మరికొద్దిసేపటికి ఆ లారీలు జంక్షన్ లోకి వచ్చి ఆగాయి. సిగ్నల్స్ పాస్ చేసుకున్నాక తిరిగి ఐదు లారీలు కలిసి నార్తు ఈస్ట్ డైరెక్షన్ కేసి సాగిపోయిన రోడ్డులో ప్రయాణించటం మొదలెట్టాయి.
* * * *
చెక్ పోస్టులో వున్న నలుగురు ఫారెస్టు గార్డ్సు రేంజర్ మాదప్పకేసి ధీనంగా చూస్తున్నారు.
వారిమధ్య ఒక కిరోసిన్ దీపం మిణుకు మిణుకుమని వెలుగుతోంది. వారి చేతుల్లో రైఫిల్స్ లోడ్ చేస్తున్నాయి, చెక్ పోస్టు రూమ్ తలుపులు తెరిచిపెట్టి వున్నాయి. రోడ్డుకి అడ్డంగా లావైన, బలమైన సర్వ్ కడ్డీ వుంది.
వాతావరణం గంభీరంగా వుంది.
నిశ్శబ్దం భయానకంగా వుంది.
"ఈ రాత్రికి వీరూ లారీలు ఇటుకేసి వస్తాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది" ఒక గార్డు భయపడుతూ అన్నాడు.
మాదప్ప మాట్లాడలేదు. తన చేతిలోవున్న రైఫిల్ ని మృదువుగా నిమురుతున్నాడు.
"సార్....పెళ్లాం బిడ్డలు వున్నవాళ్ళం....మీరే దయ చూడాలి" మరో గార్డు అన్నాడు మెల్లగా.
మాదప్ప నోరు విప్పలేదు.
యుద్ధానికి సన్నద్ధంగా వున్న యోధుడిలా గంభీరంగా వున్నాడు.
"సార్ మీరు కొత్తగా వచ్చారు. మీకు వీరూ సంగతి తెలీదు. తనెవరిదారికి అడ్డురాడు. తన దారికి ఎవరయినా అడ్డువస్తే వాళ్ళ ఎకౌంట్స్ ని ఆ క్షణంలోనే సెటిల్ చేస్తాడు. అతని అనుచరులు పొంచి వుండే మృత్యువుకి ప్రతిరూపాలు. వారి మార్గానికి అడ్డం తొలగించి తలుపులేసుకు కూర్చుందాం సార్. మా మాటల్ని వినండి సార్" మరో గార్డు అన్నాడు.
అయినా మాదప్ప మౌనాన్ని వీడలేదు.
"నీతి, నిజాయితీలు మనకే కాదు సార్....మన పై అధికారులకి, ఆ పైన మంత్రులకు కూడా వుండాలి సార్....మొదటి ప్రపంచయుద్ధం నీటి ఈ నాటు తుపాకీలతో అతన్ని అడ్డుకోవాలనుకోవటం సాహసం సార్....ఒక్కసారి ఆలోచించండి....ఆపైన....మీ ఇష్టం" మరో గార్డు అన్నాడు నిస్పృహగా.
"వాడేమన్నా తల తీసి మొలేస్తాడా? ఎందుకు వాడి పేరు వింటేనే గజగజ వణికిపోతారు? మీలాంటివాళ్ళ పిరికితనమే వాడిలో పోరాటశక్తిని పెంచుతోంది" అన్నాడు మాదప్ప లేచి బయటకు చూస్తూ.
ఆ నలుగురు గార్డ్సు కళ్ళల్లోకి ప్రేతకళ వచ్చేసింది.
కాలం క్రమంగా కరిగిపోతోంది.
కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపంలా వుంది వాళ్ళ పరిస్థితి. రేంజర్ కి ఎదురు తిరిగితే ఉద్యోగాలు, రేంజర్ మాట విని లారీలకు అడ్డంపోతే ప్రాణాలు పణంగా పెట్టవలసిన క్లిష్టమైన పరిస్థితి.
టెన్షన్ తో నలుగురు గార్డ్స్ నుదుట స్వేదం అలముకుంది. సరీగ్గా అదే సమయంలో మలైమహదేశ్వరా హిల్స్ ఫారెస్టు రేంజ్ లో కొంతదూరం ప్రయాణించిన కరియా బృందానికి భైరవీ ఎదురయింది. ఆపైన వెనుదిరిగింది. కరియా కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. గంటన్నర క్రితమే భైరవీ తనకు ఇన్ఫర్మేషన్ అందించి వెళ్ళిపోయింది. అంతలోనే తిరిగి అక్కడ ప్రత్యక్షమయింది. నోటిలో కాగితమేదీ లేదు. అంటే....ఈ చుట్టుప్రక్కలే యజమానరే మకాం చేసుండాలి. ఆలోచిస్తూ నడుస్తున్న కరియా అతన్ని ఫాలో అవుతున్న తొమ్మిదిమంది అనుచారులు సడన్ గా ఆగిపోయారు.
"శెభాష్ కరియా....శెభాష్" అన్న వీరూ మాటలు వినిపించే ఆగిపోయారు.
కుడివేపున్న పొదల్లో చిన్న కదలిక.
కరియా బృందం చేతిలోవున్న దేవదారు కాగడాలు పరిసరాల్ని తెలియజేస్తున్నాయి.
కొద్దిక్షణాలకు కోవిదార వృక్షం మొదట్లో వీరూ ప్రత్యక్షమయ్యాడు.
"రక్షణ లేకుండా లారీలని పంపించమన్నావు. రేంజర్ మాదప్ప మొండివాడు. అనవసరమైన గలాటా సృష్టిస్తే పార్టీకి సకాలంలో సరుకు అందదు. తెల్లవారటానికి రెండున్నర గంటలకు ముందే సరుకు అందాలి. లేదంటే పార్టీ సరుకు తీసుకోవటానికి రేపు రాత్రివరకు ఆగిపోతుంది" కరియా కంఠం ఆ నిశ్శబ్దంలో కొండపై నుంచి రాళ్ళను దొర్లించినట్టుగా వుంది.
"నాలుగు రోజులుగా పనిచేసి బాగా అలసిపోయున్నారు. విశ్రాంతి తీసుకొనే ముందు దింపాగూడేనికి పదివేలు పంపించు. రేపక్కడ సంబరం. మీరు దింపాగూడేనికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళేసరికి వేలాయుధం తన బృందంతో వచ్చి కలుస్తాడు" అని వీరూ భైరవీ కేసి చూసి సంజ్ఞ చేశాడు.
అప్పటివరకు వీరూ కాళ్ళ దగ్గరున్న ఒక లెదర్ బ్యాగ్ ని భైరవీ నోట కరుచుకొని తీసుకువెళ్ళి కరియా ముందు వదిలివెళ్ళింది.
"తరువాత ఎక్కడ? ఎలా అన్నది తెలియపరుస్తాను. వీలైతే దింపాగూడెంలో కలుస్తాను" అంటూ వీరూ వెనుతిరిగాడు.
"సరుకు కొనే పార్టీ ట్రబుల్ లో పడుతుందేమో రేంజర్ మాదప్ప మూలంగా" కరియా తిరిగి అన్నాడు.
వెళ్ళబోతున్న వీరూ ఒక్కక్షణం ఆగాడు. "వీరూ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆ సమయానికి ప్రత్యక్షం కావచ్చు. లేదా వేరే ఏర్పాట్లు జరిగుండవచ్చు లేదా మన సరుకును దాటించే బాధ్యతని ఆ చెక్ పోస్టు సిబ్బందే తీసుకోవచ్చు. ఇది నా రాజ్యం. నా శాసనాలే ఇక్కడ అమలు జరుగుతాయి. చెక్ పోస్టు దగ్గర మన లారీలు నిమిషంకంటే ఎక్కువసేపు ఆగవు. నువ్వెళ్ళి ఎంజాయ్ చెయ్ కరియా" అనేసి చూస్తుండగానే వీరూ చీకట్లో కలసి అదృశ్యమైపోయాడు.
కొద్ది క్షణాలకు తేరుకుందా బృందం. తిరిగి ప్రయాణం సాగించింది.
అతని అనుచరులకి వీరూ ఒక ఎనిగ్మా ఎక్కడ, ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో, ఏ ఎత్తు వేస్తాడో, ఎలా అదృశ్యమైపోతాడో యెవ్వరికీ తెలీదు. కాగడా లేకుండా ఆ చీకట్లో ఒంటరిగా యెలా వచ్చాడు? భైరవీ తప్ప ప్రక్కనెవరూ లేరు. ఏదయినా ప్రమాదం చుట్టుముడితే? ఎలా తనను తాను ఎలా రక్షించుకుంటాడు? తెలీదు.
అతన్ని అనుక్షణం వెన్నంటి వుండే తంబీ ఎక్కడ? (తంబీ వీరూ పెంపుడు కోతి)
నిజంగానే తమ యాజమానరేకి అద్భుత శక్తులున్నాయి. ఆ బృందంలోని ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తూ ఆ నిశీధిలో పర్చుకున్న నిశ్శబ్దాన్ని భంగపర్చకుండా దింపాగూడేనికి సాగిపోయారు.
సరీగ్గా అదే సమయంలో చెక్ పోస్టులో వున్న అటవీ సిబ్బంది లారీలు వస్తున్న శబ్దాన్ని పసిగాట్టటం జరిగింది.
వారి కంఠాలు తడారిపోయాయి.
లారీలు మరింత దగ్గరయ్యాయి.
వాటి హెడ్ లైట్స్ కాంతి అక్కడిదాకా ప్రసరిస్తోంది. రేంజర్ మాదప్ప రైఫిల్ ని పొజిషన్ లోకి తెచ్చుకొని గార్డ్స్ కేసి చూసి సంజ్ఞచేసి బయటకు వెళ్ళి రోడ్డుకి అడ్డంగా వున్న సర్వే కడ్డీని ఆనుకొని నించున్నాడు. గత్యంతరంలేని పరిస్థితుల్లో గార్డ్సు కూడా వచ్చి రేంజర్ కి సహాయంగా నించున్నారు.
లారీలు చెక్ పోస్టు వద్దకు వచ్చి ఆగాయి.
మాదప్ప రైఫిల్ ని ముందు లారీలో వున్న డ్రైవర్ కేసి ఎయిమ్ చేసి దిగి రమ్మన్నట్లుగా సంజ్ఞ చేశాడు.
గార్డ్సు చెమటతో పూర్తిగా తడిసిపోయారు.
ఎవరో నియంత్రించినట్లుగా లారీల ఇంజన్లు ఆగిపోయాయి. ఆపైన లైట్స్ ఆఫ్ అయ్యాయి. తిరిగి ఆ ప్రాంతంలో గాఢాంధకారం అలుముకుంది.
"మర్యాదగా వచ్చి మీ పర్మిట్స్ చూపించండి" రేంజర్ పెద్దగా అరిచాడు.
డ్రైవర్స్ కదలలేదు. మెదలలేదు. అలాగే నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా రేంజర్ కేసి చూస్తుండిపోయారు. వాళ్ళ ధైర్యమేమిటో రేంజర్ కి అర్థంగాక విస్తుపోయాడు.