"వీడింకా తాయారుని మర్చిపోలేదనుకుంటాను. మీలాంటి ఉత్తమరాలిని చేసుకున్నా అతడికి సుఖం లేదు. మీకూ సుఖం లేకుండా చేస్తున్నాడు. రానివ్వండి చెప్తాను."
"వద్దులెండి. నేనే ఏదో చెప్పాననుకుంటారు. మీ విషయం చెప్పండి - మీ భార్యకేం జబ్బు?" సానుభూతికి బదులుగా సానుభూతి అందించాలని తాపత్రయంతో అడిగింది.
"అహంభావమనే జబ్బు నేను లేని వాడినని ముందే తెలుసు. కానీ భార్యా, బిడ్డల్ని పోషించలేనంత బీదవాడిని మాత్రం కాదు. ఉన్నంతలో తృప్తిగా బ్రతకాలంటాను నేను. మా వాళ్ళ ఆస్థి అంతా నాకేగా, మా వాళ్ళతో కలిసి వుండి అది అనుభవిద్దాం అంటుందామె. ఇద్దరభిప్రయాలు వేరని తెలిసిపోయింది. నాకొచ్చిన దాంట్లో నేను తృప్తిగా బ్రతుకుతున్నాను. వాళ్ళ ఆస్థి అనుభవిస్తూ ఆమె అక్కడ సుఖంగా వుంది. ప్రాబ్లమ్ సాల్వ్ డ్" నవ్వాడు.
"బాధను గొంతులో దాచుకొని, పైకి హాయిగా నవ్వడం దైవత్వం అవుతుంది" అనుకుంది నిర్మల. అతడిమీద జాలేసింది. తనలాగే బాధపడుతున్నాడు కాబట్టి ఆత్మీయుడనిపించింది. పరమహంసలో ఏదో తేజస్సు కనబడుతుంది. బాధల్ని దాచుకోవడం వల్ల వచ్చిన వేదాంతం అయివుంటుంది అది.
బయట కారు ఆగిన చప్పుడు వినిపించింది. సింహాచలం పరిగెత్తాడు. "మీ స్నేహితుడు వచ్చాడు. నేను వెళుతున్నాను" లేచి బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది నిర్మల.
చాలా రోజులకు కనిపించిన స్నేహితుడ్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని "రా రా లోపల కూర్చుందాం" అని తన బెడ్ రూంలోకి తీసుకెళ్ళాడు వినయచంద్ర.
పరమహంసకు ఆ ఇంటి పరిస్థితి బాగా అర్ధమైంది.
* * *
సాహితి కారు దిగి తల వంచుకొని స్కూల్లోకి నడిచింది. పదేళ్ళనుంచి ఆ స్కూల్లో చదువుతున్నా ప్రతి ఉదయం భయంగానే లోపలకు అడుగు పెడుతుంది. గుంపులు గుంపులుగా కూర్చుని ఉత్సాహంగా కేరింతలు కొట్టే పిల్లలను చూస్తుంటే ఆమెకు భయం. ఎటూ చూడకుండా వెళ్ళి క్లాసులో తన సీట్లో కూర్చుంటుంది ఇక కదలదు.
వయసు పెరిగిన విజ్ఞత కలిగి పరిసర వ్యక్తుల కుత్సిత బుద్దులను అసహ్యించుకుంటూ, ఎవరితోనూ అడ్జెస్టవలేక ఏకాంతాన్ని కోరుకుంటారు కొందరు. పదిమంది పుట్టి, పెరుగుతూ ఆ గోల భరించలేక ఒంటరితనాన్ని ఇష్టపడేవారు మరికొందరు. కుటుంబంలో సరైన ఆదరణా, ఆప్యాయతా లభించవలసిన సమయంలో లభించక వారంతట వారే ఒంటరితనానికి అలవాటు పడి వయసు పెరిగినా పదిమందిలోకి వెళ్ళి కలవలేక బాధపడేవారు కొందరు. సాహితిది మూడో రకం. పదహారేళ్ళ వయసులో 'నిర్లిప్తత' పెద్ద జబ్బు.
సాహితి క్లాసులో కూర్చున్న సమయంలో పాతిక గజాల దూరంలో వున్న స్టాఫ్ రూంలో ఆమె గురించే డిస్కషన్ జరుగుతోంది. పరీక్ష పేపర్లు దిద్దుతున్న తెలుగు టీచర్ అంది-
"ఈ అమమయిని చూస్తుంటే గమ్మత్తుగా వుంటుంది. పరీక్ష పేపర్లు బ్రహ్మాండంగా వ్రాస్తుంది కానీ క్లాసులో మాత్రం నోరు విప్పదు. ఉత్సాహంగా వుండదు. ఓరల్ పరీక్షలో చాలా తక్కువ మార్కులు వస్తాయి" అంది.
"ఆ వ్రాయడానికి కూడా ఒక మూడ్ ఉండాలి కాబోలు. ఒక్కోసారి బాగా రాస్తుంది మరొకప్పుడు బ్లాంక్ పేపరు ఇస్తుంది. క్లాసులో లెక్క చెయ్యమనగానే, అందరూ ముందుగా చేసి ఫస్టు చూపించాలని ఉబలాటపడితే తను మాత్రం అందరికన్నా మొదటే చేసి కూడా చెప్పదు, చూపించదు. ఒట్టి మొద్దులా ప్రవర్తిస్తుంది" అంది లెక్కల టీచర్.
"నేను గమనించానా అమ్మాయిని. చాలా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు వుంది. బహుశా క్లాసులో అందర్లోకి బీదపిల్లవడం వల్లనేమో" అంది ఇంగ్లీషు టీచర్. ఆమె చాలా సైకాలజీ పుస్తకాలు చదివానని చెప్పుకుంటుంది.
"వాళ్ళు బీదవాళ్ళుకాదు. సాహితి స్కూల్ కి కార్లో వస్తుంది. వాళ్ళిల్లు దేవేంద్ర భవనంలా వుంటుంది" అంది లెక్కల టీచర్.
"అలా చెప్పండి. మరీ డబ్బున్న వాళ్ళైనా వచ్చే యిబ్బంది ఇదే. తల్లిదండ్రులకి పిల్లల గురించి పట్టించుకునే టై ముండదు. ఆయాల మీద వదిలేస్తారు. క్లబ్బుల వెంట తిరిగే తల్లిదండ్రులకి ఈ విషయాలు తెలియవు" తన సైకాలజీ జ్ఞానంతో తప్పుని వెంటనే కప్పేసుకుంటూ అందామె.
"మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఈ రోజుల్లో ధనవంతులలో కూడా టెండెన్సీ మారుతోంది. తమ పిల్లలు సిటీలో బెస్ట్ స్కూల్లోనే చదవాలి, అన్నింటిలోనూ ఫస్టు రావాలి. ఆటల్లో, పాటల్లో, కళల్లో ఫస్టు వచ్చి పదిమందిలోనూ పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారీ కాలంలో అందుకోసం వేలకువేలు ఖర్చుపెట్టి ట్యూషన్లన్నీ, ట్యూటర్లనీ పెడుతుంటారు. ఇది నేను చేస్తున్న టెండెన్సీ! ఇక సాహితి విషయానికొస్తే వాళ్ళ వీధిలోనే మా ఇల్లు. వాళ్ళమ్మ ఇంట్లోంచి బయటకు వెళ్ళదసలు. సాయంత్రం వేళల్లో కూతురితోపాటు తోటలో కూర్చుంటుంది. వాళ్ళ నాన్న గురించి కూడా నేనేం చెడు వినలేదు" అంది.
వీళ్ళందరి సంభాషణనీ ఆసక్తిగా వింటోంది సైన్సు టీచర్ కోమల. ఆమెకు సాహితంటే ఎందుకో అభిమానం బెల్ కావడంతో వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది. కానీ కోమలను మాత్రం ఆ ఆలోచనలు వదల్లేదు. ఆమె సాహితితో మాట్లాడాలని నిర్ణయించుకుంది.
* * *
సాహితి కళ్ళు తెరిచింది. అంతా చీకటి! రేడియో డయల్ గడియారం టైము ఒంటిగంట దాటినట్లు చూపిస్తోంది. ఆమె కళ్ళు వెతికాయి. ఊహు- ఎవరూ లేరు.
దాదాపు పదేళ్ళుగా ఆమెకి ఇలా అప్పుడప్పుడూ నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ రావటం అలవాటయింది. తండ్రి కోసం చూస్తుంది. ఆనాటి రాత్రి తండ్రి తన గదిలోకి రావడం, ఆప్యాయంగా పలకరించడం మర్చిపోలేని అనుభవం.
సాహితి పక్కమీద నుంచి లేచింది. తండ్రి గదిలో లైటు వెలుగుతూనే వుంది. చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. గది దగ్గరగా వెళ్ళి తొంగిచూసింది లోపల మమ్మీ కూడా వుంది.
"ఇంక చాలండీ! రాత్రంతా తాగుతూనే వుంటారా? డాక్టర్లు చెప్పారు కూడా. ఎందుకిలా ఆరోగ్యం పాడుచేసుకుంటారు?" అంది నిర్మల.
"పోతే పోనీ, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. తాగి మర్చిపోదామంటే నీ గొడవ ఏమిటి? వెళ్ళి పడుకో నన్ను విసిగించకు" సీసాలోంచి మరికాస్త ఒంపుకున్నాడు. అతడికి వ్యాపారంలో ఏభై లక్షలదాకా నష్టం వచ్చింది భార్యకు చెప్పలేదు ఆ విషయం.
"మిమ్మల్ని తాగనివ్వను" వెళ్ళి గ్లాసు లాక్కోవడానికి ప్రయత్నించింది. విసురుగా ఆమెను తోశాడు వినయచంద్ర.
"నేను తాగితే ఆరోగ్యం పాడవుతుందని భయమా లేక వ్యాపారంలో నష్టం తెప్పిస్తున్నానని నీ బాధా? భయపడకు. ఆస్థి చాలా వుంది. నే పోతే పది లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది."
తల్లి వెక్కిళ్ళు వినపడ్డాయి.
నిశ్శబ్దంగా సాహితి గదిలోకి వెళ్ళిపోయింది.
ఎందుకో తెలీదుగానీ ఆ అమ్మాయికి టీచర్ గుర్తొచ్చింది.
మర్నాడు ఉదయం స్కూలుకి వెళ్ళబోతూ గులాబీ తోట దగ్గర ఆగింది. రంగు రంగుల పూలు విరగబూసి వున్నాయి. ఒక్కటి కోసుకెళ్ళి టీచర్ కిస్తే? ఊహు....! ఆ ధైర్యంలేదు. వెళ్ళి కార్లోకూర్చుంది. అప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది. 'తనకంటే చిన్నవాళ్ళు చొరవగా పదిమందిలోనూ వెళ్ళి టీచర్ ని విష్ చేసి కబుర్లు చెపుతుంటే తనలో ఎందుకీ భయం?' అనుకుంది.
'డిఫెండబులిటీ' అన్న విషవృక్షం తనలో మొలకెత్తి నెమ్మదిగా ఊడలు సాగుతోందని ఆ పాపకి తెలీదు. ఏ సైకాలజిస్టు ఆమెని చూసినా, వెంటనే ఆమె "I am not o k. you are o k." స్టేజిలో వుందని చెప్పెయ్యగలడు.
"వినతి .... ముఫ్ఫై అయిదు, వెరీ పూర్, క్లాసులో పాఠం వినకుండా దిక్కులు చూస్తే ఇలాగే వస్తాయి మార్కులు వినయ.....నలభైరెండు, పాసుమార్కులు వస్తే చాలదమ్మా! ఇంకా కష్టపడాలి. వందనా.... అరవై ఒకటి, ఫర్వాలేదు కానీ ఇంకా మంచి మార్కులు రావాలి" కోమలా టీచర్ ఒక్కొక్కరి పేరూ పిలిచి మార్కులు చెప్పి యిస్తోంది. సాహితికి గుండెల్లో గుబులు మొదలయింది. ఒంటరిగా వెళ్ళి పేపరు తీసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యుంటే టీచర్ అందరిముందూ తిడితే? ఎలా....? ఎలా? ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. తన గుండెల చప్పుడు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. "సాహితీ" టీచరు స్వరం వినగానే తనకు తెలీకుండానే లేచి నిలబడింది. ముఖంలో రక్తం పూర్తిగా ఇంకిపోయి పాలిపోయింది.
"ఎనభై తొమ్మిది ఫస్ట్ మార్క్" క్లాసులో అందరూ చప్పట్లు కొడుతున్నారు. వణుకుతూనే వెళ్ళి పేపరు తీసుకుంది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
"వెరీగుడ్! కీపిట్ ఆఫ్" నవ్వుతూ ఆగిపోయింది కోమల. "ఏమైంది సాహితీ....? ఒంట్లో బావుండలేదా?" భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అడిగింది.
"ఏం లేదు టీచర్! బాగానే ఉన్నాను" సన్నగా గొణిగింది.