Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 17

   

        ఉత్తరం ముగిస్తుంటే సాహితికి దుఃఖమొచ్చింది. అది ఆనందంతో కూడిన బాధ. టీచరుకి తను గుర్తుంది. ఎంతో జ్ఞాపకం పెట్టుకుని అంతభిమానంగా, స్పెషల్ గా ఉత్తరం వ్రాసింది అంతే చాలు.
   
    "మమ్మీ! నేను రేపట్నుంచీ స్కూలుకి వెళతాను" గట్టిగా అరిచి చెప్పింది.
   
    ఆ తర్వాత వెంటనే టీచరుకి ఉత్తరం వ్రాయటానికి  కూర్చుంది. మనసులోనే పేజీలకు పేజీలు  వ్రాసింది. నచ్చలేదు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలీలేదు. ఎదురుగా తెల్లకాగితం నవ్వుతున్నట్టు అనిపించింది. సూది తీసుకుని బలంగా పొడుచుకుంది. బొటబొటా కారే రక్తంతో "ఐ లవ్ యూ టీచర్" అని వ్రాసి పోస్ట్ చేసింది.
   
    సెల్ఫ్ పిటీకి అది పరాకాష్ట.
   
    'టీచర్' అన్న పదం చాలా గొప్ప భావాన్ని సూచిస్తుంది. టీచరుకి తెలీనిది ఏదీ లేదన్న అభిప్రాయం చాలామంది పిల్లల్లో వుంటుంది. వాస్తవానికి అది చాలా సత్యదూరమైన విషయం.
   
    కోమలి వయసు ఇరవై ఆరేళ్ళు. నిజానికి ఆమెకే జీవితం గురించి సరిగ్గా తెలీదు. టీచరుగా పనిచేస్తూ వివాహం చేసుకుని కాపురానికి వెళ్ళిపోయింది. టీచరు కాబట్టి తన విద్యార్ధికి 'బాగా చదువుకోమని' ఉత్తరం వ్రాసింది. ఆమె దృష్టిలో చదువొక్కటే చాలా సమస్యలకి పరిష్కారం చెపుతుంది. అయ్యుండవచ్చు కానీ అదొక్కటే సరిపోతే, ఇంతమంది మనుష్యులు యిన్ని సమస్యలతో బాధపడరు. కావాలి. ఆ 'ఇంకేదో' అన్నదేమిటో సాహితికి ఏ టీచరూ చెప్పలేదు. జీవితం చెప్పింది.......
   
    చాలా లేటయ్యాక!
   
                                 3
   
    పరీక్ష వ్రాసి సాహితి ఇంటికొచ్చింది. రెండు నెలలపాటు ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే వుండొచ్చుననుకుంటే తృప్తిగా వుంది. మమ్మీ పూజలో వుంది. అదేదో నలభయ్ రోజుల దీక్ష పగలంతా ఉపవాసం రాత్రి మాత్రం పాలు, పళ్ళు తీసుకుంటుంది. ఆ దీక్ష దేనికో, ఎవరు చేయమని చెప్పారో సాహితికి తెలీదు. కానీ ఆవిడనలా చూసినప్పుడల్లా తండ్రి మీద విపరీతమైన కోపం వస్తుంటుంది.
   
    సాహితికి ఏం చేయాలో తోచక తోటలోకి నడిచింది. పుస్తకం పట్టుకుని వుయ్యాల్లో కూర్చుంది. కానీ అది చదవాలనిపించడం లేదు. తండ్రి గురించి ఆలోచనలో మునిగిపోయింది. అంతలో కాంటెస్సా గేటులోంచి లోపలకొచ్చింది. వినయచంద్ర ఎప్పట్లా హారన్ కొట్టలేదు. కారు దిగి సాహితి చూస్తుండగానే మెట్లెక్కుతూ ఆగిపోయాడు. అతని చేతులు గాల్లో దేన్నో అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కదులుతున్నాయి. డాడీ అప్పుడే తాగొచ్చారా అనుకుంటూ సాహితి తనకు తెలీకుండానే అటువైపు అడుగులేసింది. ఆమె తండ్రిని చేరుకునేసరికి ఆయన రెండు చేతులతో ఛాతీ ఎడమవైపు అదుముకుంటూ క్రింద కూలబడి పోయాడు. సాహితికి చాలా భయమేసింది. పరుగునవెళ్ళి పట్టుకుంది. కోపం అంతా మర్చిపోయింది. బాధతో విలవిల్లాడిపోతున్నాడాయన.
   
    "సింహాచలం, మమ్మీ" అంత గట్టిగా ఎప్పుడూ అరవలేదు సాహితి. "డాడీ! ఏమైంది డాడీ?"
   
    "నొప్పిగా వుందమ్మా" నోట్లోంచి మాట కూడా సరిగ్గా రావడం లేదు. నౌఖర్లంతా పరుగున వచ్చారు. అతడ్ని లోపలకు ఎత్తుకెళ్ళి పడుకోబెట్టారు.
   
    సాహితి ఫోన్ చేసి డాక్టరుకి చెప్పింది. ఆయన వెంటనే వస్తున్నానన్నాడు. భయంతో వేరే ఆలోచించలేక పూజ గదిలోకి పరుగుపెట్టింది.
   
    "మమ్మీ! డాడీకి ఏమో అయ్యింది-త్వరగా రా."
   
    "అదేమిటీ? పూజ గదిలోకి చెప్పులతో వచ్చేశావు?" కోపంగా అరిచింది నిర్మల.
   
    "ఏమో మమ్మీ! డాడీ పడిపోయారు. వచ్చిచూడు" కోపంగా అరిచింది. ఇది మామూలే అన్నట్టు నిర్మల దేవుడి దగ్గర బొట్టుతీసి పెట్టుకుని ఓ పువ్వు తల్లో తురుముకునే బయటకొచ్చింది. అప్పటికే డాక్టరొచ్చేశాడు. అప్పుడుకాని అతను తాగి రాలేదని, నిజంగా సిక్ అయ్యాడని నిర్మలకు అర్ధంకాలేదు. వెంటనే ఏడుస్తూ దగ్గరకెళ్ళింది.
   
    "మరేం ఫర్వాలేదు. మైల్డ్ హార్టెటాక్. కొద్దిరోజులు పూర్తిగా విశ్రాంతి కావాలి. మందులన్నీ తెప్పిస్తాను. నర్స్ ని పంపించనా?" అడిగాడు డాక్టర్.
   
    "వద్దు నేనే చూసుకుంటాను" అంది నిర్మల ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
   
    వినయచంద్ర కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. సాహితికి మెలకువ వచ్చింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. మెల్లిగా లేచి తండ్రి గదిలోకి వెళ్ళింది. వినయచంద్ర నిద్రపోతున్నాడు. పక్కనే సోఫాలో తల్లి కూడా మంచి నిద్రలో వుంది. పూజా పునస్కారాలతో బాగా అలసిపోయి వీక్ గా అయిపోయిందామె సాహితి మరో పక్క కూర్చుంది. తండ్రి పక్కన సోఫాలో తల్లి......వాళ్ళిద్దర్నీ చూస్తూ తనూ!!! ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. ఎన్నడూ లేని ఆత్మీయతాభావం తమ మధ్య కదులుతున్నట్లు.
   
    "సాహితీ!" తండ్రి పిలుపుకి ఉలిక్కిపడింది.
   
    "నిద్ర రావడం లేదా? ఇలా దగ్గరకు రా" అతడి స్వరంలో ఎంత ఆప్యాయత! ఇన్నాళ్ళూ ఏమయిపోయింది?
   
    "లేదు డాడీ!" అంటూ దగ్గరకు కూర్చుంది. ఆమె కంఠం రుద్దమైంది.
   
    "కొంచెం మంచినీళ్ళివ్వమ్మా!" పక్కనే ఉన్న గ్లాసు అందుకొని అతడిచేత తాగించింది.
   
    "పరీక్షలు బాగా వ్రాశావమ్మా? రోజూ అర్ధరాత్రి దాకా చదివేదానివి. గమనిస్తూనే వున్నాను."
   
    "బాగా వ్రాశాను డాడీ, ఫస్టుక్లాస్ వస్తుంది."
   
    "వెరీగుడ్ బాగా చదువుకోమ్మా! ఎంతవరకు చదువుకోవాలనిపిస్తే అంతవరకూ చదువుకో విదేశాలకయినా వెళ్ళు."
   
    "అలాగే డాడీ"
   
    "వెళ్ళీ పడుకోమ్మా! చాలా రాత్రయింది నాకు ఫర్వాలేదు. దిగులుపడకు. పది రోజుల్లో లేచి తిరుగుతాను."
   
    "ఇంకెప్పుడూ తాగకండి డాడీ!" ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అంది. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. వినయచంద్ర నెమ్మదిగా నవ్వి- "అలాగే" అన్నాడు.
   
    "నా మీద ఒట్టు!"
   
    "నీ మీద ఒట్టు! సరేనా వెళ్ళి పడుకో" గదిలోకెళ్ళి పడుకుంది. మనసు సంతోషంతో, తృప్తితో ఉప్పొంగుతోంది. ఇది సెంటిమెంటా లేక కుటుంబ జీవితంలో ఉండే అనుబంధ శక్తా? ఏదయినా ఆమె హాయిగా నిద్రపోయిందా పూట.
   
                            *    *    *
   
    వినయచంద్ర బాగా కోలుకున్నాడు. అయినా డాక్టర్లు మంచం దిగనివ్వడం లేదు. పరమహంస వచ్చాడు. నిర్మల అతనికి ఉత్తరం వ్రాసి పిలిపించిందని ఎవరికీ తెలియదు అంతేకాదు అతడు వచ్చినట్లు వినయచంద్రకీ తెలియనివ్వలేదు. అతడిచేత పూజలు చేయిస్తున్నట్లు తెలిస్తే వినయచంద్ర ఆవేశపడతాడని నిర్మలకు తెలుసు. ప్రసాదం మట్టుకు అతడి భోజనంలో కలిపి యిస్తోంది తెలియకుండా.
   
    నాలుగు రోజుల్లోనే కాస్త బలం చేకూరింది వినయచంద్రకి. అంతా నార్మల్ గా వుంది. "కాస్సేపు డాడీని చూస్తుండమ్మా, నేనలా గుడికి వెళ్ళొస్తాను" అంది నిర్మల. ఆమె చాలా దేవుళ్ళకి మొక్కుకుంది.
   
    "అలాగే మమ్మీ!" అంటూ వెళ్ళి తండ్రి గదిలో కూర్చుంది. బత్తాయిరసం తాగించింది. ఆయన కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఎందుకో ఆయన కాస్త డల్ గా వున్నట్లనిపించింది. ఒకసారి డాక్టర్ కు ఫోన్ చేద్దామా అనుకుంది. మమ్మీ వచ్చాక అడిగి చెయ్యొచ్చులే అని వూరుకుంది.
   
    సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సాహితి అతని ముఖంలో మార్పు గమనించలేదు. ఆమె చూసేటప్పటికే అతని మొహం నిండా చెమటలు పట్టేశాయి.
   
    సాహితి పరుగెత్తుకెళ్ళి డాక్టర్ కి ఫోన్ చేసి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. ఆమెలో భయం కాస్త తగ్గింది.
   
    "డాడీ నెప్పిగా వుందా? మందు వెయ్యనా?" దగ్గరగా వెళ్ళి అడిగింది. ఆయన మాట్లాడలేదు.
   
    ఆయన నిద్ర డిస్ట్రర్బ్ చేయటం ఇష్టంలేక సాహితి పక్కనే కూర్చుంది.
   
    డాక్టర్ వచ్చాడు.
   
    "ఇప్పుడు బాగానే ఉన్నట్లుంది, పడుకున్నారు."
   
    ఆయన పరీక్షించి చూసి ఆమె ముఖంలోకి బాధగా చూశాడు.

 Previous Page Next Page