Previous Page Next Page 
మౌనం పేజి 16

    "ఈ రాత్రి మీ యింట్లో  తలదాచుకుని రేపు  వెళ్ళిపోతాను."   

    "ఎక్కడికి?"

    "వైజాగ్"

    "ఎలా వెళతారు?"

    "అంటే!"

    "ఐమీన్....మీ పర్సనల్  సెక్యూరిటీ  గార్డ్స్ వున్నారా?"

    "లేరు"

    "దెన్....హౌకెన్  యుగో"

    "నా ప్రోగ్రాంకి  యింకా  మూడు  రోజులే  గడువుంది"

    "బట్....మీ లైఫ్  డేంజర్ లో వుంది."

    "ఫరవాలేదు"

    "వాట్ యుటాక్ ఈజ్ రబ్బిష్" అన్నాడు  అసహనంగా.

    ఆమె మాట్లాడలేదు.

    "ఇక్కడి  నుంచి  వెళ్ళటం....వెళ్ళకపోవటం  అన్నది  మీ చేతులలో  లేదు. మీకు ఎటువంటి ప్రమాదం రాదు  అన్న నమ్మిక  తరువాతే  మిమ్మల్ని  పంపేది."

    "బట్...." ఆమె ఏదో అనబోయింది.

    "అదిగో  ఆ కనిపించేదే  మా యిల్లు" ఆమె మాట  విననివాడిలా  అన్నాడు కౌశిక్.

    ఇంక ఆమె ఏమీ మాట్లాడలేదు.

    మరో యాభై గజాలు  ముందుకు వెళ్ళి ఆగింది  కారు.

    ఆ గేటును  సమీపిస్తుండగానే  పరిగెత్తుకుంటూ  వచ్చి డోరు తెరిచాడు  గుర్ఖా.

    కారుని  గేటులోకి  టర్న్ చేసి  పోర్టికోలో  ఆపాడు కౌశిక్.

    వచ్చి డోరు  తెరిచాడు  వాచ్ మాన్.

    కారులోంచి  దిగుతూ  అప్రయత్నంగా  వాచ్ లో టైం  చూసుకుందామె. పదిన్నర  అవుతోంది. చుట్టూ ఒకసారి  కలయచూసింది.

    అదొక విశాలమైన భవనం. ముందువైపు  పెద్ద  గార్డెన్, లాన్స్.

    అరవై డెబ్భై ఏళ్ళ క్రిందటి  కన్ స్ట్రక్షన్స్  ఎలా వుంటాయో అలా వుంది.

    దాదాపు  పదడుగుల  ఎత్తు ద్వారాలు....పెద్ద  పెద్ద కిటికీలు.

    పురాతన భవనానికి  మంచి రంగులు  వేసి కొత్తగా  తయారుచేశారో, లేక కొత్తగా  కట్టిన బిల్డింగ్ నే  అటువంటి షేప్ లో కట్టారో  అర్ధం  కాలేదు ఆమెకు.

    రంగురంగుల  లైట్లతో  దేదీప్యమానంగా  వెలిగిపోతోంది  ఆ భవంతి.

    ఒకింత  సంశయంగా  నిలబడింది  ఆమె.

    "కమాన్! నథింగ్ టు  హెజిటేట్"

    మౌనంగా  అతన్ని  అనుసరించిందామె.

    ఇంటిని  గ్రౌండ్ లెవెల్ నుంచి  చాలా ఎత్తులో  కట్టారు. పదకొండు మెట్లు ఎక్కిన తరువాత  విశాలమయిన  హాలులోకి  ప్రవేశించారు.

    సుమారు  ఇరవై  ఐదు అడుగుల  వెడల్పు ,ముప్పై  అడుగుల  పొడవు వుండచ్చు. పెద్ద పెద్ద సోఫాలు....గోడలకు  ఓల్డ్ రోమన్ పెయింటింగ్స్ సీలింగ్ నుండి  వేలాడుతున్న పెద్ద  షాండ్లియార్ అదొక  చిన్న మ్యూజియం ఏమో! అన్నంత  ఎక్కువగా  వున్నాయి  ఆ వస్తువులన్ని.

    "మీ ఇంట్లో  ఎవరెవరుంటారు?" హాలులో  కూడా  ఇద్దరు నౌఖర్లు మాత్రమే కనబడటంతో  అడిగింది.

    ఆమె మాట  పూర్తయ్యేటంతలో  లోపలి  గదిలో నుంచి  వచ్చింది  ఒక వృద్ధురాలు. సుమారు డెబ్భై ఐదు సంవత్సరాలపైనే  వుండచ్చు వయస్సు.

    తెల్లని జుట్టు, పచ్చని  పసిమి రంగులో ముడతలు  పడిన  శరీరం.

    కళ్ళజోడులోంచి  సంజుని  పరీక్షగా  చూసింది ఆమె.

    ఆ చూపులో  "ఎవరామె?" అన్న ప్రశ్న వుంది.

    "మా నాయనమ్మ" చెప్పాడు కౌశిక్.

    వినయంగా  చేతులు జోడించింది సంజు.

    "ఈమె  ఎవరో  నాకు చెప్పలేదేమి?" ఉత్కంఠత ఆపుకోలేక అడిగింది ఆవిడ.

    కారణం....

    కౌశిక్ ఇంతవరకు  అమ్మాయిలతో  మాట్లాడటం  చూడలేదు .అతనికి  గర్ల్ ఫ్రెండ్స్  కూడా లేదు .కనీసం  ఏ అమ్మాయి ఫోన్ కూడా చేయదు. అటువంటిది  రాత్రివేళ  ఇంటికే  తిన్నగా వచ్చిన  ఈమె  ఎవరా? అన్న సందేహం.

    "ఈమె  గురించి  చెప్పాలంటే  చాలా టైం పడుతుంది. రేపు పొద్దున్న తీరిగ్గా  చెబుతా!" అని_"మీరు పదండి....మేడ మీద గెస్ట్ రూమ్ వుంది. మీరు అక్కడ వుండవచ్చు" అంటూ ముందుకు నడిచాడు.

    ఆవిడకి  ఏం సమాధానం  చెప్పకుండా  అలా ముందుకు వెళ్ళిపోవటం ఎంబరాసింగ్ గా అనిపించింది.

    మేడ మెట్లు  ఎక్కుతుండగా అన్నాడు  అతను. "ఈ ఇంట్లో  డాడీ, నాయనమ్మ, నేను మాత్రమే  వుంటాము. డాడీ ఈపాటికి  నిద్రపోయి  వుంటారు. ఆయన నిద్ర టైమ్ పదిగంటలకే. ఆయన  ఎక్స్ పోర్టు  బిజినెస్ చేస్తారు" చెబుతూ గెస్ట్ రూమ్ లోకి వచ్చాడు.

    ఆ గదిలోకి రాగానే  ఎదురుగా  గోడకి  వున్న  ఒక ఫోటో  చూసి వులిక్కిపడిందామె.

    అది లైఫ్ సైజ్ కలర్ ఫోటో.

    "ఆ ఫోటో....ఐ మీన్  ఆమె....ఎవరు?" అడిగిందామె.

    "నా చెల్లెలు...." చెప్పాడు కౌశిక్.

    అదిరిపడిందామె  ఆ సమాధానానికి. ఒక్కక్షణం  గుండె  కొట్టుకోవడం  మానేసింది  ఆమెకి.

    బ్లూ బర్బ్ ఆ గదిలో డిమ్ గా వెలుగుతోంది.

    తెల్లని  గదిగోడలు  కూడా  ఆ వెలుగుకు  లేత  నీలిరంగులో  కనిపిస్తున్నాయి.

    బెడ్ మీద వెల్లకిలా  పడుకొని  తలక్రింద కుడిచేయి  పెట్టుకుంది  సంజు.

    ఆమె కళ్ళు  తదేకంగా  అక్కడి  గోడమీద  వున్న  ఫోటోనే  చూస్తున్నాయి.

    అందంగా  నవ్వుతున్నట్లుంది  ఆ ఫోటో.

    ఆమె__కౌశిక్  చెల్లెలు!

    ఆశ్చర్యపోయింది ఆ విషయం  విన్నప్పుడు.

    కాదు....షాక్ కి లోనయింది.

    ఆ రోజున  జరిగిన  సంఘటనలు అన్ని వింతగా  అనిపిస్తున్నాయి.

    తను షాపింగ్ కి వెళ్ళటం....అక్కడ కొందరు వ్యక్తులు  తనని చంపాలని ప్రయత్నించడం....అదే సమయంలో  కౌశిక్  రావటం....తనని రక్షించడం....అతనితో  కలిసి అతని యింటికి రావటం....అక్కడ  ఆ ఫోటో చూడటం అంతా  నాటకీయంగా వుంది.

    రెండు సంఘటనలు  ఆమెను మానసికంగా  అస్థయిర్యపరుస్తున్నాయి!

    ఒకటి తనని చంపాలని ఎవరో ప్రయత్నించడం....

    రెండోది  ఆ ఫోటో....

    ఆమెకు శత్రువులు  లేరు. ఉండే  అవకాశం, ఆస్కారం  కూడా లేదు....కానీ ఎవరో  తనని చంపాలని  పట్టువదలకుండా  ప్రయత్నించుతున్నారు.

    సంజు  మీద హత్యా ప్రయత్నం  న్యూయార్క్ లో  వుండగానే మొదలయిందనవచ్చు.

    ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని  ఆమె ఎవరినీ  పల్లెత్తు  మాట  కూడా  అనలేదు. మరి  ఎవరికుంటుందా  కక్ష....

    ఆమెకు  శత్రువులు  ఉన్నారా అన్న విషయాన్ని  తరచి, తరచి వివిధ కోణాలలో ప్రశ్నించాడు కౌశిక్.

    "నాకెవరూ  శత్రువులు  లేరు" అన్న ఆమె మాటలు అతనికి  నమ్మశక్యంగా అనిపించలేదు.

    అతను  ఆమెను  ఏ మాత్రం  నమ్మటం లేదు  అనే విషయం  ఆమెకు స్పష్టంగా అర్ధమవుతోంది. అలాగని  ఆమె పట్ల  ఏ మాత్రమూ  అమర్యాదగా  ప్రవర్తించలేదు.

    ఇంటికి రాగానే  నాయనమ్మకు పరిచయం చేశాడు.

    స్నానం చేయమన్నారు. డ్రస్ ఛేంజ్ చేసుకోమన్నారు. కొత్త డ్రస్ యిచ్చారు. కౌశిక్ తో కలిసి  డిన్నరు  కూడా  చేసింది. అతని  నాయనమ్మే స్వయంగా  వడ్డించింది. చాలా ఏళ్ళ  తర్వాత  ఆంధ్రా  భోజనం  తిందామె.

    మరో పరిస్థితుల్లో  అయితే  ఆ భోజనంలోని  రుచులు తప్పక ఎంజాయ్ చేసేదే!

    కానీ....

    ఏ మాత్రం  పరిచయంలేని  వ్యక్తుల ఇంట్లో  భోజనం....అస్తవ్యస్తంగా వున్న మానసిక స్థితి....

    ఆ తరువాత  ఆమె పడుకోవటానికి  కౌశిక్  చెల్లెలి రూమ్  యిచ్చారు.

    అది మరింత  యిబ్బందిగా  వుంది.

    కళ్ళు తెరిచి  చూస్తే చాలు....అదే  ఫోటో కనిపిస్తోంది.

    గదిలో  ఏ.సి. ఆన్ చేసి వున్నప్పటికీ....ఏదో ఉక్కగానే  వుంది  ఆమెకు.

    ఎదురుగా  ఉన్న  క్లాక్ లో  టైం రెండు  దాటింది.

    లాభంలేదు. నిద్ర  రావటంలేదు. బెడ్ మీద  నుండి లేచి క్రిందికి  దిగింది ఆమె.

    రెండు నిమిషాలు  ఇటూ....అటూ  పచార్లు  చేసి  కిటికీ దగ్గరకు  నడిచింది.

    పౌర్ణమిరాత్రి  అయి వుండాలి....

    పిండారబోసినట్లున్న  వెన్నెల  గది  అద్దాల్లోంచి  లోపలికి  పడుతోంది.

    ఆ గదిని  ఆనుకొని పెద్ద వరండా  వుంది.

    కాసేపు  ఆ వరండాలో కూర్చుంటే....నిద్ర రావచ్చు  అనుకొని  డోరు తెరుచుకొని  వరండాలోకి  వచ్చింది.

    చెప్పులు లేని ఆమె  కాళ్ళకు  చల్లగా  తగిలింగి  నేల.

    బాల్కనీ  రెయిలింగ్స్ ని సమీపించిందామె.

    నిశ్శబ్దంగా  నిద్రపోతోంది  నగరం.

    మంచు కురిసినట్లుంది....ఆ రెయిలింగ్స్  మీద తడి  తగిలింది.

    "ఏమిటి? ఇంకా  మీరు పడుకోలేదా?"

 Previous Page Next Page