"ఎందుకని చేయవు?"
"తమరు హైటెక్ లవ్ రుచి చూపిస్తాను కదా? అందులో చైనీస్ టైపు మిక్స్ చేసి."
సాజిత్ నవ్వాడు.
వారిరువురు అలా నవ్వుకుంటున్న క్షణాలకు.
వీరికి దూరంగా__
అదే భాగ్యనగరంలో.....
* * * *
మంత్రి అంబరీషుడు తన గెస్ట్ రూమ్ లో ఆగ్రహంగా అటూ, ఇటూ తిరుగుతున్నాడు. ఆయన పి.ఏ.
జనార్ధన్ ఒకదరిని కదలకుండా నిలబడ్డాడు. బయట అంబరీషుడిగారి ప్రయివేటు సైన్యం ఒకప్రక్క నిలబడింది. మరో ప్రక్క పబ్లిక్ సెక్టార్ లో ప్రజలసొమ్ము జీతాలుగా తినే సెక్యూరిటీ బృందం కూడా అలాగే మౌనంగా నిలబడ్డారు.
మంత్రిగారు తన పి.ఏ.తో కాస్త కోపంగానే చెపుతున్నాడు.
".....సి. మిస్టర్ జనార్ధన్! ఈ గుంటేవరో కనుక్కోండి. దీనికి మన రహస్యాలు ఎలా తెలుస్తున్నాయి. ఫలానా శాఖలో ఇంత కరప్షన్ జరిగిందని పైసలతో సహా లెక్కలు తయారు చేసి ఎలా పేపర్లకిస్తోంది?
ఇప్పుడు మన కుంభకోణం ఒకటే బయటపడింది. అందుకు నాకేలాంటి భయమూ లేదు.
పబ్లిసిటీ బోలెడంత వస్తుంది. వార్తా పత్రికల్లో, టీవీల్లో, మాగజైన్స్ లో మన ఫోటోలతో సహా వేస్తారు.
తరువాత ఒక కేసు ఫైల్ చేస్తారు.
కోర్టులో విచారణ మొదలవుతుంది.
సాక్ష్యాలు సరిగా వుండవు. చివరికి కేసు కొట్టివేస్తారు.
అది నాచురల్ ప్రాసెస్,
సి.బి.ఐ. ఫైల్ చేసిన ఒక్క కేసులో శిక్ష అనుభవించిన ఒకనాయకుడ్ని చూపమనండి!
సో....ఇటు దారిలో మన కెలాంటి ప్రమాదం వుండదు.
కానీ...ఆ గుంట అదే పావని చివర్లో పార్టీ రహిత ప్రజాసంఘాలంది. చూడు! అందుకు నిర్మాణాత్మక సూచనల్ని చేసింది చూడు! అందుకు ఓటు వేయటానికి బూతుకు రానివాళ్ళ నందరినీ కదలమంది చూడు!
అధ్యా అసలు ప్రమాదం! సరిక్రొత్త ప్రమాదం.
దీన్ని మనం మొగ్గలోనే తుంచాలి."
"ఈవిడ వ్రాసినంత మాత్రాన జనం కదలరు సార్. చివరికి మీరన్నట్టే జరుగుతుంది" జనార్ధన్ అనగానే మంత్రిగారు కల్పించుకుని-
"అదే పొరపాటు....."
ఈ జనం కదులుతారు!
మొన్నటికి మొన్న ఏం జరిగింది?
ఓ చిన్న సీతమ్మ కథతో దూబగుంతలో మొదలయిన సారావ్యతిరేకోద్యమం- రాష్ట్రం గూబ పగులకొట్టింది. తిరిగి కోలుకోవటానికి గవర్నమెంటుకి టైమ్ పట్టింది. అంటే గవర్నమెంటు మారితే కాని అది సాధ్యంకాలాఈ మధ్య కాలంలో మన సోదరులు ఎంత నష్టపోయారు? ఎన్ని లక్షలు లాస్ గా ఏర్పడింది?
అందుకని....ఆ గుంట ఎవరు? ఏం చదివింది? ఎక్కడుంటుంది? దాని బాక్ గ్రౌండ్ ఏమిటి? దాని వీక్ పాయింట్ ఏమిటి? దాన్ని ఏం చేస్తే ఏమవుతుంది?
రేప్ చేస్తే సరిపోతుందా?
వ్యాసాలు వ్రాసే చేయి విరగ్గొడితే సరిపోతుందా? ఏకంగా చంపితే సరిపోతుందా? వివరాలు సేకరించండి" అన్నాడు.
పి.ఏ. జనార్ధన్ అంతా విని__
"సర్! ఆ అమ్మాయి ఇప్పటికే రాష్ట్రంలో బాగా పాపులర్ అయింది. చంపటం అనే కార్యక్రమాన్ని విరమించుకోవాలి. అదే జరిగితే- అధికార్ల మీద- పాలక వర్గాల మీదా జనానికి అనుమానం వస్తుంది. అది మరో రకమైన రియాక్షన్స్ కి దారితీస్తుంది."
జనార్ధన్ చెప్పటం పూర్తికాకుండానే అన్నాడు.
"చెప్పవయ్యా! అందుకేనా నిన్ను పి.ఏ.గా పెట్టుకుంది. దాన్ని ఏం చేస్తే ఇలాంటి వాటి జోలికి రాదో - వివరంగా చెప్పు."
"చెప్తాను సర్....! నాకు తెలిసినంత వరకు - ఆ అమ్మాయికి ఓ ప్రియుడున్నాడు. ఆ ప్రియుడు ఎవరోకాదు. తమరు బాత్ రూమ్ లో పడినప్పుడు- ముందు పళ్ళు రెండు వూడాయి. అంతేకాకుండా అక్కడున్నదేదో గీరుకుపోయి భుజంమీద కూడా గాయమయింది. వెంటనే మేం తమరిని మనకు దగ్గరగా వున్న స్టార్ ఆసుపత్రికి తీసుకుపోయాం.
అక్కడి సూపరింటెండెంట్ తో మంచి స్కిల్ వున్న డాక్టర్ని మీ విషయంలో అప్పజెప్పమన్నాం-
అప్పుడు ఓ కుర్రవాడ్ని తమరి నిమిత్తం పంపారు.
అప్పుడు ఓ కుర్రవాడ్ని తమరి నిమిత్తం పంపారు.
పేరు సాజిత్ అనుకుంటాను.
అమెరికా కూడా వెళ్ళి వచ్చాడట.
మంచి డాక్టర్ ని అన్నారు.
తమరికి ముందు పళ్ళు అమర్చతమే కాకుండా భుజంమీది గాయాన్ని వారం తిరక్కుండా నయంచేశాడు. గాయం ఎంతో లోతుకెళ్ళింది.మానతానికి ఎంత టైమ్ తీసుకుంటుందో అనుకున్నాం. అలాంటిది....ప్లాస్టిక్ సర్జరీలాంటిది చేసి గాయం కూడా కనిపించకుండా చేశాడు."
"అవును. తరువాత మనవాళ్ళను ఎవరికేది జరిగినా అతన్నే మనం పిలిపిస్తున్నాం. ఆ కుర్రడాక్టరు తెలీకేం-"
"ఆ కుర్ర డాక్టరే ఆ అమ్మాయి ప్రియుడండి! ముందు ముందు మంచి భవిష్యత్ వున్న డాక్టరు."
"ఆరినీ....ఆడికీ....దీనికీ లంగరెక్కడ కుదిరిందయ్యా. ఆడేమో మెడికలూ- ఇదేమో పేపరు! అని కాస్సేపు మంత్రిగారు అటూ ఇటూ తిరిగి జనార్ధనాన్ని అడిగాడు.
"అన్నట్టూ....ఈళ్ళు ప్రేమలోనే వుండారా.....పెళ్ళిదాకా వెళ్ళారా?"
"ఇంకా పెళ్ళికాలేదు సర్!"
"సరే....ఈ కుర్ర డాక్టరంటే మనకు తెలిసిన వాడే మరి ఇదెవరు?"
"ఆ విషయాలు తమకు త్వరలో అందజేస్తా సార్."
"త్వరలో అందజెయ్! మనవాళ్ళంతా దాని రాతలమీద మండిపడుతున్నారు. ఒక్కొక్కటే ముఖ్యమంత్రిగారి దృష్టిక్కూడా పోతున్నాయి. ఇదిగో.....పి.ఏ....ఆయనదసలే కంప్యూటర్ బ్రెయిన్. ఆయన ఇంటిలో కంప్యూటర్ వుంటుంది. ఆయన ఆఫీసులో టేబుల్ మీద కంప్యూటరుంటుంది. ఆయన కారులో కంప్యూటరుంటుంది. అసలే మనం వుండేది హైటెక్ సిటీ!
ఈ గుంట వ్రాసినవన్నీ ఈ పాటికి ఎక్కించే వుంటాడు. రేపు ఆయన ముందుకెళితే...ప్రక్కన కూర్చోబెట్టుకుని....బాగున్నారా అని ఓ బటన్ నొక్కేస్తాడు. అంతే....మన వివరాలు మన కళ్ళముందే దానిలో కనపడతాయి. ఆ తరువాత ఇంకో బటన్ నొక్కుతాడు.
"రిజైన్ ప్లీజ్!" అనే అక్షరాలు పడతయ్. ఇప్పుడే రిజైన్ చేస్తే ఎంతలాసో తెలుసా?"
ఇంకా మూడేళ్ళుంది!
మా ఫాదర్ కాంట్రాక్టర్!
ఇరవై సంవత్సరాల కాంట్రాక్టు పనులకు....ఇరవై లక్షలకు మించి గాదర్ చేయలేకపోయాడు.
ఈ రెండు సంవత్సరాల్లో మనం వందకోట్లు సంపాదించాం. మరో మూడేళ్ళు మరిన్ని కోట్లు.
సో....పి.ఏ!
ఆ గుంటను మొగ్గలోనే తుంచేస్తా. ఈ గెస్ట్ హౌస్ లో గుడ్డలూడదీసి మరీ రేప్ చేస్తా, పిచ్చి పిచ్చిగా వ్రాసావంటే- నీ ప్రియుడ్ని, నీ బాబుని అందరినీ లేపేస్తా....అంటూ వార్నింగ్ ఇచ్చేస్తా.
తొందరగా అదెవరో తేల్చు?"
ఈ సారి అంబరీషుడుపిచ్చిపట్టినట్టు అరిచాడు. ఆయన వింగ్ లో జరిగినా- జరుగుతున్న కరప్షన్ ముందుగా ప్రజల దృష్టికి పోతుంది. ముఖ్య మంత్రిని వారంతా సభల్లో ప్రశ్నిస్తారు. వీధి లేక ఆయన మరుదినమే పిలిచి రిజైన్ చేయమంటాడు.
ఆ దృశ్యం అంబరీషుడికి గుర్తువచ్చింది.
ఆ వెంటనే బారో మీటర్ లో పాదరస మట్టం పైకి లేచినట్టు- ఆవేశం రెట్టింపయింది. ఫలితంగా కేకలూ- పెడబొబ్బలూ అయ్యాయి.
జనార్ధన్ అంబరీషుని ఆవేశాన్ని గమనించాడు. అతడు మంత్రి కాకముందు కూడా ఇలాగే వుండేవాడు. ఆవేశంలో అన్నంతపనీ చేస్తాడు. తర్వాత డబ్బు వెదజల్లి ఆ కూపం'నుండి బయటపడేవాడు.
ఇప్పుడు జర్నలిస్ట్ పిల్లను నిజంగానే అన్నంతపనీ చేస్తే- ఈయన రాజకీయ చరిత్ర ఇంతటితో ముగింపు తీసుకోవచ్చు.
గుర్రానికీ, గాడిదకూ ఒకే మంత్రమంటే చెల్లదు.
మనసులో అనుకుని....
"సర్! ఆవేశపడకండి మనం డీల్ చేయబోయేది జర్నలిస్ట్ లతో- అందులో ఆ అమ్మాయి పబ్లిక్ ఫిగరైంది.
"ఏందయ్యా పబ్లిక్ ఫిగరు! ఇండియా ప్రధానమంత్రులూ, అమెరికా అధ్యక్షులే ఎగిరిపోతుందారు. దీని ఫిగరెంత? దీని పికరెంత? నాకు ఎదురు చెప్పకు. నేను చేయమంది చెయ్యి. దాని బాగ్ గ్రౌండూ, మూవ్ మేంటూ మొత్తం తీసుకుని నా ముందెట్టేయ్ ఆ తర్వాత నేచూసుకుంటాను." అని ఆయన అలాగే చిందులు తొక్కుతూ బాత్ రూమ్ లోకెళ్ళాడు. జనార్ధన్ మెల్లిగా బయటకొచ్చాడు.
బయట పోలీసులూ ఆయనగారి ప్రైవేటు గూండాలు!
ఈ దేశంలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం జనార్ధన్ కు ఒకవైపు క్రిష్టత్ క్లియర్ గా కనిపిస్తున్నా తనూ అందులో భాగస్వామే!
ఆయన చెప్పినట్టు చేసి-ఆయన నడపమన్నట్టు నడిపి, ఆయనిచ్చినంత తీసుకుంటున్నాడు.
"లయిన్ షేర్" మంత్రిగారిదే కావచ్చు.
ఆయనగారి ప్రైవేటు గూండాలూ తామూ అందరూ ఆయన తినగా మిగిలిన ఎముకల మీది కండరాలను గీక్కుతిని.....తామూ బలుస్తున్నారు.