Previous Page Next Page 
నయనతార పేజి 16

    చాలా సేపు నిల్చుని మరి లాభం లేదని మరి కాస్త ముందు కెళ్ళి "సుందరీ!" అన్నాడు సారధి. తార అప్పుడు చూసింది "వచ్చావూ . నీకోసమే చూస్తున్నాను" అంటూ పలకరించింది. తనొచ్చి పదినిముషాలయింది, యిప్పుడన్నా పిలిస్తే చూసింది. తనకోసమే చోస్తూన్నానంటుంది. ఎంత అబద్దం!
    "మెనీ రిటర్న్ ఆఫ్ ది డే సుందరీ!" అంటూ చేతిలో ప్యాకెట్టు అందించాడు. తార ఆ ప్యాకెట్టు అందుకొక పూర్వమే ప్రక్కనే నిల్చున్న ఆమె ఆయా అది అందుకుని మిగతా బహుమతులన్నింటి ప్రక్కన పెట్టేసింది. "థాంక్స్" అంది తార. "రా, ఇలా కూర్చో" అంటూ ఓ టేబిల్ ముందు కూర్చో బెట్టింది. ఇంతలోనే ఇద్దరు ముగ్గురు రావడం చూసి అటు వెళ్ళింది తార పలకరించడానికి.
    ఎవరెవరో వస్తున్నారు. కొంతమంది నటీనటులని, డైరక్టర్లని, ప్లేబాక్ పాటగాళ్ళని గుర్తించగలుగుతున్నాడు సారధి. కొందరు తార భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గిరకి లాక్కుని అభినందిస్తున్నారు. ఆమె భుజాలు పట్టుకుని "బర్తడే గర్ల్" కిస్ అంటూ ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నారు మరికొందరు. ఆమె బుగ్గ మీద పేట్ చేసి "హేపీ బర్తుడే " అంటూ విష్ చేస్తున్నారు మరికొందరు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఫోటో గ్రాఫర్లకి ఫోజులిస్తున్నారు . ప్లాష్ బల్బులు, ఆగకుండా వెలుగుతున్నాయి. అందరిని నవ్వుతూ పలకరిస్తుంది. సుతారంగా నమస్కారం చేస్తుంది కొందరికి. 'ఇప్పుడా రావడం' అంటూ ముద్దు ముద్దుగా గునుస్తుంది మరి కొందరి దగ్గర. మరికొందరితో గలగల నవ్వుతూ హస్యాలాడుతుంది. వాళ్ళని, వాళ్ళ మాటలని వారి వేష భాషలని ఆశ్చర్యంగా కాసేపు చూశాడు సారధి.
    తార డ్రస్సింగు , ఆమె మాట్లాడే తీరు , ఆమె నవ్వే తీరు, అందరూ ఆమెతో తీసుకునే చనువు , ఆ మాటలు అన్నీ ఎందుకో సారధికి నచ్చలేదు. ఏదో తెలియని భారంతో సారధి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టనిపించింది. తార చాలా బిజీగా వుంది. తనతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడే సూచన కనిపించలేదు. తను రాగానే అందరి మధ్య నించి లేచి ఆదరంగా, అట్టహాసంగా తనని ఆహ్వానించి, అందరికి నా డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుందని, అందరూ తన వంక చూస్తె తను గర్వపడినట్టు తను వచ్చాక తన దగ్గిరే కూర్చుని మాట్లాడుతుందని , ఏవేవో ఆశించిన సారధికి ఆమె ధోరణి నిరుత్సాహం కల్గించింది. ఆ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి అయినట్లు, అంతమంది మధ్య తానొక్కడే వెలేసినట్టు ఫీలవుతూ -- ఆ టేబిల్ దగ్గిర నించి లేచి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు.
    తార బర్తుడే కేక్, గుండె ఆకారంలో వున్న కేక్ కట్ చేసింది. అందరూ ఆమె చుట్టూ గుంపుగా చేరి చప్పట్లు కొట్టి "హేపీ బర్తుడే టూ తారా" అంటూ గొంతుకలిపి పాడి విష్ చేశారు. హీరో కిరణ్ చిన్న కేక్ ముక్క తీసి ఆమె నోటికి అందించాడు. నేనేం తీసిపోయానన్నట్టు హీరో శ్యాం కూడా ఓ ముక్క నోట్లో పెట్టాడు. నలుగురయిదుగురు అందించాక ఆమె చేయి అడ్డం పెట్టి "ప్లీజ్ అంటూ వారించింది.
    దూరం నించి అంతా గమనిస్తున్న సారధి మనసుకి కష్టం అనిపించింది. "వాళ్ళంతా నాకేం అవరు, నీవే రావాలి నిన్నే ప్రత్యేకం పిలుస్తున్నా" నన్నసుందరి - తను వచ్చినట్టు చూడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం కేక్ కట్ చేస్తూ అన్నా తన కోసం చూడలేదు. ఆమె ఆప్తులన్నట్లు వాళ్ళంతా కేక్ తినిపిస్తుంటే నిన్ను చూస్తె ఎవరో అప్తుడిని చూసినట్టుంటుంది అన్న సుందరికి అప్పుడన్నా తను గుర్తు రాలేదు. తార తన సొత్తు అయినట్టు, ఆమెని ఎవరో తన నించి విడదీసినట్టు సారధికి అసూయగా వుంది. తార మీద కోపం వస్తుంది.
    ఫలహారాలు చేస్తున్న అందరి మధ్య తిరుగుతూ అందరినీ పలకరిస్తున్న తార సారధి టేబిల్ దగ్గిరకి వచ్చింది.... "అదేం ఇక్కడ కూర్చున్నావు....... అన్నీ తీసుకున్నావా ? నీకోసమే వెతుకుతున్నాను... ఎక్కడ వున్నావా అని చూస్తున్నాను" అంది.
    సారధి కసిగా, కఠినంగా ఏదో అనాలనుకునే లోపలే మరెవరో దగ్గిరికి వచ్చి పలకరించారు. తార నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ కదిలి వెళ్ళిపోయింది.
    ఆ తరువాత సారధి ఇంక ఎందుకో అక్కడ కూర్చోలేక పోయాడు. ఫలహారం ప్లేటు టేబిల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అంతమంది మధ్య సారధి వెళ్ళడం ఎవరు పట్టించుకుంటారు! ఏదో అవమానం జరిగినట్టు, మొహం ఎర్ర పరచుకొని విసవిస వెళ్ళిపోతున్న సారధిని తార చూడలేదు.

        
                                     *    *    *

    మర్నాడు సారధి ఆఫీసు నించి యింటి కొచ్చేసరికి తార కారు డ్రైవరు సారధి కోసం నిరీక్షిస్తూ కారులో కూర్చున్నాడు సారధి గది ముందు. "అమ్మగారు మీరు రాగానే తీసుకురమ్మని పంపారండి" అన్నాడు వినయంగా. అసలే కోపంతో ఉడికిపోతున్న సారధికి మరింత వళ్ళు మండింది. ఏమిటో సుందరి ఉద్దేశ్యం! తనో వెర్రి వెధవ అనుకుంటుందా? ఆవిడ పిలిచేసరికల్లా పరిగెత్తి వెళ్ళడానికి! ఆవిడ పెద్ద నటి, లక్షాధికారిణి అవచ్చు. కాని అంత ఆత్మాభిమానం చంపుకోవడానికి తనేం అంత పౌరుషం లేనివాడు కాడు! తనని ఆవిడగారు రమ్మన్నప్పుడల్లా వెళ్ళడం తప్ప మరో పని లేదనుకుందా! ఈరోజు నాలుగు డబ్బులు సంపాదించేసరికి ఎంత గర్వం! కసిగా అనుకుంటూ "పనుంది ఇప్పుడు రాలేనని చెప్పు" అన్నాడు వీలయినంత సౌమ్యంగా డ్రైవరుతో.

 Previous Page Next Page