"అన్నీ చేసుండేదాన్ని అని నువ్వు బెదిరించనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు కడుపునిండా తిన్నా, సుఖంగా ఆటోల్లో తిరిగినా నేను సంతోషిస్తానే తప్ప నీలా ఏడవను! నీ ఆ పిసినారితనానికి ఇప్పుడు బాధపడితే ఎలా?" అన్నాడు.
"ఆహా....ఎంత విశాల హృదయులో! నా డబ్బుతో నేను తింటే, నా డబ్బుతో నేను ఆటోలో వెళ్తే మీరు బాధపడరు. పైగా సంతోషిస్తారు. కానీ అలా కూడబెట్టిన డబ్బుతో వెహికల్ కొనుక్కుంటానంటే మాత్రం అది అనవసరపు ఖర్చు. ఎంత సహృదయత?" నేనూ అలా వ్యంగ్యంగా మాట్లాడగలనని నా కప్పుడే తెలిసింది.
అంతలో నా అత్తగారూ, ఆడపడుచూ లోపలి కొచ్చారు. వాళ్ళను చూసి అతను చాలా చిన్నగా "ఇంక ఆ గొడవ ఆపెయ్. చెల్లాయ్ వాళ్ళు వింటే బావుండదు" అన్నాడు.
పుండుమీద కారం జల్లినటైంది నాకు. "అవును నేను బాధపడితే మీకు ఫర్వాలేదు. ఇంట్లో మరింకెవరు బాధపడ్డా మీరు చూడలేరు. మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. 'ఆపెయ్' అన్నప్పుడు ఆపేయాలి. అసలెందుకు మీదింత డామినేషన్ నామీద?" నా గొంతు హెచ్చింది.
అతని మొహంలో అప్పుడు కోపం కన్పించింది నాకు. "నోర్ముయ్యమన్నాను నేను. వెంటనే ఆ పని చెయ్, నన్ను రెచ్చగొట్టకు. ఆ బోడి ఉద్యోగమే నీ అహంకారమైతే నీకు ఆ ఉద్యోగం అవసరం లేదు. మానెయ్ రేపట్నుంచి!" అన్నాడు.
నాలోనూ వివేకం నశించింది. కళ్ళు నిప్పులు కురుస్తుండగా "మీరు చెయ్యమన్నప్పుడు చెయ్యడానికి, మానెయ్యమన్నప్పుడు మానేయడానికి నేనేం మీలాంటి మూర్ఖురాలిని కాదు! అయినా నా సుఖం గురించి ఆలోచన లేని మీకు, నన్ను ఆజ్ఞాపించే హక్కు మాత్రం ఎవరిచ్చారు?" ... నా మాట పూర్తి కానేలేదు.
నా చెంప ఛెళ్ళుమంది.
అతడు ఆవేశంతో కంపించిపోతున్నాడు. తర్జనని నా ముందు ఆడిస్తూ "... నిన్ను ఆజ్ఞాపించడమే కాదు. ఏం చెయ్యాలన్నా నాకు హక్కువుంది. నేను నీ భర్తని, అన్నయ్య మాట జవదాటలేక నీతో సఖ్యంగా వుండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నీ పొగరుబోతు తనానికి ఏనాడో ఈ పని చేసి వుండేవాడిని. ఇంకెప్పుడూ హక్కుల గురించి మాట్లాడకు. ఈ ఇంటి కొడుకుగా నాకెంత బాధ్యత వుందో, నా భార్యగా నీకూ అంతే బాధ్యత వుందని తెలుసుకుని ప్రవర్తించు. అండర్ స్టాండ్?" అన్నాడు.
చెంప పట్టుకుని నిశ్చేష్టురాలిగా చూస్తున్నాను. హఠాత్తుగా నాలో శక్తినంతా ఎవరో ఊదేసినట్లు బలహీనత నన్నావరించింది.
ఆ సంఘటన నా అత్తగారినీ, ఆడపడచునీ కూడా షాక్ చేసిందనుకుంటాను. వాళ్ళిద్దరూ కూడా కొయ్యబారి బిగుసుకుపోయి, కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు.
ఇలా ఇంట్లో అందరిముందూ అతను నన్నవమానించి తన ఆధిక్యం నిరూపించుకున్నాడన్న విషయం గుర్తించి నాలో మళ్ళీ ఉద్రేకం ప్రవేశించింది. కళ్ళలో నీళ్ళు చేరుకున్నాయి. అసహ్యమంతా నా గొంతులో విన్పిస్తుండగా "ఛీ!" అని మాత్రం అనేసి, ఒక క్షణం పాటు ఆగి మా ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తున్న నా అత్తగారివైపు, ఆడపడుచువైపు ఓ చూపు విసిరేసి నా గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుని, మంచం మీద వాలిపోయాను.
వాస్తవం ఏమిటో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అతడికి కావలసింది భార్యకాదు, ఒక బానిస! బాధ్యతల బరువుని కిక్కురు మనకుండా మోసే ఒక గాడిద లాంటి బానిస. తల్లి కోరిక మీద అలాంటి బానిసగా బాగా పనికివస్తానని పెళ్ళికి ఒప్పుకున్నాడు. కేవలం అన్నగారి ఆజ్ఞ పాలించడానికే నాతో కాపురం చేస్తున్నాడు. అంతే తప్ప అతడికి నా పట్ల ప్రేమకానీ, గౌరవం కానీ లేవు. నా 'పొందు' కావాలన్న కోరిక కూడా అతడికి లేదు. ఆ శారీరక సుఖం కూడా అతడు 'అన్నగారి కోరిక మీద చేస్తున్నాడన్న ఆలోచన భయంకరంగా నన్ను వెక్కిరిస్తుంటే దుఃఖం పొరలి పొరలి వచ్చింది. దిండులో ముఖం దాచుకుని మనసారా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత హృదయం తేలిక పడ్డట్లనిపించింది. అద్దంలో చూసుకుంటే కళ్ళు, మొహం వాచి నాకు నేనే వికారంగా అనిపించాను. చెంప మీద ఎర్రగా అతడి వేళ్ళ గుర్తులు. మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. కానీ దాంతోపాటు విపరీతమైన తలపోటు డామినేట్ చేయడంతో బ్యాగ్ లోంచి 'టాబ్లెట్' తీసి వేసుకుని టేబుల్ మీద వున్న జగ్ లోంచి నీళ్లు వొంపుకుని, తాగి, మంచమెక్కి దుప్పటి మీదకు లాక్కున్నాను.
మెల్లగా నిద్రలోకి జారిపోతుండగా "అది లోపల ఏ అఘాయిత్యం చేస్తోందోరా?" అని నా అత్తగారు అనడం, "...చావనీ, ఇప్పుడు దాని ఊసెత్తకు!" అంటూన్న నా భర్త మాటలూ చెవులకి లీలగా సోకాయి. నిర్వేదంగా నాలో నేను నవ్వుకుని, నిద్రలోకి జారిపోయాను.
'దాన్ని' అన్న పదం నన్ను బాధించిందా?..ఏమో?
12
నేను కాలేజీకి వెళ్ళేసరికి మొదటి క్లాసు మిస్సయిపోయింది. అయినా అప్పటికే నా మూడ్ బాగయిపోవడంతో నేను మామూలు రొటీన్లో పడిపోయాను. నాకు తీరిక దొరికేసరికి మూడున్నరయింది. అక్కడ్నుంచి తొందరగా బయలుదేరకపోతే షోరూంకి వెళ్లేసరికి లేటయిపోవచ్చు. తొందరగా నా సరంజామా అంతా సర్దేసి, నా డ్రాయర్ కి తాళం వేస్తుండగా ప్యూన్ వచ్చి నాకోసం ఎవరో వచ్చారన్నాడు. ఎవరై వుంటారో నేను వూహించలేకపోయాను. వస్తున్నానని చెప్పమన్నాను.
బ్యాగ్ తీసుకుని, నేను విజిటర్స్ రూమ్ కి వెళ్ళేసరికి అటువైపు తిరిగి ఏవో నోటీస్ బోర్డులు చదువుతూ నిలబడ్డ నా బావగారు కనిపించారు.
అతను అటువైపు తిరిగి వుండటంవల్ల నా రాక గమనించ లేదు. నేను ఆశ్చర్యంగా "మీరా?" అన్నాను.
అతనొక్కసారిగా వెనక్కి తిరిగి - "ఓ ...వచ్చావా, అదేమిటి బయలుదేరినట్టున్నావ్? కాసేపు లేటయినా నిన్నందుకోలేక పోయేవాడినేమో కదా!" అన్నాడు.
"అవునండీ, కాస్త పనుండి ఓ అరగంట ముందు బయలుదేరాను" అన్నాను.
అతను తలూపి "పద" అన్నాడు.
అతనెటు బయలుదేరుతున్నాడో తెలీకపోయినా నేను అనుసరించాను. అతను నిన్న సాయంత్రం జరిగిన గొడవ గురించి చర్చించడానికి వచ్చాడని ఊహించాను. అయితే అతను ఏకంగా కాలేజీకే రావడం నన్నాశ్చర్యపరచింది.
అతనూ కారులో ఏం మాట్లాడలేదు. శివకుమార్ శర్మ సంతూర్, హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కలిసిన call of valley (లోయల్లోంచి పిలుపు) సంగీతం అలల్లా, ఆహ్లాదంగా హృదయాన్ని తాకుతుంటే ఏదో చెప్పలేని సాంత్వన కలిగింది. కారు ఒక భవనం ముందాగింది. 'అదేమిటా?' అని నేను ఊహించడానికి ప్రయత్నిస్తుంటే నల్లటి పలక మీద తాపడం చేయబడ్డ ఇత్తడి అక్షరాలు నీరెండలో మెరుస్తూ కనబడ్డాయి.
"జె.ఎస్. ఎలక్ట్రానిక్ కంపొనెంట్స్ లిమిటెడ్".
నేను సంభ్రమంగా చూశానతని ఆఫీసు బిల్డింగుని.
అది అయన ఆఫీసు. మొదటిసారి నేనక్కడికి రావడం.
ఆఫీసంటే ఏదో వుంటుందనుకున్నాను కానీ మరీ ఇంత హుందాగా నిర్వహిస్తున్నాడనుకోలేదు. ఇంట్లో అతి మామూలుగా అందర్లో ఒకరిగా కనిపించే ఇతను; దీనికి యజమాని అన్న విషయం నాకొక సంభ్రమంగా తోచింది.
ఫ్యాక్టరీ అంతా చుట్టబెట్టిం తర్వాత నాకా కంపెనీని గురించి ఓ విధమైన అవగాహన ఏర్పడింది. అదంతా ఎంతో ఛాలెంజింగ్ గా, రిస్క్ గా, థ్రిల్లింగ్ గా తోచింది.
నేనప్పటివరకూ చేస్తున్న ఉద్యోగమే కష్టమైందనీ, నేనెంతో ఒత్తిడిని అప్పటివరకూ తట్టుకుంటున్నాననీ అనుకుంటూ నన్ను నేను మభ్యపెట్టుకున్నందుకు నిజాయితీగానే సిగ్గుగా తోచింది.
అతను నాతోపాటే నడుస్తూ చెప్తున్నాడు- "మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డానో. అప్పుడు మార్కెట్ ట్రెండ్, మోసాల గురించి పెద్దగా అవగాహన లేదు. దానికితోడు నాకు అనుభవజ్ఞానం లేకపోవడంవల్ల నా భాగస్వాములు కూడా నన్ను మోసగించేవారు. అయినా అన్నిటికీ ఎదురీది నిలబడ్డాను. ఇప్పుడా స్థితులన్నీ దాటిపోయాను. నా సంస్థ చిన్నదే అయినా ప్రస్తుతం చెప్పుకోదగ్గ పారిశ్రామికవేత్తలలో నేనొకడిని..."
నేనాలోచిస్తున్నాను. ఇన్ని అవస్థలు ఇతనొక్కడే పడుతుంటే ఇతని తమ్ముడు ఎందుకు చేయూత నివ్వడంలేదా? అని. నా సందేహం తెలిసిపోయినట్లుగా "నా కంపెనీ ఇబ్బందుల్లో వున్నంతకాలమూ నేనింట్లో ఎవరికీ చెప్పేవాడిని కాదు. అప్పటికి వాడింకా చదువుకుంటే వుండేవాడు, ఐదారేళ్ళ క్రితమనుకుంటా వాడి చదువు పూర్తయింది. 'ఇక నాతోపాటు పనిలోకి దిగరా, నాకు కాస్త తోడుగా వుంటుంది' అని చెబ్దామనుకునేలోపు వాడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నాకు ఉస్సూరనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా వాడు దాంట్లో చేరడానికి చాలా ఉత్సాహపడ్డాడు. వాడిది పెద్దగా రిస్కు తీసుకునే మనస్తత్వం కాదు. అప్పటికే ఎలాగూ నా సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చాయి కదా అని నేనూ ఊరుకున్నాను".
ఫ్యాక్టరీ చూడడం అయిపోయిన తర్వాత ఇద్దరం ఆయన పర్సనల్ ఛాంబర్ లో కూచున్నాం. అతను బెల్ కొట్టి ప్యూన్ తో కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పాడు.
ప్యూన్ వెళ్ళిపోయాక అప్పుడు నెమ్మదిగా అడిగాడు. "ఆ ...ఇప్పుడు చెప్పు- ఏమిటి నిన్నేదో గొడవపడ్డారట" అని.
నాకు ఒళ్ళు మండిపోయింది. "అది అడగడానికి ఇంత టైం తీసుకున్నారేం. కాలేజీలో విజిటర్స్ రూంలో అడిగేసుంటే సరిపోయేదిగా!" అన్నాను విసుగ్గా. అన్న తర్వాత నాకే నచ్చలేదు. 'ఏమిటి నేను మరీ పెద్దా చిన్నా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాను' అని బాధపడ్డాను.
ఆయన మాత్రం తేలిగ్గా నవ్వేసి "అదేం లేదులే. నీకీ ఫ్యాక్టరీ చూపించాలని ఎప్పుడో అనుకున్నాను. మనింట్లో ఇంకెవరికీ బిజినెస్ మీద ఆసక్తి లేదు. ఆఖరికి వాడిక్కూడా. ఆ బ్యాంక్ లో పనిచేయడం, వాళ్ళిచ్చే జీతం రాళ్ళు పట్టుకుని ఇంటికి రావడం తప్ప వాడికింకేదీ పట్టదు. నీకే కాస్తో, కూస్తో వ్యాపారం మీద ఇంటరెస్ట్, తెలివితేటలు వున్నాయి. అందుకే మెల్లిగా కొంచెం కొంచెం దీని గురించి నీకు అవగాహన పెరగడం అవసరం అని ఆలోచించాను. సర్లే, ఆ సంగతికేం గాని నిన్నటి గొడవేంటి?" అని మళ్ళీ మొదటికొచ్చాడు.
"మీ వరకూ ఎవరి వర్షన్ వచ్చిందో నాకు తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకు మటుకు మా గొడవ స్కూటర్ కొనడం విషయంలో సాగింది" అన్నాను.
"ఏదేమైనా నువ్వు కొంటున్నావన్న విషయం వాడిని ముందు అడిగుంటే వాడి అహం సంతృప్తిపడేదేమో కదా! దాంతో వాడు కాదన్నా నీకు ఒప్పించగల వీలుండేదేమో ఆలోచించు" అన్నాడు.
"అది నేను నా డబ్బుతో కొందామనుకున్నాను. నేను పొద్దున్నే బస్సులో తిరగలేక, కాలేజీ టైంకి చేరలేక అవస్థపడుతుంటే తన బాధ్యతగా నాకు బండి కొనాల్సింది పోయి, నేను కూడబెట్టుకున్న డబ్బుతో కొంటే కూడా అభ్యంతరపెట్టే మనిషి గురించి ఇక నాకు చర్చించాల్సింది ఏమీలేదు. అయినా నేను నిన్న కూడా కొనాలా, వద్దా అని అతన్ని నేనడగలేదు. కొంటున్నానని చెప్పానంతే. అడగాల్సిన అవసరం నాకేం కన్పించలేదు". నాకు మళ్ళీ ఆవేశం వచ్చింది. అతనేం మాట్లాడలేదు. తన పెన్ తో టేబుల్ మీద కొడుతూ దీక్షగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనుబొమలు ముడివేసి చూస్తున్నాడు.
నేను వెంటనే లేచి నిలబడి "ఇక ఆ విషయంమీద చర్చ అనవసరం. నేను అర్జెంటుగా వెళ్ళాలి" అన్నాను.
అతను ఆశ్చర్యంగా "దేనికి?" అనడిగాడు.
నేను చెప్పాను. "స్కూటర్ బుకింగ్ క్యాన్సిల్ చెయ్యడానికి" అని. నా గొంతులో కసి ధ్వనించింది.