జ్ఞానస్వరూప్ మండిపడుతూ "నీ యిష్టం! అంతా నీ యిష్టమేనా? పెద్దవాళ్ళు ఏమైపోయారనుకుంటున్నావ్?" అన్నాడు.
గీత కొంచెంకూడా బెదరలేదు. "పెద్దవాళ్ళు! జన్మనిచ్చినంత మాత్రాన పెద్దవాళ్ళయిపోరు. చిన్నవాళ్ళు ఎప్పటికీ చిన్నవాళ్ళలా ఉండిపోరు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు ఏర్పరచుకుంటారు-ఎప్పటికీ తమ గుప్పిట్లో వుంచుకుని బొమ్మలా ఆడించాలంటే కుదరదు."
జ్ఞానస్వరూప్ రెచ్చిపోయాడు. "ఓహో! నువ్వు బొమ్మలా ఆడదామనుకుంటున్నావన్న మాట- నీ అక్కను అడ్డుగా పెట్టుకుని - ఆ వేషాలేం సాగవు.
"చిన్నపిల్లలు అజ్ఞానంలో తప్పు దారిన నడుస్తోంటే వాళ్ళను సక్రమ మార్గాన పెట్టే హక్కు పెద్దవాళ్ళకుంది. అదీగాక నువ్వు మైనరువి. ఇప్పుడు నువ్వు మాతో రాననటానికి వీల్లేదు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండవలసిందే!"
గీతను చెయ్యి పట్టుకుని బరబర ఈడ్చుకుపోసాగాడు. "అక్కా! అక్కా" అంటు లేగదూడలాగ ఏడుస్తూ అన్నను విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది గీత - అన్నీ చూస్తూ బొమ్మలాగ నిలబడిపోయింది వేద, ఒక్క అడుగయినా ముందుకు వేయకుండా - రాక్షసంగా ఈడ్చుకుపోయి గీతను తమతో తీసుకుపోయాడు జ్ఞానస్వరూప్ - ఏడుస్తూ తల్లి - కోపంగా సణుక్కుంటూ తండ్రి అతడిని అనుసరించారు.
ఒంటరిగా తన ఇంట్లో ఉండిపోయిన వేద - ఈ సాంఘిక నీతి నిబంధనలకు అర్ధమేమిటా అని ఆలోచించసాగింది - అవన్నీ యాంత్రికమైన సూత్రాలు, స్వార్ధపరులు ఎటుపడితే అటు మార్చుకునే ఉపకరణాలు.
వారంరోజుల తర్వాత నీరద్ వచ్చాడు సుడిగాలిలా!
"గీతను కాలేజి మాన్పించేసారా?" అన్నాడు ఉక్రోషంగా.
ఉలికిపడింది వేద "మాన్పించేసారా?" అంది అనునయంగా! పాపం గీత మెడిసన్ చదవాలని ఎంతగా కలలుకందో తనకొక్కదానికే తెలుసు. ఎలాగైనా గీతను మెడిసిన్ చదివించాలనేది తన జీవిత ధ్యేయాలలో ఒకటి.
"మీకు తెలియదా? గీత ఎక్కడుంది?"
"నా దగ్గరలేదు-అమ్మా, నాన్నగారు, అన్నయ్య దాన్ని తీసికెళ్ళిపోయారు."
"బలవంతంగానా?"
వేద మాట్లాడలేదు.
"నాకు తెలుసు! గీత తనంతట తను మీ దగ్గిరనుంచి వెళ్ళదు. మీ వాళ్ళకు మా విషయమంతా ఎవరు చెప్పారు."
"మీ నాన్నగారు!" వేద చెప్పింది! వేద మనసులోనూ ప్రతీకారవాంఛ మొలకెత్తుతోంది. ముఖ్యంగా గీత చదువు మానేసిందని విన్నప్పటి నుంచీ-వేద ఆశించినట్లుగానే పిడికిళ్ళు బిగించి 'ఐసీ!' అని పళ్ళునూరుకుంటూ-చెంగున గెంతుకుంటూ వెళ్ళిపోయాడు.
వెదకు ఒంటరితనంలో రోజులు దుర్భరంగా గడుస్తున్నాయి. జయపాల్ అప్పటిలో రాడనుకొంది. కానీ వచ్చాడు__
"ఎలా వుంది మీ చెల్లెలు?" అని పలకరించాడు. క్రౌర్యంతో కూడిన ఆ వెటకారానికి వేద మనసు మండిపోయింది.
"నా కంఠంలో ప్రాణమున్నంతవరకూ అదెక్కడున్నా సుఖంగానే ఉంటుంది-" అంది.
"వుండమను. వద్దన్నానా?" నవ్వాడు- అంతటితో యధాప్రకారంగా నిత్యకార్యక్రమం ప్రారంభమయింది.
ఆరోజు త్రాగిన మైకంలో జయపాల్ నోటినుండి వచ్చిన వాక్యాలు కొత్తగా వున్నాయి.
"జయపాల్ ని బుట్టలో పెట్టాలనుకుంటున్నారేమో జాగ్రత్త! గీత కనుక నీరద్ ని పెళ్ళిచేసుకుంటే దాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. దాని శవంకూడా కనపడకుండా చేస్తాను. నాలుగురోజులేడ్చి ఆ తరువాత సుఖంగా దర్జాగా బ్రతుకుతాడు-"
ఆ మాటలు వింటోంటే వేద శరీరం భయంతో జలదరించింది__వెంటనే ప్రతీకారమార్గం ఆలోచించటం ప్రారంభించింది__మనసు దహించుకుపోతున్నా ఆనాడు జయపాల్ మీద మరింత ప్రేమ చూపించింది.
ఒకవిధమయిన భయందోళనలతో గడుస్తున్నాయి రోజులు వేదకి-నీరద్ స్వభావం కొంతవరకూ అర్ధంచేసుకున్న వేద, అతడీ అపజయాన్ని సహించి ఊరుకుంటాడని అనుకోలేకపోయింది-
అనుకున్నట్లుగానే ఆరోజు మూడుగంటలకి ఆఫీసులో వుండగా వేదకి ఫోన్ వచ్చింది. జయపాల్ ఊళ్ళో లేడు- వేద "హలో!" అనగానే అటువైపునుంచి నీరద్ కంఠం "హలో!" అంది. ఒక్కక్షణం గొంతు పొడారిపోయినట్లయింది వేదకి-
నీరద్ గబగబ "హలో! పెట్టెయ్యకండి, మీరు వెంటనే ఆర్యసమాజానికి రావాలి! అర్జంటు!" అన్నాడు.
"ఆర్యసమాజానికా? ఎందుకు?" వణుకుతున్న కంఠంతో అడిగింది.
"అన్నీ వచ్చాక తెలుస్తాయి. ఫోన్ లో మాట్లాడటానికి వీల్లేదు. వెంటనే రండి, మీకోసం ఎదురుచూస్తూంటాము" ఫోన్ పెట్టేశాడు.
వెంటనే టాక్సీచేసుకొని వెళ్ళింది. "అక్కా!" అంటూ ఎదురొచ్చి కౌగిలించుకొంది. గీత పెళ్ళికూతురు వేషంలో వుంది.
ఆర్యసమాజం అంతా అలంకరింపబడివుంది. ఎవరెవరో ఉన్నారు. నీరద్ ఫుల్ సూట్ లో మెరిసిపోతున్నాడు. వేదను చిరునవ్వుతో సమీపించి "పెళ్ళి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. మీ ఆశీస్సులు లేకుండా పెళ్ళిచేసుకోనని పట్టుబట్టి కూర్చుంది గీత. అందుకే మీకు ఫోన్ చేసాను." అన్నాడు.
కొంత కొంత అర్ధమవుతున్నా అయోమయంగా "పెళ్ళి ఎవరికి?" అంది.
నీరద్ మిస్చివస్ గా నవ్వుతూ "కనబడటంలేదూ? నాకు, గీతకి....ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. మీరువచ్చి ఆశీర్వదించటమే తరువాయి" అన్నాడు. గీత బెంగగా ఆశగా అక్కని చూస్తోంది.
"గీతనెలా తీసుకొచ్చారు?"
"సింపుల్! వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పిస్టల్ తో బెదిరించి తీసుకొచ్చేసాను, ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నాకే తీసుకొచ్చానులెండి వాళ్ళేం చేస్తారో? మీరు తొందరగా ఆశీర్వదించండి. తొందరగా పెళ్ళి జరిగిపోవాలి!"
అక్కడ ఆర్యసమాజ పద్ధతిలో వున్న పెళ్ళి సన్నాహాలన్నీ చూసింది వేద. పెళ్ళికూతురిగా అలంకరించుకొన్న గీతను చూసింది. ఇక ఏమీ ఆలోచించకుండా భగవంతుడిపై భారంవేసి గీతను కౌగిలించుకొని "మీ దంపతులిద్దరూ కలకాలం సుఖంగా వుండాలి" అని ఆశీర్వదించింది.
గీత నీరద్ ల ముఖాలు వికసించాయి. పెళ్ళిపెద్ద ఇద్దరిచేతా వాగ్దానాలు చేయించాడు. ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయించాడు. వధూవరులు పుష్పహారాలు మార్చుకున్నారు. పెళ్ళికి వచ్చిన మిత్రులందరూ బహుమతులతో శుభాకాంక్షలందజేసారు. ఆ తరువాత అక్కడే చిన్న పార్టి జరిగింది. ఆ రాత్రే గీతా నీరద్ లు హనీమూన్ కి వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగివచ్చిన వేదకి దిగులు కలగలేదు. మనసంతా అనిర్వచనీయమైన తృప్తితో నిండిపోయింది.
13
ఇంటర్ వెల్ లో లైట్లువెలగగానే యధాలాపంగా చుట్టు చూసింది వేద. ముందు వరసలో శ్రీనివాస్ కూర్చుని ఉన్నాడు. అతడూ అప్పుడే వెనక్కి తిరిగి వేదను చూసాడు, వెంటనే "శ్రీనివాస్" అంటూ అతనికిదగ్గరగా వచ్చింది.
శ్రీనివాస్ "హలో!" అని పలకరించి "నా శ్రీమతి" అని పక్కనున్న అమ్మాయిని పరిచయం చేసాడు.
అప్పుడు చూసింది ఆ అమ్మాయిని వేద. తెల్లనిచీరలో నిరాడంబరంగా ఉన్నా అందంగా వుంది.
"గ్లాట్ టు మీట్ యు" అని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంది.
ఆ అమ్మాయి స్నేహపూర్వకంగా నవ్వి "నా పేరు మైథిలి. బి. యస్ పి., బి.యిడి. పాసయి టీచర్ గా పనిచేస్తున్నాను" అని తనను తను పరిచయం చేసుకొంది.
"ఈవిడ నా ఇంటర్వ్యూమేట్!" నవ్వుతూ వేదను తన భార్యకు పరిచయం చేశాడు.
"అదేమిటి?"
"మాకిద్దరికీ ఉద్యోగాలు రాకముందు ఇద్దరమూ ఎన్నో ఇంటర్వ్యూలకు కలిసి వెళ్ళేవాళ్ళము, డిజప్పాయింట్ మెంట్ సమంగా షేర్ చేసుకునేవాళ్ళం!"