడుచుకుని కాళికలా మొగుడివైపు తిరిగి "ఇన్నాళ్ళ తరువాత నా వాళ్ళు నా ఇంటికొస్తే గుమ్మం నుంచే వెళ్ళగొడతారా? నా వాళ్ళకి ఒక్కపూట గుప్పెడు అన్నమయినా పెట్టుకోవటానికి నోచుకోలేదా నేను?" అని అరిచింది.
    "అబ్బా! అక్క ఎందుకిలా అరుస్తుంది?" అనుకుంది తులసి.
    నీలకంఠం మాత్రం తనతో కాదన్నట్లు చిరునవ్వుతోనే ఉన్నాడు. సుమతి ఉద్రేక పడుతుంటే కోపం తెచ్చుకోవటానికి మారుగా, అది చూసి ఆనందిస్తున్నట్లుగా కనిపించాడు అతడు.
    "కట్నం లేకుండా నిన్ను చేసుకున్నది గాక, నీవాళ్ళనందరినీ మేపమంటావా? ఈ ముష్టి సంతనంతా పోషించటానికి నేను రాసులు పోసుకొని కూచున్నాననుకుంటున్నావా?" అన్నాడు అతి మెత్తగా.
    కంఠస్వరం ఎంత మెత్తగా ఉన్నా, ఆ మాటల్లో కరకుదనానికి తులసే వణికిపోయింది. ఇక సుమతి పిచ్చిదానిలా అరవటం మొదలుపెట్టింది.
    "ఏమిటీ, మావాళ్ళు ముష్టివాళ్ళా! మహా మీవాళ్ళు మహారాజులా? మొన్న మొన్న మీ అక్కలూ, అక్క పిల్లలు, ఆడబిడ్డలూ_ అందరూ వస్తే వళ్ళు హోనం చేసుకుని చాకిరీ చెయ్యలేక చచ్చాను. నా చేతిగాజులు తాకట్టు పెట్టి కోమటి దుకాణంలో అప్పు తీర్చాను. అలాంటిది,నన్ను చూద్దామని కన్నతల్లి గుమ్మంలోకొస్తే....." సుమతి మాటలు పూర్తి కాకుండానే ఉద్రేకంతో ముఖం ఎర్రబడిపోయింది. కీళ్ళు బిగుసుకుని క్రింద పడిపోయింది. పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా గోలగా ఏడుపు ప్రారంభించారు. నీలకంఠం సుమతి ముఖంమీద నీళ్ళు చల్లటానికి కాని, పిల్లల్ని సముదాయించటానికి కాని, ఏ విధమయిన ప్రయత్నమూ చెయ్యలేదు. పైగా కుర్చీలో కూచుని చిద్విలాసంగా ఏదో సినిమా చూస్తున్నట్లు నవ్వుకుంటూ చూస్తున్నాడు. "అయ్యో? సుమతీ! సుమతీ!" అని అరవటం మొదలుపెట్టింది జానకి.
    తులసి ఇక చెయ్యగలిగింది లేక, లోపలికి వచ్చి అక్క ముఖంమీద నీళ్ళు చల్లింది. పిల్లల్ని సముదాయించింది. నీలకంఠం ముఖంలోకి కోపంగా చూడబోతే, అతడు తులసి ముఖంలోకి యావగా చూసి, వెకిలిగా నవ్వాడు. భరింపరాని చీదరతో చటుక్కున తలదించుకుంది తులసి. దానికి కూడా నీలంకంఠం నవ్వుకుంటున్నట్లు లీలగా తోచింది.  
    సుమతి కళ్ళు తెరచి నీరసంగా, "తులసీ! మీరు హోటల్ కి పోవద్దే! ఇక్కడే ఉండండే!" అంది దీనంగా.
    సుమతి అలా అడుగుతోంటే తులసికి ఎంత జాలి కలిగిందో, ఉచ్ఛం, నీచం లేకుండా నీలకంఠం ఇంత అవమానిస్తుంటే సహించి ఎలా ఉండగలదు?
    "ఏమీ అనుకోకు అక్కయ్యా! మనసులో మమకారాలుండాలి గాని, ఎక్కడుంటేనేం? రేపు మళ్ళీ నిన్ను చూడటానికి వస్తాంగా!"
    తులసి అలా సమాధానం చెప్పగానే సుమతి పిచ్చి పిచ్చిగా "దుర్మార్గుడా! రాక్షసుడా! పిశాచమా! ఇప్పటికి చల్లబడిందా?" అంది ఏడుస్తూ.

 Previous Page Next Page