Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 17

తాము సాగించే ఈ కుంభకోణాల "డార్క్ స్టోరీస్ పావనికెలా తెలిశాయో, ఇప్పటికీ తామందరికీ ఒక మిస్టరీగానే వుంది.
మూడురోజుల క్రితమే తను సరిక్రొత్త కుంభకోణం వెలుగు చూసింది. అదీ పావని వ్రాసింది.
అంబరీషుడు ఈ స్కాం లో ఎలా ప్రధానపాత్రధారో.....
ఆ కుంభకోణం యొక్క ప్రణాళిక ఎలా సిద్దం చేయబడిందో, మనీ ఎక్కడ చేతులు మారిందో మొత్తం వివరించింది.
విషయం మంత్రిగారి దృష్టికి వెళ్ళే వుంటుంది.
ఇంకా ఈయన్ని పిలిపించలేదు.
జనార్ధన్ బ్రెయిన్ లో మూడురోజులనాటి పేపరువార్త మనసులో మెదిలింది.

                      *    *    *    *
పేపరు ఫ్రంట్ పేజీలోనే మెయిన్ వార్తగా ప్రచురించారు. ఆ 'స్కాం' అంబరీషుడు స్నేహితుడూ-ఒక ప్రభుత్వోద్యోగిద్వారా జరిగింది.
అయితే తెర వెనక వుండి దాన్ని ఆపరేషన్ ట్రాక్ మీది కెక్కించింది అంబరీషుడే!
భారతదేశం వ్యవసాయక దేశం. అధికోత్పత్తి దిశగా వ్యవసాయం సాగాలి. అందుకు విదేశీ సాంకేతిక సహాయమే కాకుండా విదేశీ నాణ్యమయిన ఎరువుల్ని కూడా మనదేశం దిగుమతి చేసుకోవాలి. అందుకు ప్రభుత్వానికి సహకరించే పెట్టుబడిదారులూ-పారిశ్రామికవేత్తలూ కావాలి! ప్రభుత్వం అలాంటివారికి ముందుగా కొంత ఆర్ధికసహాయం అందిస్తుంది.
ఆ నేపధ్యంలోనే అంబరీషుడు తన స్నేహితుడ్ని ఒకడిని దించాడు. ఒక విదేశీ ఎరువుల కంపెనీని కాంటాక్టు చేసినట్టూ, వారు రెండువేల కోట్ల రూపాయల ఖరీదుచేసే భారతదేశానికి ఎగుమతి చేసేట్టూ_ఒక కాంటాక్టును బ్యాంకులకు ప్రొడ్యూస్ చేయించాడు. ప్రాపర్టీని సెక్యూరిటీగా పెట్టి ఆ మొత్తం అంబరీషుడి సాయంతో బ్యాంకులనుండి డ్రా చేయించాడు. అది జరిగి ఆరు నెలలు అవుతోంది. విదేశీ కంపెనీనుండి చిటికెడు 'ఎరువు' కూడా భారతదేశానికి దిగుమతి కాలేదు.
చివరికి మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
అసలు అలాంటి ఎరువుల్ని సప్లై చేసే విదేశీ పరిశ్రమేలేదని! మరి ఈ రెండువేల కోట్లరూపాయలు ఏమైనట్టు?
గప్...చిప్....!
చాలామంది చేతులు మారాయి.
అంబరీషుడు మాత్రం 'లైన్ షేరు' కొట్టేశాడు.
చివరికి నేరమంతా అతని స్నేహితుడిమీదికీ-ప్రభుత్వోద్యోగి మీదికీ నెట్టేశాడు.
ఆ మొత్తాన్ని పేపర్లో పావని క్లియర్ గా వ్రాసి అంబరీషుడు ఆ మొత్తం స్కాం కు ఎలాంటి తెరవెనుక దైరేక్తారో వివరంగా తెలియజేసింది.
అతడెక్కడ ఎవరితో మాట్లాడిందీ-ఏమేం మాట్లాడిందీ తేదీలతో సహా ఉదహరించింది.
అంబరీషుడికి అదే పెద్ద మిస్టరీగా వుండిపోయింది.
ఒక్క ఆడది! వెనక ఎవరి సహాయం లేకుండా ఇంత సమాచారం ఎలా సేకరిస్తుంది? అదెంత 'డైనమిక్ లేడీ' అయినా ఇన్ని వివరాలు సేకరించటం అసాధ్యం!
అయినా సేకరించింది.
అంబరీషుడి స్నేహితుడూ, ప్రభుత్వోద్యోగీ పరారీలో వున్నారు.
ఇప్పటికీ సి.బి.ఐ. రంగంలో దిగబోతుంది.
ముందుగా వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
తరువాత మంత్రి సంగతి.
మరింత కాంక్రీటెడ్ గా మరిన్ని వివరాలు ఇవ్వకముందే ఒక ప్రతీకారం జరిగిపోవాలి. బుద్ది వచ్చి కొరివితో తల గోక్కోవటమంటే ఏమిటో ఆ పావనికి తెలియాలి.
అంబరీషుడు క్షణక్షణానికి తొందరపడుతున్నాడు.
జనార్ధన్ కిప్పుడు ఒక బాధ్యత నెత్తినపడింది.
"పావని" వివరాలు సేకరించాలి.
ఆమె వివరాలు తనకెలా తెలుస్తాయి?

                     *    *    *    *
అదో పాత డాబా! ఇంటిముందు పెద్ద వేపచెట్టు వుంది. దానిక్రింద తిరుమలరావు తన ఈజీచైర్ లో కూర్చున్నాడు. ఆ డాబా చుట్టూ ప్రహరీ వుంది.
ఆయన బ్రెయిన్ నిండా టెన్షన్!
చేతిలో పేపరుంది.
ఆయనకు ఎదరలో ఆయన భార్య వుంది. ఆమె నిండు ముత్తయిదువులా-మనిషి మొత్తంగా చీరె కప్పుకుని చాపమీద ముడుచుకుని కూర్చుంది.
ఆమె ముందు ఆ పేపరు తాలూకు కొన్ని పేజీలున్నాయి. ఆమె ముఖం కూడా గంభీరంగా వుంది.
తిరుమలరావు చెపుతున్నాడు....
"చూశావా లలితా! పావని తన పరిధుల్ని మర్చిపోయింది. అంబరీషుడితో పెట్టుకోవడమంటే మృత్యువుతో ఆటే!
అక్కడికీ ఆయన భార్య నా శిష్యురాలు.
నేను సంకల్పించిన ప్రాజెక్టుకు ఆర్ధిక సాయం చేస్తానంది. ఇది మన కుమార్తని వారికి తెలిస్తే సాయం చేయకపోగా....చావు బ్రతుకుల సమస్య తెస్తారు.
దీనికిన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి?
ఈ మొత్తం వెనుక ఎవరో వుండి వ్రాయిస్తున్నారు. నా భయమంతా ఒకటే! ఇది అంబరీషుడి శత్రువుల చేతిలో కీలుబొమ్మయి వారిచ్చిన సమాచారాన్ని తన ఇన్వెస్టిగేటింగ్ రిపోర్టులో ఇరికించి వ్రాస్తుందేమో!
ఆయనప్పుడు అంబరీషుడు ముందుగా శత్రువుల జోలికి వెళ్ళడు- దీన్ని వెదుక్కుంటూవస్తాడు.
వస్తాడంటే అతడు రాడు!
అతనికి ఓ ప్రైవేటు సైన్యం వుంటుంది. ఒకరకంగా ఆయన మేపే ఈ పట్టణం గూండాలు.
వారు దీన్ని వెంటాడితే దీని జీవితం కత్తి పదునుమీద నడకవుతుంది'అన్నాడు.ఆయన కంటిలోని నీరు మెల్లగా ఆయన చెంపమీదికి జారింది. పైనున్న ఉత్తరీయంతో భార్య చూడకుండా తుడుచుకున్నాడు.
తిరుమలరావుగారికి కుమార్తె కదిలిస్తున్న విషయాలూ- ప్రభుత్వ వర్గాన్ని అవి ఆందోళనకు గురిచేయటం- పబ్లిక్ మనీ ఎలా దుర్వినియోగం అవుతుందో పబ్లిక్ కి తెలియటం ఒకరకంగా లోపల ఆనందంగా వున్నా, ముందుకురాబోయే ప్రమాదాన్ని తలుచుకున్నప్పుడు మాత్రం భయం కలిగింది.
ఇంతలో ఆయన భార్య కల్పించుకొని-
"ఏమండీ! ఇది దగ్గిరవుతున్న డాక్టరు బాబున్నాడే...ఆయనకు ఈ విషయాలు తెలుసా?" అంటూ అడిగింది.
"నిజమే లలితా! రేపు దీన్నీ- ఆ డాక్టరుబాబునీ కూర్చోబెట్టి ఈ విషయం కదిలించాలి. ఆ డాక్టరు సిటీలో ఇప్పటికే మంచి పేరు వస్తుంది. దీనికి తను వ్రాసే సంచలనాత్మకమైన వ్యాసాలతో ఇప్పటికీ మంచి పేరు వచ్చింది. కాని ఏం లాభం? రేపేమన్నా జరిగితే....ఈ మెచ్చుకున్న జనం కాస్త నొచ్చుకుని పిడికెడు సానుభూతినీ- ఓ నిట్టూర్పునీ వదులుతారేతప్ప అంతకంటే ఏం జరగదు" అంటూ ఆయన పెద్దగా నిట్టూర్చాడు.
లలితమ్మకు ఆయన మాటలు కాస్త భయాన్ని కలిగించాయి.
"ఏవండీ! ఒకరకంగా ఇదిలా అవ్వటానికి మీరే కారణం. దేశమనీ ప్రజలనీ-దేశ భక్తనీ-దోపిడీ అని ప్రక్కనే కూర్చుని కబుర్లు చెప్పారు. అవన్నీ వంటబట్టాయి. కాస్త ఉడుకురక్తం- ఇక పత్రికలు వ్రాయడం, ఇప్పుడేమానుకుంటే ఏం లాభం?" ఆమె కంఠంలో కొద్దిగా దుఃఖం.
తిరుమలరావుగారికి అదీ నిజమే అనిపించినా ఆయన ఆందోళన అది కాదు. ఒక కధో - నవలో - చిత్రమో వ్రాయటం వేరు. అది సమాజం చైతన్యవంతం అవ్వటానికి ఉపయోగపడటం వేరు. కానీ తన కుమార్తె తీసుకున్న ప్రక్రియ అదికాదు.
నేరుగా ప్రభుత్వ వర్గాలుచేసే దోపిడీని పైసలతోసహా ప్రజల ముందు పెట్టటం! అది పెద్ద పెద్ద జర్నలిస్టులకే అందదు. ఆ వివరాలు దీనికెలా అందుతున్నాయ్?"
తిరుమలరావుగారలా ఆలోచిస్తున్నప్పుడు-
గేటు దగ్గర ఒక వ్యక్తి భుజానికి ఓ పెద్ద సంచి తగిలించుకొని-పాంటుమీద వదులుగా వుండే లాల్చీ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని అలాగే నిలబడి-
"మే ఏ కమిన్ ప్లీజ్" అన్నాడు.
తిరుమలరావు ఆ వ్యక్తిని చూసి-
"యస్! కమిన్" అన్నాడు.
ఆ వ్యక్తి లోనికి వచ్చాడు.
తన్నుతాను అరుణకుమార్ గా పరిచయం చేసుకున్నాడు. తను కూడా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజంలో డిప్లమా తీసుకున్నాననీ, పావనిగారి సంచలనాత్మక వార్తావ్యాసాలు తమను చాలా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయనీ, ఒకసారి ఆమెను కలుసుకోవాలనే కోర్కెతో వచ్చాననీ చెప్పాడు.
తిరుమలరావుగారి ముఖంలో ఒక చిరునవ్వూ, ఆ వెనక మరో విషాదమూ వెంట వెంటనే చోటుచేసుకున్నాయి. తర్వాత నెమ్మదిగా అన్నాడు-
"నిజమే బాబు! నీ కోర్కెకు సంతోషించాలో, అదలా వ్రాసినందుకు విచారించాలో తెలీటంలేదు.
కానీ ఇది ఆడపిల్ల! అవతల ఎక్కుపెట్టిన మనిషి సామాన్యుడు కాదు. ఒక మంత్రి చుట్టూ అతడికి ప్రయివేటు సైన్యముంటుంది. వారి చేతుల్లో బాంబులుంటాయి. వాటికి రిమోట్ సిస్టమ్ వుంటుంది.
మంత్రి తలుచుకుంటే ఏముంటుంది బాబు?
పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అవుతుంది. దేన్నీ వ్రాయమని ప్రోత్సహించిన ఎవరూ దీన్ని ఆ సమయంలో రక్షించటానికి రారు."
ఆయన చివరి మాటల్లో కొంచెం దుఃఖం కూడా తొంగిచూసింది.
"అదేమిటి సర్! ఏమయినా అయితే ఆమె వెనుక జర్నలిస్టుల సంఘం వుంటుంది. చైతన్యవంతులయిన ప్రజలుంటారు. ప్రగతి శీలకమైన మహిళా సంఘాలుంటాయి. రోజులు వెనుకటిలా లేవుసార్ - మీరు అంతగా భయపడాల్సిన అవసరంలేదు.

 Previous Page Next Page