సిద్ధేశ్వరి అలవాట్లు చాలా విచిత్రమైనవి. ఆమె తిండీ, నీరూ ముట్టదు. కేవలం గాలి భోంచేస్తారు అంతేకాదు, రోజుకి ఎనిమిది గంటలు ధ్యాన ముద్రలో వుంటారు. భక్తులు ప్రతిరోజూ ఆమె ధ్యానంలోకి వెళ్ళడాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో చూస్తారు. ఒక చిన్న ఇనుప పెట్టెలో ఆమె కూర్చుని వుండగా, ప్రధాన శిష్యుడు తలుపు వేస్తాడు. ఆమె ఆరాధ్యదైవమైన దేవీ విగ్రహం ఒళ్ళో వుంచుకుని, ఆమె లోపల ధ్యానంలోకి ప్రవేశిస్తుంది. ఎనిమిది గంటలు తరువాత భక్తుల సమక్షంలో ఆమె వున్న పెట్టె తెరవబడుతుంది. ఆమె తల చుట్టూ ఉజ్వలమైన వెలుగు ప్రకాశిస్తూ వుండగా ఆమె అందులోంచి బైటకి వస్తుంది. ఆమె కళ్ళు దీప్తితో వెలుగుతూ వుంటాయి. ఆమె మొహం దయతో ప్రకాశిస్తూ వుంటుంది. భక్తులు భక్తితో, గౌరవంతో హర్షధ్వానాలు చేస్తారు.
ఆ తర్వాత ఆమె మళ్లీ అతిథి గృహంలో కూర్చుని భక్తుల ప్రశ్నలకు జవాబులు చెప్తుంది.
ఆ గృహంలో ఒక పొడవైన టేబిల్ వుంది. దానికి ఒక చివర సింహాసనంలాంటి కుర్చీలో ఆమె కూర్చుంటుంది. వచ్చిన వ్యక్తి దూరంగా కుర్చీలో కూర్చుని, తన ప్రశ్న వ్రాస్తాడు. ఆ తర్వాత ఆ కాగితాన్ని మడిచి తన జేబులో పెట్టుకుని, పక్క గదిలో వున్న దేవీ విగ్రహం ముందు మోకరిల్లుతాడు. తరువాత వ చ్చి విశాలమైన హాలులో నిశ్శబ్దంగా కూర్చుంటాడు. తరువాత సిద్దేశ్వరీ దేవి ప్రసాదాన్ని స్వయంగా అందిస్తుంది. ఆ పళ్ళెంలో అతడి ప్రశ్నకు జవాబు వుంటుంది.
భక్తుడు ఆశ్చర్యంతో తలమునకలవుతాడు. కాదుకాదు భక్తితో సాష్టాంగపడి ప్రణమిల్లుతాడు. విభ్రాంతితో తనకొచ్చిన జవాబు చూసుకుని పరవశుడవుతాడు. తన శక్తి వంచన లేకుండా కానుకలు సమర్పించుకొంటాడు.
హేతువాద సంస్థ ప్రెసిడెంటూ , సైన్సు లెక్చరరూ అయిన ఓ డాక్టర్ ఇనపట్టె రహస్యాన్ని స్వయంగా శోధించడానికి పూనుకున్నాడు.
సిద్ధేశ్వరి కరుణించి ఆ రోజున తన గదిలోనే యోగముద్రలోకి వెళ్ళడానికి అంగీకరించారు. ఆమె బదులు అదే సమయానికి ఆ హేతువాద సంస్థాధ్యక్షుడు ఆ ఇనుప పెట్టె లాంటి విశ్రామ స్థానంలో కూర్చున్నాడు. తలుపులు వేసేయబడ్డాయి.
రెండు గంటల త్రవాత ధ్యాన ముద్రలోనే దేవి పలికింది. "ఆ అజ్ఞాన డాక్టర్ని పాపం వెలికితీయండి నాయనలారా" అని భక్తులు తలుపులు తెరిచి ఊపిరాడక కొన ప్రాణంతో వున్న ఆయన్ని బయటకీడ్చారు ఆ తరువాత ఆయన తన హేతువాదాన్ని వదిలి దేవి శిష్యకోటిలో ఒకడయ్యేడు అది వేరే సంగతి.
ఇంకా కొంత మంది వీటిని శోధించడానికి ప్రయత్నించారు గానీ సాక్షాత్ భగవత్ స్వరూపులయిన దేవిమీద ఇలా పరీక్షలు జరపడాన్ని ప్రజలు ముక్త కంఠంతో ప్రతిఘటించారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాధినేతలు కూడా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల మాట మన్నించారు.
సిద్ధేశ్వరి దేవి మహత్తు దేశం అంతటా పాకిపోయింది.
**********
అతిథి గృహంలో ఒకమ్మాయి కూర్చుని వుంది.
సిద్ధేశ్వరీ ఆలయం భక్తులతో కళకళలాడుతూంది. సదానంద చక్రవర్తి హడావుడిగా తిరుగుతున్నాడు.ఒకరి తరువాత ఒకరు లోపలికి వెళుతున్నారు.
ఆమె వంతు వచ్చింది. చక్రవర్తి దగ్గరకు రాగానే లేచి నిలబడింది. చక్రవర్తి ఆమె వైపు సాలోచనగా చూసేడు.
ఆ అమ్మాయికి ఇరవై రెండు నిండుతున్నాయి. గుండ్రటి మొహం, నిండయిన కళ్ళు కొద్దిగా పొడవు - గడ్డం మీద చిన్న నొక్కూ.
ఆమెకి చక్రవర్తి చూపు ఎందుకో నచ్చలేదు. దాన్ని పట్టించుకోకుండా లోపలికి నడిచింది. పొడవైన వరండాలో ఇద్దరూ నడుస్తుంటే, ఆమె తలతిప్పి పక్కకి చూసింది. చిన్న పిట్టగోడ కవతల భక్తులు తిరుగుతున్నారు. ఆమె చూస్తుంది అది కాదు. ఆ గ్రౌండ్ అవతల వున్న పాకకి - తాటాకుల మధ్యనుంచి అస్పష్టంగా కనబడుతున్న ఎయిర్ కండిషనర్ ని, చాలా జాగ్రత్తగా గమనిస్తే కనిపించదది.
ఆమె కెందుకో వెన్నులో చలి మొదలై వళ్ళంతా పాకింది. ఆ క్షణం అక్కణ్నుంచి పారిపోవాలన్న భావన తన ఫీలింగ్స్ తనలోనే అణచుకుని ముందుకు సాగింది. ఇద్దరూ చిన్న రూమ్ లోకి ప్రవేశించారు. అక్కడో బల్ల బల్ల మీద పుస్తకం వున్నాయి.
ఆ గదిలో సన్నగా చల్లటిగాలి ఎక్కణ్నుంచో వీస్తూంది.
"ఈ పుస్తకంలో సంతకం పెట్టండి" అన్నాడు
ఆమె వంగి పుస్తకం తెరిచింది. అవసరమైన దానికన్నా చాలా దగ్గరగా అతడు నిలబడి వుండటాన్ని ఆమె పట్టించుకోకుండా పెన్ తీసుకుంది. పేరూ, అడ్రసూ వ్రాసి, ప్రక్కనున్న ఇంకో కాలమ్ వైపు చూసింది. అందులో అంకెలేసి ఉన్నాయి. పై వాళ్ళవి.
ఆమె అనుమానం అర్ధం చేసుకున్నట్టు చక్రవర్తి అన్నాడు - "చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ సంతర్పణలు జరుగుతాయి. వాటికి భక్తుల విరాళాలే ఆధారం"
ఆమె మిగతా వాళ్ళు ఎంతెంత వేశారో చూసింది. అయిదు వేలూ ఆరువేలూ అలా వున్నాయి. ఒక స్థాయికి తగ్గిన విజిటర్స్ కి అసలక్కడ ప్రవేశం వుండదని ఆమె గ్రహించింది. తనకి ముందు తెలీదు..... ఇంత డబ్బు తీసుకురావాలని చాలా ఇన్ డైరెక్టుగా చెబుతున్నారు తన ప్రశ్నకి సమాధానం కావాలంటే ఎంత ఇవ్వాలో.
ఆమె పెన్ తో తన పేరు ఎదురుగా, రూ.216 అన్న అంకె వేసింది, వేస్తూ, వేస్తూ ఓరగా చక్రవర్తి మొహంలోకి చూసింది. అతడి అరచెయ్యి బిగుసుకుని -క్షణంలో మామూలు అయిపోయింది.