Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 15


    మర్నాడు రామలింగం కుంటుతూ ఆఫీస్ కొచ్చేసరికి కుర్రాళ్ళందరూ అతని చుట్టూ మూగిపోయారు.

    "ఏం జరిగింది గురూజీ ! నాలుగైదు కాళ్ళతో నడుస్తున్నట్లు నడుస్తున్నారు ?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు మురళీ.

    "బస్ ఎక్కబోతూంటే కాలు స్లిప్ అయింది ..."

    "అందుకే ఏ వయసు ముచ్చటా వయసులో అన్నారు సార్ ?" స్టూడెంట్స్ చేసే పనులు మీరీ వయసులో చేస్తే ఇలాగే అయిదారు కాళ్ళొస్తాయ్ ..." అన్నాడు అమితాబ్.

    "ఇంతకూ నీ ప్లాన్ విజయవంతం అయిందా బాబూ - నీ పాటవిని ఆ పిల్ల నిన్ను ప్రేమించిందా ?" అమాయకం నటిస్తూ అడిగాడు రామలింగం.

    "ఎవడో దొంగ రాస్కెల్ నా ప్లాన్ కాస్తా నాశనం చేశాడు గురూజీ ! ఆఫ్ కోర్స్ వాడికి తగ్గ శాస్తి జరిగిందనుకోండి ! అయినా - ఏం పర్లేదు. మరో ఉపాయం ఆలోచించాను. ఈసారి ఆమె ప్రేమని పొందుతాను."

    "నిజంగానా !"

    "కావాలంటే ఈ రోజు రాధతో కలిసి పార్కుకి వెళతాను. వచ్చి చూడండి" అన్నాడు.

    రామలింగం అతడి వైపు క్రూరంగా చూస్తూ, 'నిన్ను చెంపమీద కొట్టిన రాధ నీతో కలిసి పార్కుకా ? ఇంపాజిబుల్' అనుకున్నాడు మనసులో.


                        *    *    *


    రాధ కాలేజీ నుంచి బయటికొచ్చి ఇంటివేపు నడవసాగింది. ఆమె ఇంటికి చేరువగా వచ్చేసరికి ఓ సైకిల్ వేగంగా వచ్చి సడెన్ బ్రేకుతో ఆమె కెదురుగ్గా ఆగింది. 

    సైకిల్ మీదున్న మురళీని చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. అతను మురళీయేనా ? మురళీ లాగానే ఉన్నాడు కానీ ఆ క్రాఫూ, ఆ ఉలిపిరి కాయా. మురళీ కాదని చెప్తున్నాయ్.

    "హ్హహ్హహ్హ __ బుల్ బుల్ _ నీ బ్యూటీ చూసి తాళలేక ఆ రోజు పబ్లిగ్గా ముద్దెట్టుకున్నాను ! ఇప్పుడు క్షమార్పణ చెప్దామని వచ్చాను - సారీ డార్లింగ్ ! పాపం అనవసరంగా నా మూలాన మీ కాలేజీలో మురళీ ఏ కుర్రాడి చెంప పగిలింది. వస్తా-" సైకిల్ మీద వేగంగా పక్కనున్న చిన్న సందులోకి వెళ్ళిపోయాడతను.

    రాధ కొద్ది క్షణాలవరకూ స్థాణువై నిలబడిందక్కడే.

    పక్క సందులో కెళ్ళిన మురళీ వెంటనే క్రాఫ్ మామూలుగా దువ్వుకుని, ఉలిపిరి కాయ విసిరవతల పారేసి - షర్టు మార్చేసుకుని సైకిల్ ఎలక్ట్రిక్ పోల్ దగ్గరుంచి తాళంవేసి పరుగుతో రాధ ఇంటికి ఆపోజిట్ డైరక్షన్ నుంచి మొహం వేలాడేసుకుని నెమ్మదిగా నఫుస్తూ బయల్దేరాడు. పది అడుగులు వేసేసరికి రాధ ఎదురైంది. మురళీని చూసి ఆమె నిర్ఘాంతపోయింది. మనిషిని పోలిన మనుష్యులుంటారని కేవలం కథల్లోనే చదివింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూంది. కాస్త ఉలిపిరికాయ, క్రాఫు మాత్రమే తేడా !

    "రాధగారూ ! మీతో ఓ విషయం చెప్దామని ఇందాకటినుంచీ మీకోసం ఇక్కడ ఎదుర్చూస్తున్నాను." వినయంగా, దీనంగా అన్నాడు మురళి. మనసులో మాత్రం ఇప్పటివరకూ తనలా నటించి తనని ఏడిపించిన వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇన్నాళ్ళకి. వాడివల్ల తనకో లాభం చేకూరబోతూంది.

    "ఏమిటది ?' అని అడిగిందామె.

    "ఆ రోజు మిమ్మల్ని రోడ్ మీద ముద్దు పెట్టుకుంది నిజంగా నేను కాదండీ ! నా పోలికలున్న మరో డూప్లికేట్ గాడు."

    రాధకు అతనిని చూస్తే జాలి వేసింది. తనమీద తనకే కోపం వచ్చింది. ప్రత్యక్షంగా ఇద్దర్నీ చూసిన క్షణమే మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోగా, అతడు ఘంటసాల పాటను ఖూనీ చేశాడన్న కోపాన్ని తాత్కాలికంగా మరచిపోయింది.  

    ఆమె మౌనం చూసి మురళి నిరాశ చెందాడు.

    "మీకెలా చెప్పాలో తెలీడం లేదండీ ! మీకో విషయం తెలీదు. నేను మిమ్మల్ని చూసిన మొదటిరోజు నుంచే మిమ్మల్ని మౌనంగా నా హృదయంలో దాచుకుని ఆరాధిస్తున్నాను. మరి ఆరాధ్య దేవతను ఎవరయినా అలా నడిరోడ్డు మీద ముద్దు పెట్టుకుని - ఆమె కోపానికి గురి అవుతారా ? రాధగారూ ! నన్ను నమ్మండీ, ప్లీజ్ !"

    "........"

    "మీరు నమ్మకపోతే నాకు నిష్కృతి లేదు రాధగారూ! నిష్కృతి లేదు"

    రాధ అయోమయంగా అతని వేపు చూసింది.

    "నిష్కృతి అంటే ?"

    మురళీ ఖంగారు పడ్డాడు.

    "నిష్కృతి అంటే... అంటే... అదేనండీ- నిష్కృతి లేదు అని సినిమాల్లో ఎక్కువగా వాడుతుంటారు చూడండి! అదన్నమాట!"

    "మీ మాట మీద నాకు నమ్మకముంది..." అంది జాలిగా.

    మురళి ఆనందాన్ని మనసులోనే దాచుకున్నాడు.

    "అంటే... అంటే... ఆ రోజు... అది నేను కాదని మనస్పూర్తిగా నమ్ముతున్నారా ?"

    "అవును మురళిగారూ ! మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను దయచేసి క్షమించగలరా ?"

    "అంత మాట అనకండీ ! మన మధ్య క్షమాపణలేమిటి ? పాలు ఎక్కడన్నా నీళ్ళని క్షమాపణలు అడుగుతాయా ? సూర్యుడిని ఎండ క్షమాపణ అడుగుతుందా..." అంటూ ఇంకా ఉదాహరణలు చెప్పబోయి రాధ మొహంలో భయం ఛాయలు కనపడటం చూసి ఆపుచేశాడు. 

 Previous Page Next Page