Previous Page Next Page 
మౌనం పేజి 17

    చిక్కని  నిశ్శబ్దంలో....హఠాత్తుగా  ఓ గంభీరమైన  గొంతు వినిపించడంతో  వులిక్కిపడి  గిర్రున  వెనక్కి  తిరిగిందామె.

    ఎదురుగా  నిలబడి  వున్నాడు కౌశిక్.

    ఆ క్షణంలో అతని అక్కడికి వస్తాడని  ఊహించని  ఆమెకు సర్దుకొని  మామూలు  అవటానికి  కొద్ది సెకన్లు  పట్టింది.

    "మీరు....ఇక్కడ వున్నారేమిటి?" ఎదురు ప్రశ్నించింది  ఆమె.

    చిన్నగా నవ్వి  దగ్గరకు వచ్చాడు.

    "మీకు....మా ఇల్లు....ఈ పరిసరాలు  క్రొత్త కదా! నిద్ర పడుతుందో, పట్టదో....ఏమయినా అనీజీగా  ఫీలవుతున్నారేమో  తెలుసుకుందామని  వచ్చాను. అంతే! నిజానికి నాకూ  నిద్రపట్టలేదు" అన్నాడు అక్కడున్న చైర్లో కూర్చుంటూ.

    కొద్ది క్షణాలు మౌనంగా నిలబడిందామె.

    చల్లని గాలి  రివ్వున  వీచింది.

    ఆ గాలికి  అక్కడి  కొబ్బరిచెట్లు  ఆకులు  గలగలలాడాయి.

    ఒకింత  చలిగా  అనిపించిందతనికి.

    ఆమెకు  అటువంటి  అనుభూతి  లేదు. పైగా....చాలా  హాయిగా  అనిపించింది.

    ఆమె కళ్ళ ముందు  ఇంకా ఆ ఫోటోనే  కదలాడుతోంది.

    "మీ....చెల్లెలు....ఎక్కడ....వుంటారు?" తుడుముకుంటున్నట్లుగా  అడిగిందామె.

    "ఆమె.... ప్రస్తుతం ఇంగ్లండ్ లో వుంది" జవాబు చెప్పాడతను.

    తెల్లబోయిందామె....ఆ సమాధానానికి. అది ఆమె వూహించని  సమాధానం.


                        *    *    *    *


    ఆ రోజు  ఆమెకు  ఆఫీస్ లో  హెక్టిక్ వర్కు  అయిపోయింది.

    ఒకేసారి  రెండు మూడు  యాడ్ కాంపెయిన్స్  గురించి  కాన్ సెప్ట్స్ వర్కు  చేయాల్సి  వచ్చింది.

    మరో వైపు  ప్రీమియర్ ఆడియోస్  యాడ్ ఫిలిం  గురించిన  టెన్షన్.

    సమస్య  అంతా  సింగర్తోనే.

    ఆ రోజు ఫ్లైట్లో  ఆమె  దిగింది  అన్నారు. బట్ ఎవరికీ  కనపడలేదు. ఆ మధ్యాహ్నంకి  హోటల్ రూమ్ లో ప్రత్యక్షమైంది. సాయంకాలం  షాపింగ్  అంటూ  వెళ్ళిందట....అక్కడ  ఆమె మీద  ఎవరో రివాల్వర్తో  మర్డర్ ఎటమ్ట్ చేశారట....ఆమె ఎవరితోనే....ఎక్కడికో  వెళ్ళిపోయిందట.

    అందులో  వాస్తవాలు  ఏమిటో....అబద్ధాలు  ఏమిటో....ఏమీ  తెలియదు.

    వైజాగ్ లో ఆమె షో బిగిన్ అవటానికి  ఇంక రెండు రోజులే  వుంది.

    ఆమెపై  హత్యాప్రయత్నం  జరగటం....వాస్తవమే  అయితే....ఇంక  ఆమె వైజాగ్ లో  ప్రోగ్రాం  యిస్తుందా! ఇచ్చినా  వీడియో  ఫిల్మ్ షూట్ చేసే అవకాశం వుంటుందా?

    అయోమయంలో  పడిపోయారు  ఆ రోజు  అందరూ.

    ఏదయినా  కారణాలవల్ల  సంజుతో  యాడ్ ఫిల్మ్ తీయటానికి  కుదరని  పరిస్థితిలో మరో  కాన్ సెప్ట్ ప్లాన్ చేయమని  చెప్పాడు పిళ్ళై.

    ఆమె ప్రస్తుతం  అనుభవిస్తున్న  మానసికమైన  టెన్షన్లో  ఏ పని గురించి సరిగ్గా  ఆలోచించలేకపోతోంది.

    గతవారం పది రోజులుగా ఆమె అనుభవిస్తున్న  బాధ  ఇంతా అంతా కాదు.

    అనుక్షణం  పవన్  గుర్తు వస్తున్నాడు. బ్రతికి  వున్నట్లు  అనిపిస్తోంది.

    "అమ్మా....నన్ను రక్షించు" అని  పిలుస్తున్నట్లు, "నేను  బ్రతికే వున్నాను" అని పిలుస్తున్నట్లు  ఏవో వూహలు....ఏదో భ్రమ.

    పవన్  శరీరాన్ని  పాతిపెట్టిన చోట....ఖచ్చితంగా  అతని శవం  వుండదు  అనే బలమైన నమ్మకం.

    అదే క్షణంలో ఆమెకు చంద్రకాంత్  కూడా గుర్తు వస్తున్నాడు.

    చంద్రకాంత్....

    తను అభిమానించిన  వ్యక్తి....

    పిచ్చిగా ప్రేమించిన వ్యక్తి....

    అమితంగా  ఆరాధించిన వ్యక్తి....

    అగ్నిహోత్రుని  సాక్షిగా, తన  మెడలో  మూడుముళ్ళు  వేసిన వ్యక్తి....

    తన భర్త....ప్రాణం....సర్వస్వం.

    ఆమె మెదడులో  సుడులు  తిరుగుతున్న  ఆలోచనలు  కొన్ని  సంవత్సరాలు వెనుకకు  వెళ్ళసాగాయి.

    ఆ గత  స్మృతులు....ఆమెకు  వూరటకంటే  క్షోభని  ఎక్కువగా  పెడుతున్నాయి.

    సోఫాలో  నుంచి  లేచి  అల్మైరా  వైపుకు  నడిచింది.

    డోరు ఓపెన్  చేసిందామె.

    రెండవ అరలో....వరుసగా  పెట్టి  వున్నాయి  పదిహేను  డైరీలు.

    అవి ఆమె మనస్సుకు  ప్రతిరూపాలు.

    దర్పణాలు....

    వాటి మధ్యలో  నుంచి  ఒక డైరీని  బయటకు  లాగింది  ఆమె.

    1984 అన్న  గోల్డ్ కలర్  అక్షరాలు, కాలంతోపాటు మాసిపోయి వెలవెలబోయినట్లుగా  మెరుస్తున్నాయి.

    ఆ డైరీ తీసుకుని  బెడ్ రూమ్ కి  నడిచి, తన బెడ్ మీద వాలిపోయింది ఆమె.

    ఆ డైరీలు  అలా చదవడం  ఆమెకు  మొదటిసారి  కాదు.

    తరచుగా  చదువుతుంటుంది.

    చదివిన  కొద్దీ....ఆ పాత  జ్ఞాపకాలు  అధికమై  ఆమెను  శూలాల్లా  గుచ్చి  బాధిస్తున్నాయి, కానీ....ఆ బాధలోనే....ఏదో ఉపశమనం  వుంది....ఏదో తృప్తి వుంది ఆమెకు.

    నవంబర్ 1 అన్న పేజీ దగ్గర  ఆగింది ఆమె దృష్టి.


                         *    *    *    *

    ఫ్యాషన్.

    ఆధునిక  నాగరిక జీవితానికి  పర్యాదపదమయిపోయింది  ఈ మాట.

    కొద్ది సంవత్సరాల  క్రిందటి వరకు ఆ మాటకి  అర్ధం తెలియని ప్రజలు  ఎందరో  వుండేవారు  మనదేశంలో.

    కానీ....కాలం మారింది.

    సినిమాలు....టి.వి....పత్రికలు....ఫ్యాషన్  అంటే  ఏమిటో  తెలియచెప్పాయి.

    ఫలితం....

    ఫ్యాషన్  అంటే ఆరాటన  మొదలయింది. అది కళగా  మారింది.

    మనదేశంలో  ఆరంభదశలో  వున్న  ఈ కళ....ప్రాశ్చాత్య దేశాల్లో  వెర్రితలలు వేసే  స్థాయికి  వెళ్ళిపోయింది.

    ఫ్యాషన్  కొందరికి  సరదా  అయితే ,ఎందరికో  జీవనోపాధి  అయింది.

    ఫ్యాషన్....ఒక సబ్జెక్టు  అయింది.

    ఫ్యాషన్  డిజైనర్స్, ఫ్యాషన్  ఫోటోగ్రాఫర్స్, ఫ్యాషన్ షోస్_మోడల్స్, కొరియోగ్రాఫర్స్, హెయిర్ స్టయిల్స్....మేకప్ మేన్....ఇలా ఎందరెందరో పుట్టుకొచ్చారు.

    ఆ రోజు....అక్కడ ఒక అద్భుతమైన  ఫ్యాషన్  షో  జరగబోతోంది.

    భారతదేశ  సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్  సమీర్ వర్మ, కొరియోగ్రాఫర్ మౌసమీల  సారధ్యంలో  జరుగుతోంది అది.

    కోలాహలంగా  వుంది  ఆ ఫైవ్ స్టార్ హోటల్  ప్రాంగణం.

    హోటల్ కి లోపలి  వైపున  వున్న  లాన్స్ దగ్గర  స్టేజీ  వుంది.

    అక్కడ జరుగుతోంది  ఆ ఫ్యాషన్ షో.

    పదకొండుమంది  అమ్మాయిలు....ఐదుగురు  అబ్బాయిలు....మోడల్స్ గా వున్నారు.

    స్టేజీకి సరిగ్గా  వెనకవైపున  వుంది ఓ పెద్ద  హాలు.

    అదే గ్రీన్ రూమ్.

    ఒకవైపున  దాదాపు  రెండు వందలకు  పైగా  డ్రస్ లు  వరుసగా  హేంగర్సుకి  తగిలించి  వున్నాయి. దానికి  మరోవైపు  హెయిర్  స్టయిలిస్ట్ లు రెడీగా కూర్చుని  వున్నారు. మరోపక్క  మేకప్ మేన్ లు.

    ఎవరి  ఏర్పాట్లలో  వాళ్ళున్నారు.

    ఆమె కళ్ళకు  మస్కరా టచ్ అప్ చేస్తూ "ఫెంటాస్టిక్ ఐస్" అనుకున్నాడు మనసులో  ఆ మేకప్ మేన్.

    అతనే కాదు....అక్కడున్న  ప్రతి  ఒక్కరి  మనస్సులోనూ  దాదాపు  అదే భావన.

    బ్యూటిఫుల్  ఫేస్ అనీ....లవ్ లీ లిప్స్  అనీ....షార్ప్ నోస్ అనీ రకరకాల కామెంట్స్.

    ఈ రోజు  జరగబోయే ఫ్యాషన్ షోకి  ఆమె ప్రాణం పోయబోతోంది.

    ఆమె ఉన్న ఫ్యాషన్ షో హిట్.

    స్మాష్ హిట్.

    ఎటువంటి  ఫ్యాషన్ దుస్తులు  ఆమె ధరించినా  అవి ఆమె కోసమే  డిజైన్ చేశారా! అన్నట్లు  వుంటాయి.

    ఎంతో కష్టపడి  డిజైన్ చేసిన  డ్రస్ ని ఆమె  ధరించితే  దానిని  చూసి అవధులు లేని  ఆనందానికి  లోనవుతాడు  ఆ డ్రస్  డిజైనరు.

    మేకప్ దాదాపుగా  పూర్తి కావస్తోంది.

    ఫ్యాషన్  షో  మొదలవటానికి  ఇంకా  ఇరవయ్  నిమిషాలుంది.

    ఈ రోజు  ఫ్యాషన్  షోలో  అన్నీ నవాబ్  స్టయిల్స్ లో  వుండే డ్రస్ లు.

    ఆ రూమ్ కి ఒక కార్నర్లో  నిలబడి  ఆ గదిలో జరిగే  తతంగమంతా  గమనిస్తున్నాడు  కో ప్రొడ్యూసరు.

    ఫ్యాషన్ షో పూర్తయ్యేవరకు  అతనికి  ఆ టెన్షన్  తప్పదు.

    బయట  స్టేజి  దగ్గర  జరిగిన  ఏర్పాట్లన్నింటినీ  చివరిసారిగా  చూసుకుంటున్నాడు ప్రొడ్యూసరు.

    అప్పటికి  15 రోజులుగా  రిహార్సల్స్  జరిగాయి.

 Previous Page Next Page