11
దూరంగా కోడికూత వినిపిస్తోంది. రావిచెట్టు క్రింద పడకున్న బృహస్పతికి లేవాలనిపించలేదు.
హేమంత సంధ్య తాలూకు స్మృతి ఆ ప్రత్యూషాన్ని రాగరంజితం చేస్తోంది.
ఆమె పెట్టిన గడువు పూర్తవటానికి ఇంకొక నెలరోజులే ఉంది. తను చెప్పినట్లు గానే ఇన్నాళ్ళూ ఎక్కడుందో కూడా కనీసం తెలపలేదు. ఇన్నాళ్ళకి ఇక గడువు పూర్తవుతోందనగా తండ్రిని తన ఇంటికి పంపించింది. పర్యవసానమే సత్రం భోజనం, మఠంనిద్ర.
కానీ అతడికి తెలుసు. తన శపధం నెరవేరాలంటే ఈ కష్టం సరిపోదు. ఇంకా కష్టపడాలి. వ్యూహం నిర్మించాలి.ఇది ప్రారంభం మాత్రమే.
ఆలోచనల్లోనే అతడు తన పనులు పూర్తిచేసుకున్నాడు.
ఒకరొకరే భక్తులు రావటం ప్రారంభించారు. ప్రశాంత నివాళితో ఏకాంత సేవ చేయిస్తున్నాడు రావు.
ఎనిమిది అయింది. అక్కడి పరిసరాలన్నీ క్రమక్రమంగా జనంతో నిండి పోసాగాయి. వృద్ధులు, పిల్లలు, స్త్రీలూ, రోగులూ, ఒకరేమిటి బాధలు వున్నవారూ, బాధలని ఆపాదించుకున్నవారూ తండోపతండాలుగా వస్తున్నారు. ఓంఫట్ బాబాతో తలమీద కొట్టించుకున్నారు.
ఇదంతా పెద్ద మూర్ఖత్వంగా తోచలేదు బృహస్పతికి.
ఓంఫట్ బాబాతో తన్నులు తినే అమాయకపు ప్రజలకన్నా ఇటువంటి రాజకీయ వ్యవస్థని నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా గొప్పవారు? అయిదేళ్ళపాటు ఒక పార్టీ నాయకులు సొమ్ము చెసుకుంటారు. తరువాత మరొకరికి అవకాశం ఇవ్వడం కోసం వారు దిగిపోతారు. దోచుకోబడటం కూడా ప్రజాజీవితంలో ఒక భాగమై పోయింది. అసలు ఏ పార్టీ లేకపోయినా ఏ రాజకీయ నాయకుడూ లేకపోయినా దేశం ఇలాగే నడుస్తుంది అన్న చిన్న విషయం ప్రజలకి ఎప్పుడు అవగతమౌతుంది?
దూరంగా వాహనం చప్పుడు వినిపించటంతో ఆలోచనలనుంచి తెప్పరిల్లి బృహస్పతి అటు చూసాడు. పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది. దాని వెనుకే మరో రెండు వాహనాలు కూడా ఆగాయి.
ఒక ఆంగ్లేయుడు కెమెరా సరంజామాతో అతడి దగ్గరికి వచ్చాడు. బృహస్పతి విస్మయంగా అతడివైపు చూసాడు. "నా పేరు ఆండ్రూ వైట్ హెడ్. బి.బి.సి కరస్పాండెంట్ ని" అని తనను తాను పరిచయం చేసుకుని ఇంటర్వ్యూ మొదలు పెట్టాడు. బి.బి.సి. ఇటువంటి సంచలనాత్మక విషయాలకీ, యుద్ధ వార్తలకీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.
"డాకూ మంగళ్ సింగ్ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గతజన్మ లోని ప్రతి విషయం మీకు గుర్తుందా?" వైట్ హెడ్ అడిగాడు.
"ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండక పోవచ్చు."
"పోనీ కొన్ని ముఖ్య విషయాలు?"
"గుర్తున్నాయి."
"గతజన్మలో మీ భార్య రత్నాబాయి.... ఆమెని చూడాలని పించడం లేదా? ముఖ్యంగా మీ కొడుకుని"
"గతజన్మలోని నా అరాచకాల్ని, ఆకృత్యాల్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. అందుకని సాధ్యమైనంతవరకూ గతజన్మ తాలూకు విషయాల్ని మర్చిపోవాలనే అనుకుంటున్నాను."
"దేవుడి ఆదేశానుసారం మీరు నాయకుడిగా మారాలనుకుంటున్నారని చెప్పారు. ఆ ఒక్క కారణమూ మీ గత పాపాల్ని హరించి వేస్తుందా? అర్హత నిస్తుందా?"
"గతజన్మలో నేను చేసిన పాపాలు ఈ జన్మలో నన్నెలా అనర్హుడ్ని చేస్తాయి? ఆ మాటకొస్తే ఈ జన్మలో చేసిన పాపాలే ఒక వ్యక్తి నాయకుడు అవడానికి అనర్హం కావు. ఆ విషయం పూలన్ దేవికి ఓటేసి జనమే నిరూపించారుకదా. పైగా ఆమెని ప్రధానమంత్రిని చేయమని మరో వృద్ధ నాయకుడు శలవిచ్చారు కూడా. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాదు నేను మాట్లాడేది. జాతీయ విధాన అవగాహన గురించి. పూలన్ దేవి ప్రధానమంత్రి, హర్షద్ మెహతా ఆర్థికమంత్రి, ఆటో శంకర్ రవాణా శాఖామాత్యులు, చార్లెస్ శోభరాజ్ హోంశాఖ మినిష్టరు అవడానికి సౌలభ్యం వున్న ఈ ప్రజాస్వామ్యంలో నాదో పెద్ద అనర్హత అనుకోను."
చుట్టూ వున్న జనంలో చదువుకున్నవాళ్ళు చప్పట్లు కొట్టారు.
"మీరు అధికారంలోకి వస్తే ఏ విధమైన సంస్కరణలు అమలు జరపాలనుకుంటున్నారు?"
"ప్రస్తుతం విధానం ప్రకారం అధికారంలో వున్న ప్రధానమంత్రి తన ఎం.ఎల్.ఏ.లకీ, ఎంపీలకీ ఆర్ధిక సహాయం లభించేలా నిరంతరం తోడ్పడుతూ వుండాలి. కాంట్రాక్ట్ లు ఇప్పించాలి. విదేశాలకు పంపాలి. ఎల్లప్పుడూ మంచిచేసుకుంటూ వుండాలి. ఉదాహరణకి ఆంధ్రరాష్ట్రపు నీటి పారుదల శాఖామంత్రి ఈజిప్టులో నీటిసరఫరా పరిశీలన కోసం ఆ దేశం వెళ్ళాడు. అధికార దుర్వినియోగానికి ఇంతకన్నా మరో ఉదాహరణ కావాలా? ఈ రాజకీయ వ్యవస్తే ఇలా వున్నది. ఈ ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలు వారి వంతు విధిగా లోకల్ గూండాల్ని, చిన్న చిన్న నాయకుల్ని మంచి చేసుకుంటూ వుండాలి. ఒక పెద్ద మర్రిచెట్టు పైనుంచి కింద వేరువరకూ ఎలా వ్యాపించి వుందో ఈ వ్యవస్థలో ఆశ్రిత పక్షపాతం ఆ విధంగా వ్యాపించి వుంది. క్రమక్రమంగా ఇదొక వ్యాపారంగా మారింది. చిన్నసైజు గూండా కూడా ఒక పార్టీ అండతో లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ విధంగా కాకుండా వ్యక్తుల ప్రాబల్యం తగ్గి ఓటరు కేవలం పార్టీకే ఓటు వేసే విధానం కూడా ఆలోచించాలి. ప్రతి పార్టీ తన ఆర్ధిక, సాంఘిక జాతీయ విధానాన్ని స్పష్టంగా చెప్పాలి. పార్టీ నెగ్గిన తరువాత అభ్యర్ధుల్నీ నియమించుకోవాలి."
అతడు ఆగి వూపిరి పీల్చుకుని కొనసాగించాడు. "పార్లమెంట్ అంటే పశువుల సంతలా కాకుండా క్రమశిక్షణతో మెలిగే పవిత్ర ఆలయంలా నిబంధనలు విధించాలి. అక్కడెంత సమయం వృధా అవుతుందో అందరికీ తెలుసుకదా! కోర్టుల్లోలాగే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు అడ్డు తగిలితే పార్లమెంట్ లోనూ, అసెంబ్లీలోనూ జైలుశిక్ష విధించాలి. అంతేకాదు పార్లమెంటేరియన్ లు, ఎమ్మెల్యేలు సంవత్సరానికి కనీసం సగం రోజులు తమ నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేస్తున్నట్టు అటెండెన్స్ - ఏ జిల్లా అధికారి కార్యాలయంలోనో సంతకం పెట్టాలి. ప్రజలకి జవాబుదారీ కావాలి."
హనుమంతరావు కళ్ళప్పగించి బృహస్పతిని చూస్తున్నాడు. ముందు ఇదంతా ఆషామాషీ వ్యవహారం అనుకున్నాడుగానీ నిజంగానే బృహస్పతిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కనబడుతోంది. ఈ లోపులో విలేఖరి అడిగాడు.
"డాకూ మంగళ్ సింగ్ ఏ హత్య చేసినా, అత్యాచారం చేసినా తనతోపాటు ఒక ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుని ఫోటోలు తీయించి గుర్తుగా దాచుకునేవాడని వినికిడి. ఎక్కడెక్కడ దొంగతనాలు చేసిందీ, ఎంతెంత దోచిందీ చిట్టాలెక్కలు వ్రాసుకునే వాడట. నిజమేనా?"
"నిజమే!"
"అవన్నీ మీరు బయట పెడతారా?"
"దానివల్ల లాభం ఉందని తెలిస్తే తప్పకుండా బయట పెడతాను."
"ఎందుకుండదూ? ఉదాహరణకి కొన్ని వందల కోట్లు విలువచేసే బంగారాన్ని వెలికితీసి మీరు ప్రభుత్వానికి అందజేయవచ్చుకదా!"
"అదెక్కడుందో వెతకాలి. పైగా అది రాజా విక్రమ్ దేవ్ కి సంబంధించినది.అంతే తప్ప ప్రభుత్వానికి చెందదు. దాన్ని వెదికి ఇస్తే అందులో ఎంత శాతం మా ప్రజలకి ఇస్తాడో రాజా విక్రంమ్ దేవ్ ని అడగాలి. ఏమీ ఇవ్వని పక్షంలో మేము శ్రమ తీసుకోవడం అనవసరం."
అతడి మాటలు పూర్తవుతుండగా ఇద్దరు విద్యాధికులైన యువకులు ఒక గొర్రెలకాపరిని అక్కడికి తీసుకువచ్చారు. అతడి చేతిలో తుప్పుపట్టిన పాత రైఫిల్ వుంది. దాదాపు బారు పొడుగున్నది.
"దూరంగా పది కిలోమీటర్ల అవతల కొండకింద లోయలో దొరికింది" అంటూ ఆ తుపాకీని అక్కడి జనాలకి చూపిస్తున్నారు వాళ్ళు.బృహస్పతి దాన్ని అందుకుని పరిశీలనగా చూసాడు. అతడి భృకుటి ముడిపడింది. "ఎక్కడ దొరికిందిది నీకు?" అనడిగాడు గొర్రెలకాపరిని.
"గొర్రెలు కాసుకుంటూ ఏటి ప్రక్కనుంచి ఎల్తాన్నాను బాబు. రాళ్ళమజ్జె నుంచేదో బయటకి పొడుసుకొచ్చినట్టగపడింది.తవ్వితీస్తే ఇదీ! మా పెద్దలకి సూయించినాను.ఎవరో సినిమా వోల్లూ, పోలీసులూ ఇక్కడికొచ్చారంట కదా. ఆళకిచ్చెయ్యమని మావోళ్ళు నన్నంపించారు."
బృహస్పతి దానివైపు పరీక్షగా మరోసారి చూసాడు. పాతిక సంవత్సరాలక్రితం తుపాకీ అది.చెక్కంతా పెకిలిపోయి పీచుగా విడిపోతోంది.దానిమీదున్న అక్షరాల్లో పేరుకుపోయిన మట్టిని గోటితో గీకి తొలగించాడు.
కెమెరాలన్నీ అతడివైపే ఫోకస్ చేయబడి వున్నాయి. అతడు తలెత్తి-
"ఇది నాదే. పాతిక సంవత్సరాల క్రితం నేను మరణించిన చోటు ఇక్కడికి దగ్గరలోనే వున్నదని చెప్పినమాట నిజమైంది. చూసారా?"
అక్కడంతా ఉద్విగ్నమైన వాతావరణం నెలకొని వుంది. ఒకరి చేతిలోంచి ఒకరు ఆ తుపాకీని, పరిశీలించి పక్కవారికి అందజేయసాగారు. టైట్ క్లోజ్ లో ఆ తుపాకీని కెమెరాలు తమ ఫ్రేముల్లో బంధిస్తున్నాయి.
ఇదంతా ఏదో చిన్న సంచలనం కలిగించే వార్తగా ప్రసారం చేద్దామని బి.బి.సి. విలేఖరి ముందు అనుకున్నాడు.
ఈ తుపాకీ దొరకడం వ్యవహారంలో విలేఖరి ఈ ఇంటర్వ్యూని మరికాస్త పొడిగించదల్చుకున్నాడు.
"ఇప్పుడు మీరు కానీ అప్పటి మీ అనుచరులని చూస్తే గుర్తుపట్టగలరా?"
"పట్టగలననుకుంటాను".
"ప్రభుత్వం మిమ్మల్ని పోలీసు డిపార్ట్ మెంట్ లో చేర్చుకుని చంబల్ లోయకి పంపిస్తే అక్కడి బందిపోట్లని బంధించగలరా? ముఖ్యంగా 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్'గా ఎన్నో అరాచకాలు జరిగిన మిగతా ముగ్గురూ చంబల్ వాలీ దొంగలని మీరు పట్టుకోవచ్చు కదా!"
"ప్రస్తుతం చంబల్ వాలీలో ప్రశాంతత నెలకొని వుంది. కాబట్టి అంత అవసరం లేదనుకుంటున్నాను. అదీగాక నా మీద ఇంకా పెద్ద బాధ్యత పెట్టాడు భగవంతుడు. దాన్ని నిర్వర్తించాలి."
"భగవంతుడు ప్రసక్తి వచ్చింది కాబట్టి మీరు మరోప్రశ్నకు సమాధానం చెప్పవలసి వుంటుంది. కేవలం ప్రజల నమ్మకాన్ని మీరు ఇలా ఉపయోగించుకుంటున్నారు అన్న విమర్శ ఒకటి వుంది. దానికి మీరేం సమాధానం చెపుతారు?"
"ప్రజానాయకుడిని అయిన తర్వాత నా చర్యలు, ప్రవర్తన- నా నిజాయితీని రుజువు చేస్తాయి. అది చాలు. కొందరు నమ్మకపోయినా ఫర్వాలేదు. ప్రజలకి నిస్వార్ధ పూరితుడైన నాయకుడి అవసరం ప్రస్తుతం చాలావుంది. నాకు నేను జరిగింది చెప్పానంతే! అంతే తప్ప నా గతాన్ని ఆధారంగా చేసుకునిగానీ, భగవంతుడి పేరు వాడుకునిగానీ నాయకుడిని అవాలన్న ఆలోచన నాకు లేదు. జైహింద్."
ఇంటర్వ్యూ ముగిసింది.
* * *
బి.బి.సి. వార్తల్లో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూ పెద్ద సంచలనాన్నే రేపింది. ఇదెప్పుడూ వాస్తవానికి జరిగేదే! ముందు బి.బి.సి. పట్టుకుంటుంది. ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత భారతదేశపు టీ.వీ.లు, రేడియో, వార్తాపత్రికలు ఆ న్యూస్ ని కొన్ని గంటలు ఆలస్యంగా ప్రసారం చేస్తాయి.... ప్రచురిస్తాయి. ఇది ఆనవాయితీ!