విలేఖరి నవ్వలేదు. "మంగళ్ సింగ్ నేను రెండుసార్లు కలిసాను. అతడి గురించి నాకు చాలా విషయాలు తెలుసు" అన్నాడు. అతడి మాటల్లో "నువ్వు మమ్మల్ని అంత సులభంగా మోసం చేయలేవు సుమా" అన్న అర్ధం ధ్వనించింది.
బృహస్పతి గుండెలనిండా గాలి పీల్చుకుని వదుల్తూ నెమ్మదిగా అన్నాడు.
"డిసెంబర్ 20 వ తారీకు 1970 వ సంవత్సరం మధ్యాహ్నం చంబల్ లోయలో నేనూ, నా అనుచరులు కలిసి రాజా విక్రమ్ దేవ్ తాలూకు వందకోట్ల రూపాయల విలువగల బంగారాన్ని కొల్లగొట్టిన మాట నిజమే. కానీ పోలీసులు నన్ను వెంటాడారు. జగదల్ పూర్ మీదుగా దట్టమైన అడవుల్లోంచి నేను దక్షిణంవైపు వచ్చాను. అంటే దాదాపు ఈ ప్రాంతానికే వచ్చానన్నమాట. చిన్న కొండలోయలో త్రిభుజాకారంలో వున్నమూడు రాళ్ళు, వాటికి కాస్త దూరంలో చిన్నగుహ, ఆ గుహలో నిధిని దాచి డైనమైట్ తో ద్వారాన్ని పేల్చి మూసేసాం. అదే నేను చేసిన తప్పు. పోలీసులు నన్ను వెంబడిస్తున్నారన్న విషయం గమనించలేదు. ఎక్కడో అడవుల్లో వెతుకుతున్న పోలీసులకి నన్ను ఆ చప్పుడు పట్టించింది. ఆ రోజు డిసెంబర్ 24, ఆ ఎన్ కౌంటర్ లో నేను మరణించాను. యమధర్మరాజు చెప్పినదాన్నిబట్టి, నేను మరణించిన చోటే గత జన్మ గుర్తొస్తుంది. అంటే ఈ ప్రాంతంలోనే ఎక్కడో కొండలోయలో నిధి వున్నదన్నమాట. రేపటి నుంచీ నా ప్రజల సహాయంతో దానిని వెతుకుతాను. అయితే ఒక్క విషయం. ఆ నిధి తాలూకు సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించను. రాజా విక్రమ్ దేవ్ వారసులు దొరక్కపోతే నా నియోజకవర్గ ప్రజలకోసం ఆ డబ్బు ఖర్చు పెడతాను. ప్రభుత్వం దానికి అడ్డుపడితే ఆత్మహత్య చేసుకుంటాను."
అతడి మాటలింకా పూర్తికాకుండానే ప్రజల జయజయ ధ్వానాలు హోరుమని ఉవ్వెత్తున లేచిన కెరటాల ధ్వనుల్లా వినపడసాగాయి. విలేఖరి అంతటితో వదల్లేదు. "మీకు స్పృహ తప్పగానే యమధర్మరాజు కనబడడం ఒక హేలూసినేషన్-భ్రాంతి అయ్యుండవచ్చుకదా" అని ప్రశ్నించాడు.
"అది భ్రాంతి అయితే అయ్యుండవచ్చేమో కానీ నేను పుట్టింది సెప్టెంబర్ 1971లో. అంతకుముందు సంవత్సరం క్రిస్మస్ కి ఒకరోజు ముందు మంగళ్ సింగ్ మరణించాడు. కొన్ని విషయాలు అభూత కల్పనలుగా తోచినా పూర్తిగా అవాస్తవికాలు అనుకోలేం. ఇది కూడా అలాంటిదే. మంగళ్ సింగ్ మరణానికీ, ఆ పుట్టుకకీ మధ్య తేడా సరిగ్గా తొమ్మిది నెలలు" గంభీరంగా అన్నాడు బృహస్పతి.
విలేఖరి నవ్వుతూ "చావుకీ పుట్టుకకీ మధ్య తేడా తొమ్మిది నెలలైతే మరి మీరు యముడితో మాట్లాడినదెప్పుడు" అనడిగాడు.
"చూడండీ! ఇలాంటి ప్రశ్నలకి నేనేం సమాధానం చెప్పలేను. జరిగినది ఏమిటో అందరికీ చెప్పాను. నమ్మమని నేను కోరలేదు. ఈ క్షణంనుంచే భగవంతుడి ఆదేశానుసారం నా ప్రజలకి సేవ ప్రారంభిస్తాను. ఆ నిధి తాలూకు డబ్బు కూడా జనం కోసమే వినియోగిస్తాను అని చెప్తున్నాను కదా! ఇదంతా భ్రాంతి అనుకున్నా- లేక నేను నాటకం ఆడుతున్నాను అనుకున్నా అది మీ ఇష్టం. మోసం చేయవలసిన అవసరం మాత్రం నాకు లేదు.... ఎందుకంటే దీనివల్ల నాకొచ్చే లాభం ఏమీలేదు కాబట్టి...."
జనంలోంచి ఎవరో "పత్రికా విలేఖరులూ! డౌన్.... డౌన్" అని అరిచాడు. మిగతావారు దానికి వంతపాడారు. గత్యంతరం లేనట్టు వృద్ధ విలేఖరి తన ఇంటర్వ్యూ ముగించాడు.
అయితే ఆ విషయం అక్కడితో ముగియలేదు. అంత తొందరగా ముగిస్తే వారు పత్రికా విలేఖరులు ఎందుకు అవుతారు?
ఆ మరుసటిరోజు పేపర్లో చిన్న బాక్స్ అయిటమ్ పడింది.
10
రాత్రి దాదాపు ఒంటిగంట కావస్తోంది. చెట్టుకింద పడుకుని వున్నారు ఇద్దరూ! తమ ఇళ్ళకి రమ్మని అడిగిన గ్రామస్తుల అభ్యర్ధనని సున్నితంగా తిరస్కరించారు. ఆ చెట్టు దగ్గరే చిన్న ఆశ్రమం కట్టుకుని, నిరాడంబరంగా బతకాలన్న కోర్కెని వెలిబుచ్చారు. దానితో గ్రామస్థులకి వారిమీద గౌరవాభిమానాలు మరింత పెరిగాయి.
"ఇదంతా ఇంత సులభంగా అయిపోతుందని నేను కల్లో కూడా ఉహించలేదు బ్రదర్" అన్నాడు రావ్.
"కానీ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చలేదు."
"ఏమిటది?" అడిగాడు రావు.
"ప్రజలకి నాలుగు చల్లటి మాటలు చెప్పి, వారికి మనశ్శాంతి కలిగించి దానికి ప్రతిఫలంగా తృణమో పణమో పొందడంలో తప్పులేదు. కానీ వారిలో లేనిపోని భయాలు సృష్టించి, డబ్బులు వసూలు చేయడం అంత మంచి పద్ధతి కాదేమో అనిపిస్తోంది" అన్నాడు బృహస్పతి.
"ఏ విషయం నువ్వు చెపుతున్నది?"
"ఆ ముసలమ్మ- ఆవిడ మనవరాలి సంగతి"
"ఓ అదా!"
"పాపం పాతికవేలు తీసుకొచ్చి ఈ సాయంత్రమే నీ చేతిలో పోసింది కదరా!"
"నేను చేసింది తప్పు అయితే మరి నువ్వు చేయబోయేది ఏమిటి? రేప్పొద్దున మంత్రివై ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టవా? నువ్వు ప్రభుత్వ ఆస్తి కొల్లగొడుతుంటే నేను ప్రజల దగ్గరనుంచి వసూలు చేస్తున్నాను. అంతే తేడా!"
బృహస్పతి మాట్లాడలేదు.
వెల్లకిలా పడుకుని ఆకాశంకేసి చూస్తున్న రావు తనలో తాను అనుకుంటున్నట్లు "ప్రశాంత నివాళి పేరు చాలా బాగుంది కదరా. అమ్మాయిలాగే అమాయకంగా ముగ్ధంగా...." అన్నాడు.
దానికి కూడా బృహస్పతి సమాధానం చెప్పలేదు. అతడికి హేమంత గుర్తొచ్చింది.
* * *
చిన్న కార్డు - దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో I hate you అని ప్రింట్ చేయబడి వుంది. పేజీ తిప్పాడు బృహస్పతి. లోపల-
Because I need you always అని వుంది.
మళ్ళీ పేజీ తిప్పాడు. లోపల -
Because I love you అని వుంది.
క్రింద గుండ్రటి అక్షరాలతో 'హేమంత సంధ్య' అన్న సంతకం వుంది.
అతడు కార్డుని అటూ ఇటూ తిప్పుతూ చాలాసేపు నిశ్శబ్దంగా వుండిపోయాడు.
"బావుందా కార్డ్?" అనడిగింది హేమంత. అతడు సమాధానం చెప్పలేదు.
సాయంత్రానికి వయసు వస్తోంది.
అస్తమిస్తున్న సూర్యుడు దీపమాలికయితే కొంగు సవరించు కొస్తున్న సంధ్య పాపిడి పాళిక.
"నాకు ఇదంతా అంత సంతోషంగా ఏమీలేదు" అన్నాడు.
ఆమె గెడ్డం కింద చెయ్యి ఆన్చుకుని ముందుకు వంగి నవ్వుతూ.... "నీకు ఏది ఏమీ అంత సంతోషంగా లేదూ?" అనడిగింది.
"నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం"
"చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరుతున్నాను. ఇందులో వదిలి వెళ్ళిపోవడం ఏముంది? నువ్వు కూడా ఢిల్లీ వచ్చెయ్యొచ్చుగా? కలిసి వుండవచ్చు. నీకు ఉద్యోగాలంటే పడదాయే. ఆ డిగ్రీ కూడా పూర్తిచేయలేదు. నీలాంటి వాడి ప్రేమలో ఎలా పడ్డానా అని" నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది.
"గత రెండు సంవత్సరాల కాలంలో ఈ మాట రెండొందల సార్లు అనుంటావ్"
ఆమె నవ్వి ఊరుకుంది.
అతడు కార్డుని మళ్లీ అటూ యిటూ తిప్పుతూ.... "అసలు ఈ కార్డు నేను నీకు ఇవ్వాలి" అన్నాడు. "నాకు నీ మీద పీకల దాకా కోపం వుంది. ఎందుకంటే అంత ప్రేమ వుంది" దిగులుగా చెప్పాడు.
ఆమె అతడిని ఏడిపిస్తున్నట్లు సన్నని కూనిరాగం తీయడం ప్రారంభించింది.
"ఒక కోయిల పాటకీ
తిరిగి పాడే పాటకీ
మధ్యనున్న దూరం ఒక వసంతం.
తొలి కాంతి పొద్దుకీ
సాయం సంధ్య నీడకీ
మధ్యనున్న దూరం ఒక మధ్యాహ్నం.
ఒక నా నవ్వుకీ
ఒక నా దిగులుకీ
మధ్యనున్న దూరం నీ స్నేహం."
అతడు ఉక్రోషంగా "నీకు నేనంటే చాలా ఎగతాళిగా వున్నట్టుందే! కాస్తయినా బాధగా వున్నట్టు లేదు" అంటూ కార్డు తిరిగి ఆమెకి ఇచ్చెయ్యబోయాడు.
ఆమె నవ్వేసి అంతలోనే అనునయిస్తున్నట్టు అంది.
"నాకెందుకు బాధగా లేదు? నీకన్నా ఎక్కువ బాధగానే వుంది. కానీ నువ్వు బయటపడుతున్నావు నేను బయటపడటంలేదు. అంతే! పోతే ఒకందుకు మాత్రం సంతోషంగా వుంది. నేను ఏడాదివరకు నిన్ను కలవను. మన ఈ ఎడబాటు నిన్ను కాస్తయినా మార్పువస్తుందేమోనని నా ఆశ"
"ఏం మారాలి నేను?" చిన్న పిల్లాడిలా కోపంగా అడిగాడు.
"కాస్త పనికొచ్చే పని ఏదయినా చేయాలి. ఏదైనా సరే! లేదంటే నేను ఉద్యోగం చేస్తుంటాను. నువ్వు వంట చేయి"
"అదీ పనేగా?"
ఆమె నుదురు కొట్టుకుంటూ "నీతో వాదించడం శుద్ధ అనవసరం" అంది.
"అవును. నా థియరీ మీకెవరికీ అర్ధంకాదు."
"ఏమిటి నీ థియరీ నా మొహం. బతకాలంటే డబ్బు కావాలి. సరే దానిసంగతి అలా పక్కనపెట్టు. సమాజంలో చెప్పుకోవటానికయినా కాస్త గుర్తింపు వుండాలి కదా! మీ కాబోయే భర్త ఏం చేస్తుంటాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పను?"
"డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడని చెప్పు."
"నా ఖర్మ" అందామె విసుగ్గా. "రేపు మా నాన్నగారికి చెప్పాలన్నా ఏదో చెప్పాలిగా. మీ కాబోయే అల్లుడు గొప్ప తెలివితేటలు వున్నవాడు, డిగ్రీ చదవడం ఎలా అన్న టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాడని చెప్పనా?" అని ఒక్కక్షణం ఆగి.... "ఇదిగో చూడు! ఇప్పుడు చెపుతున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఏదో ఒకటి అవ్వాలి. ఉద్యోగమే చేస్తావో, వ్యాపారమే చేస్తావో నీ ఇష్టం. సంవత్సరంపాటు నీకు ఉత్తరాలు రాయను. నేను ఎక్కడున్నానో నీకు చెప్పను."
బృహస్పతి కంగారుగా "ఇది అన్యాయం" అన్నాడు.
"అవును. అప్పుడుగానీ నా విలువ నీకు తెలిసిరాదు. నేను తిరిగి వచ్చేటప్పటికి నువ్విలాగే వుంటే ఇంక నేను నిన్నసలు కలుసుకోను. మా నాన్నగారు చూసిన అబ్బాయిని పెళ్ళిచెసుకుంటాను."
ఇద్దరూ లేచారు. బాగా చీకటి పడింది. పార్క్ నిర్మానుష్యంగా వుంది. ఆమె చప్పుడు అతడి మొహాన్ని దగ్గరగా లాక్కుని బుగ్గమీద గట్టిగా ముద్దుపెట్టుకుంటూ- "ఇది తొలిముద్దు. నేను చెప్పినట్టు చేయకపోతే ఇదే చివరిది కూడా! బై" అని కారు వేపు నడిచింది.