Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 15


    "జై.... " అని ప్రజల నినాదాలు ఒక్కసారిగా వినిపించాయి దూరంనుంచి.

    "చూసావా సెక్రటరీ! జనం మన మాటలకి ఎట్లా 'జై' కొడుతున్నారో!!" అన్నాడు మంత్రి.

    "స్వామీజీకీ జై! మంగళ బృహస్పతికీ జై !!" అని దూరం నుంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.

    మంత్రి మొహం వాడిపోయింది. "మనకోసం కాదంటావా?" అనడిగాడు.

    "ఈ పక్కనే 'బుద్ధిలేనిపాలెం' అని ఒక ఊరుంది సార్! అక్కడెవరో స్వామీజీ వెలిసాడట. జనం తండోప తండాలుగా వెడుతున్నారని లోకల్ పత్రికలో చదివాను. మీరు వింటున్న జై...జై.... ధ్వానాలు అక్కడివే"

    "అయితే పదండి, అక్కడికే పోదాం"

    "మన టూర్ ప్రోగ్రాం అక్కడికి కాదండీ! మనం వెళ్ళవలసింది దున్నపోతులపాలెం."

    "పిచ్చివాడా! ఏ పాలెం అయితే ఏమున్నది? అక్కడా నా ప్రజలే.... ఇక్కడా నా ప్రజలే" అంటూ నాదస్వరం విన్నపాములా ప్రజలవేపు నడిచాడు.

    ఆయన అక్కడికి చేరుకునేసరికి బృహస్పతిని కుర్చీలో కూర్చోబెట్టి జనం హారతులు పడుతున్నారు. 'గాడ్స్ మస్ట్ బీ క్రేజీ' అన్న ఇంగ్లీషు సినిమాలో దృశ్యంలా ఉందది.

    స్వయంగా మంత్రిగారే దీన్ని చూడడానికి వచ్చారనే సరికి మరింత కలకలం రేగింది. జరిగిన సంగతంతా ఆయనకెవరో వివరించారు. అప్పుడే ఈ వార్త పక్క ఊళ్ళకి కూడా ఎలా పాకిపోయిందో తెలీదు కానీ, బళ్ళు కట్టించుకుని మరీ రాసాగారు.

    మంత్రి ఒక్క ఉదుటున వేదిక ఎక్కి బృహస్పతి ఎడమచేతిని, తన కుడిచేత్తో పట్టుకుని, ప్రజల వేపు తిరిగి, అతడి చేతిని పైకి లేపాడు. ఈ మధ్య ఇదో ఫ్యాషనై పోయింది. నలుగురైదుగురు వేరు వేరు పార్టీ లీడర్లు ఒకే వేదికమీద కలిస్తే ఆ విధంగా చేతులన్నీ కలిపి గొలుసులా పైకెత్తడమన్నమాట... 'మిమ్మల్ని ఒక్కొక్కరం వేరు వేరుగా తినం... మొత్తం అందరం కలిసి కట్టుగా మిమ్మల్ని భక్షిస్తాం...' అని సింబాలిక్ గా సూచించే గొలుసుకట్టులా ఉంటుంది ఆ మానవ లీడర్ల హారం.

    "ప్రజలారా!" అన్నాడు మంత్రి. "....భగవంతుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన ఈ మనిషి నిజంగా భగవత్స్వరూపమే!"

    వెనకనున్న సెక్రటరీ రహస్యంగా "సార్! అది నిజమో, అబద్ధమో తెలుసుకోకుండా మనం అలా చెప్పెయ్యకూడదు. మంత్రులయినందుకు ఆలోచించి, బాధ్యతాయుతమైన స్టేట్ మెంట్ యివ్వాలి" అన్నాడు.

    మంత్రి గొంతు తగ్గించి- "మంత్రికి బాధ్యత ఏమిటయయా- జోకు! మంత్రి అనేవాడు స్వంతంగా ఏమీ ఆలోచించకూడదు. ప్రజలు ఏది ఆలోచిస్తే తనూ అదే ఆలోచించాలి. నేల ఈనినట్టున్న ఇంతమంది ప్రజలు - ఈయన్ని మహాపురుషుడు అన్నారంటే నిజంగా అయ్యే వుంటాడు. ఒకవేళ కాలేదనుకో. మనకి నష్టమేమిటి? ఆయనతోపాటు ఈ ప్రజలందరూ మనవేపు వచ్చేస్తారు కదా!" అన్నాడు.

    "వస్తారంటారా?"

    "మనలో దమ్ము లేనప్పుడు ఇంకొకర్ని ముద్దెట్టుకోటంలో తప్పులేదని- మొన్న మొన్నటివరకూ గాంధీ- నెహ్రూల ఫోటోల్ని చూపెట్టి కాంగ్రెసోళ్ళు నిరూపించారు కదయ్యా! అత్త-గాజులు బద్దలు కొట్టేసుకునీ, అల్లుడు- దశదినకర్మలు చేసి ఆ తర్వాత ఆ సమాధి సంగతే మర్చిపోయారంటే- దాన్ని బట్టి మనకి అర్ధమైనదేమిటీ? ఫోటోలూ, సమాధులు కూడా ఓట్లేయిస్తాయని! అవునా? మరి అటువంటప్పుడు ప్రజలందరూ మహా పురుషుడంటున్న ఈ బతికున్న మనిషిని మన పార్టీలో కలిపేసుకోవడంలో తప్పేమిటటా?"

    "అధిష్టానం వర్గం అనుమతి లేకుండా అలా ఫిల్లింగ్ ఇచ్చేయడం మన ప్రిన్సిపుల్ కాదేమో సార్!"

    "వీలయినంత వరకూ అందర్నీ లోపలికి పుల్లింగే తప్ప ఫిల్లింగ్ ఏమిటయయా? మొన్న మొన్నటివరకూ ఆవిడ పార్టీలో వుండి మన కార్యకర్తల్ని చావబాదినవాళ్ళు యిప్పుడు మన పార్టీలోకి వస్తూంటే వాళ్ళకోసం గేట్లు బార్లాతీసేసి ఉంచలా? వాళ్ళనే కలిపేసుకున్నప్పుడు ఈ మహనీయుణ్ణి కలుపుకోవడానికి అధిష్టానవర్గం ఎందుకు ఒప్పుకోదూ?" ఎదురు ప్రశ్న వేశాడు.

    మంత్రిగారు తమతో ఒకమాట మాట్లాడి, ఆ తర్వాత వెనక్కి తిరిగి సెక్రటరీతో గుసగుస లాడడం అర్ధంకాక ప్రజల గోలచేయడం ప్రారంభించారు. మంత్రి 'శాంతించండి' అన్నట్టు చెయ్యెత్తి, అప్పుడే ఎవరో తీసుకొచ్చి అమర్చిన మైకులో ప్రజల్ని ఉద్దేశించి అన్నాడు.

    "మనిషికి భగవద్దర్శనం చేయించిన ఈ స్వామీజీకి, యిక్కడే ఒక ఆశ్రమం కట్టించి యివ్వాలని సెక్రటరీని ఆదేశిస్తున్నాను. అంతేకాదు. ప్రజాసేవకోసం పైలోకంనుంచి అరుదెంచిన ఈ మంగళ బృహస్పతిని ఇప్పుడే మా పార్టీలో చేర్చుకుంటున్నట్టు ప్రకటిస్తున్నాను."

    ప్రజల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. బృహస్పతి సవినయంగా మైక్ అందుకున్నాడు. "మంత్రిగారు నన్ను క్షమించాలి. లోకాధినేత ఆదేశానుసారం నేను ప్రజలకి సేవచేయడానికి వచ్చాను తప్ప, పార్టీ అధినేత ఆదేశాలు పాటించడానికి కాదు. ఒకవేళ మీరు ఏ రవాణా శాఖో, ఆర్ధికమంత్రి పదవో ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో యిప్పుడే నేను మీ పార్టీలో చేరితే- ఆ తర్వాత పార్టీ అధినేత అంతరంగిక చర్యలు నచ్చక, ఆయన్నే వెన్నుపోటు పొడవాలన్న క్షుద్రమైన కోరిక నాకు కలగవచ్చు. అప్పుడాయన భార్య సినిమా ఛాన్స్ లులేని హీరోల్నీ,కమెడియన్లనీ తీసుకుని వానరసైన్యంలా నా మీద దండెత్తవచ్చు. అంత గొడవెందుకు? నా పార్టీనేదో నన్నే స్థాపించుకోనివ్వండి" అంటూ చేతులెత్తి నమస్కరించాడు.
   
    మంత్రి అవాక్కయి చూసాడు. ఒక కాబోయే మహానాయకుడి లక్షణం ఆ క్షణం కళ్ళముందుకు కనబడ్డట్టుంది. ఇప్పుడే ఇతడిని మంచి చేసుకుంటే భవిష్యత్తులో ఎందుకైనా మంచిది అనిపించింది. జనంవేపు తిరిగి "ప్రజలారా! ఇంతటి నిజాయితీ వున్న నాయకుడు దొరకడం మన అదృష్టం. ఇతని పార్టీ అధికారంలోకి వస్తే దానితో భాగస్వామి అయ్యో.... లేక బయటినుంచో సపోర్ట్ ఇస్తామని హామీ యిస్తున్నాను" అన్నాడు.

    ఈసారి అవాక్కవడం బృహస్పతి వంతయింది. మైక్ కి చెయ్యి అడ్డుపెట్టి మంత్రితో రహస్యంగా, "అయ్యో! నా పార్టీ సిద్ధాంతాలు ఏమిటో నాకే సరిగ్గా తెలీదు. కమ్యూనిజమో, కాపిటలిజమో, మతతత్వమో నేనే నిర్ణయించుకోలేదు. మీరు ఏ సైద్ధాంతిక ప్రాతిపదిగ్గా నాతో కలుస్తారు?" అన్నాడు.

    "అధికార సిద్ధాంత ప్రాతిపదిక" అన్నాడు మంత్రి. ".... అదొక్కటి చాలదా, మనందరం కొంతకాలమయినా కలిసి కట్టుగా ఉండడానికి!"

    మంత్రిగారితోపాటు వెనక కార్లలో వచ్చిన వ్యక్తుల్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. అనుకోకుండా ఒక 'మసాలా' వార్త దొరికేసరికి వాళ్ళపంట పండినట్టయింది.

    'ఓంఫట్ బాబా' గురించి అప్పటికే రెండు రోజులనుంచి చిన్న చిన్న వార్తలు పడుతున్నాయి. కానీ ఇది అంతకన్నా గొప్ప సంచలనం కలిగించే వార్త! ఒక వ్యక్తి దేవుడి ఆశీర్వచనం పొంది ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పడం....

    అందులో నిజమెంతయినా కానీ, అది వేరే సంగతి. ముందొక వార్త జనంలోకి వెళ్ళిపోయింది కదా! ఉత్సాహభరితంగా చదువుతారు. అమ్మకాలు పెరుగుతాయి. ఆ తర్వాత అతడో మోసగాడని తెలిసిందనుకో.... ఆ విషయం మళ్ళీ పెద్దక్షరాలతో వ్రాసి అమ్మకాలు మరింత పెంచుకోవచ్చు. ఇంతేకదా పత్రికల ఫిలాసఫీ. హెడ్ లైన్ లో వేయడానికి సంచలన వార్తలేని రోజు ఎడిటర్ కి నిద్ర పట్టదనడంలో అతిశయోక్తి ఏమున్నది?

    అందుకే వారు బృహస్పతి చుట్టూ బిలబిలా మూగారు. మంత్రిగారు అక్కడినుంచి మర్యాదగా తప్పుకున్నారు.

    కాబోయే ముఖ్యమంత్రి, తన ప్రధమ సమావేశంలో నవ్వినట్టు, పత్రికా విలేఖర్లను చూసి సాదరంగా నవ్వాడు బృహస్పతి. అయితే వూహించని ప్రమాదం పొంచివున్నదని అతడికి ఆ క్షణం తెలీదు. విలేఖర్లలో ఒక అరవయ్యేళ్ళ వృద్దుడున్నాడు. పాతికేళ్ళ క్రితం అతడు మధ్యప్రదేశ్ లో ఉండేవాడు.

    ప్రస్తుతం శ్రీహర్ష చేస్తున్న పనిలాంటిదే పాతికేళ్ళ క్రితం అతడు చేపట్టాడు. చంబల్ లోయ దొంగల గురించి ఆ రోజుల్లోనే ఎన్నో వ్యాసాలు వ్రాసి పత్రికలకి పంపేవాడు. డాకూ మంగళ్ సింగ్ నీ, అతడి అనుచరులనీ అతడు రెండు మూడుసార్లు ప్రత్యక్షంగా కలుసుకున్నాడు కూడా!

    అన్నిటికన్నా ముఖ్యంగా ఆ వృద్ధ విలేఖరి హేతువాది. గత జన్మల్నీ, 1999 ప్రపంచ ప్రళయాల్నీ నమ్మడు. ముందేమీ తెలీనట్టు, మామూలుగా, చిన్న చిన్న ప్రశ్నలతో ఇంటర్వ్యూ ప్రారంభించాడు.

    "డాకూ మంగళ్ సింగ్ గా మరణించి, పునర్జన్మ ఎత్తానన్నారు కదా!"

    "అవును".

    "అప్పుడు మీకు వివాహం అయిందా?"

    బృహస్పతి కాస్త తటపటాయించాడు. "డాకూలకి వివాహాలుండవు."

    "కానీ మీ భార్యపేరు రత్నాబాయి."

    "అది వివాహం కాదు. కలిసి ఉండడం" గంభీరంగా అన్నాడు.

    "అప్పుడు మీకెంతమంది పిల్లలు?"

    అతడు ఏం చెప్తాడాని అందరూ ఉత్సుకంగా వింటున్నారు. హనుమంతరావు కూడా భయం భయంగా బృహస్పతి వేపు చూశాడు. డాకూ మంగళ్ సింగ్ చరిత్ర అంతా వృద్ధ విలేఖరికి పూర్తిగా తెలుసని ఆ పాటికే అతడికి అర్ధమైంది. 'నేరకవచ్చి ఇందులో ఇరుక్కున్నామే' అనుకుని దైవప్రార్ధన మొదలుపెట్టాడు. అక్కడ సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది.

    "మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. రత్నాబాయితో మీరు కలిసి వున్నప్పుడు మీకెంతమంది పిల్లలు?" 

    బృహస్పతి అతడివేపు కన్నార్పకుండా ఒక్కక్షణం చూసి "ఒక కొడుకు! నేను మరణించే సమయానికి వాడికి ఒకటిన్నర సంవత్సరం."

    "కరెక్ట్!" అప్రయత్నంగా అన్నాడు విలేఖరి.

    అంతే! ఒక సముద్ర కెరటం ఉవ్వెత్తున లేచి పెద్ద శబ్దంతో కింద పడ్డట్టు జనంలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. (అతడి విజయం తమ విజయమైనట్టు) జనం కేరింతలు కొట్టారు.

    "థాంక్యూ శ్రీహర్షా...!" అని మనసులో అనుకున్నాడు బృహస్పతి.

    "ఇంకొక ప్రశ్న."

    "అడగండి."

    "ఇందిరాగాంధీ రాజభరణాల్ని రద్దు చేసిన రోజుల్లో ముగ్గురు మాజీ సంస్థానాదిపతులు తమ యావదాస్తినీ బంగారం రూపంలో మార్చుకుని రవాణా చేస్తున్నప్పుడు- డాకూ మంగళ్ సింగ్ దాన్ని కొల్లగొట్టాడు. నిధి రూపంలో దాన్ని ఎక్కడో దాచాడు. దాని వివరాలు చెప్తారా?"

    బృహస్పతి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. అప్రయత్నంగా గుటక మింగాడు. మొహం వెలవెల బోయింది.

    పత్రికా విలేఖరులందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాబా రూపంలో వున్నా హనుమంతరావు దిగులుతో కూడిన భయంతో బృహస్పతివైపు ఆందోళనగా చూసాడు. తామేదో చెప్పగానే జనం నమ్మేసారు అనుకున్నారే తప్ప లోతైన ప్రశ్నలతో వేధిస్తారనుకోలేదు. అకస్మాత్తుగా మంత్రి రాక, ఆయనతోపాటు ఊహించని విధంగా పత్రికా విలేఖరుల ఆగమనం ఇబ్బందిలో పడేసేటట్టుంది. మామూలు ఇబ్బంది కాదు, ఏమాత్రం అనుమానం వచ్చినా అప్పటివరకూ ప్రణామాలు చేసిన జనమే వ్రణాలు కోసినట్టు పీకలు తెగ్గోస్తారు.

    బృహస్పతి నవ్వుతూ "మంగళ్ సింగ్ గురించి ఇప్పటికిప్పుడు చాలా తెలుసుకుని వచ్చినట్లున్నారే?" అన్నాడు.

 Previous Page Next Page