"ఇలాంటి చిన్న విషయాలు వెంకటేశ్వర్లు నడగాలి! లేదా సర్క్యులేషన్ మేనేజర్ని పిలవాలి! నన్ను డిస్టర్బ్ చేయకూడదు....." బట్టతల సవరించుకుంటూ అనేసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు.
చిరంజీవి మొఖం ఎర్రగా అయిపొయింది. ఇనుములా బిగుసుకున్న పిడికిళ్ళను చాలా సేపటికి గాని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
మొఖమంతా చెమటలు పట్టేసింది. ఉక్కపోస్తున్నట్లనిపించింది. లేచి బాత్ రూమ్ లోకి నడిచి వాష్ బేసిన్ దగ్గర నిలబడి మొఖం కడుక్కోడానికని దోసిట నిండా నీళ్ళు తీసుకున్నాడు .
అప్పుడు కనిపించింది తన అవతారం అద్దంలో.
మూసిపోయిన బట్టలు - ఒకటి రెండు చోట్ల పిగిలిపోయి- మొలక లేత్తుతున్న గడ్డం- మెరుపు తగ్గిన కళ్ళు - వాడిన మొఖం-
ఈ అవతారమా ఈ సంస్థకు యజమాని!
ఇందుకేనేమో అందరూ అంత నిర్లక్ష్యంగా , చులకనభావంతో చూశారు తనను!
ఇదే తను సూటులో ఉండి, కారులో తిరుగుతున్నట్లయితే పరిష్టితి ఎలా ఉండేది?
మొఖం కడుక్కుని కర్చీఫ్ తో తుడుచుకుంటూ గదిలో కొచ్చాడు చిరంజీవి.
ఆ కుర్చీ మీద అలాంటి బట్టలతో - అలాంటి రూపంలో కూర్చోడానికి మనసొప్పలేదతనికి.
ఆఫీస్ బిల్డింగ్ బయటికొచ్చాడు . నెమ్మదిగా 'గేటు' వేపు నడవసాగాడు.
వాచ్ మేన్ మళ్ళీ సెల్యూట్ కొట్టాడు.
"వెళ్ళిపోతున్నారేం సార్?"
వాడి కళ్ళలో జాలి, ప్రేమా అన్నీ కనిపించినాయ్ చిరంజీవికి.
"పనుంది!"
రోడ్డు మీద జనప్రవాహంలో కలిసిపోయి నడుస్తున్నాడతను.
హటాత్తుగా చిరంజీవికి భయం వేసింది. నిరుత్సాహం రక్తంలా ప్రవాహించసాగింది వంట్లో!
ఆఫీస్ లో చుట్టూ శివతాండవం , వెంకటేశ్వర్లు లాంటి నక్కల్ని పెట్టుకుని తనేం సాధించగలడు.
తనే కాదు ఎవరూ ఏమీ చేయలేరు.
ఆఖరివరకూ ఇలా చాలీ చాలని జీవితం గడపాల్సిందే! స్వప్న అలా దరిద్రంలో మగ్గిపోవలసిందే.
తను 'తెలుగు కిరణం' దినపత్రికను లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ గా చేయడానికి ప్రయత్నించటం అవివేకమేమో!
ఇంటికి చేరుకొని గడప దగ్గర నిలబడి లోపలకు చుశాడతను.
స్వప్న 'స్టౌ' ముందు కూర్చుని వంటపనిలో నిమగ్నమయి ఉంది.
నెమ్మదిగా , శబ్దం కాకుండా నడిచి వంటింటి గడప మీద కూర్చున్నాడతను.
స్వప్న కూరగాయ తరుగుతూ సన్నగా పాట పాడసాగింది.
"ఇది మల్లెల వేళయని....ఇది వెన్నెల మాసమని.....తొందరపడి ఓ కోయిల ముందే కూసింది - విందులు చేసింది...."
ఇక్కడ దేనికోసమో ప్రక్కకు తిరిగి - కూర్చుని ఉన్న చిరంజీవిని చూసి ఉలిక్కి పడింది.
"నువ్వా!' అంది ఆశ్చర్యంగా.
"అవును!"
"ఎందుకలా శబ్దం లేకుండా దొంగలా వచ్చావ్?"
"నిన్ను అర్జంట్ గా చూడాలనిపించింది."
"పాపం! ఎందుకనిట?"
"ఏమో?"
"పెద్ద వద్దంటే ఆ పత్రికకు చెరిగేస్తానని కబుర్లు చెప్పి వెళ్ళావుగా" నవ్వుతూ అందామె.
చిరంజీవి ఆ మాటతో కృంగిపోయాడు.
అక్కడ జరిగినవన్నీ స్వప్న కెలా చెప్పాలో తెలీటం లేదు.
"ఏం జరిగిందక్కడ?" అడిగిందామె చాలా మాములుగా.
"ఏమీ లేదు! కానీ ఆ ప్రయత్నం వృధాయేమో అనిపిస్తోంది....."
"నేను పొద్దున్న అదే తెలుగులో చెప్పాను.!"
చిరంజీవి లేచి ఆమె దగ్గర కెళ్ళి ముందుకి వంగి ఆమె చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు .
'సారీ డియర్!"
"ఇదెందుకో!"
"నిన్ను ఇన్ని అవస్తలు పెడుతున్నందుకు...."
ఆమె కిలకిలా నవ్వింది. "ఏ సినిమాలోది డైలాగ్?"
ఆమె ముఖంలోని అందం, అమాయకత్వం, నిర్మలత్వం, చూస్తుంటే మళ్ళీ తన మీద తనకే కోపం వస్తోంది.
ఆస్తంతా తన చేతికి చిక్కే అవకాశాన్ని ఇలా దారుణంగా వదులుకోవలసిందేనా? స్వప్న లాంటి అందాల దేవతను జీవితాంతం ఈ దరిద్రానికి ఆహుతి చేయాల్సిందేనా?
అతనిలో రోషం , కసి , ఆవేశం పొంగుకొచ్చినాయ్.
"నో" అంటూ గట్టిగా అరచాడు పిడికిళ్ళు బిగిస్తూ.
స్వప్న ఆ అరుపుకి బిత్తర పోయింది.
"ఏయ్! ఏమిటది? ఎందుకలా అరిచావ్?" అనడిగింది ఆశ్చర్యంగా.
"ఆ ఆస్తి మనది స్వప్నా! విభూతి బాబాలది కాదు! అది నేను సంపాదించి తీర్తాను!" ఆవేశంగా అన్నాడతను.
స్వప్నకు నవ్వొచ్చింది. విరగబడి నవ్వుతుంటే కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
*****
'రైజింగ్ స్టార్' అ=ఇంచుమించుగా ఖాళీగా ఉందా రోజు.
అంచేత రైజింగ్ స్టార్ హోటల్లో బల్లల మీద ఈగలు గుంపులు గుంపులుగా చేరి కేరింతలు కొడుతూ తిరుగుతున్నాయ్. టేబుల్ మధ్యలో కొంచెం వలికిన ఎన్టీఆర్ 'టీ' ని చూసి తెగ సంబరపడి పోతున్నాయ్.
వాటిని చూసి ఈర్ష్యపడ్డాడు భవానీశంకర్.
"ఆహా! ఈగ జీవితం ఎంత ఆనందమయం?" అనుకున్నాడు మనసులో. వాటిల్లో ఎంత ఐక్యమత్యత ఉంది? ఎంత డెమోక్రసీ ఉంది? ఎంత స్వాతంత్ర్యం ఉంది? ఎంత సుఖం ఉంది?".... ఇంకా ఏవేవో అనుకొంటుండగానే ఓ క్లీనర్ కుర్రాడు ఏవో మందు నీళ్ళు తెచ్చి వాటి మీద స్ప్రే చేశాడు. క్షణాల్లో అవన్నీ గిలగిలకొట్టుకుంటూ కిందపడి చచ్చినాయ్.
వెంటనే భవానీ శంకర్ కి వాటిమీద ఎక్కడలేని జాలీ కలిగింది.
"హు! మనిషి జీవితం కూడా ఈగ జీవితం లాంటిదే కదా" అనుకున్నాడతను.
హాయిగా, సుఖంగా సినిమాపాటలు విజిలేసుకుంటూ తిరిగే మనిషి మీద ఎప్పుడే ఉపద్రవం వచ్చి పడుతుందో తెలీదు కదా! ఎవరి సంగతో ఎందుకు?
తన జీవితమే బ్రహండమయిన ఎగ్జాంపుల్! నాల్రోజుల క్రితం వరకూ "జీవితమే ఒక పూల వనం - లలలా, లాలలలా , బ్రతుకే ఒక బృందావనం లాలా, లలలా , లాలలలా అని పాడుకుంటూ తిరిగాడు. కానీ తరువాతేమయింది. ఉన్న ఉద్యోగం కాస్తా టక్కున ఊడిపోయింది.
"క్యాహోనా సాబ్?" సర్వర్ అతని దగ్గర కొచ్చి అడిగాడు.
భవానీశంకర్ ఆలోచనల్లోనుంచి బయటకొచ్చాడు.
"నీ పేరేంటోయ్ అడిగాడతనిని.
"సురేష్ సార్!"
"సురేష్! హు! చూడు సురేష్! జీవితం ముళ్ళబాటోయ్' సురేష్ అదిరిపడ్డాడు.
ఆ రోజు తను ఆ డైలాగ్ వినటం అది రెండోసారి.
చివరి టేబుల్ ముందు కూర్చుని అరగంట నుంచి ఏక దాటిన నిట్టూర్పులు విడుస్తోన్న మరో యువకుడు కూడా పావు గంట క్రితమే ఆ విషయం తనతో చెప్పాడు.
ఇలా ఒకటే డైలాగ్ ని పావుగంట వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు సీరియస్ గా వాడటం ఇంతకూ ముందేప్పుడు ఆ హోటల్ హిస్టరీలో జరుగలేదు.
ఒకవేళ ఆ మాటలో ఏమయినా రహస్య సంకేతాలున్నాయేమోనని అనుమానం వచ్చిందతనికి. చాలా డిటెక్టివ్ సినిమాల్లో ఇలా రహస్య సంకేతాలు మాట్లాడుకోవటం చూశాడతను.
"అవ్ సార్! ఆ టేబుల్ దగ్గర కూర్చున్నతను కూడా అదేమాట అంటుండే ఇందాక!" వినయంగా చెప్పాడతను.
భవానీశంకర్ కి ఆశ్చర్యం కలిగింది. ఇలా 'జీవితం ఓ ముళ్ళబాట' అనిపిస్తోంది తనోక్కడికే కాదన్న మాట! తనలాంటి ప్రాణి ఇంకోటుందన్న మాట! ఆ టేబుల్ వేపు తిరిగి చూశాడతను.
చెదిరిన జుట్టూ, సన్ గ్లాస్ కళ్ళజోడూ, జీన్స్ డ్రస్ లో చాలా దిగులుగా , దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడా యువకుడు.
తనలాగానే అతనూ ఏదో క్లిష్ట పరిస్థితిలో ఇరుకున్నట్లు స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. అతని మీద బోలెడు సానుభూతి కలిగింది భవానీశంకర్ కి.
సరిగ్గా అదే సమయంలో అతనూ భవానీశంకర్ వేపు చూశాడు. అతని ముఖం పరిచితమయిన మొఖంలా కనిపిస్తోంది గానీ - ఎలా పరిచితమో తెలీటం లేదు. బహుశా ఆ హోటల్ లోనే అంతకుముందు చూసి ఉండవచ్చు. లేదా తనతో పాటు ఏదయినా ఇంటర్యూ కోచ్చాడెమో!
ఏదేమయినా ఇద్దరూ స్నేహితులవటానికి ఇది సరయిన సమయం అనిపిస్తోంది. అదీగాక మనసులోని ఆవేదనంతా ఎవరికయినా చెప్పుకుంటే గానీ కొంత మనశ్శాంతి లభించేట్లు లేదు.
"హలో!" పలుకరించాడు భవానీశంకర్ చిరునవ్వు అర్జంటుగా అప్పు తెచ్చుకుని.
"హలో - హలో!" ఆదరంగా జవాబిచ్చాడతను.
భవానీశంకర్ ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని టేబుల్ దగ్గర కెళ్ళి కూర్చున్నాడు.