మాధవరావు లాంటి వ్యక్తులను అంతవరకూ కలుసుకోలేదు రాగిణి. అతని సమక్షంలో మనసెందుకో గడగడ వణికిపోతోంది. తన ధోరణి తను సాగించటానికి చాలా శ్రమ పడవలసివస్తోంది.
"ఎందుకు నవ్వుతున్నారు?
"ఆయుధాలను ఎదుటి వ్యక్తులమీద ప్రయోగించటానికే ఉపయోగించుకుంటారు. ఆత్మహత్య చేసుకోవటానికి కాదు! మీ కింత మాత్రం కూడా ఎలియదేమో అని నవ్వొచ్చింది!"
రాగిణి తెలివి తక్కువది కాదు! మాధవరావు మాటలకు ఆవిడ ముఖం తెల్లగా పాలిపోయింది. క్షణాలలో కూడా దీసుకుని తనూ మాధవరావును చూసి విరగబడి నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నారని ' మాధవరావు అడగలేదు. అడగకపోయినా రాగిణి చెప్పింది. కావాలని తెచ్చుకుని కృత్రిమంగా నవ్వుతూ.
"మీ అమాయకత్వం చూస్తోంటే నాకు నవ్వొస్తోంది. తెలియక పొతే సరి, పామును కూడా పూలమాలగా మెళ్ళో వేసుకోవచ్చు."
అప్పటికీ రాగిణి మాటల్లో పెద్ద కుతూహలం ప్రకటించలేదు మాధవరావు.
యధాలాపంగా "నీకేమైనా తెలిస్తే చెప్పరాదూ!" అన్నాడు.
"మిమ్మల్ని లలితతో సినిమా హల్లో చూసాను నేను!"
కవ్విస్తున్నట్లున్న ఆ ధోరణికి నిటారుగా కూర్చున్నాడు మాధవరావు.
"అయితే?"
"ఏం లేదు. లలితతో నిశ్చింతగా సినిమాకు వెళ్ళగలిగిన, మీరు నన్ను చూసి నిష్కారణంగా ఉలికిపడుతుంటే నవ్వురాడూ?"
"ఎంత సాహసం! లలితతో నిన్ను పోల్చుకుంటున్నావా?"
ఈమాటలు చాలా లోతుగా తగిలాయి రాగిణికి. తన బెదురు సంకోచమూ వయ్యారాలూ, విలాసాలు అన్నీ మరిచిపోయింది. నాగిని లాగ తలపైకెత్తి "ఏదీ లలితా నాకంటే దేనిలో ఎక్కువ?" అంది.
"ఎన్ని రకాల రంగులు పులుముకున్నా , ఎన్ని విధాలుగా నగిషీలు చెక్కుకున్నా . కాగితం పువ్వు సహజ సుగంధాలను విరజిమ్మే గులాబికి సాటిరాదు!"
"ఓహ్! అయితే ఆ "సహజ సుగుందాలు" మీదాకా ఎంతవరకూ వచ్చాయి? ఆవిడ రాజుకి ప్రియురాలని మీకు తెలుసునా? మీరు ఆవిడని నమ్మి నన్ను గురించి చెప్పిన రహస్యం రాజుకి చెప్పేసి రాజుని కాపాడటానికి ప్రయత్నించిందని తెలుసునా? నేను నా చాకచక్యంతో రాజుని నమ్మించి కార్యం సాధించానని తెలుసునా?"
నిర్ఘాంతపోయాడు మాధవరావు ఆ ముఖం చూస్తూ కసిగా నవ్వుకుంది రాగిణి.
"వెళ్తాను. దయ ఉంచండి! ఈ కాగితం పువ్వుతో.......ఈ మరబోమ్మతో .........ఈ ఆయుధంతో ఏదైనా పని పడినప్పుడు కబురు చెయ్యండి."
వెళ్ళిపోతున్న రాగిణి కళ్ళలో నీళ్ళు విచిత్రంగా కదిలించాయి మాధవరావుని.......రాగిణి విలాసాలూ, చిరునవ్వులూ, వయ్యారాలూ, చూసి చీదరించుకున్నాడు. నవ్వుకోగలిగాడు. కానీ ఆ రెండు కన్నీటి బొట్లు చూసేసరికి మనసు కరిగిపోయింది.
రాగిణి మాటలు నిజమేనా? కావచ్చు! ఆనాడు తానూ చెప్పిన విషయం వినగానే లలిత ముఖంలో వచ్చిన మార్పు.....ఆమార్పుకి కారణం. రాగిణి స్నేహితురాలు కావటం, అనుకున్నాడు!
మనసంతా చాలా చికాగ్గా అయిపొయింది. అంత చికాకుపడవలసిన అవసరమే మొచ్చింది? రహస్యం బయటపడటం పొరపాటే అయినా దానివల్ల ఏ ప్రమాదమూ జరగలేదు. ఆరోజు, మాటల సందర్భం అలా రాబట్టి ఆ మాత్రం నోరు జారాడు. ఇకముందు లలిత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండచ్చు. కాకపోతే తను ఎంతో ఉన్నతురాలని భావించిన లలిత ఇలా ప్రవర్తించటం కష్టంగా ఉండచ్చు. అందుకు లలితమీద అసహ్యం కలగాలి! మనసెందుకిలా మాధనపడాలి? లలిత రాజుకు ప్రియురాలని తెలియటమే యీ అశాంతికి ఓ కారణమా? గుండె గుభిల్లుమంది మాధవరావుకి! తన ఆలోచనకు తనే అసహ్యించుకున్నాడు.
అద్దం ముందు కూచుని అలంకరించుకొంటున్న మణిమాల అద్దంలో మాధవరావు ప్రతిబింబాన్ని చూసి నవ్వింది. ఆ నవ్వు చాలా కొత్తగా గమ్మత్తుగా కనిపించింది మాధవరావుకి. అందులో ఆనంద మెంత ఉందొ విషాదమంత ఉంది. దుఃఖాన్ని అణచుకుని ఆ దుఖంలోనే ఏదో అనందం అనుభవిస్తున్నట్లుగా ఉంది.
"నీకొక గుడ్ న్యూస్!" అంది మణిమాల అలా నవ్వుతూనే.
"చెప్పు....."
"లలిత నిన్ను ప్రేమిస్తోంది!"
బొమ్మలా నిలబడిపోయాడు మాధవరావు ఒక్క క్షణం! కోపంగా "మణీ! మతి ఉండి మాట్లాడుతున్నావా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావని భ్రమపడమంటావా?" అన్నాడు.
"లేదు మాధవ్! అలాంటి భ్రమ లేమీ పడక్కర్లేదు. నేను చెప్తున్నది నీ విషయం కాదు! లలిత విషయం! లలిత ప్రేమిస్తోంది నిన్ను!"
"అలాగా! ఎలా గ్రహించావు? వీణ వాయించిందనా? మనతో కలిసి నువ్వు బలవంతం చేస్తే పిక్నిక్ కి వచ్చిందనా?" వెటకారంగా అడిగాడు మాధవ్.
"అవేవీ కాదు మాధవ్! ఇలాంటి వాటికంటే చాలా బలమైన ఆధారంతోనే గ్రహించాను. డాక్టర్ వినోద్ దగ్గిరకు నన్ను వెళ్ళద్దని బ్రతిమాలింది. నీకింత అశాంతి కలిగించడం న్యాయం కాదని పోట్లాడింది. ఎలాగైనా మనిద్దరం సుఖంగా ఉండటం కంటే తనకు కావలసింది లేదంది. కోపంతో, ఉద్రేకంతో , నేను కొట్టిన చెంప దెబ్బని కూడా భరించి మీ కర్ధం కావటం లేదు. ఇలాంటి వినోద్ లు లక్ష మంది జతగూడినా మాధవరావు గారితో సరికారు! ' అంది! ఇప్పుడు చెప్పు! లలిత నిన్ను ప్రేమించటం లేదూ?"
నవ్వుతోన్న మణిమాల చూపుల నుండి తన చూపులు తప్పించుకున్నాడు మాధవరావు.
13
లలితను చూచి చవట నవ్వు నవ్వాడు రాజు. అతని నవ్వులో అంత చవటతనం చూడటం లలిత కది రెండవసారి. మొదటిసారి రాగిణితో కలిసి తన నేడుర్కొన్నప్పుడు నవ్వాడు అలా. ఆనాడు ఆ చవటతనంతో పాటు ఏదో దర్పమూ, అహంకారమూ కూడా ఉన్నాయి. ఈనాడు ఎంతో దైన్యం ఉంది.
ఎన్నో రోజుల తర్వాత పని కట్టుకుని లలిత ఇంటి కొచ్చాడు రాజు. మనిషి చిక్కి పోయాడు. ముఖం కాస్త కళ తప్పింది. అతణ్ణి చూస్తోంటే ఏ వికారమూ కలగలేదు లలితకి! "కూచో రాజూ!" అంది మాములుగా.
లలిత ఇంత మాములుగా మాట్లాడేసరికి తబ్బిబ్బయ్యాడు రాజు. లలిత తన పైన కోపగించుకొని తిడితేనే అతనికి బాగుండేది.
"నిన్ను చూట్టానికి నాకు ముఖం చెల్లడం లేదు లలితా!" నిజంగానే వంచిన తల ఎత్తలేక అన్నాడు రాజు.
"ఫరవాలేదు! అంత కాని పని నువ్వేం చేసావు? జీవితంలో ఇంకా ఇంకా పైకి పోవాలనుకోవటం సహజమే!"
తలఎత్తి లలిత ముఖంలోకి చూసాడు రాజు. ఆ ముఖంలో ఏకోశానా కోపపు ఛాయలు లేవు. ఆ మాటల్లో నిష్టురమూ లేదు. అతి శాంతంగా అతి మాములుగా ఉంది. రాజు నీరయిపోయాడు. ఇక తనేం మాట్లాడీ లాభంలేదని అర్ధమవుతూనే ఉంది. అయినా లలిత మంచిది.
"నన్ను క్షమించు లలితా!"
"నువ్వు తప్పు చేసావని నేననుకోవటం లేదు రాజూ దేనికి క్షమించను?"