Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 15

                                 

 

    ప్లాట్ ఫారం మీద అగబోతున్న రైలు బండి పరుగు లాంటి నడకతో కంపార్టు మెంట్లు కలయజూస్తున్న ప్రసాదరావు.
    "నాన్నా, ముందుకి రండి." మృదుమధురమైన గొంతు. ఉలికిపాటుగా ముందుకి నడిచాడు ప్రసాదరావు....."నాన్నా!" మళ్ళీ అదే పిలుపు. అతని తనువు పులకించింది. ఆ పిలుపు కోసం అతను తపించాడు. ఆ పిలుపు వినే రోజులు దగ్గర పడే వేళ. చేతిలో ఉంచిన ఫలం తిననియ్య కుండా లాక్కున్నట్టు, పసివాడు బోసినవ్వులు మాత్రమే చూసి, ఆ బాబు నాలుక మాటలకు తడుముకునే వేళ విధి దూరంగా విసిరింది అతన్ని. "నాకు ఇల్లు తెలుసుగా? వచ్చేసే వాణ్ణి. ఎండలో స్టేషను కెందు కొచ్చారు?" అదే ప్రసాదరావు చెవులకు తియ్యగా వినిపించిన గొంతు -- ఆప్యాయతగా ప్రశ్నించింది.
    "నాకేమీ ఎండలే! ఈ వేళ చాలా లేటుగా వచ్చింది బండి" అంటూ వాసు చేతిలో బాగ్ అతను వారిస్తున్నా అందుకున్నాడు ప్రసాదరావు.
    "మీకు తెలియపరచాలని ఫలానా ట్రెయిను లో వస్తున్నానని వ్రాశాను కాని, మీరు స్టేషను కి రావాలనా? ఎందుకు వచ్చారు, నాన్నా?"
    అ మాట ఏ దివ్య లోకాలకో తీసుకుపోయింది ప్రసాదరావుని. అతని హృదయం పుత్రవాత్సల్యంతో పులకించిపోయింది. వాసు భుజం చుట్టూ చెయ్యి వేసి నడుస్తూ, 'అంతా బాగున్నారా? నీ ఆరోగ్యం బాగుందా? బాగా చదువుకుంటున్నావు కదూ? డబ్బు సరిపోతుందా? మామయ్యా గారింట్లో వాళ్ళెం విసుక్కోవడం లేదు కదూ?" అని ప్రసాదరావు అత్రతగా , తొందరగా ప్రశ్నించిన ప్రశ్నలకు చిన్నగా నవ్వుకుంటూ , "నా ఆరోగ్యం బాగానే ఉంది. అంతా బాగున్నారు. డబ్బు చాలకపోతే వ్రాయమన్నారుగా క్లాసు రావాలనుకునేప్పుడు కష్టపడి చదవక పొతే ఎలా! మామయ్య వాళ్ళు....వాళ్ళెందుకు విసుక్కుంటారు? విసుక్కున్నా వెళ్ళేవాణ్ణి కదా అప్పుడు?' అన్నాడు వాసు.
    ప్రసాదరావు వదనం వివర్ణమై పోయింది.
    టక్కున ప్రసాదరావు మనస్సు నోచ్చుకుందని గ్రహించిన వాసు, "చిన్న మామయ్యా , అత్తయ్యా, పిల్లలూ చాలా మంచివాళ్ళు , నాన్నా!" అన్నాడు.
    "వాళ్ళంతా మంచివాళ్ళు కనకనే వాళ్ళ నీడన ఇంత వాడివయ్యావు. వాళ్ళు కాక ఈనాడు నువ్వు వెతుక్కున్న నాన్నా మంచివాడు? అది కాదు నేననేది.... నా దగ్గర ఉండే చదువుకుంటే?'
    అతనలా ఎందు కంటున్నాడో, ఆ మాటల అర్ధమేమిటో గ్రహించలేని వాసు మౌనంగా తల వంచి నడుస్తున్నాడు. ఇద్దరూ ఫ్లాటు ఫారం దాటి రిక్షా ఎక్కారు.
    తన కొడుకని, కాలేజీ లో చదువుతున్నాడనీ స్నేహితులకీ, తన తోటి వ్యాపారులకి పరిచయం చేశాడు ప్రసాదరావు. అందరికీ వినయంగా నమస్కరించాడు వాసు.
    రెండు రోజులు తండ్రి అడరాభిమానాలకి ఉక్కిరిబిక్కిరయ్యాడు వాసు. మేనమామల ప్రేమలో తనకి లభించని ఏదో ఆత్మీయత ప్రసాదరావు లో అడుగడుగునా ద్యోతకమైంది వాసుకి. అంతర్లీనమైన రక్తసంబంధం అతన్ని ఎన్నోసార్లు "నాన్నా!' అని పిలిపించింది. ఆ పిలుపుతో వాత్సల్య పరవశుడోతున్నాడు ప్రసాదరావు. "బాబూ! నాన్నా, వాసూ!" అని ప్రాణాధికమైన ప్రేమతో సంభోదిస్తున్నాడు కొడుకుని.
    "ఈవేళ సాయంత్రం వెళతాను, నాన్నా!"
    తన నావరించిన ఏదో మత్తు విడిపోతున్నట్టు ఉలిక్కిపడి , "వెళ్ళిపోతావా? అప్పుడే? ఇంకా సెలవులు ఉన్నాయి కదూ?' అన్నాడు ప్రసాదరావు.
    'అమ్మ ఉత్తరాలు వ్రాస్తుంది. చూడాలనుందట" నెమ్మదిగా అన్నాడు వాసు.
    రెండు క్షణాలు ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయి, "సరే. ఈ వేళ మంచిరోజు కాదు. రేపు సాయంత్రం బండికి వెళ్ళు!' అని క్షణం వాసు నుంచి సమాధానం రాకపోవడంతో , "ఏం నాన్నా! మళ్ళీ ఏవో సెలవులూ ఉంటె కాని రావుగా? అందుకని...." అంటూ వాసు మొహంలోకి చూశాడు ప్రసాదరావు.
    "సరే, మీ ఇష్టం. అలాగే రేపే వెళతాను." అన్నాడు వాసు.

                          *    *    *    *
    వాసు బాబు ఏమని వ్రాశాడు ఉత్తరం ?' కూతుర్నడిగింది జానికమ్మ.
    "సెలవులు ఇచ్చాక వస్తానని వ్రాశాడు. కాలేజీలకి సెలవులిచ్చి నాలుగు రోజులయింది. రాడేమో? తమ్ముడే మన్నాడో?" అంది మధుమతి.
    "ఏమో? అయితే అలా అయి ఉండవచ్చు. ఫీజులూ, పుస్తకాలూ, తిండి కాకుండా, రైలు చార్జీలు కూడా అంటే కష్టం కదూ? పోనీలే, వచ్చినప్పుడే చూస్తాం. అన్నీ కావాలంటే ఎలా?"
    జానికమ్మ మాటలు నగ్నసత్యాలైనా మధుమతి గుండెల్ని నిలువునా చీల్చాయి. చప్పున కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన దురదృష్టానికి మూగగా రోదించింది మధుమతి.

                           *    *    *    *
    పండుగ రోజులు కావడాన రష్ గా ఉంది బట్టల షాపు. టేరిలిన్, ఉలెన్, టెర్రీ కాట్ -- ఇంకా ఏదో ఖరీదైన  పాంటూ, షర్టూ, బట్టలు చూపిస్తూ , "నీకు నచ్చినవి ఓ నాలుగు జతలు తీసుకో" అన్నాడు ప్రసాదరావు.
    చకితుడై చూసిన వాసు అప్రతిభుడై పోయాడు. అతని మనస్సేటేటో పరుగులు తీసింది. తానెప్పుడూ మామయ్యా తో షాపు కెళ్ళి తన కిష్టమైన బట్టలు ఏరుకోలేదు. "నీకీ బట్టలు కావాలా?" అని ఎవ్వరూ తనని ప్రశ్నించలేదు. దయధర్మ బిక్షగా అమ్మమ్మో, మామయ్యలో వారికి తోచినవి కుట్టించడం, తానవే తోడుక్కోవడం . పెద్ద మామయ్య , అత్తయ్యా , పిల్లలూ పండగ బట్టలు తీసుకోవడానికి షాపుకి వెళుతుంటే అరుగు చివర నిలుచుని వారి వైపు చూసేవాడు, వాళ్ళ అదృష్టాన్ని మెచ్చుకుంటూ. "వాసూ, ఇలా రా. ఎందుకలా వాళ్ళు వెళుతుంటే నిలుచుని చూడడం?' అని కసురుకునేది అమ్మ, కళ్ళు తుడుచుకుంటూ. జయా, చంద్రం వాళ్ళ బట్టలు చూపిస్తే ఎంత బాగున్నాయో అని వింతగా చూసేవాడు తను. చంద్రం తొడుక్కొని బట్టలు తన కిచ్చేది అత్తయ్య. చిన్న మామ్మయ్య వస్తే, తనకూ, అమ్మకూ అమ్మమ్మ కూ బట్టలు కొనేవాడు.
    "వాసూ! తీసుకో తొందరగా." ప్రసాదరావు గొంతు వినరావడం తో గతం చెదిరిపోయింది.
    "బట్టలు ఉన్నాయి, నాన్నా! ఇప్పుడెందుకు?' అప్రయత్నంగా వాసు గొంతు వణికింది. 'అసలు నాన్న దగ్గర బట్ట లేలాటి వెంచుకోవాలో నీకు తెలుస్తేగా?' అంటూ తానే కొన్ని గుడ్డలు ఏరి పాక్ చేయించాడు ప్రసాదరావు.

                           
    "అబ్బా! కళ్ళు కాయలు కాశాయిరా!" రెండు చేతులతో వాసు తల పట్టుకు ముద్దు పెట్టుకుంది మధుమతి.
    "నా ఉత్తర మందిందా? అమ్మమ్మేది?' అడిగాడు వాసు. "సెలవు లిచ్చిన వెంటనే వస్తావనుకున్నాను. వచ్చేవాడివి ఎలాగూ వచ్చావు. ఇంత ఆలస్యం ఎందుకు చేశావురా , బాబూ!" అని అతని చేతిలో సంచీ అందుకుని, "పెట్టె హోల్దారు తెచ్చావు -- ఎన్నాళ్ళిచ్చారు సెలవులు?' అంది వింతగా వాసు వైపు చూస్తూ.
    మాటలకి తడుముకుంటూ మౌనంగా బాత్ రూమ్ వైపు నడిచిన వాసు "ముందే ప్రిపేరవవలసినది-- ఇలాంటి ప్రశ్న లేలానూ వస్తాయి కనక' అనుకున్నాడు.
    రాజశేఖరం పిల్లలూ, జయా, చంద్రం "వాసు.... వాసోచ్చాడు" అంటూ సందడిగా వచ్చారు. "అబ్బా ఎన్నో రోజులో అయిపోయినట్టుంది! నువ్వసలు రావేమో అనుకున్నాం." అంటూ విప్పారిత నేత్రాలతో ఆప్యాయంగా వాసు వైపు చూసింది జయ.
    "ఎందుకు రాను? నాకు మాత్రం మీ అందర్నీ చూడాలని ఉండదూ?' చిన్నగా నవ్వుతూ అన్నాడు వాసు. రాజశేఖరం భార్య సుందరమ్మ వచ్చి వాసు వైపు పరిశీలనగా చూస్తూ లక్ష్మీ , పిల్లలూ బాగున్నారా, వాసూ?' అని పలకరించింది.
    "బాగున్నారత్తయ్యా! మామయ్యా ఉన్నాడా! కాంపేళ్ళాడా?' ఆ గొంతులో ఇదివరకు ఉండే బేలతనం స్థానే నిండుతనం , ధైర్యం.
    అతన్ని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసిన సుందరమ్మ "అబ్బ, ఎంత మారిపోయాడు! ఈ చురుకూ, ఈ ధైర్యం ఎలా వచ్చింది? ఏం భరోసా ఇచ్చాడో ఆ మామయ్యా!" అనుకుంటూ, "లేదు. ఊళ్ళోనే ఉన్నారు. బాగున్నావోయ్ మనిషివి. ఆ ఊరు గాలీ, నీరూ పడినట్టుందే!" అని నవ్వింది అదోలా అతని వైపు చూస్తూ-- వంట ఇంటిలో ఉన్న జానికమ్మ కళ్ళు రెండూ మూశాడు వాసు వెనకపాటున వెళ్ళి.
    "ఒరేయ్ చంద్రిగా. తంతాను సుమా! చేతులు తియ్యి!" బజారు నుంచి తెచ్చిన కూరగాయల సంచీ క్రింద పడేసి, తన కళ్ళని మూసిన చేతులు పట్టుకుంటూ అంది జానికమ్మ.
    "నువ్వు కూరల బజారు కెళ్ళావా , అమ్మామ్మా?' అన్నాడు వాసు టక్కున చేతులు తీసేసి ఆమె వైపు బాధగా చూస్తూ.

 Previous Page Next Page