"ఉహుఁ ఇంత ఉపద్రవంలో మందులేకుండా పడుకుంటే ఇంకేమయినా ఉన్నదా?" అంటూ ఆమె నాడీ పరీక్షచేసి, లేచి వెళ్ళి గోడనున్న అలమారాలోంచి అరకు తీసుకువచ్చి, ఆమె తల తన వొడిలో పెట్టుకుని బలవంతంచేస్తూ కాస్త కాస్తచొప్పున మందు త్రాగించేశాడు. తర్వాత పట్టీ తీసుకువచ్చి ఆమె నుదుటి మీద వేశాడు.
నుదుటి మీద చల్లదనానికి ఒకింతసేపు తేరినట్లయి వేదిత కళ్ళు మూసుకుని పడుకుంది మౌనంగా.
ఆచార్యులుగారు చాలా సేపటివరకూ కూతురు చెంతనే కూర్చుని ఆమె నిద్రపోయిందని దృఢపరుచుకున్నాక భగవతి ప్రార్థన చేసుకుని, దీపం తగ్గించి ప్రక్క మీదికిపోయి పడుకున్నాడు. ఆ పూట ఆయన ఫలహారం కూడా చేయలేదు.
మొదట వేదితకు మాగన్నుగా నిద్రపట్టింది. ఈ నిద్రలో సుఖంలేదు. మగతతో కూడిన నిద్ర. వివిధ భావాలు, కలలు, పైగా పీడకలలు.
తాను ఒక్కతే యమునానది ఒడ్డున విరహిణియై తిరుగాడుతోంది. ఒడలంతా సెగను, తన విశాల నేత్రాలను మరింత విశాలం చేసుకుని, తడబడే మనస్సుతో నలువైపులా కలయజూస్తోంది.
తను ఎవరికోసం ఎదురు చూస్తున్నదో తనకు తెలుసు. కాని అంతా అయోమయంగా, అస్పష్టంగా ఉంది. తాను ఒక్కోసారి వేదితగా మారిపోతోంది. ఒక్కొక్కసారి గోపికగా మారిపోతోంది.
"వేదితా! నువ్వు వితంతువు. గోపికగా ఉండటానికి తగవు" అని ఏదో అజ్ఞాతశక్తి హెచ్చరించినట్లయింది.
ఆమె విషాదంగా నవ్వుకుంది. "ఇంత ఉధృతంగా పొంగే ప్రవాహం అర్హత అనర్హతలను యోచిస్తూ ఆగుతుందా?" అనుకుంది.
ఇంతలో ఆమె మేలిముసుగును ఎవరో సడలించినట్లయింది. కెంపుల్లాంటి ఆమె బుగ్గలపై చిలిపిగా గాలి ఊదినట్లయింది. జడను లాగినట్లయింది. వ్రేళ్లు సున్నితంగా మీటినట్లయింది.
పులకితురాలై నిలబడిపోయింది. ఎట్లానో... ఎట్లానో.... నరాలు స్వాధీనంలోకి తీసుకుని కళ్ళెత్తి చూసింది.
ఓ శృంగార మోహనమూర్తి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆజానుబాహువు. విశాలమైన వక్షస్థలం. నల్లని ఆకర్ణాంత నేత్రాలు. శిరస్సున మణిమయ కిరీటంలో మెరిసే నెమలి పింఛమూ, చేతిలో పిల్లనగ్రోవి.
అతడ్ని చూసి వేదిత వివశురాలైపోయింది. ఆమె కన్నులు అరమోడ్పులయినాయి. శరీరం గగుర్పొడిచింది.
"నేను వచ్చాను" అన్నాడతడు గంభీర కంఠంతో.
ఆమె కపోలాలు సిగ్గుతో ఎర్రబడినాయి. ఇహ ఆ భువన మోహనుని రూపం చూడటం ఆమెవలన కాలేదు.
"నేను వచ్చాను" అన్నాడతను మళ్ళీ. తియ్యగా ఉంది ఆ స్వరం.
"ధన్యురాల్ని స్వామీ!" ఆమె గొంతు తడబడి నేత్రాంచలాల్లో నీళ్ళు నిలిచాయి.
"అలా తలవంచుకుంటే ఏముంది? ఇలా నా వంక, నా చూపుల్లోకి చూడు. ఇది వరకు భక్తితో ముడివేశావు! ఇప్పుడు చూపులతో ముడివెయ్యి."
నెమ్మదిగా తల ఎత్తింది ఈ నీలమేఘశ్యాముని నిర్మలదర్శనం కాగానే మనసంతా ఆనందోద్రేకంతో నిండిపోయి పెదవులు దాటి మాట బయటకు రాలేదు. తాను కఠినురాలే అనుకుంది. ఇంత ముగ్థగా తయారయిందేమిటి? ఇంతటి లాలిత్యం పొదుపుకుని ఉందా తనలో?
అతని చూపులకు ఒడలు కరిగి, వెన్నెల జలపాతంగా మారుతోంది. అట్లాగే తన్మయంగా చూస్తున్నది. ఆమె అర్థనిమీలిత నేత్ర అయింది. పెదవులు అర్ధచంద్రాకృతి దాల్చాయి. అని కదులుతున్నాయి, వొణుకుతున్నాయి.
మీ దాసిని, మీ పిపాసిని, మీ సేవికను. నన్ను గైకొనండి" మాటల పువ్వులు రాలాయి ముత్యాలవంటి ఆమె పలువరుస దాటి.
అతను చిరునవ్వు నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆమె మీదకు సాగిన గాలిలో విద్యుత్ ప్రవహించినట్లయింది. మైకం కమ్ముకువస్తున్నది. తన చేతిని ఆమె నడుంచుట్టూవేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె చుబుకాన్ని పట్టుకుని ముఖం పైకి ఎత్తాడు. ఆమె అధరాలు అదురుతున్నాయి. అతడు ముందుకు వొంగి వాటిని మృదువుగా ముట్టుకొన్నాడు.
ఆమె మైమరిచిపోయింది. కనులు వాటంతట అవే మూసుకుని పోయాయి. విచిత్రమైన మగత శరీరమంతా ఆవహించింది.
అట్లా ఆ దశలో ఎంతసేపు వున్నదోగాని, తెలియని మార్పు ఒకటి తనని క్రమ్మివేస్తున్నదని క్రమంగా తెలుసుకున్నది. తనకు మధురాను భూతులు కలుగజేసిన స్పర్శలోని మాధుర్యం నశించిపోయింది. భరించలేని సెగలోపడి మరిగిపోతున్నట్లూ, నరాలు ముక్కలు ముక్కలు అవుతూన్నట్లూ అనుభూతి పొందింది.
ఈ నూతన పరిణామం భరించలేక కళ్ళు విప్పి చూసి అదిరిపడింది. తను ఉన్నది మురళీలోలుని మోహనపరిష్వంగంలోకాదు. శేషశాయి ఇనుప కౌగిలిలో బంధించబడి వుంది.
"ఛీ! అని ఒక విదిలింపు విదిలించి వేసింది.
"అమ్మా!" అని మూలుగుతూ వేదిత కళ్ళు విప్పింది. ఓహ్! తను కుటీరం, గోడన చిన్నగా వెలిగే దీపం. ప్రక్కనే మంచము మీద వృద్ధుడైన తండ్రి.... ఇదంతా కల!
కాని ఛీ, ఎంత అసహ్యమైన కల!
"నా బుద్ధి వక్రమైపోయింది. నేను కలుషితమయినాను. నాలో పవిత్ర ఆలోచనలు నశించిపోయాయి." వేదిత రోదిస్తోంది.
"అతీతురాలి ననుకున్నాను. నా అహంభావం మంట గలిసింది. నాలో నిర్మల బుద్ధిలేదు. తేజస్సు అంతకంటే లేదు. ఉంటే అతను నిర్భయంగా యింత అల్పత్వానికి నన్ను ఎలా గురిచేయగలడు? అతడు నా కలలోకి రావటమేమిటి?అక్కడ జరిగిందేమిటి?
"ప్రభూ! ఇహ నాకు ముక్తిలేదు. నాకు చావు ప్రసాదించు. అసలు ఎందుకు నాకీ జన్మ నిచ్చావు? నన్ను హీనురాల్ని చేయటానికేనా? నీ తీర్పు యిదా?"