నైక్ హీల్సు వేసుకుని, వయ్యారంగా నడుస్తూ అటు వెళ్తున్న ఆంగ్లో ఇండియన్ స్టెనో ఒకమ్మాయి అతన్ని గుర్తుపట్టి ఆగింది.
"ఈవెనింగ్ మిస్టర్ రవిచందర్!"
"ఈవెనింగ్! ముఖర్జియా ఉన్నారా?"
"ఉన్నారు! ఒక్క అయిదు నిమిషాలు ఆగితే మీరు ఆయన్ని కలుసుకోవచ్చు. ఇన్ ద మీన్ వైల్, కేర్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ?"
"వైనాట్?" అన్నాడు రవిచంద్ర నవ్వుతూ.
అతను తన ఆఫర్ ని అంగీకరించడమే మహాభాగ్యమన్నట్లు పొంగిపోతూ పెర్కోరేటర్ లోని కాఫీ పేపర్ కప్పులోకి వంపి, తీసుకొచ్చి వేళ్ళు రాస్తూ అందించింది డికొస్టా.
తాను థాంక్స్ చెప్పాడు.
మళ్ళీ వేళ్ళు తాకిస్తూ పేపర్ కప్పు తీసుకెళ్ళి వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పడేసింది డికొస్టా.
విరక్తి కలిగినట్లయింది రవిచంద్రకి. ఇలాంటి 'ఫాస్ట్ గర్ల్స్'తో పోలిస్తే భానురేఖ ఎంత మెరుగు?
ఏం చేస్తోందో తను? ఎలా ఉందో?
కొద్ది నిమిషాల తర్వాత చీఫ్ దగ్గరనుంచి కబురొచ్చింది. వెళ్ళాడు రవిచంద్ర.
లోపలికెళ్ళగానే కరస్పర్శ చేశాడు ఆయన. "వెల్ యంగ్ మాన్! హౌ ఆర్యూ? జర్నీకి ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయా? టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నావా?"
ఒక గుటక మింగి చెప్పాడు రవి.
"సర్! నాకు చాలా పెద్ద ఫేవర్ కావాలి!"
అనుమానంగా చూశాడు చీఫ్ "ఏమిటి?"
"నాకు హైదరాబాద్ లోనే పోస్టింగ్స్ కావాలి సర్!"
ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"హైదరాబాద్ పోస్టింగ్సా? అబ్సల్యూట్ లీ నో! నో! బాంబే వెళ్ళడానికి నువ్వు వప్పుకున్నావు కదా?"
"అన్నాను సర్! కానీ... అనుకోని పరిస్థితులు...."
"ఎలాంటి పరిస్థితులలోనైనా కంపెనీ పట్ల విశ్వాసంగా ఉండగలవాళ్ళే మాకు కావాలి! అందుకే అంతంత సాలరీస్ పే చేస్తున్నాం! అవునా?"
"కానీ సర్, ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాంటిది"
"ఎవరికి?"
"నాకూ, మరో అమ్మాయికీ"
"ఇంకొంచెం వివరంగా చెప్పగలవా?" అన్నాడాయన అప్రసన్నంగా. కాస్త ఆలోచించాడు రవిచంద్ర.
తను చెప్పబోయే కారణం తనకి తప్ప మరెవ్వరికీ ముఖ్యం కాదని తెలుసు అతని. పైగా విన్నవాళ్ళు నవ్వవచ్చు కూడా.
అయినా చెప్పాడు. ఆయన అడిగినట్లే వివరంగా. సీరియస్ గా విన్నాడు ముఖర్జియా. తర్వాత చాలాసేపు ఆలోచించి అన్నాడు.
"నేను మెషిన్ని కాను. మనిషిని. నీ ప్రాబ్లెం అర్థం చేసుకోగలను. అయితే నేను చెయ్యగల సాయం ఒక్కటే ఉంది."
ఆయన నోటివెంట వస్తున్న ప్రతి అక్షరాన్ని చెవులప్పగించి వింటున్నాడు రవి.
"ఒక్క సంవత్సరం బాంబేలో వర్క్ చెయ్యి! నెక్స్ ట్ ఇయర్ చాలా రిటైర్ మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఒక వేకెన్సీ వస్తుంది. అప్పుడు నిన్ను ఇక్కడ అకామడేట్ చేస్తాం."
చెప్పలేనంత నిరాశ కలిగింది రవిచంద్రకి.
"అది చాలా కష్టం సర్!"
"అయితే ఏం చెయ్యదలుచుకున్నావ్?"
"మీరు నొచ్చుకోకపోతే నేను డ్రాప్ అయిపోతాను సర్!"
"అంటే? బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసేసుకుంటావా? మరొక్కసారి ఆలోచించుకో రవి! ఇన్నాళ్ళ నుంచి కంపెనీ నీమీద చాలా ఖర్చు చేసింది. అదంతా రీపే చెయ్యవలసి ఉంటుంది నువ్వు."
"రీపే చేస్తాను సర్!"
చాలాసేపు రవిచంద్రనే చూస్తూ ఉండిపోయాడాయన. తర్వాత ఏదో తట్టినట్టు అన్నాడు "పోనీ ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుని బాంబే వెళ్ళిపోవచ్చుగా?"
కొంచెం ఆలోచించి చెప్పాడు రవిచంద్ర "ఇంతవరకూ ఆ దృష్టితో ఆలోచించలేదు సర్! అయినా ఆ అమ్మాయి ఇంకా మామూలు మనిషి కాలేదు! మంచు ముక్కలా వుంది ఆమె మనసు. మంచుముక్క కాలం గడుస్తున్న కొద్దీ కరిగిపోతుంది సర్! అయితే కనీసం అప్పటిదాకా నన్నా ఓపిక పట్టకపోతే ఆ అమ్మాయి మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోవచ్చు."
"నువ్వు ఎవరిని పెళ్ళాడినా చాలా మంచి భర్తవు అవుతావు రవీ!" అన్నాడాయన ఆర్ద్రంగా.
లేచి నిలబడ్డాడు రవి. "మే ఐ గో నౌ సర్!"
"ఆల్ ద బెస్ట్! మై సన్!"
తను ఇష్టపడ్డ ఓ అమ్మాయి కోసం ఇంటర్నేషనల్ జెయింట్ అయిన ఆ కంపెనీతో సంబంధం తెంపేసుకు బయటికొచ్చేసిన రవిచంద్ర, ఈ ప్రపంచాన్ని ఒంటరిగా ఒంటిచేత్తో ఎదుర్కోవలసి వచ్చినవాడిలా ఫీలవుతూ కాసేపు నిలబడి, తర్వాత ఇంటిదారి పట్టాడు.