Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 15


    రాగిణి రాగానే రాగిణి ముఖకవళికలు పరిశీలనగా చూస్తూ అనేశాడు "ఇది విన్నావా? నిన్ను పోలీస్ డిపార్ట్ మెంట్ నన్ను ట్రాప్ చెయ్యటానికి పంపిస్తోందట!"
    నిర్ఘాంతపోయింది రాగిణి. "ఎవరు చెప్పారు" అంది.
    "లలిత!"
    "అయితే ఇంకేం? నేను వెళ్ళిపోతాను. నువ్వు లలితా మళ్ళీ స్నేహితులయిపోవచ్చు!"
    వెళ్ళిపోవటానికన్నట్లు బయలుదేరింది రాగిణి. అడ్డగించాడు రాజు.
    "అంత తేలిగ్గా నిన్ను వెళ్ళనివ్వను! నేను తిరస్కరించినందుకు లలిత ఎంత బాధపడుతోందో, తిరిగి నన్ను పొందాలని ఎలా తపస్సు చేస్తోందో. నాకు తెలియదనుకున్నావా? పాపం, లలిత..."
    కిలకిల నవ్వింది రాగిణి. ఆ నవ్వు వింటూ సర్వమూ మరచిపోయాడు రాజు. 36" -28" -36"లో మునిగిపోయాడు.
    ఒక నెలరోజులు రాజ్ను రాగిణి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఏమీ జరగలేదు. 'అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది' అని నవ్వుకున్నాడు.
    రాజులాన్తి బ్రహ్మచారి కళ్ళ కెదురుగా కనిపిస్తోంటే పెద్దలూరు కోరు. చాలా గొప్ప గొప్ప సంబంధాలొస్తున్నాయి రాజుకి. ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోలేక పోతున్నాడు. ఈ సందట్లోపడి రాగిణి విషయం ఇంచుమించు మరిచిపోయాడు.
    ఆరోజు రాగిణితో కలిసి రాజు ఖరీదైన హోటల్లో ఉండగా మాధవరావు ఆ హోటల్ మీద రైడ్ చేశాడు. రాజును అరెస్ట్ చేసారు.
    గవర్నమెంట్ డబ్బు హరించుకుపోయింది. ఈ అక్రమానికి ఎవరో ఒకరు బాధ్యులు కావాలి! రాజుని చూపించారు! రాజు డబ్బు నిలువ చేసుకున్నట్టుగా ఆధారాలేమీ లేవు. సొంత ఆస్తి కూడా లేదు. కానీ 'కాల్ గరల్స్'తో తిరుగుతున్నాడు! డబ్బంతా ఈ విధంగా ఖర్చుపెట్టి ఉంటాడా? వేరే ఎక్కడైనా రహస్యంగా దాచాడా?
    రాజును సస్పెండ్ చేశారు. ఈ విషయం విచారణలోకి వచ్చింది.
    
                                             11
    
    మణిమాల కావాలని లలితతో స్నేహం పెంచుకోసాగింది. దానికి లలిత కూడా సంతోషించింది. మణిమాలా మాధవరావులతో కలిసి భోజనం చెయ్యటం, ఆ దంపతులు వింటూ ఉండగా వీణ వాయించటం, అప్పు డప్పుడు వాళ్ళిద్దరితో కలిసి పిక్నిక్ లకి కూడా వెళ్ళటం సాధారణమయిపోయింది లలితకి.
    మాధవరావు మోహన్ అనే పేరుగల ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆచూకీలు తెలుసుకుని ఫోటోలు తెప్పించారు. కానీ అవేవీ లలిత తమ్ముడు మోహన్ వి కావు. మాధవరావు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మోహన్ క్లాస్ మేట్స్ ఎవరెవరో తెలుసుకుని వాళ్ళందరి దగ్గిరా మోహన్ గుణించిన వివరావు సేకరించాడు. మోహన్ కలిసి పనిచేసిన సంఘసభ్యులతో కూడా మాట్లాడాడు. మోహన్ స్నేహితులలో ఒకరి దగ్గిర మోహన్ ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి సంపాదించగలిగాడు. దాని ఆధారంతో మోహన్ ఆచూకీ తెలుసుకోవటానికి పూనుకున్నాడు.
    "ఫోటో దొరికింది గనుక కొంచెం రోజుల్లోనే మీ తమ్ముడ్ని మీ దగ్గిరకు తీసుకురాగలను." అన్నాడు మాధవరావు.
    లలిత ఈ వార్త వెంటనే తల్లికి చెప్పింది. మంచంలో పడి కొడుకును గురించిన బెంగతో తల్లడిల్లిపోతున్న జానకమ్మ కళ్ళలోకి జీవం వచ్చింది. "ఎప్పుడే! ఎప్పుడొస్తున్నాడువాడు?" అంది ఆశగా.
    "త్వరలోనే వచ్చేస్తాడమ్మా!" మాధవరావు మీది నమ్మకంతో తల్లికి ధైర్యం చెప్పింది లలిత.
    మణిమాల కబురందుకొని ఎప్పటిలా ఉత్సాహంగా వచ్చిన లలిత మణిమాల ముఖం చూసి బిత్తరపోయింది.
    ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు వడిలిపోయి ఉంది మణిమాల ముఖం.
    "అలా ఉన్నారేం?" అంది లలిత.
    "నేనొక్కటి చెపుతాను. ఇవాళ నామాట కాదనకు! మాధవ్ నిన్ను తనతో తీసికెళ్తాడు. వెళ్ళు."
    మణిమాల ఒకటి రెండుసార్లు లలితను, మాధవరావును మాత్రమే బయటికి పంపాలని ప్రయత్నించింది. లలితా మాధవరావు లిద్దరు ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించటంతో విరమించుకుంది. మణిమాల ప్రాధేయపడుతున్నట్లుగా అలా మాట్లాడేసరికి ఏం తోచక అక్కడే ఉన్న మాధవరావ్ ను చూసింది లలిత.
    "ప్లీజ్! రండి!" అన్నాడు మాధవరావు. అతడా మాటలన్న ధోరణి లలిత కేదో భయం కలిగించింది.
    "ఏవిటిదంతా...." అంది.
    "రండి!" అంటూనే కారులో కూచున్నాడు మాధవరావు.
    దడదడ లాడే గుండెలతో కారులో కూర్చుంది లలిత. కారు డ్రైవ్ చేస్తూ తిన్నగా రోడ్డువంకే చూస్తూ కూచున్నాడు మాధవరావు.
    జైలుముందు కారాగేసరికి లలితకు మతిపోయినట్లయింది.
    మాధవరావు దిగి కారు డోర్తెరిచి "దిగండి!" అన్నాక కాని తనక్కడే దిగాలని నమ్మకం కలగలేదు లలితకి.
    ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది. ఏదేదో అడగాలని ఉంది. కానీ గొంతు పొడారి పోతోంది లలితకి. యాంత్రికంగా మాధవరావు వెంట నడిచింది. అతడు కూర్చోమన్న కుర్చీలో కూచుంది. కొంచెంసేపట్లోనే ఖైదీ యూనిఫారంలో ఉన్న యువకుడ్ని పోలీసులు లలిత ముందుకు తీసుకొచ్చారు.
    "మోహన్!" ఒక్క గావుకేక పెట్టింది లలిత.
    మోహన్ లలిత ముఖంలోకి చూసి తల దించుకున్నాడు. గిర్రున తిరిగి బయటికెళ్ళి పోతున్న అతడ్ని పోలీసులనుసరించారు.
    లలిత కళ్ళనుండి కన్నీరు కాలువలు కట్టింది. వణికిపోతున్న లలిత భుజం చుట్టూ చెయ్యివేసి తన రుమాలుతో కన్నీళ్ళు తుడిచాడు మాధవరావు. తనేం చేస్తోందో, ఏం జరుగుతుందో, ఏమీ తెలియటం లేదు లలితకి. లలితను నడిపించుకుంటూ తీసుకొచ్చి కారులో కూచోబెట్టాడు మాధవ్. లలితకు కన్నీళ్ళాగటం లేదు.
    "మీ ఇంటిదగ్గిర దింపనా!" అన్నాడు మాధవరావు. తల్లి ముఖం గుర్తుకొచ్చి వణికిపోయింది లలిత.
    "వద్దు! వద్దు! తమ్ముడొస్తాడని గంపెడాశతో ఉంది అమ్మ. ఇప్పుడిప్పుడే కాస్త లేచి తిరుగుతోంది. అమ్మముఖం ఎలా చూడగలనో అర్ధం కావటంలేదు. నాన్న అలాగ! తమ్ముడిలాగ! నన్నెక్కడికయినా కొంచెం సేపు తీసికెళ్ళండి. కొద్దిగా స్థిమితపడనీయండి!"
    లలిత ఎన్నడు ఇంత బేలగా మాట్లాడలేదు. జాలితో మనసు తరుక్కుపోయింది మాధవరావుకి.
    "సినిమాకు వెళ్దామా?" అన్నాడు.
    "ఎక్కడికైనా సరే!"
    నిలబడలేక పోతున్న లలిత భుజం చుట్టూ చెయ్యివేసి నడిపించుకొంటూ సినిమాహాల్లో కొచ్చి లలితను కూచోబెట్టీ తను పక్కన కూచున్నాడు మాధవరావు.
    ఆరోజే రాగిణి కూడా తన సేవాసదనం స్నేహితులతో కలిసి సినిమా కొచ్చింది. లలితా మాధవరావులను చూడగానే రాగిణి కేదో ఈర్ష్య కలుక్కుమంది.

 Previous Page Next Page