కౌగిలి నొప్పులు కవీంద్రుని మెప్పులు
అది ఇంకా రసికత చావని కాలం. శృంగారమంటే మనసుకి తనువుకి ఆరోగ్యానిచ్చే సింగారంగా భావించే మంచి కాలం. అనుభవాలు తప్పుకావు కానీ తప్పుడు అనుభవాలు ముప్పు అని తెలుసుకున్న మేలికాలం. మనిషిలోని కామ ప్రవృత్తిని రాక్షసగుణాన్ని రెచ్చగొట్టే రచనలు లేని చక్కని కాలం. వర్ణన పేరుతొ మనిషిలోని పైశాచికత్వానికి ప్రాణం పోయకుండా మనసువీణని మధురంగా శృతి చేసి అందమైన రాగాలను పలికించిన చక్కని కవుల కాలం.
పిఠాపురం రాజావారు కవితను పోషించారు కవులను పోషించారు. కృతి చెప్పి అంకితం ఇచ్చి ఆ మీదట తృప్తితో సంతృప్తితో కాలం గడిపే వాళ్ళు కవులు. నిద్దుర్లేవగానే నిత్య జీవన భృతికి వెంపర్లాడాల్సిన గతి కవులకి కళాకారులకి ఉండేవి కాదు. అందుచేత చక్కని వర్ణనలతో ఎంచక్కనైన కవిత్వాన్ని అందించే వారు. ఆ పిఠాపురానికి సమీపంలో చంద్రపాలెం అనే ఊరుంది.ఆ ఊళ్ళో కూచి మంచి వారిది పండిత కుటుంబం. బాగా చదువుకోగలిగే కావ్యాలకి వాళ్ళ ఇల్లు పుట్టిల్లు, అన్న తిమ్మకవి. తమ్ముడు జగ్గకవి. ఇద్దరూ కవిత్వంలో ఉద్దండులే! తిమ్మకవి తెనేతేటల్లా పూట నీటిలాగా మాటల మూటలు పేర్చి రసికజన మనోభిరామం వ్రాశారు. అది దేశవ్యాప్తంగా పఠన పాఠంగా ప్రచారంగా రూపొందింది.
ఆ నోటా ఆ నోటాపడి అందులో కవితా సోయగాలు ఇంపైన వర్ణనలు పసందైన భావనలు ఓ వేశ్య చెవిన బడ్డాయి. ఆ రోజుల్లో వేశ్యలు వరసకి వెలయాళ్ళేగానీ చదువుకుని భరత నాట్యాది విద్యలు అభ్యాసం చేసి వీణ మొదలైన సంగీత వాద్యాలు నేర్చి ఇంటికి వచ్చిన సరసుడైన విటుడిని ముందు మాటతో పాటతో ఆటతో బాగా సంతోషపరిచి ఆ తరువాత శారీరకానందాన్ని పంచుకునేవారు. వచ్చే విటుడై నా మనస్సు శాంతపడ్డాకే తనువు శాంతపడాలని కోరేవాడు.
విద్వజ్జన రంజని అనే వెలయాలికి అవి విన్నాక ఆ గ్రంధం చదవాలనిపించి తెప్పించి చదివాక ఇంత బాగా శృంగార రసపోషణ చేసిన కవిగారు ఎంతరసికులో ఎంత అందగాదో అనుకొని ఆ కవిగారిని చూడాలని బయలుదేరింది పిఠాపురం దాటి చంద్రపాలెం చేరుకుంది.
ఈమె వెళ్లేసరికి ఆ కవిగారు ఎలాఉన్నారు? మధ్యాహ్నం దేవలార్చన చేసి ఆ మీదట కునుకు తీసి భోజనానికి అవసరమైన విస్తళ్ళు కుట్టుకుంటున్నారు.
మధ్యాహ్నం భోజనవేళ కట్టుకున్న మడిపంచె--- రోజూ తడిపి పిండి ఆరవేయడంవల్ల ధోవతి తెలుపుపోయి నీరు కావి రంగుకి వచ్చింది. మోకాళ్ళ పైకి జరిపి ఎగదీసి కట్టుకున్నాడు. మొఖాన గంధాక్షతలు. మాసిన గడ్డంతో ఒకటి అరా నెరసిన వెండ్రుకలు పిలకముడి, భుజాల మీద షష్ఠిపంచ!
ఆ రూపంలో అతన్నలా చూడగానే రంజని మనస్సు నీరు గారిపోయింది. " ఏం బాపనయ్యవయ్యా! కవి సార్వభౌముడివని బిరుదు ఉన్నందుకైనా కాస్తా హోంబట్టు పంచె సింగారించి భుజాన కాశ్మీరు శాలువా పల్లెవాటుగా వేసుకొని ముఖాన శ్రీ చందనం దిద్దుకుంటూ తాంబూలం సేవిస్తూసత్కావితా గోష్ఠిలో ఉంటావనుకుంటే విస్తళ్ళు కుట్టుకుంటున్నావా అనుకుంది.
అయినా తమాయించుకుని నమస్కరించుకుంది.
"కవిరాజులకు నమస్కారం!"
"శుభమస్తు! శోభనమస్తు! దీవించాడు తిమ్మన
"మిమ్మల్ని చూడాలని వచ్చాను"
"వచ్చి చూశావుగా!"
'మీరసిక జనమనోభిరామం----'
'చదివావా!'
"ఆహా ఏం పద్యం.... ఏం వర్ణన"
అంటూ నాలుగయిదు పద్యాలు పరవశంతో అందులోనివి చదివింది. ఈలోగా కవిగారు విస్తరాకులు, అంటువేసే పుల్లలు, కుట్టిన విస్తళ్ళు వదిలేసి నుంచున్నారు. నడుం మీద చెయ్యేసి వింటున్నారు.
అబ్బురపడి చదివిన కవిత్వం మనసు తబ్బిబ్బయ్యే పరవశత్వం ఎదురుగా ఆజానుబాహుడు - అందగాడు అయిన కవి సార్వభౌముడు - భుజాన కాశ్మీరు శాలవా బదులు గావంచ వుంటేనేం? పట్టు పీతాంబరానికి బదులుగా పాత నీర్కాని పంచె అయితేనేం? ముఖాన కస్తూరి తిలకం బదులు గంధాక్షతలుటేనేం? మెడలో రత్న హారాల బదులు జంధ్యప్పోగుంటే ఏం? ఆనాటి వరూధుని ప్రవరుడ్ని చూచి ముచ్చట పడినట్లుగా ముచ్చట పడిపోయి ఆగలేక కవిరాజును కౌగిలించుకుంది.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు వాలకం. కాస్తంత వెర్రి యింకాస్తంత పైత్యం వున్నట్టు అర్ధం అవనే అయ్యింది. ఇదిగో ఇప్పుడు కౌగిలింత----
చప్పున ముఖం తిప్పుకున్నాడు. కవి సార్వభౌముడు. ఊసురుమనింది రంజిని ఊసురుమన్న మనస్సు కస్సుమంది. కవిత్వంగా చతురలలోన నెంతయును జాణసటంచును, నెంతయును నేను గౌగిలించితి, ఇటు మారుమో మిడగ చెల్లునెయో రసికా గ్రగణ్య!"
ఏమయ్యా కవీ! రసికుడివే! జాణవే! చతురులలో చతురుడవని పేరుపొందావే! నే వచ్చి మెచ్చి యిచ్చిన కౌగిలికి నొచ్చినట్లుగా పెడమొఖం పెడతావేం? అంది పద్యం అయ్యాక గద్యంలో.
ముసి ముసి నవ్వులు నవ్వాడు తిమ్మ కవీంద్రుడు!
అయ్యో పాపం! వరూధినిలాగే మొఖం వేలాడేశావ్! ఇంతకింతకు నచ్చి వచ్చినందుకు మెచ్చి కౌగిట్లో గుచ్చినందుకు మారు మొఖమయ్యానని కోపమా? ఇంతకు నేను అటు మొగమయ్యింది ఎందుకో తెలుసా?
"అద్భుత మగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీ కుచద్విత యము ఱొమ్మున నాటి వీపున చూసె నటంచు చూచితిన్."
"బాలా! బేలవు కావద్దు! బంగారు రంగారు బొంగరాల్లా అన్ని విధాల అండగా ఉన్న నీ చనుబోయి బిరుసెక్కి పదునెక్కి నిక్కినాగుండెను దూసుకొని వెళ్ళాయి. అయినా అంతటితో ఆగకుండా వీపుగుండా వెళ్ళుకుని వచ్చాయేమోనని ఆ గుచ్చుకున్న వైఖరికి అదిరిపోయి వెనుదిరిగి చూశాను అన్నాడు.
అంతే!
"భళిరా సత్కవి సార్వభౌమ! కూచి మంచి తిమ్మ! నిజంగా జాణవే!" అంటూ సిగ్గులమొగ్గ అయ్యింది రంజని.
----*----