Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 16
భిక్షువర్షీయసి
దారిపక్క చెట్టు క్రింద,
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దొకతె
మూలుగుతూ, ముసురుతున్న
ఈగలతో వేగలేక.
ముగ్గుబుట్టవంటి తలా,
ముడతలు తేరిన దేహం,
కాంతిలేని గాజుకళ్ళు,
తనకన్నా శవం నయం.
పడిపోయెను జబ్బు చేసి;
ఆడుకునే శక్తిలేదు;
రానున్నది చలికాలం;
దిక్కులేని దీనురాలు.
ఏళ్ళు ముదిరి, కీళ్ళు కదలి,
బతుకంటే కోర్కె సడలి--
పక్కనున్న బండరాతి
పగిదిగనే పడి ఉన్నది.
"ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి"దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళిపోయింది!
ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క!
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ!
క్రమ్మె చిమ్మ చీకట్లూ,
దమ్ము రేగె నంతలోన.
"ఇది నా పాపం కా"దనె
ఎగిరివచ్చి ఎంగిలాకు!
13-8-1934
* * *
Previous Page
Next Page