Previous Page Next Page 
మౌనం పేజి 15

    ఒకింత  అసహనంగా  ఆ వ్యక్తి  వైపు  చూశాడు  కౌశిక్. "ఈ ప్రశ్న నిన్ను అడగలేదు కదా! నువ్వెందుకు  సమాధానం  చెబుతావు?" అన్న అర్ధం కనిపించింది అతని కళ్ళలో.

    "నేను ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో వాళ్ళు వచ్చారు" నిలబడే  ఓపిక  లేనట్లుగా  అక్కడే వున్న స్టూలుమీద కూర్చుందామె.

    ఒకసారి చుట్టూ పరికించి  చూశాడు కౌశిక్.

    బుల్లెట్  దెబ్బలకి  రెండు అద్దాలు పగిలాయి.

    కార్పెట్  మీద ఒకచోట రక్తపు  మరకలు  వున్నాయి.

    ఆ వ్యక్తి  కాలికి  తూటా  తగిలినప్పుడు కారిన రక్తం  అయి వుండాలి అనుకున్నాడు దృష్టిని  తిరిగి ఆమెవైపు  మళ్ళించాడు.

    "మీకు ఆ వ్యక్తులు తెలుసా?" అడిగాడు.

    తెలియదన్నట్లు  తల అడ్డంగా  వూపిందామె.

    తెల్లముఖం  వేశారు  ఆ సమాధానానికి  అందరూ.

    ఇంక సంభాషణ  వాళ్ళందరిముందు  పొడిగించడం  మంచిది కాదనిపించింది  కౌశిక్ కి.

    "ఇట్సాల్ రైట్....మీరు నాతోపాటు  రండి. రిపోర్టు  యివ్వాలి."

    ఆమె సరేనన్నట్లు  రిపోర్టు  యిచ్చింది.

    అదే క్షణంలో  షాపు ఓనరు  మెదడు చురుకుగా  పనిచేసింది.


    త్వరగా  ఆమెను  సమీపించి  "ఆగండి  మేడం! మీరు అతనితో  వెళ్ళద్దు" అన్నాడు ఒకింత  గంభీరంగా.

    "ఎందుకు?" అన్నట్లుగా చూశాడు  కౌశిక్.

    "మేడం! ఈ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. తనతో  రమ్మంటున్నాడు అంటే....తెలియని మనిషితో కలిసి వెళ్ళటం  మీకు ప్రమాదం" తన మనస్సులోని  భయాన్ని నిర్మొహమాటంగా  చెప్పేశాడు  షాప్ ఓనరు.

    ఒళ్ళు మండిపోయింది  కౌశిక్ కి. పోలీస్ అధికారితో  కలిసి  వెళ్ళటానికి  భయమేమిటి? తప్పేమిటి? అనిపించింది. షాప్ ఓనరు  చాలా అసభ్యంగా  మాట్లాడుతున్నాడనిపించింది. అదే క్షణంలో  గుర్తుకువచ్చింది. తను పోలీస్ యూనిఫాంలో  లేడు. మామూలు  ప్యాంట్ ,టీషర్ట్ లో వున్నాడు. తనకి తను పోలీస్ అధికారి  అనుకుంటే  సరిపోతుందా! అది ఎదుటి వ్యక్తులకి  కూడా తెలియాలి కదా!

    "అయన ఎవరో నాకు  తెలుసు."

    తెల్లముఖం  వేశారు  అందరూ ఆ మాట విని.

    అతని కనుబొమ్మలు  ముడిపడ్డాయి. ఒకింత  పరీక్షగా  ఆమెను  చూశాడు.

    "ఎస్....యువార్ ఎ పోలీస్ ఆఫీసర్. ఆ విషయం నాకు తెలుసు. ఒక పోలీస్ అధికారితో  రావటానికి  నాకు అభ్యంతరం  లేదు" అందామె.

    ఇంకా నమ్మకం లేనట్లు చూస్తున్న  షాపు  ఓనరుని చూసి  జేబులోంచి  ఐడెంటిటీ కార్డు  చూపించాడు కౌశిక్.

    కౌశిక్  చూపించిన  ఐడెంటిటీ కార్డువైపు చూడటానికి  మొహమాట పడ్డాడు అతను.

    "అవునవును! మీరు పోలీస్  డిపార్ట్ మెంటు  మనిషి  అనే అనుకున్నాను సార్! లేకపోతే  ఆ దుండగుల  నుండి  రక్షించేటంత  సాహసం  ఎవరు చేస్తారు? మాకు పునర్జన్మ  యిచ్చారు సార్!" మరోసారి  నమస్కారం  పెట్టేశాడు  ఓనరు.

    ఆ వ్నుకనే కౌశిక్ కి నమస్కారం  పెట్టారు అందరూ.

    చాలా  యిబ్బందిగా  అనిపించింది  అతనికి.
   

                     *    *    *    *


    "ప్లీజ్ కమ్ విత్ మి" అని షట్టర్  వైపు నడిచాడు కౌశిక్.

    "సార్....బయట....ఆ  మనుషులు....వుంటారేమో! షట్టర్  ఎత్తగానే  ఎటాక్  చేస్తారేమో!" అనే సంశయం వ్యక్తం  చేశాడు  ఓనరు.

    తల తిప్పి  వెనుకకు చూసి నవ్వాడు కౌశిక్. ఆ నవ్వులో  మీకేమీ  అవ్వదు. నతింగ్ టు వర్రీ అన్న అర్ధం కనిపించింది.       

    షట్టర్ ని సమీపించి  ముందుకు  వంగి రెండు చేతులతో  షట్టర్ లిఫ్ట్ చేశాడు.

    పెద్దగా  శబ్దం  చేస్తూ  తెరుచుకుంది షట్టర్.

    అప్రయత్నంగా  అతని చేయి రివాల్వర్ మీదికి  వెళ్ళింది.

    ఓసారి  ఇటూ అటూ  చూసి  బయటకు  అడుగు పెట్టాడు.

    ఆ ప్రదేశం  దాదాపు  ఖాళీగా  వుంది.

    షాప్స్ అన్నీ మూతబడ్డాయి. మహా అయితే  పదిమంది  మించి రోడ్డు మీద లేరు.

    "రండి" అన్నట్లుగా  సైగచేసి ముందుకు కదిలాడు.

    సుమారు  వందగజాల  దూరంలో  ఆగి  వుంది  థౌంజండ్ సి.సి.మారుతీ కారు.

    ఆ కారుని  సమీపించి  డోరు  లాక్  ఓపెన్ చేసి కారులో కూర్చుని ఇవతలి డోరు  తెరిచాడు.

    నిశ్శబ్దంగా  వచ్చి కారులో కూర్చుందామె.

    చిన్న జర్క్ తో స్టార్ట్ అయి దూసుకుపోసాగింది  కారు.

    రకరకాల ఆలోచనలు కౌశిక్  మెదడులో  ముసురుకోసాగాయి.

    ఎవరీమె? ఈమె  వెంటపడే  ఆ వ్యక్తులు  ఎవరు? ఈమెకు  నేను ఎలా తెలుసు? ఇన్ని రకాలుగా ఆలోచించే  బదులుగా  ఆమెనే  అడిగితే  సందేహం నివృత్తి  అవుతుంది కదా! అనుకున్నాడు.

    తల కొంచెం  ప్రక్కకు  తిప్పి  ఆమెవైపు  చూశాడు.

    అదే సమయంలో  ఆమె కూడా  ఇటుగా  చూసింది.

    "ఆర్ యు టేకింగ్ మి టు పోలీస్ స్టేషన్?" వారిద్దరి  మధ్య నిశ్శబ్దాన్ని  బ్రేక్ చేస్తూ  అడిగిందామె.

    ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు  అతను.

    "ముందుగా  మనం  ఒకళ్ళని ఒకరికి పరిచయం  చేసుకుంటే  బావుంటుందేమో! ఐ మీన్.... మీరెవరు? ఆ వ్యక్తులు  మిమ్మల్ని ఎందుకు  చంపాలనుకుంటున్నారు? మీరు నన్ను  ఎక్కడ చూశారు? హౌ డూయూనో మి?"

    వెనుకకు ఆనుకొని  వున్న  ఆమె ముందుకు  వంగింది.

    ఆమె దృష్టి రోడ్డు మీదనే వుంది.

    "నేను....నా గురించి  చెబుతాను. బట్....నన్ను యిప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళనని, రోజుల తరబడి  యీ వూరిలోనే  ఆపనని మాట యివ్వాలి. ఐకెన్  టెల్ ఎబౌట్ మి ఓన్లీ_ఆన్ దట్ డిషన్."

    ఈ కండిషన్  మరీ వింతగా  అనిపించిందతనికి.

    "అయామ్ వెరీసారీ! మీకు  అటువంటి  వాగ్ధానాలు  ఏమీ చేయను. ఆపదలో వున్న ఓ మనిషి ప్రాణం రక్షించడం  ఒక పోలీస్ అధికారిగా  నా డ్యూటీ. మీ ప్రాణానికి ఎటువంటి  ప్రమాదం  లేదు అని నాకు ఖచ్చితంగా అనిపించినప్పుడే  మిమ్మల్ని స్వేచ్ఛగా  వదలగలను. మీ గురించిన వివరాలు  నాకు చెప్పటం  చాలా అవసరం."

    ఆమె మాట్లాడలేదు.

    "కనీసం  మీ ప్రాణాన్ని  కాపాడినందుకయినా  కృతజ్ఞతగా  మీ గురించి  మీరు చెప్పరా!"

    ఈ మాట  ఆమె మీద  అమోఘంగా  పని చేసింది.   

    చిన్నగా గొంతు  సవరించుకుందామె.

    "నా పేరు  సంజన. అయామ్ పాప్యులర్లీ  నోన్ ఏజ్ సంజు."

    "పాప్యులర్లీ  అంటున్నారు. అంటే....మీరు....ఏం చేస్తారు?"   

    "సింగర్"

    "సింగర్! అంటే....సంజు....సింగర్....ఎక్కడో  విన్నట్లుందా పేరు" స్వగతాన్ని  పైకి  అన్నట్లుగా  అన్నాడు అతను.

    "మీరు  ఈ వూరులోనే వుంటారా?" తిరిగి తనే అడిగాడు. కారుని  రైట్ టర్న్  తిప్పుతూ.

    "నేను....ఇంగ్లండ్  నుంచి వచ్చాను. వివరంగా చెప్పాలంటే  నేటివ్ ప్లేస్ వైజాగ్. నాకు తొమ్మిదేళ్ళ  వయస్సు వచ్చేవరకు ఇక్కడే  వున్నాను. తరువాత మా మదర్ తో కలిసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాను. అక్కడ పాప్ సింగర్ గా పేరు తెచ్చుకున్నాను. నాకు మాతృదేశం  అంటే అభిమానం. అందుకే  ఇక్కడ ప్రోగ్రాం  ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. మరో మూడు రోజుల్లో  వైజాగ్ లో నా ప్రోగ్రాం  వుంది."

    ఆమె చెప్పిన   మాటలు  అతనిలో  ఆసక్తిని  రేకెత్తించాయి.

    అతనికి మ్యూజిక్ మీద, పాప్ సింగర్స్ మీద సరి అయిన  పరిజ్ఞానం లేదు. అందువల్ల ఆమె పేరు ఎక్కడో విన్నట్లు  అనిపిస్తోంది కానీ....నిర్దిష్టంగా  ఎవరో తెలియటం లేదు.

    "నేను న్యూయార్క్ లో ప్రోగ్రాం  యిచ్చి ఇండియాకు  బయలుదేరాను. బయలుదేరిన  క్షణం నుండి  ఒక వ్యక్తి నన్ను  అనుసరిస్తూనే వచ్చాడు. ఇందాక  షాప్ లో వుండగా  నీగ్రోలా  ఒక వ్యక్తి  నన్ను చంపాలని  వచ్చాడు  గుర్తుందా మీకు?"

    ఉందన్నట్లు  తల ఆడించాడు  కౌశిక్.

    "ఇంతకీ....నేను మీకు ఎక్కడ కనిపించానో  చెప్పలేదు"

    "అదే చెప్పబోతున్నాను. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిన్న నేను దిగినప్పుడు, ఆ వ్యక్తి  కూడా నాతోపాటు  దిగాడు. ఇక్కడ మరో వ్యక్తి కూడా అతనికి తోడయ్యాడు. ఇద్దరూ  కలిసి నన్ను చంపాలని  ఎయిర్ పోర్టు దగ్గర ప్రయత్నించారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని  చూశాను. జీపులో  కూర్చోబోతున్న  మిమ్మల్ని  సహాయం  కోసం  పిలిచాను. మీరు చూడలేదు. అదృష్టవశాత్తు  చివరి క్షణంలో  ఒక టాక్సీ డ్రైవర్ నన్ను  సేవ్ చేశాడు" అని జరిగింది చెప్పింది.

    "మిమ్మల్ని ఛేజ్  చేస్తున్న  ఆ వ్యక్తుల  గురించి చెప్పగలరా?"

    "ఐ డోంట్ నో ఎనీబడీ....నాకు  వాళ్ళెవరో  తెలియదు. ఎందుకు ఫాలో  అవుతున్నారో తెలియదు."   

    ఆ మాట  నమ్మశక్యంగా  అనిపించలేదు  కౌశిక్ కి.

    కారు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతోంది.

    క్రిందగా  ఒక ట్రైన్ వెళుతోంది. ఆ ట్రైన్  లైట్ రైలు  పట్టాలమీద పడి అవి  మెరుస్తున్నాయి.

    "ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళుతున్నారా?"

    కాదన్నట్లు  తల వూపాడు.

    "దెన్?"

    "టు మై హౌస్.మా ఇంట్లో  వుంటారా?"

 Previous Page Next Page