Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 15


    "రేపు నా పుట్టినరోజు. నువ్వు మా ఇంటికి రావాలి?" మంజు లతతో చెప్తుండగా విన్నాడు మురళి. మంజుకి పుస్తకాలు చాలా యిష్టమని మురళికి తెలుసు. మంజు పుట్టినరోజుకి ఒక పుస్తకం కొని బహుమతిగా ఇచ్చి ఆ రకంగా కొంచెం చనువు పెంచుకోవాలనుకున్నాడు. తల్లికి తెలియకుండా తండ్రి దగ్గిరిచేరి_
    "డాడీ! నాకొక అయిదు రూపాయలు కావాలి!" అన్నాడు.
    "ఎందుకూ?"
    "పుస్తకం కొనాలి? ఎందుకు కొంటున్నావు?" అని ఏమి అడక్కుండా అయిదురూపాయలు ఇచ్చేసి "బాగా చదువుకో!" అన్నాడు కాంతారావు. బుద్ధిగా తలూపాడు మురళి.
    ఆరోజే డెనిస్ రోబిన్స్ పుస్తకం కొన్నాడు. ఎలాగో అవకాశం చూసుకుని లత పక్కనే ఉన్నా ధైర్యంగా మంజుకి పుస్తకాన్ని అందించి "మీ బర్తడేకి నా ప్రజంటేషన్. విష్ యు మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే-" అన్నాడు.
    మంజు గతుక్కుమంది. ఆ బహుమతి తీసుకోవాలో వద్దో అర్ధంకాలేదు. డెనిస్ రోబిన్స్ పుస్తకం వద్దనలేకపోయింది. తీసుకుని "థాంక్యూ!" అంది.
    లత అప్పటికేం అనలేక ఊరుకుని ఆ తరువాత "డెనిస్ రోబిన్స్ పుస్తకం కొనటానికి నీకు డబ్బులెక్కడివి?" అని అడిగింది అన్నని.
    "నీ కెందుకూ, నోరుమూసుకో!" అని కసిరాడు మురళి....
    ఆలాగే నోరు మూసుకుంటా! అమ్మకి చెపుతా!"
    హడలిపోయాడు మురళి.
    "ప్లీజ్! చెప్పకే!
    "నా యిష్టం నేను తప్పకుండా చెపుతా!...."
    "చెప్పానంటే ఇంకెప్పుడూ రవి నడిగి "మిల్స్ అండ్ బూన్స్" పుస్తకాలు తెచ్చిపెట్టను_అంతేకాదు-నువ్వు క్లాస్ పుస్తకాల్లో నవలలు తెచ్చుకుని చదువుతున్నావని అమ్మకు చెప్పేస్తాను."
    అక్కడితో తగ్గిపోయింది లత.
    కాంతారావు "మురళి కొత్త పుస్తకం కొనుక్కున్నాడా?" అని అడిగాడు సత్యవతిని....
    సత్యవతి తెల్లబోయి "ఏం కొత్త పుస్తకం?" అంది.
    పుస్తకం కొనుక్కోవాలని నన్ను అయిదురూపాయలడిగాడు ఇచ్చాను."
    సత్యవతి మండిపడుతూ "వాడికి అడిగినప్పుడల్లా డబ్బు లియ్యద్దని చెప్పలేదా? ఇలాగే పాడుచేస్తున్నారు పిల్లల్ని" అంది....
    "సరే! రేపు వాడినడిగి ఆ అయిదురూపాయలు తీసుకో!" శాంతంగా అన్నాడు కాంతారావు.
    తల కొట్టుకుంది సత్యవతి విసుగ్గా.
    "మురళీ! నాన్నగారి దగ్గిర పుస్తకం వంకతో తీసుకున్న అయిదురూపాయలు ఏంచేశావురా?" అని నిలదీసింది మురళిని. మురళి నిర్ఘాంతపోయాడు. "ఈ నాన్నగారు నాకు డబ్బులిచ్చి మళ్ళా అమ్మతో చెప్పేశారు" అని మనసులో తండ్రిమీద విసుక్కున్నాడు.
    "రవితో కలిసి సినిమాకి వెళ్ళావు కదూ?" అని మళ్ళా గదమాయించింది సత్యవతి.
    మురళి మాట్లాడలేదు. సత్యవతి తన అనుమానమే నిజమని నిర్ధారణ చేసుకుంటూ "అబ్బబ్బ ఈ సినిమా పిచ్చి తగ్గితేకాని నువ్వు బాగుపడవు. వచ్చిన ప్రతి సినిమాకీ వెళ్ళాలని చూస్తావు. ఇలా అయితే నేను నీచేతికి నయాపైస కూడా దక్కనివ్వను." అంది కోపంగా...
    "ఇంకెప్పుడూ వెళ్ళనమ్మా!" అన్నాడు బుద్ధిగా మురళి.
    అంతా వింటోన్న లత ఏమీ మాట్లాడలేదు. అన్న రహస్యం తను బయటపెడితే, తన రహస్యం అన్న బట్టబయలు చేస్తాడేమోనని భయపడింది.

 Previous Page Next Page