Previous Page Next Page 
అనైతికం పేజి 16


    అతను నవ్వాడు- "అతన్ని అడగడమే అవసరం లేదన్నావ్. మరి అతను వద్దన్నాడని బండి కొనడం క్యాన్సిల్ చేయడం మాత్రం దేనికి?"

 

    నేను జవాబు చెప్పలేనట్టు, అతనికి దొరికిపోయినట్లు, నిస్సహాయంగా చూశాను. అతను మళ్ళీ నవ్వి, నన్ను కూర్చోమన్నట్లుగా చెయ్యి వూపాడు. నేను కూర్చున్నాను.

 

    అతనన్నాడు- "చూడూ, నేను ముందే చెప్పాను. నా ఇంట్లో వాళ్ళందరి అవసరాలూ నా అవసరాలు కూడానని. అందుకే ఒకటి చెప్తాను విను. ఆ వెహికల్ ఏదో నేనే కొని పెడతాను. అప్పుడు ఇంట్లోవాళ్ళు కూడా ఏమీ అనలేరు" అని.

 

    నేను దిమ్మెరపోయాను. నాకు బండి ఆయన కొనిపెట్టడం ఏమిటి? నా అహం దెబ్బతిన్నది.

 

    కంట్రోల్ చేసుకుంటూ, "చూడండి, ఇక్కడ ప్రశ్న నేను వెహికల్ కొనాలా, లేదా అనేది కాదు. ఆ సమస్య మనస్తత్వాలకి సంబంధించినది. నాకు బండి కొనలేకపోతున్నాననే బాధకంటే, అతను దానికి చూపించిన కారణాలు, నా ఆలోచన పట్ల కొంచెం కూడా గౌరవం లేనితనం ఎక్కువగా బాధిస్తున్నాయి. ఆయనకే అంత పట్టనప్పుడు మూడో మనిషి నాకు కొనిపెట్టడం అన్నది నా కెందుకో సమంజసంగా తోచడంలేదు" అన్నాను ఇంగ్లీషులో.

 

    ఆతనిక నన్ను ఒప్పించలేనట్లుగా ఒక నిట్టూర్పు విడిచి, భుజాలు ఎగరేసి వూరుకుండిపోయాడు.

 

    ఆ తర్వాత ఇద్దరం కారులో బయల్దేరాం. కారులో ఆతనిక ఆ విషయం ఎత్తలేదు. కానీ ఇల్లు సమీపిస్తూండగా మాత్రం నిశ్శబ్దం ఛేదిస్తూ అన్నాడు- "గొడవలని ఎప్పుడూ తెగేదాకా లాగకు సుమా! నువ్వు చాలా తెలివైన, ముక్కుసూటైన మంచి అమ్మాయివి. నీకు వున్నదున్నట్లుగా మనసులో దాచుకోకుండా మాట్లాడడం. వెంట వెంటనే రియాక్టయిపోవడం అలవాటు. అది అసలు మంచి పద్ధతే కానీ ఎప్పుడూ కాదు. కొంచెం లౌక్యం నేర్చుకో..."

 

    నేనెటో ఆలోచిస్తూ అతను చెప్తున్నది వింటున్నాను. అతను ఆపేశాక అప్పుడడిగాను- "ఇప్పుడు ఆ స్కూటర్ షోరూం తెరిచి వుంటుందాండీ?" అని!

 

    నా మొండి వైఖరి అతనికి ఆశ్చర్యమే కలిగిందో, మరేంటో నాకు తెలీలేదు కానీ ఓ క్షణం తదేకంగా నా మొహంలోకి చూశాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు-

 

    "అసలు నీతో చెప్పాలనే అనుకోలేదు కానీ నీ వైఖరి చూశాక చెప్పాలనిపిస్తోంది. పొద్దున నువ్వు కాలేజీకి వెళ్ళిపోయాక మీ గదిలో వాడితో మాట్లాడాను. వాడూ బాగా విసిగిపోయి వున్నాడు. వాడు సాధారణంగా కూల్ మనిషి. నేను వాడిని సమర్థించడంలేదు. వాడిని ఎక్కువకాలం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. వాడంటే చెడ్డ అభిప్రాయమున్న వ్యక్తి భూప్రపంచంమీద మరెవరూ లేరు- నీవు తప్ప. అదే ఎందుకో నా కర్థంకాలేదు. నువ్వు ఒక వెహికల్ కొనుక్కోవాలనుకున్నావు. అదీ నీ డబ్బుతోనే. దాన్ని కాదనడానికి ఎవరికీ హక్కులేదు. కానీ సంసారం అన్నాక కేవలం హక్కులే కాదు కదా! నువ్వొక్కమాట అతనితో చెప్పి వుంటే అతడి అహమూ సంతృప్తి చెంది వుండేది. దానివల్ల నీకొచ్చే నష్టం కూడా ఏమీలేదు. ఆ విషయమే నీతో మాట్లాడదామనుకున్నను. నీవు మంచి మూడ్ లో లేవు. నిన్న నువ్వు గదిలో ఏం చేస్తున్నావో అని అందరం ఎంత కంగారుపడ్డామో తెలుసా? సర్లే; ఇల్లు దగ్గర పడింది. నీ మూడ్ బావున్న రోజు మరెప్పుడైనా మాట్లాడుకుందాం" అన్నాడు.

 

    "అతని మీద అంత సానుభూతి కలిగాక ఇక నాతో మాట్లాడడం, చర్చించడం అనవసరం!" అన్నాను. ఈసారి నా కంఠంలో దిగులు ధ్వనించింది. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అనే వ్యధ దాంట్లో ప్రతిఫలించింది. నా ఒక్క హక్కుని వినియోగించుకుంటానని నేననగానే, అంతవరకు నేను నెత్తిన వేసుకుని భరిస్తున్న బాధ్యతల విషయం అందరూ మర్చిపోయారు. ఇక వీళ్ళతో వాదాలు అనవసరం. వెహికల్ కొనుక్కుంటున్న విషయం ముందే మా ఆయనకి చెప్పి అనుమతి తీసుకోవచ్చుగా- అని నా బావగారి వాదం! ముందే చెప్పినా మా ఆయన '...నో' అంటాడుగా. చెప్పాల్సిందేముంది? అన్నది నా వాదం.

 

                                         *    *    *

 

    కారు ఇంటిముందు ఆగగానే నా భర్తే వచ్చి తలుపు తీశాడు. నేనతన్ని పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయాను. అతనూ నన్ను పలకరించే ప్రయత్నం చేయలేదు.

 

    ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మొహం, కాళ్ళు చేతులు కడుక్కుని, చీర మార్చుకుని వంటింట్లోకి జొరబడి పనిలో పడిపోయాను. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరమేం కన్పించలేదు నాకు. ఇంట్లో వాతావరణం మామూలుగానే వుంది.

 

    నిశ్శబ్దంగానే భోజనాలు ముగించి పడుకున్నాం. నేను పడుకునే సరికి నా భర్త టేబుల్ ముందు కూచుని ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. అతను అర్థరాత్రి లైటాఫ్ చేసి మంచంమీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకుని అటు తిరిగి పడుకోవడం ఏదో కలలోలా లీలగా గుర్తుంది.

 

    ఆ తర్వాత నిశ్శబ్దమే నా ఆయుధమై పోయింది. నేను మొండిగా కొనుక్కొస్తానేమోనని ఇంట్లో వాళ్ళు ఎదురు చూసినట్టున్నారు. కానీ నేను నా బావగారితో మాట్లాడిన తర్వాతి రోజు ఉదయమే వెళ్ళి కాన్సిల్ చేయించాను.

 

    చాలా రోజులవరకూ నా బావగారూ నాతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. బహుశా నేను ఆయన సూచనని పాటించకుండా బండి కొనడం మానేసినందుకు ఆయనకు కోపం వచ్చి వుంటుందని, అందుకే పట్టించుకోవడం మానేసి వుంటారని భావించాను. అయినా నేనేం బాధపడలేదు.

 

    ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు సమస్య కాకపోయినా, రీసెర్చి వల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ఎలాగూ నేను టీచ్ చేసేది బయాలజీయే కదా అని పి హెచ్.డి. ఆలోచన విరమించుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి నాకేదైనా మార్పు కావాలి. చదువు ఒక్కటే దానికి మార్గంగా తోచింది నాకు.

 

    యూనివర్శిటీలో ప్రస్తుతం నేను పనులు తేలిగ్గా చేయించుకోగలనన్న ధైర్యం వచ్చింది. వెంట వెంటనే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. నా ఆర్టికల్స్ జర్నల్స్ లో పబ్లిష్ అయిపోయాయి. నాకో గైడ్ ని కూడా వెతికి పట్టుకున్నాను.

 

    ప్రస్తుతం నా రాత్రులు కలత నిద్రతోనూ, కన్నీళ్ళతోనూ గడపడం లేదు. సీరియస్ గా వ్రాత, చదువులో మునిగిపోయాను. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశాను. రొటీన్ గా పనిచేసుకుపోవడం మాత్రమే నా పని అనుకున్నాను.

 

    ఒకరోజు నేను కాలేజీకి బయలుదేరబోతుంటే నా బావగారు నన్ను ఆపేసి, "నేనదే దార్లో వెళుతున్నాను. మీ కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. ఐదు నిమిషాలు వెయిట్ చెయ్యి" అన్నాడు.

 

    దారిలో అతను నాతో వ్యక్తిగత విషయాలేవీ మాట్లాడలేదు. నా చదువు, అతని బిజినెస్ గురించి ఏదో కాస్త మాట్లాడుకున్నా మంతే. సాయంత్రం నేనింటికి వచ్చేసరికి మళ్ళీ మా బావగారూ, అత్తగారూ మాత్రం వున్నారంతే. ఆయన ఇడ్లీలు తింటున్నాడు. నన్ను పలకరిస్తే ఇక తప్పదన్నట్లుగా అక్కడ కూర్చున్నాను.

 

    నా అత్తగారు లోపలికి వెళ్ళి నాకు ఇడ్లీలూ, చట్నీవేసి పట్టుకొచ్చింది. "అయ్యో! నేను తెచ్చుకునేదాన్ని కదండీ! మీ కెందుకు శ్రమ?" అని నొచ్చుకున్నాను.

 

    "ఫర్లేదులేమ్మా! దీంట్లో శ్రమేముంది? ఇప్పుడే పెద్దబ్బాయి చెప్తున్నాడు. ఓ రెండు మూడు నెలలపాటు ఎవరో డీలర్ తో పనుంటుందిట. ఆ దార్లోనే వెళ్ళాలి అమ్మాయిని రోజూ కాలేజి దగ్గర దింపచ్చు అన్నాడు. పోన్లే నీకూ కొంతకాలం పాటు శ్రమ తప్పుతుంది" అంది.

 

    ఆవిడ మొహంలో ఎక్కడైనా వెటకారం కనపడుతుందేమో అని చూశాను. కానీ ఖచ్చితంగా అదేంలేదు. ఆవిడ అదోరకం మనిషికానీ బేసికల్ గా మంచిదే అనిపించింది. కానీ ఆ భావన నన్నే అయోమయంలో పడేసింది. ఆవిడోసారి చాలా నెరజాణలా, ఒకోసారి మెత్తగా, ఒకోసారి అమాయకురాలిలా కనపడుతూ నన్నలా అయోమయంలో పడేస్తుందెందుకో అర్థంకాలేదు.

 

    ఆ తర్వాత రోజునుంచే నేను నా బావగారితో కారులో వెళ్ళడం మొదలుపెట్టాను. కారులో వెళ్ళడం వల్ల, ఇంట్లో పని చేసుకోవడం కాస్త ఆలస్యమైనా నాకు క్లాసుకి లేటయ్యేది కాదు. ముఖ్యంగా అలసట వుండేది కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే జంకు అప్పుడప్పుడూ కలిగేది కానీ ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనుకోరు. ఇక బయటి వాళ్ళేమనుకుంటున్నారో తెలిసే అవకాశం లేకపోవడంవల్ల పట్టించుకోవలసిన అవసరం కనిపించలేదు. టైమ్ సేవ్ అవుతున్నంత వరకూ నేనవీ, ఇవీ ఆలోచించ కూడదని నిశ్చయించుకున్నాను. అది నేను చేసిన రెండో తప్పు.

 

                                                                     13

 

    మేమిద్దరం కార్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ముందు డీలర్ దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత నన్ను డ్రాప్ చేయడం జరిగేది.

 

    ఆ డీలర్ ఇతనికి నమ్మకస్తుడవడం వల్ల అతని పర్యవేక్షణలో నా కాలేజీ దగ్గరలోనే మరో ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన ఇతనికి వున్నట్టు నాకు అర్థమైంది.

 

    "అక్కడ ఫ్యాక్టరీ మాత్రమే పెడతారా? లేక ఆఫీసు కూడానా?" అడిగాను.

 

    "అంటే?" అన్నాడతను అర్థంకానట్టు.

 

    నేను నవ్వి "మరేం లేదు. ఆఫీసు కూడా పెడితే ఎప్పటికీ కారులోనే రావచ్చు. పోవచ్చు కదా అని" అన్నాను.

 

    అతను ఆశ్చర్యంగా నా వంక చూసి నవ్వేసి "సిల్లి! డూ యూ రియల్లీ థింక్ సో?" అని అడిగాడు.

 

    నేను తల అడ్డంగా వూపుతూ నవ్వి "ఛ అదికాదు. పట్టుమని పదిహేను కిలోమీటర్ల దూరంలేదు. రెండు ఆఫీసులు పెట్టడం అనవసరమేమో అన్పించింది. అంతేకాదు, ఒకే ఆఫీసయితే సెంట్రలైజ్డ్ అథారిటీ కూడా వుంటుంది కదా! ఫ్యాక్టరీలో కూడా అంతా కొత్తవారినే తీసుకునే బదులు పాతవాళ్ళను ఇక్కడకు బదిలీ చేయడం మంచిదేమో...." అన్నాను.

 

    అతను తన మొహంలో ఆశ్చర్యం కనపడనివ్వకుండా, "మరి అక్కడ పాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి తక్కువవదూ?" అనడిగాడు.

 

    "ప్రొడక్షన్ మొదలవడానికి ఇంకా చాలా టైముంటుంది కదా, అప్పట్లోగా అప్రెంటీస్ ట్రెయినీస్ ని తీసుకోండి పాత ప్లాంట్ లో. కానీ వాళ్ళను మాత్రం కొత్త ప్లాంట్ కి మార్చొద్దు". అన్నాను. "ఎందుకు?" అన్నాడతను కుతూహలంగా.

 

    "కొత్త ప్లాంట్, కొత్త మిషనరీతో ఏ ఒడిదుడుకులైనా రావచ్చు. వాటిని ఎదుర్కోవాలంటే సమర్థులూ, అనుభవజ్ఞులూ అయితేనే మంచిదేమో అని నా ఉద్దేశం. అయినా మీకు తెలీనిదేముంది?" అన్నాను.

 

    అతడొక క్షణం మౌనంగా వుండి "నువ్వర్జెంటుగా ఉద్యోగం మానెయ్యాలి" అన్నాడు గంభీరంగా.

 

    నేనొక్కసారిగా తెల్లబోయి "ఏం?" అనడిగాను. అతని సీరియస్ నెస్ చూసి, నేనతిగా వాగానేమో, అతనికి నచ్చలేదేమో అని భయమేసింది.

 

    "మరేం లేదు. నాతోపాటు వ్యాపారంలోకి దిగు" అన్నాడతను నవ్వేసి.

 

    నేనూ తేలిగ్గా నవ్వుతూ "అయ్యో! నేను కొత్త విషయాలేమీ చెప్పలేదండీ. నేనేదో గొప్పగా మీకు ఉచిత సలహాలిస్తే మీరు మరీ ఎక్కువ చేసి పొగిడేస్తున్నారు" అన్నాను. మొహమాటంగా. కానీ అతను మెచ్చుకోవడం నన్ను బాగా సంతృప్తి పరిచింది. "పొగడడం కాదు. నిజంగా చెప్తున్నాను. ఒకవైపు జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి, మరోవైపు బిజినెస్ గురించి ఇంత లోతుగా మాట్లాడడం, ఆలోచించడం చూస్తోంటే ముచ్చటేస్తుంది. Sometimes I feel marriage has shad- owed you... honestly....." అతని గొంతులోని సిన్సియారిటీ నన్ను కదిలించింది. తిరిగి అతనే అన్నాడు- "నా తమ్ముడు నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నాడంటే ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది కాబోలు. అత్తగారితో గొడవలు పడకుండా ఇంటిపనులు పంచుకుంటే బావుండునని అనుకున్నాను. నీ క్వాలిఫికేషన్ తెలిశాక 'పి.జి. చేసి ఇంట్లో కూర్చుంటుందా? ఈ అమ్మాయిలు ఫ్యాషన్ కోసం ఎందుకు చదువుతారో...అదీ అంత కష్టపడి మెడల్స్ సంపాదించుకుని' అని చిరాకుపడ్డాను. నిజం చెప్పొద్దూ".

 Previous Page Next Page