Previous Page Next Page 
నివేదిత పేజి 18


    మొదట ఆ మహాప్రవాహంవంటి అనుభవాల దొంతరలో స్నేహితుడి ఉదాసీనత గమనించకపోయినా మత్తు విడినాక విషయం గ్రహించి అయినా అతని స్థబ్దత్వానికి కారణం ఊహించలేక యిహ కవ్వింపుకు దిగాడు సక్సేనా. తనకు అమృత క్షణాలు అందిచ్చిన పంకజాన్ని అతని మీద ఉసిగొల్పాడు. త్రాగి, మత్తెక్కి మరో ప్రపంచములో ప్రయాణం చేస్తోన్న పంకజం, శాయి ముందు నిలబడి అతన్ని గేలిచేస్తూ, అతన్ని తాకి కవ్విస్తూ, అతనిమీదపడి అల్లరిచేస్తూ నానా చేష్టలు చేస్తూ రభస చేస్తుంటే అతను ఎదురుగా కూర్చుని ఉత్సాహంతో తిలకిస్తూ కేరింతలు కొడుతున్నాడు.

 

    శేషశాయి ఈ అఘాయిత్యాలన్నీ కొంతసేపు భరించి, ఇహ వెగటుపుట్టి "సక్సేనా! నీకు పుణ్యముంటుందిగాని ఈమెను మాత్రం నా మీదకు పురిగొల్పకు. అవతలకు తీసుకువెడుదూ?" అన్నాడు ఇంగ్లీషులో స్నేహితుడ్ని వేడుకుంటూ.

 

    సక్సేనా కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా "ఏం? ఈమె నీకు నచ్చలేదా?" అని అడిగాడు.

 

    "ఉహుఁ, అదికాదు. నే నీమెను నీ కోసం తీసుకువచ్చాను. నా కోసం కాదు."

 

    "అలా కొత్తగా మాట్లాడుతున్నావేమిటి మిస్టర్ శాయీ! ఈ అభ్యంతరాన్ని మన మెప్పుడయినా పాటించామా?"

 

    ఇహ అతనికి ఎలా నచ్చచెప్పాలో తెలియక "నాకు యిప్పుడు మాడ్సులేవు. దయవుంచి నన్ను వదిలెయ్యి సక్సేనా!"అని ప్రాధేయపడ్డాడు.

 

    "ఆల్ రైట్! మనవాడు ఒట్టి సజ్జు సరుకుగా తయారయాడు. మనం పోదాం రా డార్లింగ్" అని హిందీలో అంటూ ఆమె భుజంమీద చేయి వేసి ప్రక్కగదిలోకి తీసుకు వెళ్ళాడు సక్సేనా.

 

    తన అపజయానికి పంకజం కాస్త చిన్న బుచ్చుకుంది. కాని మరో గ్లాసు కడుపులోకి పోయేసరికి సర్వం మరచి ప్రపంచ అంచులకు పరిగెత్తింది.

 

    మిత్రుడు మనస్సులో తీవ్రంగా దేన్ని గురించో మధన పెట్టుకున్నాడని గ్రహించాడు సక్సేనా. మరునాడు పంకజాన్ని పంపించివేశాక దగ్గరకు జేరి గ్రుచ్చిగ్రుచ్చి అడిగాడు.

 

    మొదట్లో తన అంతర్గత వేదనని గురించి బయటకు చెప్పటం యిష్టం లేకపోయింది శాయికి. సక్సేనా ముందు దాచాలని కాదు. అతడు తనని విలాసపురుషుడిగానే గుర్తించాడుగానీ, మనోవ్యధల పాలైన నిర్భాగ్యుడిగా అర్థం చేసుకోకపోవచ్చునని అతని భావం. కాని అతడు మరీమరీ బలవంతం చేసేసరికి యిహ తప్పనిసరయి తనకు వేదిత కనబడటం దగ్గర్నుంచీ జరిగిన సంఘటనలూ, ఆమె మనస్తత్వం, గ్రామంలో ఆమెని అందరూ చూచే విధం, తనలో ప్రవేశించిన మార్పూ అన్నీ పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. తన భార్యను తాను స్వీకరించ లేకపోతూన్న సంగతికూడా దాచలేదు.    

 

    అంతా విని సక్సేనా నిట్టూర్చి "చివరకు ఇంత ప్రేమ, వ్యామోహాలకు గురి అయ్యావా? అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూన్న లేత వయస్సులో అయితే ఈ మానసిక పరిమాణాలు అంత ప్రమాదమైనవి కాదుగానీ, జీవితంలో స్థిరపడవలసిన ఈ వయస్సులో మహా ప్రమాదాన్ని చేకూరుస్తాయి. నీవు నీ భార్యతో సమంగా ఉండకపోవటం మరింత దురదృష్టకరం. బయట ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా సంసారంలో ఒడుదుడుకులు లేకుండా చూసుకుంటే తప్ప మనం సాఫీగా బ్రతకలేము శాయీ! నేనెంత పైలా పచ్చీసుగా విలాసాలలో మునిగి తేలుతూ కాలం గడిపినా భగవంతుడంటే భయం, నమ్మకం ఉన్నాయి. ఆధ్యాత్మికత  అంతే అభిమానం ఉంది. నువ్వు చెప్పినదంతా విన్నాక ఆ స్త్రీని దర్శించాలని కుతూహలం కలుగుతోంది. నాకు చూపిస్తావా?" అని అడిగాడు ఆర్ధ్ర స్వరంతో.

 

    "నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను."

 

    "ఉహుఁ నాకు మనిషిని చూడాలని ఉంది. దేవాలయానికి అందరూ పోవచ్చుగా, నేను వెళ్ళి చూస్తాను."

 

    శేషశాయి కొంచం ఆలోచించి "ఉండు, ఆమెను చూసే విధానం ఉంది. అలాగే చూపిస్తాను. చూశాక నాలో చెలరేగే అగ్ని సకారణమైనదే అని నువ్వు అంగీకరిస్తావు" అన్నాడు.

 

    ఆ సాయంత్రమే యిరువురూ ఊరికి తిరిగి వచ్చారు. ఆ రాత్రి ఇంట్లోనే భోంచేశారు. ఇద్దరికి సీతే వడ్డించింది. ఆమె వంక మొహమాట పడకుండా సుదీర్ఘంగా చూసి సక్సేనా "అదృష్టవంతుడివి భాయి నువ్వు. ఇలాంటి యిల్లాళ్ళని చూస్తే మన దేశమన్నా, భూమి అన్నా ఎనలేని గౌరవం కలిగి ప్రాణం లేచివస్తుంది. ఈ పదార్థాలు నీ భార్య వండిన వేనా? వహ్వా! ఏమీ కమ్మదనం! ఏం రుచి!" ఇంగ్లీషులో అంటూ తెగ మెచ్చుకుంటున్నాడు.

 

    అతని భాష అర్థం కాకపోయినా తన గురించే సంభాషిస్తున్నాడని సీత తెలుసుకుని సిగ్గు, బలహీనతల మూలంగా ముఖం ఎర్రబడగా మెల్లగా తలుపు అవతలకు తప్పుకుంది.

 

    బయటకు గంభీరంగా కనిపిస్తుందిగానీ, తన గురించి ఎక్కడ చర్చ వచ్చినా, తనకి భయం కలిగించే ఆలోచనలు వచ్చినా సీత గుండె గబగబ కొట్టుకుంటుంది. అప్పుడప్పుడు ఆమె గోడకి చారగిలబడి కళ్ళు మూసుకుని హృదయంమీద చేయివేసి నొక్కుకుని ఆవేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తుంది.

 

    శేషశాయి అతని మాటలు వినీ విననట్లుగా ఊరుకున్నాడు.

 

    తెల్లవారు ఝామునే శాయి నిద్రలేచి స్నేహితుడ్ని నిద్రలేపాడు. ఇద్దరూ మెల్లిగా బయటకువచ్చి ఏటివైపు సాగిపోయారు. శాయి అతడ్ని తాను మొదట నిలబడి ఫోటోలు తీసిన గంగరావి చెట్టుక్రిందకే తీసుకువెళ్ళాడు.

 

    మెల్లిగా తూరుపు రేఖలు విచ్చుకున్నాయి. గలగలపారే ఏటి నీటి మీద సూర్యకిరణాలు పడి రంగురంగులుగా మెరుస్తున్నాయి.

 

    "తానా అఘాయిత్యం చేసినప్పట్నుంచీ ఆమె ఏటికి రావటం మనేసిందేమో, రాదేమో ఇప్పుడు" అనుకుంటూ కలవరపడుతున్నాడుశాయి. ఆమెను చూసి వెయ్యి యుగాలు గడిచినట్లయింది. చూడాలని మనస్సు వెయ్యి విధాల ఆశిస్తోంది.                     

 Previous Page Next Page