Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 16

    "వలలో వేసుకుంటానా? అంటే?"
    గీత అయోమయంగా చూసి "ఏమో!" అంది.
    "వేసుకుని__ __"
    "నన్ను నాశనం చేస్తావు!"
    "అంటే?"
    "ఏమో!"
    "నాన్సెన్స్! నేను చెడ్డవాడినని ఎవరన్నారో చెప్పు. వాళ్ళని_" మహోద్రేకంగా అనబోతున్న నీరద్ ని అడ్డుకొని కోపంగా "మా అక్కయ్యని ఏమన్నా అన్నావంటే ఒప్పుకోను!" అంది గీత. నీరద్ వెంటనే తగ్గిపోయి "ఆఫ్ కోర్స్! నాకు ఆవిడంటే చాలా గౌరవం!" అని నీరసంగా "ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు.
    "నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా?"
    "ఎందుకు చేసుకోను? ఒకసారి కాదు! లక్షసార్లు చేసుకుంటాను."
    "అదే! అలా లక్షసార్లు చేసుకుంటావనే చెడ్డవాడన్నది!"
    "ఓగాడ్! అది నా ఊతపదం! లక్షసార్లు నిన్నే పెళ్ళి చేసుకుంటాను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోను, ప్రామిస్!"
    "ఈ మాటలు మా అక్కతో చెప్పు!"
    "ఓస్! ఇంతేనా! ఇప్పుడే చెపుతాను."
    నీరద్ తో కలిసి వస్తున్న గీతని చూసి మండిపోయింది వేదకి. "గీతా!" అని కోపంగా మందలించ బోతుండగానే నీరద్ అడ్డుకుని ధైర్యంగా గీత చెయ్యి పట్టుకుని "నేను గీతని పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు.
    వేదకి మతి పోయింది. ఏమి ధైర్యం? ఎంత చొరవ!
    "మీ నాన్నగారిని అడిగావా?"
    "ఇప్పుడేగా నిర్ణయించుకుంది!"
    "ఒప్పుకుంటారా?"
    "నాకేం తెలుసు? ఇంతకుముందెన్నడూ పెళ్ళి చేసుకుంతానని అడగలేదుగా!"
    "ఒప్పుకోకపోతే ఏం చేస్తావు?"
    "సింపుల్! చెప్పకుండా పెళ్ళిచేసుకుంటాను!"
    "పెళ్ళంటే కేవలం తాళి ముడెయ్యటమే అనుకుంటున్నావా?"
    "కాదు. ఆ తరువాత హనీమూన్ కి కూడా వెళతాం. ఆమాత్రం తెలియదనుకుంటున్నారా?"
    కోపం కరిగిపోయి నవ్వు వచ్చేస్తోంది వేదకి. "ఇతనిలో ఏముందో కాని, కోపం తెచ్చుకోవాలన్నా సాధ్యంకాదు!" అనుకుంది.
    "హనీమూన్ కి వెళ్ళిరావటంకాదు, ఫేమిలీ యెస్టాబ్లిష్ చేసుకోవాలి. సంఘాన్ని ఎదుర్కోవాలి...."
    "మేం ఇప్పుడిపుడే ఫేమిలీ యెస్టాబ్లిష్ చెయ్యం. కొంతకాలం ఇద్దరమే ఉంటాం! నాకు బోలెడు డబ్బుంది! మా నాన్న ఇయ్యక్కరలేదు. నేనే సంపాదించుకోగలను. ఒక సంఘాన్నికాదు, లక్ష సంఘాలను ఎదిరించగలను. బై బై!"
    నవ్వుతూ వెళ్ళిపోయాడు నీరద్, నవ్వుతప్ప మరొకటి ఎరగనట్లు.
                                      11
    అప్పుడే మిరకిల్ నుంచి వచ్చింది మీనాక్షి. జుట్టు కృత్రిమంగా నొక్కులు తిప్పించుకువచ్చింది. తాను సృష్టించుకున్న ఆ ఉంగరాలజుట్టును అద్దంలో మురిపెంగా చూసుకుంటూ జుట్టంతా ముఖంమీదకు పడేలా తల దువ్వుకుని జుట్టు ముడి వేసుకుంటోంది. అందంపట్లా అలంకరణపట్లా తల్లి తాపత్రయం చూసి నవ్వుకొన్నాడు నీరద్. మీనాక్షి సహజంగా అందమైనదే! కానీ మీదపడుతున్న నడివయసును ఎదుర్కోవాలని నానా యాతనా పడుతోంది. ఒక్కగానొక్క కొడుకు నీరద్ పైనే పంచ ప్రాణాలు పెట్టుకొంది. ఆవిడ-తనకేం కష్టంవచ్చినా, చికాకువచ్చినా, మొదట కొడుకుతోనే చెప్పుకునేది. తండ్రి "గరల్ ఫ్రెండ్" ని సంపాదించుకోవటం, అది తెలుసుకొని మీనాక్షి కుమిలి కుమిలి ఏడవటం నీరద్ కి కొత్తకాదు. అతడికి తల్లి దగ్గరే చనువు. తల్లిమీదే ప్రేమ, తండ్రంటే భయభక్తులేతప్ప, ప్రేమాభిమానాలు ఏనాడూలేవు. ఇటీవల ఆ భయంభక్తులుకూడా నశించిపోతున్నాయి.
    "అమ్మా! నేను పెళ్ళిచేసుకుంటున్నాను" అన్నాడు నీరద్, "నేను ఫలహారం చేస్తాను" అన్నంత సామాన్యంగా, అతడు చెప్తున్నదేమిటో అర్ధంకానట్టు తెల్లబోయి చూసింది మీనాక్షి. అతడి దుడుకుతనం ఆవిడకి చిన్నతనంనుంచీ అలవాటే! ఎప్పుడు ఏది కావాలని మొండిపట్టు పడతాడో ఎప్పుడు ఏదిచేస్తాడో, ఎందుకు చేస్తాడో, ఈనాటికీ ఆవిడ ఊహించలేదు. కానీ, ఇప్పుడు తను విన్నమాట విడ్డూరాలన్నింటిలోకీ విడ్డూరంగా వినిపించింది. చిన్నపిల్లాడిలా చేతులతో పక్కనున్న బల్లమీద మద్దెలవాయిస్తూ తల్లి విభ్రాంతికి ఆలోచించసాగాడు నీరద్.
    "ఏమిటిరా, నువ్వంటున్నది?"
    "విన్నావుగా! నేను పెళ్ళి చేసుకుంటున్నాను."
    "ఛీ-పో! అప్పుడే నీకు పెళ్ళేమిటి?"
    "నాకు పెళ్ళిచేస్తే తొందరగా బామ్మవయిపోతావని భయమా?"
    గతుక్కుమంది మీనాక్షి.
    "ఛీ-పో! తల్లి దగ్గరకూడా తుంటరితనమే!"
    "ఇది తుంటరితనంకాదు. నిజంగా నేను పెళ్ళిచేసుకుంటున్నాను."
    "చేసుకో! మా అన్నయ్యగారి అమ్మాయి శిరీషను నీకు చేసుకోవాలనుంది నాకు. మీ నాన్నగారికీ సంబంధం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆయనకింకా గొప్ప సంబంధం తెచ్చుకోవాలని ఉంది. ఆయన దృష్టి ఎంతసేపూ డబ్బుమీదే!"
    "ఛ! డబ్బుమీద దృష్టి ఉండకూడదుకదమ్మా!"
    "అదే! మనకి కావలసినంత ఉంది. ఇంకా డబ్బుకోసం పెళ్ళిచేసుకోవలసిన ఖర్మేంకాలింది? మా అన్నయ్యగారమ్మాయి...."
    "కరెక్టు! మనం డబ్బుకోసం పెళ్ళి చేసుకోవలసిన అవసరంలేదు. అందుకే నేను గీతను పెళ్ళిచేసుకుంటున్నాను." తల్లి మాటలకడ్డుపడి అనేశాడు. ఆవిడ పైప్రాణాలు పైన పోయాయి, కొడుకుకు తనమీద అభిమానం గనుక, అతడికి నచ్చచెప్పి, మేనకోడలిని కోడలుగా చేసుకోవాలని ఎప్పటినుంచో కలలుకంటోంది ఆవిడ. 
    "ఎవరా గీత?"
    "చాలా అందమైన అమ్మాయి?"
    "ఎవరమ్మాయి"
    "యమ్.బి.బి.యస్ సెకెండియర్ చదువుతోంది!"
    "ఎవరమ్మాయి?"
    "చాలా మంచిపిల్ల!"
    "అవన్నీ సరే! ఎవరమ్మాయో చెప్పు! ఏ కులం?"
    "నాకు తెలీదు!"
    "తెలీదూ? అంత తెలీకుండా ఎలా ప్రేమించావురా? కొంపదీసి నీతోబాటు క్లబ్బుల్లో తైతక్కలాడేది కాదుగదా!"
    "గీతకి డాన్స్ వచ్చోరాదో నాకు తెలియదు. డాన్స్ నేర్చుకుంటే డాన్సర్ గా బాగా షైన్ అవుతుంది. మంచి ఫిగర్. పెళ్ళయ్యాక తనకిష్టమయితే ఇద్దరమూ కలిసే డాన్స్ పెర్ ఫార్మన్సెస్ ఇస్తాము."
    "ఇదెక్కడి సంతరా? ఆ అమ్మాయి నీకే రోడ్డుమీద పరిచయం అయింది? ఏ దౌర్భాగ్యుడు పరిచయం చేసాడు?"
    "నువ్వే పరిచయం చేశావు!"
    "నేనా?'
    "అవును. నువ్వే! గుర్తుందా? ఆరోజు నాన్న గర్ల్ ఫ్రెండ్ ని తిడుతూ కుమిలి కుమిలి ఏడ్చేవు. అది చూసి భరించలేక ఆవిడకి బుద్ధి చెప్దామని వెళ్ళాను."
    "వెళ్తే...."
    "తీరా వెళ్ళాక వాళ్ళు పాపం మంచివాళ్ళేనని తెలిసింది...."
    "నీరద్!"
    "ఆ అమ్మాయి చెల్లెలే గీత. ఆమెనే నేను పెళ్ళిచేసుకుంటున్నాను."
    "ఆ!" అని గుండె బాదుకుంది ఆవిడ.
    "నాన్నకి చెప్పు" అనేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు.
    కొడుకు అల్లరి చిన్నప్పటినుంచీ ఎంతో శాంతంగా సహిస్తూ ముద్దుచేసింది ఆవిడ. ఇప్పుడీ విషయం ఆలోచించడానికి కూడా ఆవిడకి శక్తిలేకపోయింది. అన్ని కుటుంబాలలోలాగ ఆ కుటుంబంలో భార్యాభర్తలు కలిసి కూచుని కబుర్లు చెప్పుకోవడం సాధారణంగ జరగదు. నెలకి పదిహేనురోజులు జయపాల్ ఊరిలో ఉంటాడు. ఉన్నప్పుడయినా హడావుడిగా తిరుగుతుంటాడు. ఇంట్లో అతడు భార్యతో మాట్లాడినదానికంటె,ఫోన్ లో మాట్లాడేదే ఎక్కువ. నిద్రపోవటానికే అతడికి ఇల్లు. నిద్రపోయేముందే బెడ్ రూమ్ లో ఫోన్ డిస్ కనెక్టు చేసేస్తాడు. తాగిపడుకుంటాడు.   
    ఆ తరువాత ఏ పరిస్థితుల్లోనూ, అతడినెవరూ డిస్టర్బ్ చెయ్యటానికి వీల్లేదు. నిద్రలేచినతర్వాత కాఫీకూడా అతడి గదికి పంపవలసిందే! రాత్రి మూడొంతులు గర్ల్ ఫ్రెండ్సు తోనే గడుపుతాడు, ఎపుడో భార్యముఖం చూస్తాడు__

 Previous Page Next Page