Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 17

రూంలోకి వస్తుండగా ఎదురయింది సులక్షణ. "ఎప్పుడు బాంబే ప్రయాణం?" అంది అలవోకగా నవ్వుతూ. ఆమె వంటి మీద నుంచి ఖరీదయిన పరిమళం ఏదో వస్తోంది.
"వెళ్ళట్లేదు." అన్నాడు రవి ముక్తసరిగా.
తెల్లబోయింది సులక్షణ. "అదేమిటి?"
"అదంతే!"
"అంటే, ఇక్కడే పోస్టింగ్స్ వస్తున్నాయా?"
"లేదు"
"అంటే?"
"ఆ ఉద్యోగంలో చేరడం లేదు."
"అంతకంటే మంచి ఉద్యోగం దొరికిందా?"
"లేదు"
"మరి? కన్సల్టెన్సీ ఏమన్నా పెడుతున్నారా?"
"ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు"
అతనివైపు చిత్రంగా చూసింది సులక్షణ. "మీరు వదిలేసుకుంటున్నది గోల్డెన్ ఛాన్సు అని మీకు తెలుసా?"
"బాగా తెలుసు"
"ఆ ఛాన్సుతో బాటు మరో ఛాన్సు కూడా మిస్సవుతున్నారు మీరు. అది కూడా తెలుసా?"
"మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం! అదేనా?"
"తెలివితేటలకేం తక్కువ లేదు. లేనిదల్లా ప్రయోజకత్వమే!" అని ఆగి "గుడ్ బై మై ఫ్రెండ్! ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు రూము? ఈ ఇంట్లో అప్రయోజకులకి స్థానం లేదు."
మళ్ళీ అదే అనిపించింది రవికి.
కొంతమంది దృష్టిలో పెళ్ళి అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారం. అంతే!! నిట్టూర్చాడు అతను. ఇక్కడ ఇంక సులక్షణ ఉండనివ్వదు తనని. రూము ఖాళీ చెయ్యవలసి వస్తుంది వెంటనే. ఖాళీ చెయ్యనని మొండికేస్తే, తను చెయ్యి పట్టుకు లాగాడనో, చెంప మీద గిల్లాడనో కంప్లయింట్ ఇచ్చి, మెడపట్టి బయటకు గెంటించగలదు సులక్షణ. తలచుకుంటే ఎంతపనైనా చెయ్యగల తెగువ ఉంది ఆమెలో.
అతనికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది.
వేరే రూము వెదుక్కుని వెళ్ళేబదులు ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్సులోకే మారిపోతే?
అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది.
ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్స్ లోకి మారిపోతే, భానురేఖను పొద్దస్తమానం కనిపెట్టుకుని ఉండవచ్చు.  
తెల్లవారగానే ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్సుకి వెళ్ళాడు రవి.
వెళ్ళగానే కనబడ్డాడు మధుకర్ కాలే. రవిని చూడగానే అతని మొహం చేటంత అయ"హలోలోలోలో! రండి రండి!" అన్నాడు సంతోషంగా.
"ఒక ఇన్ ఫర్మేషన్ కావాలి సార్!" అన్నాడు రవి.
"చెప్పండి! ఈ అపార్ట్ మెంట్స్ లో నాకు తెలియకుండా పిల్లులు పిల్లలని కూడా పెట్టవు. చెప్పండి. ఏం కావాలి?"
"ఈ అపార్ట్ మెంట్స్ లో ఖాళీలు ఏమన్నా ఉన్నాయాండీ?"
"ఉన్నాయ్! రెండు ఫ్లాట్సు. శంఖుమిత్రాది, వెంకటేశ్వరరావుది. నానక్ సింగ్ ఫ్లాట్ నెక్స్ ట్ మంత్ ఖాళీ కావచ్చు. రాఘవేంద్రరావుకి ఢిల్లీ ట్రాన్స్ ఫర్ అవుతోంది. ఫ్లాట్ అద్దెకిచ్చేద్దామని ఆయన అంటే, వద్దు మనమే ఉంచుకుందామని ఆయన భార్య..." అతన్ని ఆపి, "రెంట్స్ ఎలా ఉంటాయండీ?" అన్నాడు రవిచంద్ర.
"టూ బెడ్ రూం ఫ్లాటు రెండువేల ఐదొందలు!"
చెంప మీద ఛెళ్ళున కొట్టినట్టు చటుక్కున మొహం పక్కకి తిప్పుకున్నాడు రవి. ఇది చాలా ఎక్స్ పెన్సివ్ అపార్ట్ మెంట్సు అని తెలుసుగానీ మరీ ఇంత ఎక్కువ అద్దె అని అనుకోలేదు.
నెలకు రెండువేల ఐదొందలు అద్దె ఇచ్చి తనెక్కడ ఉండగలడు! అయ్యేపని కాదు అది!
మొహం పక్కకి తిప్పుకోగానే అతనికి లిఫ్టు ద్వారం దగ్గర అంటించి ఉన్న ఒక నోటీసు కనబడింది.
"లిఫ్ట్ ఆపరేటర్ వాంటెడ్"
వెంటనే అతనికి అయిడియా తట్టింది.
"అపార్ట్ మెంట్ మా ఫ్రెండ్ కోసం అడిగాను. ఇన్ ఫర్ మేషన్ అతనికి పాస్ ఆన్ చేస్తాను. నాకు చిన్న ఉద్యోగమేదన్నా కావాలి. ఆ లిఫ్ట్ ఆపరేటర్ పోస్టు నాకు దొరుకుతుందా?"
అప్పటిదాకా ఫ్రెండ్లీగా మాట్లాడిన మధుకర్ హఠాత్తుగా మారిపోయాడు. గొంతు అదోలా పెట్టి, "లిఫ్టు ఆపరేటర్ గా చేరతానంటావా? నేను చెబితే వెంటనే చేర్చుకుంటారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెయ్యాలి నువ్వు!"
తనలాంటి వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా దొరకని ఉద్యోగాన్ని రవిచంద్ర ఎడం కాలితో తన్నేసి వద్దని వచ్చాడని అతనికి తెలియదు.
ప్రయత్నపూర్వకంగా వినయం తెచ్చిపెట్టుకున్నాడు రవిచంద్ర. "వర్క్ ఈజ్ వర్ షిప్ అని నమ్ముతాను నేను. నాకు ఈ ఉద్యోగం అత్యవసరం. మీరు ఇప్పించగలిగితే ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను."
మధుకర్ కాలే కాలరెత్తలేదు గానీ కాళ్ళు ఎత్తెత్తి వేస్తూ, రవిచంద్రని ఆ  కాంప్లెక్సు ఆఫీసుకి తీసుకెళ్ళాడు.

 Previous Page Next Page