Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 16


    తనకు ఈర్ష్య ఏమిటి? ఎందుకు? ఎవరిమీద? రాగిణి ని మాధవరావు చూసాడు. రాగిణితో పాటు రాగిణి స్నేహితులను చూశాడు. రాగిణి నవ్వబోయింది. ఆవిడ ఒక మనిషే కానట్లు తల తిప్పుకున్నాడు మాధవరావు. రాగిణి మనసు భగ్గుమంది.
    రాగిణి కట్టుకున్నది మైసూర్ జార్జెట్ చీర! దగ్గిర దగ్గిర అయిదువందలుంటుంది. ఎర్రటి ఎరుపులో ఉన్న ఆ చీరకి మాచ్ అయ్యేలా నెక్లెస్, దుద్దులు, గాజులు, ఉంగరం, అన్నీ ఉన్నాయి. అన్నీ ఖరీదైనవే అందమైన ఆ చీరలో శరీరకాంతి మరింత అందంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల పురుషుల చూపులు రాగిణిమీద నుంచి కదలటంలేదు.
    తనను చూసుకుని లలితను చూసింది రాగిణి. ఏం చీరో సరిగ్గా తెలియటం లేదు. పాతబడి ఉంది. కొద్దిగా నలిగినట్లుగా కూడా ఉంది. ఏ అలంకరణా లేదు సరికదా, ముఖమంతా వడిలిపోయి ఉంది. జుట్టు రేగి ఉంది. అయితే ఆ వడిలిన ముఖంలో ఏదో ఆకర్షణ రాగిణి గుర్తించకుండా ఉండలేకపోయింది.
    మాధవరావు కూల్ డ్రింక్ తెప్పించి తనే లలిత కందించాడు. ఎందుకనో సీసా పట్టుకున్న లలిత చేతులపై తన చెయ్యి వేశాడు.
    ఉండుండి లలితతో ఏదో మాట్లాడుతున్నాడు. లలితను నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి అపురూపంగా లలిత కనీ కనపడనట్లు నవ్వింది. ఏం మెరుపులు, ఆ నవ్వులో!
    రాగిణి సినిమా చూడలేదు. లలితా మాధవరావులనే చూస్తూ కూచుంది.
    సినిమా పూర్తి కాగానే రాగిణి నిగ్రహించుకోలేక "హలో? లలితా!" అని దగ్గరకు రాబోయింది. లలిత ఏదీ వినిపించుకోగలిగే స్థితిలో లేదు. వినిపించుకున్న మాధవరావు రాగిణి ఎక్కడ సమీపిస్తుందో నన్నట్లు గబగబ లలితను నడిపించి కారులో కూచోబెట్టాడు.
    ఆపాదమస్తకమూ భగభగ లాడింది రాగిణికి. లలిత షాక్ నుండి కొంచెం కోలుకున్నట్లు కనిపించక మాట్లాడటం మొదలుపెట్టాడు.
    "మీరు నన్ను క్షమించాలి లలితా!"
    "దేనికి?"
    "మోహన్ అరెస్టవడానికి కారణం నేనే!"
    లలిత దిగ్గున తలెత్తి ఆశ్చర్యంగా చూసింది.
    "మోహన్ గురించి తెలుసుకోవటానికి మీరు నా సహాయం కోరకపోయినా బాగుండేది. ఆ ఫోటో ఆధారంగా ప్రయత్నించేసరికి అనుకోని వివరాలు తెలిసాయి. మోహన్ గేంగ్ తో కలిసి దొంగతనాలు చేస్తున్నాడు. అందరినీ అరెస్ట్ చేసాం!" లలిత మాట్లాడలేదు.
    మాధవరావు చెయ్యిజాపి లలిత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మంచులా చల్లగా ఉంది. "నన్ను క్షమించు లలితా!"
    మొదటిసారిగా ఏకవచనంలో చనువుగా సంబోధించాడు మాధవరావు. అంతటి విషాదంలోనూ అది గుర్తించింది లలిత మనసు.
    "మీరు నన్ను క్షమించమని అడగక్కర్లేదు. మీరేం తప్పు చేసారని?" శాంతంగా అంది.
    ఆ సమాధానానికి మాధవరావు ఆశ్చర్యపోయాడు. లలితను లోలోపల మెచ్చుకున్నాడు. ఒక్క నిట్టూర్పు విడిచాడు!
    
                                                        12
    
    పని కట్టుకుని తన దగ్గిరకు వచ్చిన రాగిణి ని చూసి చికాగ్గా ముఖం చిట్లించుకున్నాడు మాధవరావు.
    "నమస్తే!" తనకు అలవాటయిన ధోరణిలో వయ్యారంగా విలా సాలు పోతూ నమస్కారం చెయ్యబోయింది రాగిణి.
    తీక్షణంగా ఒక్కసారి రాగిణిని పైనుండి క్రిందకు చూసాడు మాధవరావు ఆ చూపులతో తనకు తెలియకుండానే విలాసాలు మరిచిపోయి తిన్నగా నిలబడిపోయింది రాగిణి తనకే అర్ధంకాని భయంతో దడలాడుతున్న గుండెలను సర్దుకుని మామూలు ధోరణిలో నవ్వటానికి రెండు నిముషాలుపట్టింది రాగిణికి.
    శ్యామలాంబగారి సేవాసాధనంలో చేరినప్పటినుండీ రాగిణికి అనేక మంది 'ప్రసిద్దపురుషుల'తో 'పరిచయాలు' ఏర్పడ్డాయి. వాళ్ళలో ఏ ఒక్కరిని గురించీ ప్రత్యేకంగా ఏ నాడు రాగిణి ఆలోచించలేదు.
    కొన్ని కొన్ని సందర్భాలలో రాజకీయఖైదీలను సైక్రియాటిస్ట్ ల సహాయంతో సొంత ఆలోచన అనేది రాకుండా తయారుచేసి ఉపయోగించుకొంటారట!    
    సేవాసదనంలో ఉన్న స్త్రీల పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంటుంది. సైక్రియాటిస్ట్ లు ప్రత్యేకించి రాకపోయినా వాళ్ళు మసలే వాతావరణంలో, శ్యామలాంబగారు సృష్టించే పరిస్థితుల్లో వాళ్ళకు చీరలు, నగలు, డబ్బు, తప్ప మరేదీ ముఖ్యంకాదు. అలంకరణలు విలాసాల్లో వాళ్ళు ఒకరితో ఒకరు పోటీలుపడేలా శ్యామలాంబగారు తన మాటలతో రెచ్చగొడుతుంది. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఎంతగా విలాసాలు గుమ్మరించగలిగితే అంత ప్రజ్ఞావంతుల మనుకోగలిగితే దశలోకి వచ్చేసారు వాళ్ళు. రాగిణి ఎప్పుడూ ఆలోచించేది ఒకే ఒక వ్యక్తిని గురించి ఆ వ్యక్తి లలిత.
    లలిత అంటే రాగిణికి ఎంతో అభిమానం. చిన్న తనంలో అనేక విధాల తనను ఆదుకున్న లలితను రాగిణి మరిచిపోలేదు. భగవంతుడి దయవల్ల ఆ నికృష్టదశలో నుండి తను బయటపడింది! ఇప్పుడు లలిత కే తను సహాయం చెయ్యగలిగే దశలో ఉంది. తను తలుచుకుంటే లలిత తమ్ముడికి ఉద్యోగం ఇప్పించగలదు. లలిత కూడా ఇంకా మంచి ఉద్యోగంలోకి వచ్చేలా చెయ్యగలదు. ఆర్ధికంగా కూడా లలితకు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉంది. కానీ లలితకు తన సహాయం అక్కర్లేదు. లలిత ధర్మ పన్నాలు చెపుతూ తనను అసహ్యించుకున్నా, తన సామాన్యమైన ధోరణిగా రాగిణి అర్ధం చేసుకోగలిగేది! కాని లలితకళ్ళలో తనమీద జాలి! ఎందుకా జాలి? తనకంటే లలిత ఏం బావుకుంటోందని ఆ జాలి? ఆ నాడు రాజు ముందు లలిత ముఖం ఎలా అయిపోయింది? ఆ సౌభాగ్యానికేనా, తనను చూసి జాలిపడటం?
    కానీ, మాధవరావు? తనను చూసి కూడా నిర్లక్ష్యం చేసి లలితతో వెళ్ళిపోయాడు! సినిమాహాల్లో లలితను పసిపాపను బుజ్జగించినట్లు అనునయిస్తూ తననుచూసి ముఖం చిట్లించుకున్నాడు.
    లలిత మాధవరావును ప్రేమిస్తోందా? మాధవరావుకు పెళ్ళయిపోయింది. పెళ్ళయిన మాధవరావును ప్రేమించే లలిత నైతికంగా మాత్రం తనకంటే ఏం ఎక్కువ?
    తనను నిర్లక్ష్యం చేసి లలితతో వెళ్ళిపోయిన మాధవరావు లలితను నిర్లక్ష్యం చేసి తనతో రావాలి! అప్పుడు లలిత.... అఫ్ కోర్స్ లలితంటే తనకేం కోపంలేదు! లలితకే సహాయం చెయ్యాలన్నా తను సిద్దమే!
    అవును! లలిత తనను చూసి జాలిపడకూడదు! తనే జాలిపడి సహాయం చెయ్యాలి? ఏం చెయ్యమన్నా చేస్తుంది?
    ఎదుటి వ్యక్తి నిలువునా పులకించేలా చిలిపిగా నవ్వింది రాగిణి తెల్లబోయి చూసాడు మాధవరావు. ఆ చూపులతో ధైర్యం తెచ్చుకున్న రాగిణి తనే ఒక కుర్చీ దగ్గిరకి లాక్కుని కూర్చుంది.
    "ఏం పనిమీద వచ్చారు?"
    మారిపోయిన మాధవరావు ముఖమూ, అతని కంఠమూ, రాగిణిలో  ఎన్నడూ ఎవరగని బెదురును కలిగిస్తున్నాయి.
    "పని లేకుండా రాకూడదా?"
    గారాబాలుపోతూ అంది రాగిణి. రాగిణి ముఖంలోకి చూసి పకాలున నవ్వాడు మాధవరావు.

 Previous Page Next Page