Previous Page Next Page 
నివేదిత పేజి 17


    ఒక వైపు జ్వరంబాధ, మరోవైపునుంచీ హృదయాన్ని పిండే ఆలోచనల తాకిడి, ఆ రాత్రి ఆమె మళ్ళీ కన్ను మూయలేదు.

 

                                                              * * *

 

    వేదితను అంత వైపరీత్యానికి గురిచేసి, ఆమెతో బయటకు వెళ్లమని శాసించబడినాక శేషశాయి గుడిదాటి యివతలకువచ్చి గాయపడిన హృదయంతో పిచ్చెక్కినవాడిలా అడవులవైపు బయల్దేరాడు. కాళ్ళరిగిపోయేటట్లు అంతూ, పొంతూ లేకుండా అలా ఎంతసేపు తిరిగాడో అతనికే తెలియదు . పైన ఎండ నెత్తి మాడ్చేస్తున్నది. దానికి ఆలోచన్ల వేడి కూడా జోడై ముఖం నల్లగా కమిలిపోయింది.  

 

    అలా తిరిగి తిరిగి ఎప్పటికో యింటికి చేరుకున్నాడు. బట్టలైనా మార్చుకోకుండా ప్రక్కమీద వాలబోతుండగా, గుమ్మం దగ్గర గాజుల చప్పుడయితే తల త్రిప్పి చూశాడు. తలుపవతల సీత తలవంచుకుని నిలబడివుంది.

 

    "ఇప్పుడేం కావాలి సీతా నీకు?" అన్నాడు చిరాగ్గా.

 

    "చాలా ఆలస్యమయిపోయింది. బట్టలు మార్చుకుని భోజనానికి లేవండి" అంది సీత తలవంచుకునే.

 

    "నా కాకలిగాలేదుగాని, నన్ను వేధించక యిక్కడ్నుంచి వెళ్లు సీతా"

 

    "పోనీ ఎంత ఆకలి అయితే అంతే తిందురుగాని రండి."

 

    "అబ్బబ్బ! నాకు మనస్సు బాగాలేదు. ఇక్కడినుంచి వెడతావా లేదా?" అన్నాడతను గద్దిస్తూ.

 

    ఒక్కక్షణం మెదలకుండా వూరుకుని మ్లానమైన ముఖంతో సీత మెల్లిగా వెనుదిరిగి వెళ్ళబోతోంది. ఇంతలో అతనికేదో స్ఫురించి "ఆగు" అని అరిచాడు.

 

    సీత నిలబడిపోయింది.

 

    "నువ్వు అన్నం తిన్నావా?"

 

    ఆమె జవాబు చెప్పకుండా మెదలకుండా ఊరుకుంది.

 

    "నిన్నే?"

 

    "ఏమిటండీ?"

 

    "అన్నం తిన్నావా? అని అడుగుతున్నాను."

 

    ఒక్కక్షణం మాట్లాడకుండా వురుకుని "మీరు భోజనం చేయకుండా నేనెలా చేస్తాననుకున్నారు?" అని అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడ్నుంచి గబగబ వెళ్ళిపోయింది సీత.

 

    అతని మనసుమీద చురుక్కుమని అంటించినట్లయింది. ఆమె వెళ్ళినవైపే చూస్తూ అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ఆమెయందు అతనికి ఎక్కడలేని గౌరవమూ జనించింది. కాని ఆమెని పిలిచి సరళంగా మాట్లాడగలిగే ఓర్పు, నిశ్చింతహృదయమూ అతనికి లేవు. కాసేపు అట్లాగే కూలబడి వుండి, తర్వాత మెల్లగా పరుండి కళ్ళు మూసుకున్నాడు.

 

    తర్వాత రెండు మూడురోజులు గడిచిపోయాయి. అతని ఉనికి అతనికే గగుర్పాటుగా ఉంది. ఆలోచించకుండా ఉండాలని సీసామీద సీసా ఖాళీ చేస్తున్నాడు. తను చేసిన పనికి అతనికేమీ పశ్చాత్తాపం కలగటంలేదు. వేదితమీద జనించిన వ్యామోహాంధకారం రానురానూ పెరుగుతున్నదేగాని, ఆమెను మరిచిపోవటం అతనికి సాధ్యం కావటం లేదు.  

 

    అతనెప్పుడూ మైకంలోనే ఉంటాడు. "నేను ఏమిటి? జీవితాన్ని విశృంఖలంగా గడపగలిగిన వాడ్ని. యింత దిగులుతో కుమిలిపోతున్నానేమిటి? వేదిత కంటే అందగత్తెలు వెదికితే కనబడరా? వాళ్ళని నేను స్వాధీనం చేసుకోలేనా? ఏమిటి నాకీ వెర్రి!" అని అనుకుంటూ ఉంటాడు.  

 

    ఒకరోజు అతనికి బొంబాయిలోని అతని హిందూస్థానీ స్నేహితుడు సక్సేనా దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. విదేశాలలో ఉన్నప్పుడు ఇద్దరూ మంచి మిత్రులు. ఇంతకాలమూ ఇంత డబ్బు ఖర్చుపెట్టి చదివి, ఏదో ఓ మూల యింజనీరుగా ఉద్యోగం చేయటం తన కిష్టం లేదనీ, తన దగ్గర లక్షలు లక్షలు డబ్బు మూలుగుతోందనీ, శాయి కూడా భాగస్వామిగా కలిస్తే భారీ ఎత్తున ఏదయినా యింజనీరింగ్ వర్క్స్ స్థాపించవచ్చుననీ, ఈ విషయాలు స్వయంగా మాట్లాడటానికి రెండు మూడు రోజుల్లో బయల్దేరి వస్తున్నాననీ రాశాడు.

 

    అతని ఉత్తరం చూశాక వ్యాపారం స్థాపించాలన్న అతని కోరిక మరింత బలపడింది. కొంత ఉపశాంతి లభించినట్లయింది.

 

    రాసినట్లుగానే మూడు రోజుల్లో సకేన్సా ఆనందపురానికి వచ్చేశాడు. అయితే అతను కారులో వచ్చాడట. కారు ఊళ్ళోకి తీసుకురావటానికి వీల్లేదు. కాబట్టి, ఆరుమైళ్ళ దూరంలోనే జంక్షన్ లో ఆపి, తను ఎడ్లబండిలో వచ్చాడు.

 

    అతగాడికి ఉండవలసిన వ్యసనాలన్నీ ఉన్నాయి. చురుకుపాలూ, ఉత్సాహము కూడా ఎక్కువేమో! ఒక్క చుక్క గొంతులో పడగానే యింగ్లీషు ట్యూనులూ, ఉర్దూ ఘజతాలూ అందుకుని యిల్లదరకొట్టేస్తాడు. అందులో యిక్కడి ఆడవాళ్ళనూ, వారి సహజ సోయగాన్నీ చూశాక అతనికి మరింత మతిపోయింది. కేకలూ కేరింతలూ యెక్కువైనాయి.

 

    ఈ ఆగడాలన్నీ యింట్లో చేస్తే మరీ లజ్జావిహీనంగా ఉంటుందని ఝడిసి శేషశాయి ఈ పల్లెటూళ్ళో అతనికి సదుపాయం ఉండదనీ, సౌకర్యాలు జరగవనీ వంకపెట్టి జంక్షన్ వెళ్ళి, కారులో అతన్ని తీసుకువెళ్ళి బస్తీలో ఉన్న ట్రావెలర్స్ బంగాళా తీసుకుని, తనుకూడా అతన్తోపాటు అందులోనే ఉన్నాడు.

 

    సాయంత్రాలు కార్లో మైళ్ళకు మైళ్లు షికార్లు చేస్తూ, పానీయాలు సేవిస్తూ విందులు ఆరగిస్తూనే వాళ్ళు తమ భావికార్యక్రమాన్ని క్షుణ్ణంగా చర్చించుకున్నారు. ఈ మనోవ్యధలతో తాను ఈ గ్రామంలో నివసించలేడు. అందుకని ఎంతటి విఘాతాలనైనా ఎదుర్కొని వ్యాపారంలో ప్రవేశించటానికే శేషశాయి నిశ్చయించుకున్నాడు. బ్యాంకులో అతనికి చాలా ఎకౌంటు ఉంది. అదీగాక తమకున్న వందల కొద్దీ ఎకరాలలో చాలా భాగం అమ్మేసి, డబ్బు చేసుకుని రెండు మూడునెలల్లో అతన్తోవెళ్లి జత కలవటానికి నిర్ణయమైపోయింది.

 

    అయిదారు రోజులు ఖుషీగా, పైలా పచ్చీసుగా గడిచిపోయాయి. యిద్దరికీ డబ్బుకు కొరతలేదు. ఇద్దరూ భోగలాలసులు. మితృడి కోరికమీద శేషశాయి ఖరీదైన ఓ యింతిని కూడా రప్పించి అతడి ఆనందపు ఆవధులకు పరిపూర్ణత చేకూర్చాడు. అయితే తను మాత్రం ఆమె జోలికిపోలేదు.

 

    ప్రక్కగదిలో సక్సేనా మత్తుగా త్రాగి ఆ తాత్కాలిక ప్రియురాలితో కూడా త్రాగించి, మత్తెక్కి నవ్వులలో, కేరింతాలలో, శృంగార చేష్టలలో మునిగి తేలుతూంటే అతను సోఫాలో వంటరిగా పడుకుని గ్లాసుమీద గ్లాసు త్రాగుతూ, సిగిరెట్టు మీద సిగిరెట్టు కాలుస్తూ, నీళ్లు నిండిన కళ్ళతో పై కప్పువంక చూస్తూ ఆలోచన్లతో, తీరని కోర్కెలతో కాలేవాడు.

 Previous Page Next Page