"చాలా బాగా వ్రాశావు. వ్రాత కూడా బావుంది. వెళ్ళు..... వెళ్ళి కూర్చో."
సీట్లో కూర్చున్నాక కూడా సాహితి చేతులు చాలాసేపు వణుకుతూనే వున్నాయి. టీచరు పాఠం మొదలు పెట్టింది. అదేమీ సాహితి చెవుల్లో పడటం లేదు. టీచరు తనను మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. ముఖ్యంగా తను ఆవిడ దృష్టికి వెళ్ళింది. అంతేచాలు.
"సాహితీ! అందరి దగ్గరా హోంవర్కు నోట్ బుక్స్ కలెక్టు చెయ్" టీచర్ చెప్పగానే లేచి నిలబడింది. క్లాసు మానిటర్ దా డ్యూటీ ఆమె ఈ రోజు రాలేదు.
తొమ్మిదో క్లాసుకి వచ్చేవరకు చెయ్యనిపని ఆ రోజు చేసింది.
పీరియడ్.....అయిపోయినట్లుగా గంట కొట్టారు. "నాతో స్టాఫ్ రూమ్ వరకూ తీసుకురామ్మా" చెప్పింది కోమల.
పుస్తకాలు పట్టుకొని ఆవిడవెంట నడుస్తుంటే ఏదో తెలీని భయం, ఉద్విగ్నత.....స్టాఫ్ రూములో మరెవ్వరూ లేకపోవడం అదృష్టం. పుస్తకాలు అందుకుని 'థాంక్స్' చెప్పింది టీచర్. "చూడమ్మా! హాఫ్ యియర్లీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఫస్ట్ మార్కుల కోసం అందరూ పోటీపడి చదువుతారు. నీకు పోటీ రాబోతున్నాయి. ఫస్ట్ మార్కుల కోసం అందరూ పోటీపడి చుదువుతారు. నీకు పోటీ ఎక్కువ అవుతుంది. ఇలాగే కష్టపడి చదువు. మళ్ళీ ఫస్ట్ మార్కు నీకే రావాలి. ఓకే?"
"ఎస్ టీచర్! ప్రయత్నిస్తాను...." అంది అతికష్టంమీద నోరు పెగుల్చుకుని.
"సాహితీ!" ఆ పిలుపులో ఎంతో మార్దవం. "మీ ఇంట్లో చాలా రకాల గులాబీలు వున్నాయటగా? నాకు కటింగ్స్ తెచ్చి పెడతావా?"
"తప్పకుండా టీచర్! రేపే తెస్తాను" ఉత్సాహంగా అంది.
ఆ రోజంతా ఆమెకు తెలీకుండానే పెదవులమీద నవ్వు కదలాడుతోంది. ఇంటికి వెళ్ళగానే పమేలాని గట్టిగా ముద్దుపెట్టుకుంది. తర్వాత పుస్తకాలు తీసి సీరియస్ గా చదవటం మొదలు పెట్టింది. టీచర్ల ప్రభావం పిల్లలమీద ఎంతలా పడుతుందో అదే ఓ ఉదాహరణ! ఆరునెలల పరీక్షల్లోనే కాదు- సంవత్సరాంతం పరీక్షల్లో కూడా సాహితి ఫస్టు మార్కులు తెచ్చుకుంది. కోమలా టీచరు ప్రత్యేకంగా పిలిచి 'కంగ్రాట్స్' చెబితే పొంగిపోయింది.
* * *
నిర్మల పుస్తకాలతోపాటు అన్ని వారపత్రికలు, మాసపత్రికలు తెప్పిస్తుంది అవే ఆమెకు కాలక్షేపం విజయవాడనుంచి వెలువడే ఒక లోకల్ మాసపత్రిక తిరగేస్తూ ఒకచోట ఆగిపోయిందామె. అందులో పరమహంస ఫోటో వుంది.
పరమహంస సంవత్సరాని కొకసారో రెండుసార్లో వస్తుండేవారు. వచ్చినప్పుడల్లా ఆమెకు ధైర్యం కలిగించే మాటలు చెప్పి వెళుతుండేవాడు. వినయచంద్ర ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నించేవాడు. సిన్సియర్ గా వాళ్ళిద్దరి మధ్యా సఖ్యత పెరగటానికి కృషిచేసేవాడు. గత సంవత్సరం నుంచి రానేలేదు. ఆమె ఆతృతగా ఆర్టికల్ చదివింది. విజయవాడలో ఆరునెలల క్రితం స్థాపించబడిన 'భక్తసేవా సమాజము' గురించిన వ్యాసం అది.
కేవలం అయిదుగురితో స్థాపించబడిన ఆ సమాజము రెండు నెలలలోనే ఐదు వందల సంఖ్యలతో విస్తృతమైంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, పండుగ పర్వదినాల్లో రోజంతా అక్కడ ప్రార్ధనలు జరుగుతాయి. రోజువారీ గృహ బాధ్యతలలో మునిగి పోయిన నేటి సమాజంలో ప్రశాంతత, పవిత్రత, పరిసరాల్లో నిర్మలత ఇంట్లో లేకపోవడంతో రోజుకి కొద్ది నిముషాలైనా భక్తిగా దైవచింతనలో గడపటం అసాధ్యమైపోతోంది. గుడికి వెళ్ళినా అక్కడ ప్రశాంతత దొరకదు. ఈ భక్తి సేవా సమాజంలో ఎలాంటి శబ్దమూ వుండదు. ఏ సమయంలోనైనా వెళ్ళవచ్చు. శబ్దం చేయకుండా భగవధ్యానం చేసుకోవచ్చు. దానికి తగిన వాతావరణం యేర్పరచబడింది.
నిర్మలకు పరమహంస అంటే గౌరవభావం పెరిగింది. ఒక సారి వచ్చి వెళితే బావుండును అనుకుంది.
ఆ సాయంత్రమే వచ్చాడతను.
"రండి! మీ గురించే అనుకున్నాను. పత్రికలో చూశాను. చాలా గొప్పవారై పోయారు. మేము గుర్తున్నామా అని అనుమానం వచ్చింది" అంది ఆహ్వానిస్తూ అతడి రాక ఆమెకి చాలా రిలీఫ్ గా, సంతోషంగా అనిపించింది.
అతడి కళ్ళలోనూ, ముఖంలోనూ కూడా మార్పు వుంది. కొత్తరకం వెలుగుతో కళ్ళు మెరుస్తున్నాయి. "నేను అతి మామూలు మనిషిని! సామాన్యుడిని! మీలాంటి ఉత్తముల్ని ఎలా మర్చిపోగలను? మీరు నా గురించి ఆలోచించి వుంటారని నా కెందుకో అనిపించింది. రాత్రి పూజలో ఉన్నప్పుడు మీ పిలుపు వినిపించింది. వచ్చేశాను" అన్నాడతను.
నిర్మల అతనివైపు భక్తిగా, ఆసక్తిగా చూసింది. అతడో అద్భుతమైన వ్యక్తిలా అనిపించాడు. "వినయ్ ఎలా వున్నాడు? ఆరోగ్యం బావుండటంలేదు కదూ?"
"అవును" దిగులుగా అంది. "మీరైనా కాస్త చెప్పండి. తాగుడు బాగా ఎక్కువైంది. నా మాట వినటం లేదసలు."
"నా మాట వాడు వినడు. రోజూ ఓ గంట నాతోపాటు ప్రార్ధనలో కూర్చోపెడితే ఎలాంటి మందుల అవసరం లేకుండానే వాడి జబ్బు మాయమౌతుంది. నా మాట అసలు పట్టించుకోడు. నేను చేయగలిగిందేమీ లేదు."
"దానికేదో మార్గం చూడండి. నా మాట అసలే వినరు. పూజలూ అవీ అంటే అసలు గిట్టదు. ఎద్దేవా చేస్తారు."
"చిన్నప్పటినుంచీ అంతేవాడు. వాడినిప్పుడు మార్చటం కష్టం. సర్లెండి ఏదో మార్గం ఆలోచిస్తాను" అన్నాడు. అతడు ఆ మాట ఇచ్చాక ఆమె మనసు తేలికపడింది. వినయచంద్ర ఇంటికి వచ్చేవరకు ఆగకుండా పనుందని వెళ్ళిపోయాడతను.
వినయచంద్రకి పరమహంస వచ్చాడని చెప్పింది. "వాడో సైకోపాత్! నమ్మకు' అంటూ కొట్టిపారేశాడు వినయచంద్ర.
* * *
వేసవి సెలవులు అయిపోయాయి. స్కూలు తెరిచే రోజు త్వరగా స్కూలుకి బయలుదేరింది సాహితి. తోటలో పూచినా మల్లెల దండ గుచ్చింది. విరిసీ విరియనివి ఎంచుకుని కోసింది. రెండు నెలలు తర్వాత టీచర్ని చూడబోతున్నానన్న ఉత్సాహం ఉరకలు వేస్తుంటే కారెక్కింది.
స్కూల్లో అడుగు పెడుతూనే ఆమె కళ్ళు టీచర్ కోసం వెతికాయి. ఎక్కడా కనిపించలేదు. ప్రార్ధన ముగిశాక క్లాసులోకి వెళుతుంటే ఎవరో అనడం వినిపించింది. 'కోమలా టీచర్ రిజైన్ చేసి వెళ్ళిపోయారట". అని
చేతిలో గులాబీ పువ్వు నలిగి కిందకు జారిపోయింది.
'టీచర్ యిక రాదు. కనిపించదు' అన్న భావం వెంటనే జీర్ణం కాలేదు. ఆ రోజంతా మూడీగా కూర్చునే వుంది.
టీచరు కట్టుకునే బట్టల్ని గమనించి, ఆమెకు గులాబీరంగు యిష్టమని తెలిసి అన్నీ ఆ రంగు బట్టలే కొనుక్కుంది. ఆవిడ చేతికున్న చిన్న వాచీలాంటిదే కొనుక్కుని పెట్టుకుంది. ఆమె వేసుకున్న చెప్పులలాంటి వాటికోసం ఒకరోజు వూరంతా తిరిగి సాధించింది. అవన్నీ ఇప్పుడు తనని చూసి వెక్కిరిస్తున్నాయి. ఒక్కరోజు సెలవు వస్తే ఆవిడను చూడకుండా ఎలా బ్రతకడమనుకునేది. ఇక ఎప్పటికీ కనిపించదని తలుచుకుంటున్నప్పుడల్లా దుఃఖం ముంచుకొస్తోంది.
అంతలోనే ఏదో ఆలోచన తట్టినట్లు గులాబీ మొక్కలవైపు నడిచింది. అయిదు నిమిషాల తర్వాత "సాహితీ! ఏమిటి టిఫిన్ చేయలేదు?" అంటూ వెతుక్కుంటూ వచ్చి కూతురి చర్య చూసి కంగారుగా....."అరె! ఏమిటిది? పూలన్నీ అలా నాశనం చేస్తున్నావేం? పిచ్చెక్కిందా నీకు?" అంటూ పక్కకు లాగింది నిర్మల.
"వద్దమ్మా! మనింట్లో ఇక గులాబీ మొక్కలే వద్దు అన్నీ తీసెయ్యమని మాలీకి చెప్పు-లేకపోతే నేనే లాగి పారేస్తాను."
నిర్మల అర్ధంకానట్లు చూసి....."సరే అలాగే! రేపే చెప్పి తీయించేస్తాను. నువ్వు లోపలకు పద" అని చెయ్యి పట్టుకుంది. సాహితి ఒళ్ళు కాలిపోతోంది.
వారం రోజుల పాటు ఆమెకు జ్వరం తగ్గలేదు. పిచ్చి కలవరింతలు. నిర్మల భయపడిపోయింది. డాక్టరిచ్చిన మందులేం పని చేస్తున్నట్లనిపించలేదు. ఆమెకు పరమహంస యిచ్చి వెళ్ళిన విబూది గుర్తొచ్చింది. అది తెచ్చి బొట్టుపెట్టింది. పాలల్లో చిటికెడు కలిపి తాగించింది. రెండ్రోజుల తర్వాత జ్వరం తగ్గుముఖం పట్టింది. నిర్మల మనసులోనే పరమహంసకి కృతజ్ఞతలు చెప్పుకుంది.
"మమ్మీ! నేనిక స్కూలుకి వెళ్ళను" అంది సాహితి జ్వరం తగ్గిన రెండో రోజు.
"అలాగేలే! నీ యిష్టం" అంది నిర్మల. "అన్నట్లు నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు మీ క్లాస్ మేటట ఒకమ్మాయి వచ్చింది. నీకు స్కూలుకి వుత్తర మొచ్చిందని తెచ్చింది-ఇస్తానుండు".
ఉత్తరం మీద ముత్యాల్లాంటి అక్షరాలు చూడగానే సాహితికి ముఖం విప్పారింది. అది కోమలా టీచర్ రైటింగ్. ఆత్రంగా విప్పింది.
"సాహితీ!
బావున్నావని తలుస్తాను. బెంగపడ్డావా? చెప్పకుండా వెళ్ళవలసి వచ్చింది సాహితీ! సారీ! మనుషులు దూరమైనంత మాత్రాన అభిమానం దూరం కాదు. ఐ లైక్ యూ. ఎక్కడున్నా నేను నిన్ను మర్చిపోను.
నాకు పెళ్ళయింది. చెప్పాల్సింది శుభవార్తే అయినా అది మరోరకంగా బాధ కలిగించే విషయం కాబట్టి చెప్పలేదు. రిజగ్నేషన్ లెటర్ పంపేటప్పుడు నీ గురించే ఆలోచించానంటే నమ్ముతావా? బొంబాయిలో జీవితం సెటిలయిపోయినట్లే. అందుకే ఈ ఉత్తరం. ఆత్మీయురాలిగా, నిన్నభిమానించే టీచరుగా అప్పుడు ఇప్పుడు కూడా చెప్పేదొక్కటే. నువ్వు బాగా చదవాలి. నీ ఫస్టు ర్యాంక్ ని వదులుకోనంత బాగా చదవాలి. ఇది నా కోరిక! నువ్వు నాకిచ్చే కానుక! నిలబెట్టుకుంటావనే నమ్ముతున్నాను. నీ ప్రోగ్రెస్ వుత్తరాల ద్వారా తెలిపితే సంతోషిస్తాను.
దీవెనలతో
నీ
కోమలా టీచర్."