Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 15

                                       అందని ద్రాక్ష "చూపులు"

    ముదురాకు రాలేటి ముదిమినాళులలోన తొడిగేటి చివురాకు పడుచు పొద్దులలోన ఆకునైన కానుగా---

    అయినచో
    సోకేది చిరుగాలి నన్ను
    మెల్లతాకేది మిణిగురుల హొన్ను
   
    మొగిలు కన్నెల గుంపు ధగధగ మని మెరిసేటి చిగురు వెన్నెల కావి సొనిసు సంజెలలోన మొగిలునైనా కానుగా---

    అయినచో
    ఎగిరి ఉందును మింట కొనల

    మెల్ల తగిలి యుందును వెల్గు సొనల తొలి ప్రేమ రుచి చూచు నెల ప్రాయపుంగన్నె తలిరు మెత్తని నీలవలపులో ఊహనైనా కానుకగా

    అయినచో
    వలచేది నను చిన్న చూపు
    మెల్ల కలచేది చివురాకు తూపు

    ఇది సుమారు 60 ఏళ్ల క్రితం 1926 లో విశ్వనాధ వ్రాసిన చిన్న తలపు అనే గేయం మెత్తమెత్తని మాటలతో పరమ సుకుమారమైన భావనలతో గేయాలు అల్లారు విశ్వనాధ కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి ఆ కోవలోనివే. ఎన్నో ఖండికలున్నాయి. ఎన్నో ముక్తకాలున్నాయి. పంచవింశతి అనే సంకలనంలో విశ్వనాధ వారి చమత్కారం కవితా ధోరణి ఎంత గొప్పగా ఉంటాయో చూడొచ్చు.

    ఆకాశంలో తెల్లమబ్బు అనే గేయం 1925లో సాహితిలో
    అచ్చయింది.
    నీవు నేను కూడి
    నింగి లోనికి పోయి
    నీలిమబ్బుల తేలి
    చందమామను చూసి చానా! నవ్వామె
    చందమామ నవ్వె చానా నను చూచి
    చందమామ నవ్వె చానా నిను చూచి
    తిరిగి రాబోయామె
    తెరవ నీవంతలో
    తెల్ల మబ్బయ్యావే
    చల్లనైనా దొలు చానా! నవ్వానె (చందమామా)
    అంతలోనే చూడ ఆకాశమైనావే
    ఆకాశమున మబ్బువై నీవు తేలుచూ
    చందమామను చూచి చానా నవ్వామే
    ఇలాంటి గేయాలే కాదు మెత్తని పద్యాలు రాశారు.
    కల్పవృక్షంలో అరణ్య కాండంలో - సీతను ఎత్తు కెడుతూ
    రావణు ఉంటాడు
    ఐపాన వాలు తెలియని
    నా పోయిన తెన్ను తెలియునా తనికిన్
    వాపోయిన వాపోతలు
    ఏ పుట్టం పుట్టబోవు నితని కథాశుల్

   
    ఐపు ఆనవాలు తెలియకుండా పోతున్న నాదారి అతనికి తెలుస్తుందా! నీవు తప్పి పోయావని అతను వాపోయే వాపోతాలు - ఏడ్పులు - ఏ పుట్టలో కధలుగా పుడతాయో! అంటాడు. ఎంత గొప్ప చమత్కారం ఉందో మనసుకే తెలుస్తుంది.

    ఆయనకి మనమన్నా, మనభాషన్నా, మన సంస్కృతి అన్నా పట్టపగ్గాలు లేని భావావేశం పుట్టుకొస్తుంది. ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ అప్పయ్య దీక్షితులలాగే -

    బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి
        ఆంధ్రుడై ధాత్రిలో నవతరించు
    బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి
        ఆంధ్రభాషను మాటలాడు చుండు
    బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి
        ఆంధ్రత్వమున నిద్దియని యెరుంగు
    బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి
        ఆంధ్రీ మహామూర్తి నైక్యమొందు

    వట్టి నడమంతరపు సిరి వట్టినట్టి
    బాసలంగని మతి భ్రాంతి పడకు మోయి
    ఆంధ్రుడని నంత నాత్మతత్త్వ
    మభిలము నెరుంగుటన్నది యంచు తెలియు

    అంత రసావేశంగానే చెప్పిన ఆంధ్ర పౌరుషం చదివేందుకు కాస్తంత తీరిక, అర్ధ చేసుకునే ఓపిక ఉంటే క్రమక్రమంగా కిన్నెరసాని పాటలతో శశి దూతం ప్రారంభించి కల్పవృక్షం దాకా సాగిపోవచ్చు.

    అమృతం గూడుగట్టిన దొరలాంటి మధుర కవిత్వమును ఆస్వాదించవచ్చును. కావ్యరూపమైన విశ్వనాధ శారదనే కాక నవలా రూపంగా అంతరాత్మ అయి ఏకవీరగా రూపుదిద్దుకొని చెలియలి కట్టను దాటుకొని వేయి పడగలుగా విస్తరిల్లిన విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు పురాణ వైర గ్రంధాలు దాకా ఎలా మ్రోయు తుమ్మెదగా ప్రతిధ్వనించిందో చూడవచ్చు. స్వర్గానికి నిచ్చెనలు వేయవచ్చు కానీ - లోకంలో అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని ఓ సామెత ఉంది. మనకు అందుబాటులో లేనిది అందుకోడానికి మన శక్తి చాలక అది ఒప్పుకోవడం ఇష్టంలేక ఆ వస్తువునే కించపరచడం బతక నేర్చిన వాళ్ళ రీతి. ఆ ధోరణిని చూపేదే ఈ సామెత.

    కవిత్వం ఆస్వాదించడానికి పాండిత్యం కంటే ముఖ్యమైంది రసవంతమయిన మనస్సు. అది లేకపోవడం వలన జీవివంతమయిన కవిత్వం అదృశ్యమౌతూనే ఉంది. ప్రభుత్వం అంతరించి పోయే అరుదైన జంతుజలాన్ని పక్షి సంతతిని జాతికోసం అంటూ జూలో ఉంచి కాపాడుతుంది. ఏ జాతి చైతన్యానికి మూల భూతమైన కవిత్వ తత్వాన్ని రక్షించే కవుల్ని పండితుల్ని వారి రచనల్ని గురించి పట్టించుకోడం లేదు.
   
         విశ్వనాధ సత్యనారాయణగారు ఒకచోట అంటారు
    తొలి నాళుల పద్యార్ధము
    తెలియనిచో పాఠకునిది తెలియమి ఈనా
    ళుల వ్రాసిన కవి దోషము
    కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడుచున్

    అలా ఐపోయింది పరిస్థితి. విశ్వనాధ వారిది పరమ సుకుమారమైన శైలి. ఆయన్ని చదవలేక పాషాణ పాకం అనడం పైన చెప్పిన లాటిదే.

                                                                              ----*----
 

 Previous Page Next Page