అందుకే అసలు రాకూడదనుకున్నాడు , రానన్నాడు. తార ఫోను చేసి పిలిచినపుడు ---- "ఏమిటీ , రావూ ---- అదేమిటి?" అంది తార ఫోనులో ఆశ్చర్యంగా.
"క్షమించు సుందరీ. నేనెందుకు లెద్దూ. మీ సినిమా వాళ్ళందరూ వస్తారు గాబోలు. నాకెవరూ తెలియదు. నేనెవరికీ తెలియను. నాకు మొహమాటంగా వుంటుంది. కావలిస్తే ఉదయం వచ్చి నీకు గ్రీటింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతా." అన్నాడు.
"అదేం కుదరదు ఎవరూ తెలియక పొతే నీకేం. నేనూ తెలియనా, నేను లేనా. నీవు రాకపోతే నేను చాలా బాధపడ్తాను. వీళ్ళందరిని పిలవడం, వాళ్ళందరూ రావడం, వెళ్ళడం అన్నదంతా ఓ ఫార్మాలిటీ , నేను మనస్పూర్తిగా రమ్మని పిలుస్తున్నది నిన్నోక్కడినే తెలుసునా. తక్కిన అందరికి కార్డ్స్ వెళ్ళాయి. ప్రత్యేకం ఫోను చేసి నేను పిలుస్తున్నది నిన్నే."
ఒక్క క్షణం సారధికి సంతోషంతో పాటు గర్వమూ కల్గింది. తార, ప్రఖ్యాత సినీ నటి అయిన తార తనని మాత్రమే ప్రత్యేకం పిలుస్తుంది!
"రాకూడదని ఏం లేదు. ఇన్ ఫాక్ట్ వస్తే సినిమా ప్రపంచంలోని మనుషులందరినీ చూడవచ్చని కోరిక గానూ వుంది . కాని ----కానీ ------"
"కానీలు ఇంక లేవు రావాల్సిందే వస్తావు. టైముకి రాకపోతే కారిచ్చి డ్రైవర్ని పంపిస్తా . నీవు వచ్చేవరకు పార్టీ ఆరంభం అవదు. అన్న సంగతి గుర్తించు" అంటూ మరో మాటకి అవకాశం ఈయకుండా ఫోను పెట్టేసింది తార.
సుందరి ప్రత్యెకాభిమానాన్ని గురించి ఓ ప్రక్క ఆనందిస్తున్నా ...... ఓ ప్రక్క ఏదో తెలియని సందేహం , సారధిని పట్టుకుంది. ఆమె అభిమానానికి అర్ధాలు వెతకడం ఆరంభించాడు. ఆలోచించిన కొద్దీ ఏదో భయమూ కలగసాగింది. సారధికి. తను ..... తన స్థితి..... తార ...... ఆమె చుట్టూ ప్రపంచము. ఆమె అంతస్తులన్నీ గుర్తులో వుంచుకొని యీ పరిచయాన్ని కేవలం పరిచయంగా మాత్రమే ఉంచాలి గాని అంతకుమించి పెరగనీయక పోవడం మంచిదేమోననిపించిది సారధికి. ఆ ఉద్దేశ్యంతోనే సుందరి ఇంటికి ఆ తరువాత మళ్ళీ ఓ ఇరవై రోజులు వెళ్ళలేదు. తార ఓ రోజు ఫోను చేసింది. ఏదో కారణం, సాకులు చెప్పాడు. అలా ఓ వారం గడిచాక ఓరోజు ఉదయం షూటింగ్ కు వెళ్ళేముందు తార సారధిరూముకి వచ్చేసింది. అర్ధాంతరంగా , హటాత్తుగా పెద్ద కారులో , ప్రఖ్యాత నటీమణి బ్రహ్మచారి , వంటరి అయిన తన కొట్టులాంటి గదికి రావడంతో సారధి గాభారపడి పోయాడు. "ఇదేమిటి ..... ఇదేమిటి. ఇలా వచ్చావు " అంటూ వున్న ఒక్క కుర్చీలో కూర్చోపెడుతూ సుందరిని ఆరాటంగా అడిగాడు.
తమరి దర్శనం కాకపోతే మరేం చేస్తాను. రాక .... మహమ్మద్ రాకపోతే మవుంటేనే వెళ్ళిందట అక్కడికి. అలా - తమరు బెట్టుచేస్తున్నారు గదా , రాకేం చేస్తాను...." బుంగమూతి పెట్టి అంది తార.
'అది కాదు , అది కాదు....."
"ఏది కాదు? ...... నీవెందుకు రావడం లేదో చెప్పు ముందు ఎందుకు నన్ను ఎవాయిడ్ చేస్తున్నావు ?" హార్ట్ అయినట్టు ఆమె గొంతే చెప్పింది. సారధి జవాబు చెప్పలేనట్టు చూపు మరల్చుకుని తల దించుకున్నాడు. "నిజంగా సారదీ , నీ కంపెనీలోనే నేను కాస్త హాయిగా ప్రశాంతంగా ఫీలవుతున్నాను. తక్కిన వాళ్ళందరి ముందు ఆ లైఫ్ ఏదో ఆర్టిఫిషల్ గా అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్య మరీ దిగులుగా వుంటోంది. లోన్లీగా ఫీలవుతున్నాను. అలాంటి సమయంలో నీతో కాసేపు కబుర్లు చెపుతే హాయిగా వుంటుందనిపిస్తుంది. నీవసలు రావడమే మానేసావు ........." బాధగా అంది తార. సారధి చాలించాడు. ఆ విచలిత కంఠన్ని విని.
"సారీ, సుందరీ . నా కంపెనీ నీకు నిజంగా సంతోషాన్నిస్తుందనుకొని నేను అస్తమాను రావడానికి నీకు నాకు వున్న పరిచయం ఏపాటి అని మొహమాట పడ్తున్నాను. అందరూ మీవాళ్ళు, అందరూ ఏమనుకుంటారో అని...."
"నాన్సెన్స్ ...... ఎవరేమనుకుంటారు ! అనుకుంటే నాకేం భయం? మావాళ్ళు , హు ... మావాళ్ళ నా గురించి అంతమాత్రం పట్టించుకుంటే ఇంకేం!" కోపంగా అంది తార. "నీవు నన్ను ఇంకా అపరిచితురాలి క్రింద ట్రీట్ చేస్తున్నావు గాబోలు. కానీ నేనెప్పుడూ ..... ఇప్పుడూ నిన్ను మంచి మిత్రుడుగా, నా అప్తుడిగానే భావించాను, ఇప్పుడు పెద్ద నటినయ్యాక నేనేదో మారిపోయాననుకుంటావు గాబోలు...... నీమీద నాకున్న.....నాకుండే భావం ...... ఎలా చెప్పను?"
"థాంక్స్ ......థాంక్స్ సుందరీ ........నిన్ను సరిగ్గా అర్ధం చేసికోలేకపోయాను క్షమించు. నా రాక , నా కంపెనీ నీకు ఆనందాన్నిస్తుందంటే తప్పక వీలున్నప్పుడల్లా వస్తుంటాను."
"ప్రామిస్" విలాసంగా చేయి చాపింది తార. కాస్త సందేహిస్తూ ఆమె చేతిలో చేయి వేశాడు సారధి. ఆ వేసిన చేతిని ఒక్క క్షణం అలా పట్టుకుని సారధి మొఖంలోకి చూసింది. ఆమె మొహం ఎందుకో ఎర్రబడినట్లనిపించింది సారధికి. నెమ్మదిగా చేయి తీసేసుకున్నాడు . తార చప్పున తెలివి తెచ్చుకున్నట్టు సర్దుకుని లేచి నిల్చుంది. "వస్తా స్టూడియోకి వెడుతూ వెడుతూ ఇలా వచ్చాను ఆలశ్యం అయింది అంతా ఎదురు చూస్తుంటారు." అంటూ గబగబ వెళ్ళి పోయింది.
"అదేమిటి మీరు రారేం....... ఫలహారం తీసుకోరూ" అంటూ తార అన్నయ్య వచ్చి సారధిని పలకరించేసరికి ఆలోచనల మధ్య నించి తేరుకుని చుట్టూ చూశాడు. అందరూ టేబిళ్ళ చుట్టూ చేరుకున్నారు. బుఫే పార్టీ -- పెట్ల లోంచి ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటున్నారు.
సారధి తార అన్నయ్య వెంట వెళ్ళాడు. అతను టేబిల్ దగ్గరికి తీసికెళ్ళి ఓ ప్లేటు అందించి మరో వైపు వెళ్ళిపోయాడు. కాస్త ఖాళీగా వున్న ఓ టేబిల్ వైపు నడిచాడు సారధి. ఏవో ఓ రెండు ఫలహారాలు పెట్టుకుని తన కుర్చీలోకి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. తార ఆ గుంపు మధ్య ఎక్కడుందీ కనపడలేదు సారధికి --------- రాను మొర్రో అంటే బలవంతం చేసిన తార మీద కోపం వస్తుంది సారధికి. సారధి వచ్చేసరికి సగం మంది వచ్చి వున్నారు. అందరి మధ్య కూర్చుని గలగలా నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న తార చాలాసేపటికి వరకు సారధి ఎదురుగా వచ్చి నిల్చున్నా గుర్తించలేదు. అంతమంది అపరిచితుల మధ్య, కొందరు సారధిని ఎవరన్నట్టు చూస్తుంటే సారధి ఇబ్బందిగా కాసేపు నిల్చున్నాడు.
తార ఆ రోజు మరీ అభునికంగా అలంకరించుకుంది. పల్చటి నైలాన్ షుగ్ర ...... పైన పల్చటి లూజు జుబ్బా .... మరో పల్చటి వల్లేవాటు ,అన్ని బట్టలు వున్నా , తార అవయవ సౌష్టవాన్ని స్పష్టంగా చూపించే ఆ డ్రెస్సింగ్ లో తారని చూడడానికి సారధి ఎందుకో ఇబ్బంది పడ్డాడు. హాయిగా శుభ్రంగా చీర కట్టుకోకుండా ఈ బట్టలేమిటో అనుకున్నాడు. చాలా ఖరీదయిన రాళ్ళ నగలు ఆమె వంటిని మారుస్తున్నాయి. జుత్తు సిగ చుట్టకుండా బాబ్ గా వదిలేసింది. ఆమె ప్రక్కన ఎన్నో పూల బొకేలు, పువ్వుల మాలలు, అందంగా రంగు కాగితాలతో రిబ్బను కట్టిన ప్రెజెంటేషన్ పెకట్లు చాలా వున్నాయి. ప్రక్కన టేబిల్ మీద ఆ పెద్ద పెద్ద పెకట్ల మధ్య తన చేతిలో ప్యాకట్టు చూసుకుని సిగ్గుపడ్డాడు సారధి.
అసలు తారకి ఏ బహుమతి తీసుకెళ్ళాలా అన్న ప్రశ్నకి జవాబు తట్టలేదు. తను ఎంత ఖర్చు పెట్టినా ఓ ఏభై మహా అయితే వంద కంటే ఖర్చు పెట్టలేడు. వంద రూపాయలు పెట్టినా ఏమీ రాదు మంచిది. ఎందరెందరో పెద్ద వాళ్ళు, లక్షలార్జించే వాళ్ళు తెచ్చే ప్రెజంట్ల ముందు తన బహుమతి తార కంటికేం ఆనుతుంది. అసలు రాననడానికి ఇది ఒక కారణం, అయినా తప్పింది గాదు. అక్కడికీ ఎంతో అలోచించి మంచి నిర్మల్ పెయింటింగ్ -- రాదాకృష్ణులు ఒకరి వడిలో ఒకరు తన్మయు లవుతున్నట్టు చిత్రించిన పెయింటింగ్ కొన్నాడు.