Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 16


    "సారీరా...."

    "సారీ అంటే సరిపోతుందా! తమాషాకయినా ఓ హద్దూ పద్దూ వుండాలి. నేను ఈ రోజునుంచి మాట్లాడను గాక మాట్లాడను."

    చంద్ర తీరే అంత. పసిపిల్లవాడి తత్వం. మాట్లాడనంటే మాట్లాడడు. నాకు కోపం వచ్చిందన్నాడు. ఇందర్ కి బాగా తెలుసు. తన ప్రవర్తనతో బాగా నొచ్చుకున్నాడని తెలుసుకున్నాడు. తను చేసిందానికి బాధపడుతున్నాడు. కాబట్టి తనే బాధని పోగొట్టాలి ఇందర్ అనుకున్నాడు.

    "తప్పుచేశాను కాబట్టి నీవు కోపగించుకోవటంలో అర్ధం వుంది. నీ వంటే నాకు ముద్దు. ఇది నీకు తెలుసు. వరేయ్ నీవు ఫ్రెండ్ ని కాదురా నా మొగుడివి అంటూ నాతో నామకరణం చేసింది నీవే."

    "ఊ, అందుకని....అందుకని...."

    "అబ్బ చెప్పేది వినరా. తప్పు నాదేనంటున్నా కదా! యింకా కోపమే. నేనెప్పుడూ చెప్పుకోలేదు. నీవే తమాషాగా మొగుడుగారూ! అన్నావా లేదా!"

    "అంటే మాత్రం...."

    "అదేలే కాస్త చొరవ తీసుకున్నా కదా! దానికి కారణం చెబుతున్నాను. కనీసం నేను చెప్పేదన్నా జాగ్రత్తగా విను. నేను ఇన్ స్పెక్టర్ వేషంలో రాబట్టే కదా వాళ్ళ బారి నుంచి నిన్ను రక్షించుకో గలిగాను. అదే నిజంగా ఇన్ స్పెక్టర్ అయితే నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళేవాడే కదా! నేకాస్త రావడం ఆలస్యం అయితే ఆ జనం నీ శరీరంలో ప్రతి జాయింట్ నీ ఏ కీలుకాకీలు విరగగొట్టే వాళ్ళు! అవునా! పోనీ ఆటోలో మనింటి అడ్రస్ చెబుతుంటే అప్పుడైనా నీకు అర్ధం కాలేదా. ఈ ఇన్ స్పెక్టర్ గాడికెట్లా అడ్రస్ తెలుసని! నిన్ను వాళ్ళ నుంచి రక్షించినందుకు సంతోషిస్తావనుకుంటే అది తారుమారయింది. ఈ విషయం అయినా కాస్త ఆలోచించు" అన్నాడు ఇందర్.

    చంద్రలాంటి వాళ్ళు మనసు మార్చటానికి పెద్దగా బ్రయిన్ వాష్ అక్కరలేదు. జాలిగా రెండు మాటలు మాట్లాడితే చాలు. నేను రక్షించకపోతే నీపని ఏమయేది. అన్న ఇందర్ మాటతో చంద్ర ఆలోచనలో పడిపోయాడు.

    చంద్ర ఆలోచిస్తూ కరిగి పోతున్నాడని అతని ముఖంలో కదలాడే భావాలు చూసి ఇందర్ గ్రహించాడు.

    "స్టేషనులో అసలేం జరిగింది! ఏ పిల్ల చెయ్యి పట్టుకున్నావు! స్త్రీ అంటే ఎంతో గౌరవం చూపించే నీవు ఓ ఆడపిల్ల చేయి పట్టుకుని అల్లరి చేశావంటే ఎవరూ నమ్మరు.

    నీవేంటి ఆడపిల్లను అల్లరి చేయడం ఏమిటి? పగలు చంద్రోదయం రాత్రి సూర్యోదయం అవుతుందంటే నమ్మవచ్చేమో గాని, స్త్రీని గౌరవించే నీలాంటి వుత్తముడు అల్లరి చేశాడంటే నమ్మను గాక నమ్మను" ఇందర్ ఆవేశంగా అని అంతలోనే తగ్గిపోయి సానునయంగా "అసలేం జరిగిందిరా చంద్రా!" అన్నాడు.

    ఇందర్ అన్న తీరుకి చంద్రకరిగిపోయాడు.

    "అసలే జరిగిందంటే" అంటూ అవంతీ స్టేషన్ బుక్ స్టాలు వద్ద కనబడడం తను చెయ్యి పట్టుకోవడం ఆతర్వాత జరిగింది వివరంగా చెప్పాడు.

    "ఊ....అదన్నమాట విషయం. ఆనాడు ఆడపిల్లలను రక్షించినందుకు నీ ఎడల కృతజ్ఞతగా వుండాల్సింది పోయి, నిన్ను తన్నిస్తుందా! అది ఆడదికాదు. రాక్షసి....రాకాసి...దెయ్యం....భూతం...."

    "పాపం తిట్టకురా ఏదో బలమైన కారణం వుండబట్టే  అలా ప్రవర్తించింది అనుకుంటున్నాను. ముఖం చూస్తే నీవలా అపార్ధం చేసుకోవు"

    "కొంపదీసి ప్రేమలో పడలేదు కదా?"

    "ఛా....ఛా....ప్రేమలేదు, దోమలేదు అవంతి నన్ను ఏమందో తెలుసా?"

    "ఏమంది?"

    "భాయి సాహెబ్! అంది. అవంతి నాకు సిస్టర్"

    "అఘోరించినట్టే వుంది. అచ్చు తెలుగులో సోదరా అనో అన్నా అనాల్సింది" ఇందర్ వ్యంగ్యంగా అన్నాడు.

    "పోనీలేరా పాపం ఆడపిల్ల అబల"

    "ఆ పిల్ల నాకు కనిపిస్తే మాత్రం వూరుకోను. మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను"

    "పోనీమన్నా కదా! ఇంతకీ నీవు ఇన్ స్పెక్టర్ వేషంలో ఎలా వచ్చావు?"

    "అదా, వెరీ సింపుల్ మేటర్. దివ్యకళానాట్య నాటక కళామండలిలో సభ్యుడిగా చేరాను. వాళ్ళు నా నటనని మొదట్లోనే మెచ్చుకున్నారు. "ఎర్రటోపీలు ఏకం అయ్యాయి" అన్న నాటకంలో నాది ఇన్ స్పెక్టర్ పాత్ర. నేను ఆ డ్రస్ వేసుకుని డైలాగులు చెప్తుంటే సభ్యులు మెచ్చుకున్నారు. ఈ డ్రస్ లో ఇంటికి వచ్చి నిన్ను తమాషా చేద్దామనిపించింది. సరాసరి ఇంటికి బయల్దేరాను. దారిలో కొందరు నాకు నమస్కారం పెట్టారు. మరికొందరు గౌరవంగా పక్కకి తొలిగారు. వాళ్ళు అలా భయ భక్తులతో ప్రవర్తించడం నాకు తెలియగానే బోలెడు చిలిపి కోరికలు నాలో ప్రవేశించాయి.

    ధరించడం అయితే ఇన్ స్పెక్టర్ వేషం ధరించాను. తెలుగు సినిమాల్లో ఇన్ స్పెక్టర్ కి వున్నట్టు పది పతకాలు తగిలించుకున్నాను. కాలినడకన వస్తున్నాను. వీడు నకిలీ ఇన్ స్పెక్టర్ అని ఒక్కడు గుర్తించి చావడే, నాకు ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. ఓ కాలేజీ అమ్మాయిని రోడ్డు మధ్య నడుస్తావేం అని గద్దించాను. ఆ పిల్ల హడలెత్తిపోయి కంగారుగా అవతలికి జారుకుంది. కిళ్ళీబడ్డివాడిని దబాయించి నిమ్మకాయ సోడా తాగి రెండు అరటి పళ్ళు తిన్నాను. సరదాగా అలా స్టేషనులోకి వెళ్ళి కాసేపు వచ్చేపోయే రైళ్ళను చూస్తూ గడిపాను. తిరిగివస్తుండగా నిన్ను చూడడం. వాళ్ళ బారి నుంచి తెలివిగా నన్ను రక్షించడం జరిగింది. వక్కసారి పరిచయంలో అవంతి చేయి నీవు పట్టుకుని తమాషాగా మాట్లాడావు అవునా? మనం కలిసి వకచోట వున్నవాళ్ళం. ప్రాణ మిత్రులం. నీ వంటే నాకెంత యిష్టమో నీకు తెలుసు....నిన్ను తమాషా చేద్దామనుకున్నాను. రేప్ జరిగిపోయినట్లు  గొల్లుమంటుంటివి. 

 Previous Page Next Page