8
సావిత్రి విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణారావు సావిత్రి ఇంట్లో జొరపడి ఏదో అల్లరి చెయ్యబోయాడట! సావిత్రి కంగారుపడి కేకలు వేసింది. నలుగురూ పోగయ్యారు. కృష్ణారావును చివాట్లు పెట్టి బయటకు సాగనంపారు. సావిత్రి మామూలు ఆడపిల్ల అయితే, అల్లరిపడిన ఆడపిల్లగా మిగిలిపోయేదేమో! కానీ, ఆవిడ యం.యల్.ఏ. గారి అమ్మాయి. అంచేత సావిత్రి తండ్రి మరో కొందరు పెద్ద మనుష్యులను వెంటబెట్టుకుని కృష్ణారావు ఇంటికివెళ్ళి, కృష్ణారావు తండ్రితో హోరాహరీ వాదించి, కృష్ణారావు మెడలువంచి సావిత్రితో పెళ్ళికి కృష్ణారావును ఒప్పించాడు.
ఈ వార్త విన్న తులసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే, కృష్ణారావు రెండేళ్ళు యస్.యస్.సి. ఫెయిలయి ఆ తరువాత అతికష్టంమీద ఎలాగో పాసయ్యాడు. ఇంటర్ చదవాలని సరదాగా కాలేజీలో చేరాడు. కాని, పాసవలేక పోయాడు. అలాంటి కృష్ణారావును చేసుకోవడానికి ఒప్పుకుంటోందా సావిత్రి! తులసీ, సావిత్రి చిన్ననాటి స్నేహితులు. విషయమేమిటో వివరంగా తెలుసుకుందామని తనే సావిత్రి దగ్గరకెళ్ళింది.
"కృష్ణారావును పెళ్ళి చేసుకుంటున్నావా?" అంది నమ్మలేనట్లు.
సావిత్రి తలవంచుకుని "ఏం చెయ్యనూ, నాన్నగారు అలా నిర్ణయించారు" అంది.
"ఇంట్లో జోరపడి నిన్ను అవమానించాలని చూసిన వాడిని పెళ్ళి చేసుకుంటావా?"
"ఇంట్లో జొరబడింది, నామీది ప్రేమతోనేగా! నన్ను ప్రేమిస్తున్నవార్నే పెళ్ళి చేసుకోవటం మంచిదేగా?"
"ప్రేమ! దీన్ని ప్రేమ అంటావా నువ్వు?"
"ఏమో బాబూ! అవన్నీ నాకు తెలియవు"
"అతడు ఇంటర్ కూడా పాసవలేదు. ఆ సంగతి ఆలోచించావా?"
"చదువు లేకపోతేనేం? బోలెడు డబ్బుందిగా! ఒక్కడే కొడుకు!"
తెల్లబోయింది తులసి...
"అయితే, నీకు ఇష్టమేనన్నమాట!"
"పెద్దవాళ్ళు నిర్ణయించాక ఇంకా నా ఇష్టమేమిటి?"
"ఎక్కడో బి.సి. నాటి అమ్మాయిలా మాట్లాడుతున్నావు. నీకు యిష్టం లేకపోతే మీ నాన్నగారితో చెప్పకూడదూ? మరొక మంచి చదువుకున్న సంబంధం తీసుకురాలేరూ?"
"ఎలా తీసుకొస్తారు మరొక మంచి చదువుకున్న సంబంధం? నాకు మాత్రం చదువేముంది? థర్డ్ ఫాం కూడా పాసవలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లని కూడా అందరూ 'ఏం చదువుకున్నావు?' అని అడుగుతున్నారు. మా నాన్నకి పలుకుబడి ఉందేకాని డబ్బులేదు. చదువుకున్న పెళ్ళికొడుకులంతా 'అయ్యో! థర్డ్ ఫాం మాత్రమే చదివిందా' అని చప్పరించి వెళ్ళిపోవటమే! నా అందం చూసయినా నన్ను చేసుకోవటానికి ఒప్పుకోలేదు."
మరొకసారి గతుక్కుమంది తులసి. సావిత్రి అనాకారి కాదు కాని, పెద్ద అందమైనది కాదు. తనపట్ల ఎంత అహంకారముందీ, ఈ అమ్మాయి మనసులో.....
ఆ తరువాత కృష్ణారావు ధోరణి మరీ శ్రుతిమించింది. రోజుకొక అమ్మాయిని కార్లో కూచోబెట్టుకుని తిరిగేవాడు. ఆ అమ్మాయిలను గురించి రకరకాలుగా చెప్పుకునేవారు.
"ఇట్లా రోజుకొక దానితో తిరిగే కృష్ణారావుని చేసుకుని నువ్వేం సుఖపడతావు?" అని ఎవరో సావిత్రితో అంటే_
"ఒకసారి సంబంధం నిశ్చయం అయ్యాక నేను ఆయన భార్యనే! పెళ్ళయ్యాక నా మంచితనంతో, పవిత్ర ప్రేమతో ఆయన మనసు మార్చుకుంటాను" అందట సావిత్రి.
"హమ్మ బాబోయ్! ఎంత ఉత్తమురాలో! తెలుగు నవలల్లో హీరోయిన్ ని మించిపోయింది" అని గుండె బాదుకున్నారట అడిగిన వాళ్ళు!
ఒక రోజు తులసి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుండగా ఎదురుపడ్డాడు కృష్ణారావు. తులసిని చూడగానే కృష్ణారావు కారాపి, నోరారా నవ్వుతూ "తులసీ! ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా? నీకు మంచి ఉద్యోగం కావాలంటే....." అని ఏదో అనబోతుండగానే తులసి ఉరిమి చూసి, "షటప్! నా ఉద్యోగం సంగతి నీకెందుకు? మరొకసారి నా జోలికి వచ్చావంటే జాగ్రత్త!" అని విదిలించి కొట్టింది.
ఆ విదిలింపుకు తట్టుకోలేకపోయాడు కృష్ణారావు. అతని ముఖం ఎర్రబడింది. కళ్ళలోంచి నిప్పులు కురిసాయి.
"ఛీ! ఏం మనిషివి నువ్వు? నీకొక మంచి విషయం చెపుదామని వస్తే....."
"నువ్వు చెప్పే మంచి విషయాలు నాకేం అక్కర్లేదు." చిత్రంగా కృష్ణారావు ముఖంలో కోపం ఎగిరిపోయి ఒక విధమయిన కొంటెతనం చోటు చేసుకుంది.
"నేను చెప్పాలనుకున్నది సూర్యం విషయం....."
"సూర్యం విషయమా?" అప్రయత్నంగా కుతూహలంగా అడిగింది.
"ఏం లేదులే! నీలాంటి 'క్లియోపాత్ర'తో అయిదు నిముషాలు మాట్లాడే అదృష్టం నాకే అక్కర్లేదు" అని బయలుదేరబోయి ఆగి, "నాకంటే సూర్యం నిన్ను బాగా అర్థంచేసుకున్నాడు. అందుకే నీకు ఉత్తరం కూడా రాయలేదు" అనేసి వెళ్ళిపోయాడు.
తెల్లబోయింది తులసి. "అందుకే నీకు ఉత్తరం కూడా రాయలేదు" అన్న మాటల్ని తేలిగ్గా మరిచిపోలేకపోయింది.
జగన్నాథం పంతులు రిటైరయిపోయాడు. ఆయనకు చూపు కూడా ఆనటం లేదు. తులసి ఉద్యోగం చెయ్యవలసిన అవసరం మరింత ఎక్కువయింది కుటుంబములో.... సుమతికి ముగ్గురు పిల్లలు. పిల్లల సంఖ్యని బట్టి సుమతి సుఖంగా కాపురం చేసుకుంటోందని నమ్ముతుండగా నీలకంఠం నుంచి ఉత్తరం వచ్చింది.....
"నన్ను మోసం చేసి నాకు మూర్ఛరోగిని అంటగట్టారు. మీ అమ్మాయికి 'ఊఁ' అన్నా, 'ఆఁ'అన్నా ఫిట్స్ వచ్చేస్తాయి. యీ ఫిట్స్ తోనే పడలేకుండా ఉంటే. యీ మధ్య మీ అమ్మాయికి మతిస్థిమితం కూడా పోయింది. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో తనకే తెలియదు. అంచేత మీరు వెంటనే వచ్చి మీ అమ్మాయినీ, మనవలనీ తీసుకుపోవలసింది...." అని ఆ ఉత్తరం చదివి, జానకి గుండె బాదుకుంటూ "అయ్యో! సుమతికి మూర్ఛలేమిటీ? దానికి మతి చలించటమేమిటీ? దాన్నీ, పిల్లల్నీ ఇక్కడికి పంపేసి అతడు మరో పెళ్ళి చేసుకుంటాడా? మన సుమతి గతేం కావాలి!" అని ఏడ్చింది.