Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 16


    అంత చిన్న పజిల్ ని కనుక్కోలేకపోయినందుకు ఓ పక్క నాలిక్కరుచుకుంటూనే, ఆ అమ్మాయి చివర్లో అడిగిన ప్రశ్నపట్ల ఎలా రియాక్టవ్వాలో అర్థంకాక సతమతమయ్యాడు శ్రీధర్.

 

    "ఏంటాలోచిస్తున్నావ్...బంగారుకొండా! ఇంతకీ నీకు అనుభవం వుందా? లేదా?" తిరిగి అడిగిందామె.

 

    "లే...లే...లేదు...అయినా ఎంత ధైర్యం నీకు? ఒక మగాడ్ని పట్టుకొని సెక్స్ లో అనుభవం వుందా అని అడుగుతావా? పోకిరీ పిల్ల..."

 

    "ఏం? సెక్స్ ఓ సైన్స్...వారానికి అరడజను పత్రికలు వేయించుకుంటావే... వాటిలో సెక్స్ గురించి నువ్విప్పటికే చదివి వుండాలే. సెక్స్ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేయకపోతే, సృజనాత్మకమైన ఆలోచనలు పుట్టుక ఆగిపోతుంది తెలుసా?"

 

    ఆ మాట విని ఆదిరిపడ్డాడు శ్రీధర్. తను వారానికి అరడజను పత్రికలు వేయించుకోవడం ఎంత నిజమో, పట్టు వదలకుండా వాటిని చదివెయ్యడం అంతే నిజం, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతోంది? అనుకున్నాడు తనలో తాను.

 

    "అవునూ...నల్లపిల్లా! నీకీ విషయం ఎలా తెలుసు?" అతను నల్లపిల్ల అని సంభోదించడంతో అటువైపు నుంచి సెలయేటి గలగలల్లాంటి నవ్వు వినిపించింది. "ఇంతకీ నువ్వు పాతాళ భైరవి సినిమా చూశావా?" అడిగిందామె.

 

    "లేదు...చూళ్ళేదు."

 

    "అయితే నేను కేసెట్ ఇస్తా...చూడు."

 

    "నువ్వెందుకిస్తావ్? నేనెందుకు చూడాలి? అయినా అందులో ఏముంటుంది?" ఆశ్చర్యాన్ని తన కంఠంలో ప్రస్ఫుటంగా పలికిస్తూ అడిగాడు శ్రీధర్.

 

    "ఎందుకయ్యా బాబు! అన్నిసార్లు ఆశ్చర్యపోతావ్? నువ్వు మీ అమ్మ కడుపులోనుంచి పుట్టావా? లేక ఆశ్చర్యం అంచుల్లోంచి పుట్టావా? ఏది ఏమైనా నువ్వెన్నిసార్లు ఆశ్చర్యపోయినా అది నాకు చాలా బాగుంటుంది. నీవసలే పెద్ద పెద్ద కళ్ళు... ప్రపంచం మొత్తాన్ని నీ కనురెప్పలమాటున దాచుకుందామన్నంత అందంగా వుంటాయ్. నీకు తెలియదు గాని నీ అంతలేసి కళ్ళు ఎన్ని భావాల్ని పలికిస్తాయో...? ఆ కళ్ళు నీక్కాదయ్యా వుండవలసింది-ఆడపిల్లలకుండాలి.

 

    నీ హృదయం నీ కళ్ళలో కనిపిస్తుంది. నీలో చెలరేగే భావాల్ని నీ కళ్ళు దాయలేవు... నీలో రేగే అసహనం, అసంతృప్తి, ఆవేదన, అనిశ్చిత స్థితి, ఆలోచనల తీవ్రత, ఆతృత, ఆరాటం, కోరిక, తపన, ఆపైన ఆగ్రహం, ఆవేశం, ఆనందోద్వేగం, అభినివేశం...ఇంకా చెప్పాలనే వుంది. కానీ తెలుగు భాషమీద నాకంత పట్టులేదు. అందుకే ఉత్తర భారత వనితనైనందుకు ఇంత బాధపడుతున్నా... ఆ భావాలనేవీ నువ్వు దాచలేవు.

 

    నీ కళ్ళు నీలో చెలరేగే భావాలకు వాకిళ్ళు...దీన్ని బట్టి నీకర్థం కాలే...నేనెంత దగ్గరగా నిన్ను ఫాలో అవుతున్నానో.

 

    ఎనీ హౌ, ఐ లైక్ యువర్ ఐస్...

 

    నీకు సైనస్ వుందనుకుంటాను. అందుకే నీ కళ్ళకింద చిన్నపాటి గుంటలు... దానికి తోడు సిగరెట్ల గోల ఒకటి. మానెయ్యకూడదూ... మంచివాడు మా బంగారుకొండా అని అనుకొంటాను..." అందామె-మామూలుగా కాదు- ఎంతో మార్థవంగా.

 

    ఆమె చివరి మాటలు వింటూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ మాటల్ని మరోసారి మననం చేసుకున్నాడు. దాంతో అతనికి రెండో క్లూ దొరికినట్టయింది.

 

    ఒకటి : నల్లపిల్ల

 

    రెండు : నార్త్ ఇండియన్.

 

    "ఏం మాట్లాడవేం?" ఇప్పుడామె కంఠం ఇంతకుముందులా లేదు. మామూలుగా వుంది.

 

    "అదే ఆ పాతాళభైరవి క్యాసెట్ ఎందుకు చూడాలి...? అందులో ఏముంది?" అడిగాడు శ్రీధర్.

 

    "అందులో ఓ అద్భుతమైన డైలాగ్ వుంది. అది నువ్వు వినాలి."

 

    "ఏంటా డైలాగ్...ఎవరు ఎవరితో అన్నారు? ఎందుకన్నారు?" ప్రశ్నించాడు శ్రీధర్.

 

    "ఖర్మకాలి ఏ ఆడపిల్లయినా ఓ ముద్దపప్పులాంటి వాడ్ని ప్రేమించి, అతన్నుంచి ఎలాంటి స్పందన లభించకపోతే, ఆ డైలాగ్ అనవలసి వస్తుంది."

 

    ఆనందం, అసహనం, ఆసక్తి, కలగలిసిపోయిన స్థితిలో వున్నాడు శ్రీధర్.

 

    "ఎందుకిలా చంపుకుతింటావ్...? ఆ డైలాగ్ ఏంటో చెప్పొచ్చుకదా?" తనలో రేగుతున్న భావాల్ని తన కంఠంలో కలపకుండా చూసుకుంటూ అడిగాడు శ్రీధర్.

 

    "సాహసం చేయరా డింభకా! రాకుమారి దక్కేను... అని ఎస్వీరంగారావు ఆ సినిమాలో ఎంత గొప్పగా అన్నాడో తెలుసా...? ఆ సాహసం నీలో ఊపిరి పోసుకుంటుదేమోనని నా ఆశ..."

 

    "నువ్వెందుకు ఆశ పడటం?" అంతా అయోమయంగా వుంది శ్రీధర్ కి.

 

    అపరిచితురాలు ఫోన్ చేస్తే...ఆమెని హర్ట్ చేసి, ఫోన్ పెట్టేసేలా చేయాలనుకుంటాడు ప్రతీసారి. ఆమె మాటల్లో పెట్టేసరికి... ఆ విషయమే మర్చిపోవడం జరుగుతోంది...ఏముందా అమ్మాయి కంఠంలో...?

 

    ఆమె కంఠంలోని, ఇతరుల్ని కట్టిపడేసే స్వరపేటికకి ఆశక్తి ఎక్కడిది? ఆలోచనల్నుంచి తేరుకొని తిరిగి అడిగాడు- "నువ్వెందుకు ఆశపడటం?"

 

    "ఓ అందమైన అమ్మాయి- ఓ అబ్బాయిమీద ఆశపడుతున్నానని, అంటే ఎందుకు ఆశపడటం అని అమాయకంగా అడిగే అబ్బాయిని నిన్నే చూస్తున్నాను..." కిలకిలా నవ్వుతూ అందా అమ్మాయి.

 

    అతనికొక్క క్షణం పాలుపోలేదు.

 

    "సరే! ఎప్పుడిస్తావ్!" అడిగాడు శ్రీధర్.

 

    ఆ మాటని వేరే అర్థానికి అన్వయించుకుని సెలయేటి గలగలలా నవ్వింది.

 

    "ఇంతకీ క్యాసెట్ ఎప్పుడిస్తావ్?" అడిగాడు శ్రీధర్ ఆమె ఎందుకు నవ్విందో అర్థం చేసుకోకుండా.

 Previous Page Next Page