"సూర్యం!" అంది సంభ్రంగా తులసి. అంతలో నాలుక కరచుకొని "సారీ! సూర్యంగారూ!" అంది.
"ఫరవాలేదులెండి. మనం బాగా పెద్దవాళ్ళమయిపోయాం! చిన్నప్పటి రూపాలు గుర్తుంటాయా? అప్లికేషన్ లో మీ బయోడేటా చూశాను గనుక మీరని అనుకోగలిగాను. మిమ్మల్ని చూశాక నుదుటిమీద ఆ చిన్న మచ్చ చూసి, దేవదాసు పార్వతి కిచ్చినలాంటి ఆ కానుక గుర్తుకొచ్చి మీరేనని నిర్ధారణ చేసుకున్నాను."
"ఛ! ఛ! పార్వతీ దేవదాసులతో పోల్చకండి" అని చటుక్కున అనేసి నాలుక కరచుకుంది తులసి.
సూర్యం నవ్వి, "ఆఫీస్ టైంలో కబుర్లు చెప్పుకోవడం బాగుండదు. సాయంత్రం కారులో వస్తే మిమ్మల్ని యింటి దగ్గిర డ్రాప్ చేస్తాను. అప్పుడు మాట్లాడుకోవచ్చు" అన్నాడు.
అయిదు దాటాక ప్యూన్ వచ్చి, "మేనేజరుగారు బయట కారులో ఉన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారు" అని చెప్పాడు. సంభ్రమంతో బయటకు వచ్చింది తులసి. కానీ, కారువైపు చూడగానే ముందుకు వెయ్యబోయే అడుగు ఆగిపోయింది. డ్రైవింగ్ సీట్ లో కృష్ణారావు కూచుని ఉన్నాడు.
"రండి! ఆగిపోయారేం?" అన్నాడు సూర్యం. తులసి సమాధానం చెప్పలేదు, ముందుకూ రాలేదు.
"వీడు మన కృష్ణారావు. మీకు తెలుసు కదూ!" అన్నాడు.
కృష్ణారావు నవ్వి తులసిని చూస్తూ, "తులసి నన్ను చచ్చినా మరిచిపోదు__ పందెం వెయ్యగలను. ఏం తులసీ! నా కారులో కూచోకూడదా?" అన్నాడు.
అప్పటికి తులసి ధైర్యంగా తలెత్తింది. కృష్ణారావుని చూడకుండా సూర్యాన్నే చూస్తూ, "నన్ను క్షమించండి సూర్యంగారు! మీరు వెళ్ళిపోండి. నేను బస్ లో వెళ్ళగలను" అంది. ఆ సమాధానం వింటూనే కృష్ణారావు కారు స్టార్టు చేసేశాడు.
10
కారులో రానందుకు సూర్యానికి కోపం వస్తుందేమోనని భయపడింది తులసి. కానీ, అతడు ఆ విషయమే ప్రస్తావించకుండా ఊరుకునేసరికి మొదట కొంచెం రిలీఫ్ అనిపించింది. కాని, రానురాను ఏదో నిరుత్సాహం కలిగి అతడు తనమీద కోపం తెచ్చుకుంటేనే బాగుండేదని అనిపించసాగింది. నిగ్రహించుకోలేక అవకాశం చూసుకుని ఒకరోజు తనే అడిగేసింది "కృష్ణారావు మీకు స్నేహితుడా?" అని.
సూర్యం ఆశ్చర్యంగా కనుబొమలు పైకెత్తి, "కృష్ణ చిన్నప్పటి నుండీ నాకు స్నేహితుడేగా! మీకు తెలుసుగా!" అన్నాడు.
"చిన్నప్పుడు తెలిసీ తెలియని జ్ఞానంతో ఏవేవో అనుకుంటాం! పెద్దయి తెలివి తెచ్చుకున్నాక కూడా ఆ ఆలోచనలనే అంటిపెట్టుకొని ఉండాలా?"
"ఎవరయినా ఎంత పెద్దయితే తెలివి తెచ్చుకుంటారో, నాకిప్పటికీ సరిగా అర్థంకాదు. అది అలా ఉండనియండి. ఒకరకంగా మీరన్నట్లు చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా విషయాల్లో నా ఆలోచనలు చాలా రకాలుగా మారాయి. నేను లోకాన్నీ, మనుష్యుల్నీ అర్థంచేసుకోగలుగుతున్నకొద్దీ కృష్ణ నాకు మరింత సన్నిహితుడయ్యాడు."
"అతని గురించి మీకు అంతా తెలుసా?"
"అంతా అంటే?"
తులసి మాట్లాడలేకపోయింది. అలాంటి విషయాలన్నీ అతని ముందు మాట్లాడటానికి మొహమాటం వేసింది.
"పోనీ మీకు తెలుసా ఆ 'అంతా'.....?"
సూర్యం మాటల్లో ఏదో వెటకారం వినిపించి అతని ముఖంలోకి పరీక్షగా చూసింది తులసి. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. చటుక్కున ముఖం తిప్పుకొంది. సూర్యం వెంటనే అనునయంగా "ఒక్క విషయం అర్థం చేసుకోండి. మనం ఏనాడూ దేనిని గురించీ, ఎవరిని గురించీ అంతా తెలుసుకోలేము. మనకు తెలిసినదే, మనం అర్థం చేసుకోగలిగినదే 'అంతా' అనుకొంటాము. అదీగాక, మనుష్యులు ఎప్పుడూ ఒకలాగే ఉంటారా? పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండరూ?" అన్నాడు.
"అంటే, ఇప్పుడు కృష్ణారావు మంచివాడైపోయాడనా?" సూర్యం గట్టిగా నవ్వాడు.
"సారీ! మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. మంచివాడంటే ఏమిటో నాకు తెలియదు."
తులసి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. కానీ, ఒకటి మాత్రం అర్థమయిపోయింది. కృష్ణారావంటే సూర్యానికి ఇష్టమని..... ఆ భావం మనసుకి చాలా చేదుగా తోచింది.
అసలు కృష్ణారావు కూడా ఇక్కడికెందుకొచ్చాడు? ఏ పనిమీద వచ్చాడు? ఈ ప్రశ్నలన్నీ సూర్యాన్ని అడగాలని ఉన్నా, అడగలేకపోయింది.
తులసి ఉద్యోగంలో చేరాక, నెలకి నాలుగు వందలకి పైగా జీతం తెచ్చుకొంటుందని తెలిశాక, నీలకంఠానికి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. "మీరు వేరుగా, మేము వేరుగా ఉండటం దేనికి? అందరం కలిసి మరికాస్త పెద్ద ఇల్లు తీసుకొని ఉందాం! సుమతికి చేదోడు వాదోడుగా ఉంటారు. నా కుటుంబానికి తిండి ఖర్చు నేనిచ్చేస్తాను లెండి" అన్నాడు.
ఈ ఆలోచనకు తులసి మొదట్లో ఒప్పుకోలేదు. కానీ, జానకి బలవంతపెట్టింది.
"చూస్తున్నావుగా! అతడిచ్చే రెండు వందలూ చాలక ఏదో అదనీ, ఇదనీ మనని అడుగుతూనే ఉంది సుమతి. చూస్తూ చూస్తూ కన్నకూతురికి లేదనటానికి నోరెలా వస్తుంది? మొన్న చంటిదానికి జ్వరమొస్తే తనకేమీ పట్టనట్లు పోయాడు. ఇది ఏడుస్తూ కూచుంటే, చూస్తూ ఊరుకోలేక చంటిదాన్ని చచ్చినట్లు నేనే డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళి డబ్బు కూడా ఖర్చుపెట్టి వైద్యం చేయించాను. ఇంతకంటే అందరమూ ఒకచోట ఉండటం మంచిది కాదూ?"