కమాండర్ శక్తి_సామర్ధ్యాలను కనులారా చూసిన డి.ఐ.జి. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తిలా స్థానువుగా మారిపోయాడు.
* * *
రాజమండ్రి రైలు స్టేషన్.
పోలీస్ ఉన్నతాధికారులు హడావుడిపడుతున్నారు.
సూపర్ ఫాస్ట్ లో వున్న సి.ఎం. ను ఏవిధంగా కాపాడగాలమా అని వారు తలమున్కలుగా పరిపరి విధాల ఆలోచిస్తునారు.
సూపర్ ఫాస్ట్ రాజమండ్రి స్టేషన్ కు వచ్చేందుకు సిగ్నల్ ఇచ్చారు.
రైలు_కం_రోడ్డు బ్రిడ్జి మీదుగా అది రావలసివున్నది.
అదే క్షణంలో _
సిగ్నల్ ను మార్చి, ఎవ్వరూ ఊహించనైనా ఊహించని రీతిలో ట్రెయిన్ గోదావరి స్టేషనుకు వెళ్ళేందుకు వీలు కల్పిస్తూ ట్రాక్ కనక్షన్ ను కూడా మార్చివేశాడొక సాయుధుడు_తాము తలచుకుంటే చేయలేనిది అంటూ ఏమీ లేనట్టు.
సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ గనుక గోదావరి వంతెనను అదే వేగంతో క్షేమంగా దాటితే అది ప్రపంచంలో మరొక వింతే అవుతుంది.
ఎన్నడో బ్రిటీష్ వారి పాలనా కాలంలో నిర్మించిన ఆ బ్రిడ్జి గోదావరి నది ఆటుపోటులకు నలిగినలిగి శిథిలావస్థలో వున్నది మరి!
అందరి అంచనాలను ఆలోచనలను తారుమారు చేస్తూ సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ గోదావరి బ్రిడ్జిని సమీపించడానికి ముందే దాని స్పీడు నార్మల్ కు వచ్చింది.
కీచుమని శబ్దంచేస్తూ, జర్క్ ఇచ్చి గోదావరి స్టేషన్ లో ఆగింది.
అప్పటివరకు గుండెలను అరచేతులలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న ప్రయాణీకులు ట్రెయిన్ ఆగీఆగగానే ఒక్క ఉదుటున దిగి బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగు లంకించుకున్నారు. ప్రాణం అంటే అందరికీ తీపేమరి!
సునంద చూస్తుండగానే ఆ యువజంట వి.వి.ఐ.పి.కేబిన్ లోకి వెళ్ళారు. సూటిగా చూస్తూ ధీమాగా వెళ్ళారు.
సెక్యూరిటీ ఆఫీసరు నవీన్ కు ఇంకా స్పృహ రాలేదు.
కూపేలో వున్న సి.ఎం. నుదుటికి పాయింట్ బ్లాంక్ రివాల్వర్ గురిపెట్టారు ఆ యువతీ యువకుల జంట.
ఆయనను బయటకు తీసుకువచ్చారు.
బయటకు రాబోతూనే యువకుడు తన ఎయిర్ బ్యాగ్ లో నుంచి టైమ్ బాంబును తీసి, సరిగ్గా పది సెకన్ల తరువాత అది పేలేట్టు ఏర్పాటు చేసి, స్పృహలేని నవీన్ చేతిలో వుంచాడు. అరచేతిలో వైకుంఠం....
ట్రెయిన్ అంతా రెప్పపాటు కాలంలో ఖాళీ కావడం, ట్రెయిన్ బ్లాస్ట్ కాకపోవడంతో కోచ్ లో మిగిలివున్న సునంద లేచి హుషారుగా తెచ్చుకుంటూ వి.వి.ఐ.పి. కోచ్ లోకి ప్రవేశించింది. దిక్కులు చూసుకుంటూ చకచకా వెళ్ళింది.
అక్కడ స్పృహలో లేని నవీన్ ను, అతని చేతిలోని టైమ్ బాంబ్ ను గుర్తించి ఖంగుతిన్నది. ముచ్చమటలుపోసాయి. కణతలు ఉబ్బాయి.
టైమ్ బాంబు పేలడానికి ఇక కేవలం ఆరు సెకన్ల వ్యవధి మాత్రమే ఉండటాన్ని గమనించింది. ముఖాన పట్టిన ముచ్చమటలను చీర చెంగుతో తుడుచుకుంది.
సి.ఎం. ట్రెయిన్ దిగి ప్లాట్ ఫారం మీద అడుగుపెట్టగానే, ఖంగారుగా తన ముఖానికి వున్న ముఖ్యమంత్రి రూపం మాస్క్ ను ఊడపీకి సాయుధుల చేతులతో గబుక్కున పెట్టాడు. గిరుక్కున తిరిగి పెద్దపెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు.
యువజంట తెల్లబోయారు. ఇతను కూడా సి.ఎం. డూప్ అని తెలుసుకున్న వాళ్ళు రెచ్చిపోయారు. రేచులయారు.
తాము ఎక్కడ ఏవిధంగా డబుల్ క్రాసింగ్ కు గురయ్యినదీ అర్ధంకాక యువజంట ఆలోచించడం ప్రారంభించారు_ కోపంతో, కక్షతో.
అసలు సి.ఎం. ఏమైనట్టు?
తక్షణ కర్తవ్యాన్ని గుర్తించారు యువజంట.
అసలు సి.ఎం. ను తెలివిగా తప్పించిన సెక్యూరిటీ ఆఫీసరు నవీన్ పట్ల వారిలో కక్ష చెలరేగింది. అతని అంతు తేల్చుకోవాలను కున్నారు.
తిరిగి సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ కంపార్ట్ మెంట్ వైపుకు పరుగుతీశారు.
యువజంట చేతులలో కదులాడుతున్న రైఫిళ్ళను చూస్తున్న కొత్త ప్రయాణీకులలో కలవరం పుట్టింది. దేవుళ్ళు గుర్తుకొచ్చారు.
నవీన్ అపస్మారక స్థితిలో పడివున్న కోచ్ ని సమీపించేప్పటికి బాంబు పేలడానికి ఇక కేవలం మూడు సెకన్లు మాత్రమే వ్యవధి వున్నది. మరణానికి ముహూర్తం....
అదే క్షణం....
పోలీసు ఆఫీసర్లు వస్తున్నట్టు జీప్ సైరన్ హోరెత్తింది. పోలీస్ జీప్ లు, కారులు బారులుతీరి వేగంగా వచ్చేస్తున్నాయి. దుమ్ము రేగిపోతున్నది.
అసలు నవీన్ నే కిడ్నాప్ చేద్దామని యువజంట అనుకున్నారు. వారి ఆలోచనలకు ఇప్పుడిక తెరపడిపోయింది. పోలీసులు వచ్చేస్తున్నారు! తాము దొరకకూడదు!
ప్రమాదాన్ని పసికట్టిన యువజంట స్టేషన్ బయటకు పరుగుపెట్టారు. వీళ్ళ కోసమే అక్కడ వేచివున్న జీప్ లోకి ఒక్క ఉదుటున ఎగిరి దూకారు....స్టార్ట్!