Previous Page Next Page 
నివేదిత పేజి 15


    "ఏమిటి శేషుబాబూ మీరనేది!" అన్నది వేదిత కంపిత స్వరంతో.

 

    "ఇంకా అర్థం కాలేదా నీకు? నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మోహిస్తున్నాను. నా సుఖమూ, శాంతీ నువ్వే."

 

    అతని నరనరాల్లో, రక్తం మోహం ప్రవహించింది. లేచి నిలబడి ఒక చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని, రెండోచేతిని ఆమె నడుముచుట్టూ, పోనిచ్చి దగ్గరకు లాక్కున్నాడు.

 

    ఆమె అప్రతిభురాలై కళ్ళప్పగించి అతనికేసి చూస్తోంది. హఠాత్తుగా జరిగిన ఈ అనిభవం ఆమెను నిశ్చేష్టితను చేసివేసింది.

 

    "నువ్వు భక్తురాలవి కావచ్చు. కాని నువ్వు మనిషివి. నీలో రక్తం, కోరిక, తృష్ణ అన్నీ వుంటాయి. జీవన పరమావధి మోక్షంకాదు స్త్రీ పురుషుల కలయిక. వేదితా! నువ్వు నా జీవివి. నీ కన్నులు, సుందరకేశాలు, బుగ్గలు, పెదవులు..."

 

    అతను ముందుకు వొరిగాడు. ఆమె పెదవులు భగ్గుమన్నాయి.

 

    అప్పుడు తెలిసి వచ్చిందామెకు ఏం జరుగుతున్నదో! ఆమెలో ఎక్కడలేని శక్తి కలిగినట్లయింది. అతన్ని ఒక్కతోపు తోసేసింది. ఆమె కళ్ళు నిప్పులు గ్రక్కుతున్నాయి. పెదవులు వొణికిపోతున్నాయి.

 

    "దుర్మార్గుడా! దురహంకారీ! ఒక సభ్యత స్త్రీలో ప్రవర్తించటం చేతకాని నువ్వు ఒక నీతి బోధకుడివా? జీవిత సూత్రాలు వల్లె వేస్తావా? పో ! ఇక్కడ్నుంచి తక్షణం వెళ్లిపో. మరెప్పుడూ యీ ప్రాంగణంలోకి కాలు పెట్టకు" అని అరిచింది చేయెత్తి బయటకు చూపుతూ.

 

    అతను ఏదో మాట్లాడాలనుకున్నాడు. కాని ఆమె రూపం చూస్తే భయం వేసింది. అతనిక్కూడా అంతా కలగా తోచింది. తలవంచుకుని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు.

 

                                             * * *

 

    దుస్సాహసం చేసి, దుడుకు వాతావరణాన్ని సృష్టించి శేషశాయి అక్కడి నుండి నిష్క్రమించాక వేదిత చాలా సేపటివరకూ అలాగే కొయ్యబారిపోయి నిల్చున్నది. ఇలాంటి విపరీతం జరుగుతుందని ఆమె కలలోకూడా ఊహించలేదు. తనకేమన్నా పిశాచం ఆవహించలేదు కదా! అసలు తనేనా అక్కడ నిలుచున్నది? తనకేనా ఈ ఉపద్రవం జరిగింది? అన్న చిత్రమైన భావాలు కలగసాగాయి. ఒడలంతా నిప్పులో కాలిపోతున్నది. కళ్లు భగభగ మండిపోతున్నాయి.

 

    ఈ వేడి భరించటం శక్యము కాదనిపించిందామెకు. ఏదో లోకం నుండి ఊడిపడినట్లు హఠాత్తుగా ఉలికిపడి గబగబ ఇంట్లోకి పరిగెత్తింది. ఉన్మాదినిలా లోపలి గదిలో దూరి తలుపు వేసుకుని బకెట్లకొద్దీ నీళ్ళు వంటిమీద గుమ్మరించుకుంది. అయినా తాపం చల్లారలేదు. భగభగ మండిపోయే శరీరానికి ఉపశాంతి లభించలేదు.

 

    ఉన్మాదిలా యిల్లంతా అటూ యిటూ కలయతిరిగింది అణువు అణువునా ఆవిరి ప్రవహిస్తున్నట్లుగా ఉంది. బోనులోని బెబ్బులిలా, గుహలోని సివంగిలా నడయాడింది. తోక త్రొక్కిన త్రాచులా బుసలు కొట్టింది.

 

    ఆమె తాపం చల్లారలేదు.

 

    ఇంటి తలుపులు తెరిచి, జుట్టు విరబోసుకుని వున్న వేదిత దిక్కుతోచని దానిలా గుళ్ళోకి పరిగెత్తింది. గుడి తలుపులు తెరుచుకుని వేణుగోపాలుని విగ్రహం ముందు మోకరిల్లి చాలాసేపు కళ్ళు మూసుకుని అలాపడి వుండిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకే తెలియదు. మూసివున్న కనులనుండి కన్నీరు కాలువలు కట్టింది.

 

    "చివరకు నన్ను ఇటువంటి అన్యాయానికి గురిచేశావా? ఇందుకేనా నా తపస్సు? ఇదేనా నా భక్తి? నన్ను పరీక్షలకు గురిచేసి పరిహసిస్తున్నావా నువ్వు. కృష్ణా! ఇదేనా నువ్వు పెట్టిన భిక్ష?"

 

    కాలుతున్నాయి ఆమె పెదవులు నిప్పుకణికల్లా, "మలినమైనాను మలినమైనాను" అని వాపోతోంది.

 

    అలా ఎంతసేపు గడిచినా. ఎన్ని కన్నీళ్ళు ప్రవహించినా ఊరటకలగలేదు. మనశ్శాంతి లభించలేదు. చివరకు తండ్రి వచ్చే వేళయిందని లేచి, కళ్ళు తుడుచుకుని గుడి తలుపులు మూసి యింట్లోకి వెళ్ళింది.

 

    ఆ రోజు ఆమె పరధ్యానం చూసి "అలా వున్నావేవమ్మా?" అని అడిగారు గోవిందాచార్యులుగారు చాలాసార్లు. వంట్లో బావుండలేదని చెప్పి తప్పించుకున్నది.

 

    ఆ సాయంత్రం ఆమె గీతాలాపనకు కూడా వెళ్ళలేదు. అమ్మలక్కలు కొందరు "మా అమ్మ ఏదీ? యివాళ మమ్మల్ని తరింపచెయ్యటానికి రాలేదేం?" అని కబురు చెయ్యజూశారు గాని, ఆమెకు వంట్లోబాగుండలేదని చెప్పి ఆచార్యులుగారు వారిని వారించారు.

 

    ఆ రాత్రి ఆయన దేవాలయంలోని కార్యక్రమాన్నంతా ముగించుకుని యింటికి చేరేసరికి వేదిత చాపమీద మూసిన కన్నెరుగకుండా పడిఉంది, ఆయన కంగారుపడుతూ "అమ్మా!" అని పిలుస్తూ ఆమె ప్రక్కన కూర్చుని ప్రేమగా నుదురు నిమరబోయేసరికి వళ్ళు నిప్పులా కాలిపోతుంది. ఉలికిపడి "అయ్యో! తల్లికి యెంత జ్వరం!!" అని గాభరాపడుతూ భుజంతట్టి 'అమ్మా!అమ్మా!' అని పిలిచాడు.

 

    నాలుగయిదుసార్లు పిలిచాక వేదిత బలవంతంగా కళ్ళు తెరచి చూసింది. ఎదురుగా తండ్రి స్వరూపం మసగ్గా గోచరించింది 'నాన్నా!' అంది బలహీనస్వరంతో

 

    ఆచార్యులగారికి కళ్ళల్లోకి నీళ్ళు తిరిగాయి . ఆయన గుండె ద్రవించింది. కూతురి శరీరాన్ని ప్రేమగా నిమురుతూ "జ్వరం ఇలా సలసల మండిపోతూంటే, ఇంత బాధను నాకు చెప్పకుండా దాచుకున్నావా తల్లీ! ఉండు మందువేస్తాను" అన్నారు.

 

    "నాకు మందువద్దు నాన్నా!" అంది వేదిత అదే స్వరంతో.

 Previous Page Next Page