అప్పటికే మెల్లిగా అనుభూతులపరంగా బెండవుతున్న పినాకినికి కారు అనేసరికి ఓ సరిక్రొత్త ఆశ చిగురించి మరింత బలమయింది.
తమకు నిజంగా ఈ క్షణంలో అత్యంత అవసరమయింది ఓ కారు అది చేతిలో వుంటే తను క్లబ్ కు అదే కారులో నేరుగా వెళుతుంది. తన భర్తను ఆయన పనిచేసే ఆఫీసులో డ్రాప్ చేస్తుంది. తిరిగి వెళ్ళేప్పుడు కలసివెళ్ళడం జరుగుతుంది.
హాలీడేస్ వస్తే.....కారున్నవారికి ఎంత హాయిగా వుంటుందో! స్వంత కారులో తిరగటం నిజంగా గొప్ప థ్రిల్.
గ్రీన్ సిటీగా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాక ఎన్ని పార్కులున్నాయో! తనకు ఒకసారి హైటెక్ పార్కుకు స్వంత కారులో హాలిడేలో వెళ్ళిరావాలని వుంది. అది తనకిప్పట్లో సాధ్యంకాదు.
మెత్తటి గడ్డితో 'ప్లేన్ ట్రేస్'తో అది మనోహరంగా వుతుంది. అక్కడే మార్కెట్ వుంది. పగలంతా ఆ పార్కులో ఎంజాయ్ చేసివస్తూ వారానికి సరిపడా మార్కెట్ చేసుకుని, కారులో తీసుకుని రావచ్చు. తనకీ సమయంలో కారు అమరితే జీవితాన్ని మాగ్జిమమ్ ఎంజాయ్ చేయవచ్చు.
పినాకిని ఆలోచనలు క్షణక్షణానికీ పదునెక్కుతున్నాయి.
ఇంతలో రేఖ అంది-
డియర్ పినాకినీ! నీకు కారు ముందుగా ఎరేంజ్ చేసి పెడతాను. ఆ తరువాతే ఆ రహస్యాన్ని నాకు చెప్పు"
దీనితో పినాకిని కొద్దిగా మూవ్ అయింది.
తరువాత వారి కారు బయలుదేరింది.
పినాకిని వద్దంటున్నా రేఖ ఓ ఖరీదయిన రెస్టారెంటుకి దారితీసింది.
* * * *
పినాకిని యిచ్చిన వివరాల ప్రకారం రేఖ భర్త బిజినెస్ పనిమీద బయటికి వెళ్ళగానే తన పర్సనల్ కారులో బయలుదేరింది. దగ్గరదగ్గరగా వారి హౌస్ పార్కుకు అవతలవైపు వుంది. ఆ ఇంటికి మరికాస్త దూరంలో అన్నీ చిన్ని చిన్ని బిల్డింగ్స్. కాస్త స్లమ్ ఏరియా కూడా వున్నది.
ఇల్లు చిన్నది.
తనెలా ఇంటిలోకి వెళ్ళటం? తనను తానెలా పరిచయం చేసుకోవటం?
దస్తగిరీ- బదరీ.
వారికి తమ జైగోట్ వలన మగపిల్లవాడు కలిగాడు. తనకు తరువాత ఆ యోగం పట్టలేదు. ఒక ఆడపిల్ల. తరువాత ఎందుకనో తను తిరిగి ప్రెగ్నెంట్ కాలేకపోయింది.
ఈ క్షణంలో ఆ యింటిలో ఎవరెవరు వుండివుంటారు?
కారు ఇంటి ముందు రోడ్ ప్రక్కగా ఆపి కాస్సేపు వెయిట్ చేసింది.
అదిగో....అప్పుడే ఒక ఆశ్చర్యం అక్కడ చోటుచేసుకుంది.
ఆ ఇంటి తలుపు తెరుచుకుని ఓ కుర్రవాడు బయటికి వచ్చాడు. రేఖ నిలువెల్లా షాక్ తింది. తను కళ్యాణ్ ను పెళ్ళి చేసుకున్న తొలిదినాల్లో అతను ఎలా వున్నాడో అచ్చం ఆ కుర్రవాడు అలా వున్నాడు. ఆ పాయింటెడ్ నోస్, ఆ విశాలమయిన కళ్ళు, ఆ నునుపైన బుగ్గలు, ఆ తెల్లదనం మరోసారి పాతిక సంవత్సరాలకు వెనక్కి పోయి తన అందమయిన కళ్యాణ్ ను చూసిన అనుభూతి కలిగింది.
అన్నీ కళ్యాణ్ పోలికలే. ఆ నడకలోనూ ఏ విధమయిన మార్పు లేదు.
బయటికొచ్చిన ఆ కుర్రవాడు వరండాలో నిలబడి "డాడ్" అంటూ పిలిచాడు.
ఏభై నిండిన ఓ నల్లటి మనిషి బయటకు వచ్చాడు. అలా వచ్చిన ఆ మనిషితో...అంటే ఒక రకంగా తండ్రితో ఆ కుర్రవాడు ఏదో సైగ చేశాడు.
ఆ మనిషి వెంటనే జేబులోంచి కొంత పైకం తీసి చాటుగా కొడుక్కుయిచ్చాడు, ఈ దొంగాట యింటిలో వున్న ఆ కుర్రవాడి తల్లి కనిపెట్టినట్టుంది. వెంటనే బయటకు వచ్చి....
"ఇదిగో! ఎన్నిసార్లు మీకు చెప్పాలి? వాడికి మనీ యిచ్చి అలా చెడగొట్టవద్దని. వాడు ఆ మనీతో బజారు హోటల్స్ లోని చెత్తంతా తింటాడు. ఇంటికి వచ్చి ఆకలిగా లేదంటాడు. రెండు రోజులకు అజీర్తి" అంటుండగా ఆ కుర్రవాడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన మోటార్ బైకెక్కి బయటపడ్డాడు.
రోడ్ మీదికొచ్చి ఇరువురికీ ఫ్లయింగ్ కిసెస్ యిచ్చి టాటా చెప్పి బయలుదేరాడు.
"సారీ మై ఏంజిల్! ఓ మూవీ కెళతానంటే ఇచ్చాను" దస్తగిరి అన్నాడు.
రేఖకు వారి దాంపత్యంలోని విశిష్టత నచ్చింది. భార్యను ఏంజిల్ అంటున్నాడంటే ఆమెనతడెంతగా ఆరాధిస్తున్నాడో అర్ధమయింది.
ఇక అక్కడ రేఖ క్షణం కూడా వుండలేదు.
కొడుకును చూసిన ఒక శక్తీ తను ఏమీ చేయలేని ఆశక్తత.....విభిన్న భావాలు ఒకేసారి కళ్ళముందు కనపడి రేఖను రకరకాలుగా పెనవేశాయి.
ఈ విషయం తన భర్తకు కూడా తెలీకూడదు. కానీ ఆయనకు తను చెప్పకపోతేనే తెలీదు.
తన బుల్లి రూపం ఒకటి భూమిమీద పడి పెరిగి పెద్దదయిందనీ అది అచ్చం ఆయనలా వుందనీ, ఆ రూపం తమకు కొడుకనీ, కానీ కొడుకు కాదనీ ఎలా చెప్పటం?
కానీ చెప్పకూడదు. తను పినాకినికి మాటిచ్చింది. ఆ గాళ్ పుణ్యమా అని ఒక 'కాంట్రా వర్సల్' అనుభూతికి తను లోనయింది.
కానీ ఒక ఆనందం తన అంతరాంతరాళాల్లో పెల్లుబుకుతూనే వుంది. ఈ ఆనందానికి కళ్యాణ్ ను తనెలా దూరంగా వుంచగలదు?
కానీ వుంచాలి.
తను మాత్రమే అనుభవిస్తూ కళ్యాణ్ కు తెలియజేయకపోతే ఒక అన్యాయం అవుతుంది. కానీ తెలియజేయకుండా వుండటం ఒక న్యాయమవుతుంది.
హేగాడ్!
ఇప్పుడు మరింత పూర్తిగా తనకు అర్ధమయింది.
ఆ సైన్సు క్లబ్ మేధావులు ఎందుకు ఆంక్షలు పెట్టారో! ఎందుకు సీక్రెసీను మెయిన్ టెయిన్ చేస్తున్నారో!
బహుశా ఈ సమయంలో ప్రపంచంలో ఏ తల్లీ ఇలాంటి విచిత్రాను భూతికి లోనుకాదు.
ఎక్కడా ఇలాంటి కత జరిగి వుండదు.
రేఖ తిరిగి మెల్లగా తన కారును డ్రయివ్ చేసుకుంటూ ఇంటిముఖం పట్టింది.
* * * *
తను నిఖిల్ ఇంటికి మరలా వెళ్ళలేదు. రేఖ ఆలోచనలనుండి తేరుకుంది.
తన ముందే తన కుమార్తె లోపెడ్ పిస్టల్ ని తన తలకే గురిపెట్టుకుని నిలబడింది.
"డియర్ సింధూ! నేను చెప్పేది విను. ఏ విధంగానూ త్వరపడవద్దు. నీవే తెలుసుకుంటావ్" రేఖ అంది.
సింధూ కళ్ళు అప్పటికే ఎర్రగా మారాయి.
ఆవేశంగా మరో అడుగు ముందుకేసి-
"మమ్మీ! మరోసారి చెప్తున్నాను విను. నీనుండి ఒక్కమాట బయటకు వచ్చినా నేను ఈ క్షణమే కాల్చుకు చనిపోతాను. నా ఆఖరి వార్నింగ్" అంది.
రేఖ శిలాప్రతిమలా నిలుచుండిపోయింది.
* * * *
సాజిత్ పావనివంక చూశాడు.
పావని ముఖం ఎర్రగా, గంభీరంగా అయింది. ఆమె పరిస్థితికి అతడు చిన్నగా నవ్వుకున్నాడు.
చెప్పు పావనీ! సైన్స్ కీ, ఎతిక్స్ కీ, ఒక హాట్ వార్ మొదలయింది. పెరుగుతున్న శాస్త్రీయ విజ్ఞానం మానవ విలువలమీద పరోక్షమయిన దాడికి పూనుకుంది.
సైన్స్ ఒక అసాధ్యాన్ని, సాధ్యం చేసింది.
కానీ ఒక నైతిక పధంలో మింగుడుపడని వెలగపండయింది.
ఈ కళ్యాణ్ రేఖ ప్రాబ్లెం లో మనకు చాలా డెలికేట్ సమస్య ముందుకొచ్చింది.
'జైగోట్' కళ్యాణ్ కీ, రేఖకీ సంబంధించింది.
'రక్తం' బదరికకి సంబంధించింది.
ఒక రకంగా ఆమె తన శక్తి పంచి జన్మనిచ్చింది. రేఖ ప్రకారం ఆ విషయం ఆమెకు తప్ప తెలీదు. ఒకవేళ రేఖ స్వయంగా బదరిక దగ్గరకు పోయి నిఖిల్ నా బిడ్డంటే ఆమె అంగీకరించదు.
జైగోట్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎవరు ఎవరయిందీ తెలీగూడదు. ఈ రహస్యాన్ని రేఖ ఏమాత్రం పబ్లిక్ చేయగూడదు. ఒకవేళ చేస్తే ఇదే ఊహ చాలామందికి వస్తుంది. జైగోట్ ను దానంచేసిన 'ఫెయిర్ జంటలు బ్యాంక్ మీద పడి అలాంటి ప్రమాదం ముందు ముందు తమ విషయంలో తలెత్తకుండా మా పిల్లల్ని జాగ్రత్త పర్చుకోవటానికి మాకూ రహస్యం చెప్పమని గోలచేయవచ్చు.
ఈ సమస్యకు రేఖ ఎలాంటి పరిష్కారం ఇస్తుందో - ఒకసారి నీవు రేఖ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆమెకు కదిలించాలి. లేకుంటే ఆమె అలాగే శిలాప్రతిమలా బిగుసుకుపోవచ్చు!" అన్నాడు.
"యూ నాటీ! భలే సమస్య తెచ్చిపెట్టావే? అయినా నో ప్రాబ్లమ్! దీనికి నేను పరిష్కారం యిస్తాను" పావని గర్వంగా అంది.
"మరి చెప్పు?"
"ఇప్పుడు చెప్పను. కథ మొత్తం నేను కంప్యూటర్ కెక్కించి సొల్యూషన్ క్రింద షీడ్ చేస్తాను. నీవు దాన్ని చదువుతావు."
"ఎప్పుడు?"
"అదీ చెప్పను. ఈ నిముషం కావచ్చు- ఈ గంట కావచ్చు. ఈ రోజు కావచ్చు.
"ఇంకా నయం...ఈ నెల కావచ్చు- ఈ సంవత్సరం కావచ్చు ఈ శతాబ్దం కావచ్చు అనలేదు."
"అంతలేటు నేనెందుకు చేస్తాను."