అర్జంటుగా మాట్లాడవలసింది వుందని పనికుర్రాడితో భర్తకి కబురు చేసింది మీనాక్షి. అతడు వెంటనే లోపలకొచ్చాడు.
"ఏమిటో త్వరగా చెప్పు-అర్జంటు పనుంది" అన్నాడు గడియారం చూసుకుంటూ....
"నీరద్, అదెవరో గీతను పెళ్ళిచేసుకుంటానంటున్నాడు__"
"గీతా?" అతడి కనుబొమలు ముడిపడ్డాయి.
"మీ గర్ల్ ఫ్రెండ్ చెల్లెలట!" కచ్చగా అంది.
"అంతవరకూ వచ్చిందా?"
"మీరేలాగైనా దానికి గడ్డిపెట్టి ఈ పెళ్ళి ఆపుచేయించండి-"
"చూస్తాను__"
"అంటే? కొంపదీసి మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఈ పెళ్ళికి మీరే ఒప్పుకుంటున్నారా?"
"నాన్సెన్స్! వాడితో వెధవ వేషాలు వెయ్యద్దని చెప్పు. ఆ పెళ్ళి జరగటానికి వీల్లేదని చెప్పు."
గడియారం చూసుకుంటూ వెళ్ళిపోయాడు__కృంగిపోతున్న మనసుతో నీరద్ గదిలోకి వచ్చింది మీనాక్షి.
పాప్ మ్యూజిక్ రికార్డ్సు పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను. లోకంలో ఉల్లాసమంతా ఆ ముఖంలోనే ఉంది.
తల్లిని చూసి "రా అమ్మా!" అన్నాడు.
ఉత్సాహంతో అందంగా కళకళలాడుతున్న కొడుకుని చూసుకొని మురిసిపోతుంది మీనాక్షి. ఇవాళమాత్రం ఆవిడ మనసు దిగులుతో నిండిపోయింది.
"నీరద్! నువ్వయినా, మీ నాన్నలా తయారవకుండా వుండాలని ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నానురా! ఏ దేవతలూ నన్ను కరుణించలేదు."
"లేదమ్మా! దేవతలందరూ నీ ప్రార్ధన విన్నారు. నేను ఆయనలా ఎప్పటికీ వుండను. ఆయన నిన్ను కష్టపెట్టినట్లు నా భార్యను నేను కష్టపెడతాననుకుంటున్నావా? గీతను నా గుండెల్లో దాచుకొని కాపాడుకుంటాను"
ఒళ్ళుమండిపోయింది ఆ తల్లికి.
"దౌర్భాగ్యుడా! నీ తండ్రిని మించిపోయావు నువ్వు. ఇంకా మీనాన్నే నయం. ఆ ఏడ్చే ఏడుపేదో చాటుమాటుగా ఏడుస్తున్నారు. నువ్వు బాహాటంగా పెళ్ళికే సిద్ధపడుతున్నావు."
"నేను కోరినమ్మాయిని పెళ్ళిచేసుకుంటున్నాను. అది తప్పా?"
"నీతీ, జాతీ లేనిదానినా. పెళ్ళిచేసుకుంటావు?"
"నీతీ, జాతీ లేనిదెవరికమ్మా? నీ మెడలో మంగళసూత్రాలున్నాయి. ఆవిడ మెడలో లేవు-నీలాంటిదే ఆవిడాను."
"ఆ! ఎంతకు తెగించావురా. దాంతో నన్ను పోలుస్తున్నావా?"
"పాపం, ఆవిడ మంచిదమ్మా. ఆవిడ దౌర్భాగ్యంతో పోలిస్తే నీ కష్టాలసలు కష్టాలా?"
"లాభంలేదురా! వ్యామోహంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. పోనీ వావీ వరుసా అయినా అక్కర్లేదురా? అది నీకేమవుతుంది?"
"ఏమీకాదు. మీ అన్నగారి కూతుర్ని చేసుకోవటం మంచిదికాదు. రక్తసంబంధాలు పనికిరావు. కానీ గీతకూ, నాకూ రక్తసంబంధం ఏముందమ్మా? చక్కగా చేసుకోవచ్చు."
"అయ్యో, దేవుడా! ఎక్కడ కర్మొచ్చి పడిందిరా! పోనీ దాన్ని కావాలంటే మీ నాన్నలాగ నువ్వు "గర్ల్ ఫ్రెండ్" లాగ ఉంచుకో. పెళ్ళి మాత్రం లక్షణమైన సంబంధం చేసుకో!"
వింతగా చూసాడు తల్లిని.
"నాన్న ప్రవర్తనకి బ్రతుకంతా కుమిలి కుమిలిపోయిన నువ్వేనా ఈ మాటలంటున్నది? ఇదెక్కడి సాంప్రదాయమమ్మా! అలాంటి సాంప్రదాయాలు లేకపోతేనేం? అసలు సంఘంలో పెళ్ళిళ్ళు లేకపోతేనేం?"
"అయితే నా మాట వినవన్నమాట! మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోనన్నారు."
"మానెయ్యమను. ఒప్పుకోకపోతే! ఏం చెయ్యగలరు? మహా ఐతే నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వను?" అంటారు. అంతేనా! మానెయ్యమను నాకేం నష్టం? నేను సంపాదిస్తాను. నా భార్య సంపాదిస్తుంది. వేషభాషల్లో ఎక్కడ లేని ఆధునికత్వాన్ని ప్రదర్శిస్తారు. మనసులు మాత్రం పాతరాతియుగం నాటివి, ఛ! ఛ!"
వైట్ నిక్కరు, వైట్ బనియన్ వేసుకుని, చేతిలో టెన్నిస్ రాకెట్ ఊగించుకుంటు వెళ్ళిపోయాడు. అతడిని లొంగదియ్యటం తన తరం కాదని అనుభవంమీద తెలుసుకుని ఉసూరుమని పోయింది మీనాక్షి.
12
జయపాల్ లో ఆ ఉగ్రస్వరూపం అంతకు ముందెన్నడూ చూడలేదు వేద. "నీ చెల్లెలికి ఏం చెప్పుకుంటావో, ఎలా చెప్పుకుంటావో చెప్పుకో! ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు. అత్యాశలకు పోయారంటే అందరినీ నాశనం చేస్తాను."
ఆ మాటలు వింటుంటేనే వేద గుండెలు దడదడలాడాయి. అతని కౌటిల్యం ,కల్మషం, చాలాసార్లు చూసింది వేద. ప్రత్యక్షంగా కాదు, మైకంలో దొర్లిన వాక్ప్రవాహంలో ఏ అధికారులు అతనికేవిధంగా అడ్డువచ్చారో, వాళ్ళపై ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడో, ఎందరిని ట్రాన్స్ ఫర్ చేయించాడో, ఎందరికి రావలసిన ప్రమోషన్స్ ఆపు చేయించాడో అవన్ని వేదకు తెలుసు. రాజకీయ నాయకులలో ఎవరెవరు అతనికి అండగా ఉంటారో, ఎవరు అతనికి ప్రతికక్షులో కూడా తెలుసు.
అతడు చేసే దుర్మార్గాలు విని విని ఉన్న వేదకు అతడెంతకయినా తెగించగలడని తెలుసు. అందుకే గీతకు మళ్ళీ నచ్చజెప్పబోయింది. కానీ, గీత ఎదురు తిరిగింది.
"ఇందాక జయపాల్ నీతో మాట్లాడుతోంటే విన్నాను. ఒళ్ళు మండిపోయింది. ఎలా సహించావ్, ఆ మాటలన్నీ? నేనయితే చెంపలు పగలగొట్టేదాన్ని- నువ్వు అతడు కొనుక్కున్న బానిసవా?
"నిన్ను అంత అగౌరవంగా- హీనంగా-మాట్లాడిన వ్యక్తిని ఇంకా ఎందుకు గౌరవిస్తున్నావో. అతడి మాటకు విలువ ఇచ్చి నామనసు మార్చాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావో, నాకు అర్ధం కావటంలేదు-" జీవితంలో వరసగా ఎదురుదెబ్బలు తిని తిని అలసిపోయివుంది వేద.
"ఇది గౌరవం కాదు గీతా! భయం, నీ మనసు మార్చుకోమని బ్రతిమాలుతున్నది అతని మాట మన్నించి కాదు, నీ మేలు ఆలోచించి."
"అక్కా! నీరద్ మనకు అండగా ఉన్నంతవరకూ మనం దేనికీ భయపడక్కర్లేదు. నా మేలు నాకు తెలుసు. ఇన్ని మాటలెందుకు? ఖచ్చితంగా చెపుతున్నాను. విను, నీరద్ ని తప్ప మరొకరిని నేను పెళ్ళి చేసుకోను. కాని నీ ఇష్టం లేకుండా మాత్రం పెళ్ళి చేసుకోను...."
ఆమె మనసు అటు ఇటు ఊగిసలాడిపోసాగింది. నీరద్, గీత, ఇద్దరికిద్దరూ తమ మాటమీద గట్టిగా నిలబడ్డారు. పెళ్ళి చేసుకుంటామంటున్నారు. ఆ పవిత్ర ప్రేమికులను ఎందుకు విడదియ్యాలి? ఆ అమాయక హృదయాలను ఎందుకు బాధపెట్టాలి?
ఆ సాయంత్రం, అన్న వదిన, తల్లి తండ్రి, అంతా వచ్చారు. వస్తూనే "ఇదెక్కడి అన్యాయమే!" అంటూ ఘొల్లుమంది తల్లి.
"దాన్నికూడా నీలా తయారుచెయ్యాలనుకున్నావా? నువ్వొక్క దానివి ఇలా తయారయింది చాలదా?" అన్నాడు తండ్రి. ఇప్పుడు ఆరోగ్యం బాగుపడింది గనుక గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. అన్న ముందు కొచ్చాడు. వంకరగా నవ్వుతూ అన్నాడు.
"జయపాల్ గారు వచ్చి చెపితే నమ్మలేకపోయాను, నీ మనసులో ఇంత దురాలోచన ఉందని ఎవరూహించగలరు? దానికి కట్నమిచ్చి తగిన సంబంధం నేను చూడగలను. దానిని నాతో పంపించెయ్యి-" అప్పటివరకూ అంతా వింటూ శిలలా కూచున్న ఆమె ఇంక సహించలేకపోయింది.
"ఆ కట్నం కూడా జయపాల్ గారే ఇస్తానన్నారా? ప్రస్తుతం అడ్వాన్స్ గా ఎంత తీసుకున్నావు?" అంది.
జ్ఞానస్వరూప్ ముఖం అవమానంతో, కోపంతో రగులుకుపోయింది. అతని భార్య సన్నగా "నేను చెప్పలేరూ? మీ చెల్లెలు ఇలాకాక మరొకలా మాట్లాడుతుంది? ఆవిడకి మంచీ చెడ్డా బొత్తిగా లేకుండాపోయాయి" అంది. ఆవిడ గొప్పింటి పిల్ల కావటంవల్ల అరుస్తూ మాట్లాడదు. సన్నగా హుందాగా మాట్లాడుతుంది.
తల్లి మళ్ళీ తల బాదుకుంటూ "దాని బ్రతుకు బండలు చెయ్యకే. మాతో పంపించెయ్యవే!" అంది ఏడుపు గొంతుతో.
"తీసికెళ్ళండి! నేను వద్దన్నానా?" విసిగిపోయిన వేద శాంతంగా అంది. అంతవరకూ అక్కడే కూచుని అందరి మాటలూ వింటున్న గీత కోపంగా లేచి "మీరంతా అక్కయ్య నెందుకు మాటలంటున్నారు? నాకు ఇష్టానిష్టాలు లేవా? నేను యిష్టం వచ్చినచోట ఉంటాను. ఇష్టం వచ్చినట్లు ఉంటాను" అంది.