Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 16


    మరో క్షణం గడిచివుంటే ఏమై వుండేదోగానీ, అప్పుడే పిస్తోల్ శబ్దం వినిపించింది.

    ప్రవల్లిక మీదకు వంగబోతున్న టెర్రరిస్టు చప్పున ఆగిపోయాడు. ఇద్దరు గూండాలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఈ శబ్దాన్ని వాళ్ళు వూహించలేదు. ఎవరు ఎవరిమీద పేల్చారో తెలియలేదు. ఎందుకంటే, అంతకుముందు వినిపించిన శబ్దంతోనే, వాళ్ళ ఉద్దేశంలో విహారి మరణించి ఉండాలి.

    వాళ్ళ సందిగ్ధతని ప్రవల్లిక సరియైన సమయానికి సరిగ్గా ఉపయోగించుకుంది. బలం అంతా కాళ్ళలోకి తెచ్చుకుని, తనని పట్టుకుని వ్యక్తి మొహంమీద కొట్టింది. అతడి చేతుల్లోంచి తప్పించుకుంటూ ఉండగా రెండోవాడు తిరిగి పట్టుకోబోయాడు.

    అప్పుడు పేలింది వెనుకనుంచి పిస్తోల్. ఛాతీనుంచి గుండు దూసుకుపోయింది. రక్తం చిమ్ముతుండగా టెర్రరిస్టు వెనక్కు విరుచుకు పడిపోయాడు. ఆ పడటంలో కాలుజారి లోయలోకి కూలిపోయాడు. అతడు పెట్టిన ఆర్తనాదం అడవిలో ప్రతిధ్వనించింది.

    విహారి మళ్ళీ ఇంకోసారి పేల్చాడు. అయితే ఈసారి బుల్లెట్ ప్రత్యర్ధి పక్కనుంచి దూసుకుపోయింది. ఊహించని దాడితో ఆ మిగిలిన ఒక్క ప్రత్యర్దీ బెదిరిపోయాడు. ప్రవల్లిక ఒక్కతే అన్న ఉద్దేశ్యంతో ఆయుధాలు కూడా దగ్గిర వుంచుకోలేదు. వాడి కళ్ళముందే సహచరుడు మరణించడంతో అతడు ధైర్యం కోల్పోయాడు. విహారి మరోసారి గురిచూసే లోపులో తుప్పల్లోకి పరుగెత్తి అదృశ్యమయ్యాడు.

    విహారి వంటిమీద ఒక షర్టు తప్ప మరేమీలేదు. అదైనా అదృష్టవశాత్తూ చెట్టుకొమ్మల్లో దొరికింది.

    అసలతను బ్రతికి బయటపడటమే ఒక అదృష్టం.

    రామ్ లాల్ సాడిస్టిక్ గా అతడితో ఆడుకున్నాడు. "నిజం చెప్తే వదిలేస్తాను. చెప్పు కాలుస్తావా- కాల్చనా!" అని ఒకసారి, "నిజం చెప్పావు అందుకే కాల్చలేదు. చెప్పు ఈసారి నిన్ను కలుస్తానా? గాలిలోకి పేలుస్తానా?" అని మరోసారి- ఇలా ప్రాణాల్తో ఆడుకోసాగాడు.

    అయితే, అతడు గాలిలోకి పేల్చినప్పుడు, చెట్టుమీద ఉన్న గ్రద్దకి ఆ బుల్లెట్ తగలడం, అది నేల కూలడం అతడు గమనించలేదు. దానితోవున్న జంట రెక్కలు సాచి గాలిలోకి రివ్వున ఎగిరింది. కసితో, కోపంతో ప్రచండ వేగంతో దాని రెక్కలు టపటపా కొట్టుకున్నాయి.

    ఆ సమయానికి రామ్ లాల్ గట్టిగా నవ్వుతూ "గోడమీద నుంచి నా మీద ఎలా దూకావు? ఇలా కదూ...." అంటూ ఆక్రోబాటిక్స్ చేసి చూపిస్తూ మరోసారి (ఈసారి నిజంగానే) విహారిని షూట్ చేయబోయే సమయానికి గాలిలో విసురుగా వచ్చి అతడి నుదుటిమీద బలంగా కాళ్ళతో కొట్టింది.

    రామ్ లాల్ ఈ హఠాత్ చర్యకి విస్తుబోయాడు. ఎంతటి వాడినైనా భయకంపితుడ్ని చేసే చర్య అది. అతడి కుడి కంటినుంచి రక్తం కారసాగింది. పిస్టల్ అనాలోచితంగా వదిలేశాడు. బాధతో గిర్రున తిరిగాడు.

    విహారి ఆ అవకాశాన్ని వదులుకోలేదు. వేగంగా వెళ్ళి పిస్తోల్ అందుకున్నాడు. అయితే రామ్ లాల్ ఆ సంగతి గ్రహించి చురుగ్గా అక్కడినుంచి పరుగెత్తాడు. కనపడని స్టేజిలో తుప్పల్లో అడ్డదిడ్డంగా పరుగెత్తి అదృశ్యమయ్యాడు.

    విహారి అతడి గురించి పట్టించుకోలేదు. ప్రవల్లిక ఏమైందా అన్న ఆందోళనతో వెతుక్కుంటూ వచ్చాడు. అతడి వంటిమీద షర్టు మాత్రం వేసుకున్నాడు. ప్రాబ్లం యుక్తాయుక్తాలకన్నా పెద్దది. అతడు వచ్చే సమయానికి ప్రవల్లిక శారీరక స్థితికూడా దాదాపు అలాగే వుంది. ఆమె కూడా దొరికిన ఆచ్చాదనను కప్పుకుంది కానీ అది చాలా చిన్నది.

    మృత్యువు ఎంత సమీపంలోకి వచ్చిందో, అంత తొందరగా వెళ్ళిపోయింది.

    చుట్టూ అడవి.

    తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రాణాల్తో ఇద్దరు పారిపోయారు. మృత్యువు ఒకడిని తీసుకు వెళ్ళింది. విహారి- ప్రవల్లిక ఇద్దరే మిగిలారు. ప్రాణగండం తప్పిపోయిందని తెలియగానే, మామూలు భావాలు తిరిగి చోటు చేసుకున్నాయి. విహారి చప్పున మొహం తిప్పుకున్నాడు. ప్రవల్లిక సిగ్గుతో పొదచాటుకి పరుగెత్తింది. ఆమె జీవితంలో ఎప్పుడూ అంత సిగ్గుపడలేదు. మొహం ఎర్రగా కందిపోయింది. చేతులు రెండూ భుజాలకి అడ్డు పెట్టుకుని అరక్షణంలో అదృశ్యమైంది. కానీ ఆ అరక్షణమే ఆ అడవిలో ఒక మెరుపుతీగె ఉజ్జ్వలంగా మెరిసి మాయమైనట్టు అనిపించింది. 

    విహారి పరిస్థితి అంత ఘోరంగా లేదు. అతడికి కనీసం బుష్ షర్టు వుంది.

    అతడికేమి చెయ్యాలో తోచలేదు.

    ప్రవల్లిక వెళ్ళినవైపు చూశాడు. అక్కడి పొదలు నిశ్చలంగా వున్నాయి. ఆమె అక్కణ్నుంచి బయటికి రాలేదని ఏవో ఒక బట్టలు వెతకవలసిన బాధ్యత తనదేనని అతడు గ్రహించాడు.

    తమ బట్టలు మొత్తం లోయలోకి విసిరివేయడం అతడు చూశాడు. అదృష్టవశాత్తు తన చొక్కా మాత్రం దొరికింది. అది ఆమె కిచ్చేస్తే తనకేమీ వుండదు.

    లోయలో పడిన టెర్రరిస్టు శరీరం కోసం అతడు వంగి చూశాడు. దూరంగా క్రింద ఎక్కడో అస్పష్టంగా కనిపిస్తూంది. అక్కడివరకూ దిగివెళ్ళి తీసుకురావడం తప్ప మరోమార్గం లేదు. కానీ రిస్కు. రిస్కు తీసుకోకపోతే ఈ అడవి నుంచి తామిద్దరూ ఆడమ్ అండ్ ఈవ్ లలాగా నాగరిక ప్రపంచంలోకి వెళ్ళాలి.

    ప్రవల్లికని సలహా అడుగుదామా అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ఏం చెపుతుంది? లోయలోకి దిగొద్దు- ఆకులు కట్టుకుని బయల్దేరదాం అనదు కదా.

    అతడిక మరేమీ ఆలోచించకుండా లోయలోకి దిగడం ప్రారంభించాడు. ప్రవల్లిక ఇదంతా చూస్తూనే వుంది. తమ స్థితి తల్చుకుంటూంటే ఆమెకు నవ్వూ, సిగ్గూ ఒకేసారి కలుగుతున్నాయి. చెట్ల కొమ్మలు పట్టుకుని అతడు దిగడం చూస్తుంటే రాంబో గుర్తుకొచ్చాడు. తనకోసమే అతడీ రిస్కు తీసుకున్నాడని ఆమెకు తెలుసు.

    శవం వరకూ వెళ్ళనవసరం లేకుండానే, అదృష్టవశాత్తు చెట్ల కొమ్మల్లో తమ బట్టలు కనపడ్డాయి విహారికి. ఆమె బ్రా దొరకలేదు. మిగతావన్నీ తీసుకుని పైకి వచ్చాడు. పొదకి ఇవతలగా పెట్టి ఆ విషయం చెప్పి, చెట్టుచాటుకి వెళ్ళి అయిదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆమె తయారై వుంది.

    కొంచెంసేపు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోవటానికి సిగ్గుపడ్డారు. విహారికయితే ఆమెను వివాహం చేసుకోబోయే కల్నల్ కు ఈ విషయం తెలిస్తే ఎలా వుంటుందా అన్న అనుమానం వచ్చింది. అరక్షణం పాటు తన కళ్ళముందు అందంగా కదలాడిన మెరుపుతీగె వంపుని సంస్కారయుతంగా ఆలోచన్ల నుంచి తొలగించడానికి అతడు చాలా కష్టపడవలసి వచ్చింది.

    ఇద్దరూ వాహనం దగ్గరకు వచ్చారు. టెర్రరిస్టులు తమను తీసుకొచ్చిన వాహనం అది. అందులోనే తాళాలు వున్నాయి. అతడు దాన్ని స్టార్ట్ చేస్తూ అన్నాడు. "వాడిని చంపినందుకు నా మీద కేసు వుంటుందా?"

    ఆమెకు నవ్వొచ్చింది "ఉండదు" అంది. "రేప్ కాబడడం నుంచి ఒక స్త్రీని రక్షించే సమయంలో చేసే చర్యకు కేసు వుండదు".

    "థాంక్స్".

    "ఆ విషయం నేను చెప్పాలి".

    వాహనం కదిలింది. ఆమెకు కళ్ళజోడు సంగతి అప్పుడు గుర్తొచ్చింది. బుష్ షర్టు జేబులో వెతుక్కుంది. అది వెయ్యి ముక్కలై కనిపించింది. ఆమె దాన్ని ఖాళీచేసే ప్రయత్నంలో నిమగ్నమైంది.

    "మీరు కళ్ళజోడులో బావుంటారు"

    ఆమె తన పని ఆపుచేసి అతడివేపు చూసి నవ్వేసింది. "మీరొక్కరన్నారు అలా. నాకేమో ఈ కళ్ళజోడంటే ఎలర్జీ. ఇది పగిలింది. ఓ పదిరోజులు ఇది లేకుండా తిరగొచ్చుకదా అని సంతోషిస్తున్నాను."

    "ఎవరన్నారు ఆడవాళ్ళకి కళ్ళజోడు బావుండదని? కళ్ళజోడు తెలివితేటలకు చిహ్నం. నిజానికి కళ్ళజోడు మీకు బోలెడంత హుందాతనాన్నిచ్చింది."

    ఆమె సీటు వెనక్కి జారి కళ్ళు మూసుకుంది. అలసిపోవడం వల్లనో, అతడి మాటలకో తెలీదు.


                               8


    మరుసటిరోజు పేపర్లలో పిల్లల్ని సి.బి.ఐ. అపాయం నుంచి తప్పించిన వైనం పెద్ద అక్షరాల్తో పడింది. ప్రవల్లిక గురించి విపులంగా వ్రాశారు. విహారి గురించి చిన్న బాక్స్- ఐటమ్ తప్ప ఎక్కువ వివరాలు లేవు.

    మొత్తం వివరాలన్నీ బామ్మకు చదివి వినిపించింది సునాదమాల. ఒకటికి రెండుసార్లు బామ్మ చదివి వినిపించుకుంది. ఆ సాయంత్రమే ఆవిడ విహారి ఇంటికి వెళ్ళింది. సునాదని రమ్మంటే రాలేదు. "ఎందుకు?" అని అడిగింది.

    "అదేమిటే? అసలు నీకు కృతజ్ఞత అనేది వుందా? ఆ అబ్బాయి మీ ఇద్దర్నీ వదిలి పెట్టించడం కోసం ఆ మాదర్చోత్ (ఆవిడ పరిభాషలో టెర్రరిస్టు)లతో పాటు వెళ్ళాడు. ఆ అబ్బాయిగానీ అడ్డుపడకపోయి వుంటే మన విష్ణు ఏమయ్యేవాడో ఒకసారి ఊహించు".

    అది తలుచుకుంటేనే సునాదమాల చేతులు వణికాయి. విష్ణూ అంటే ఆ అమ్మాయికి అంత అభిమానం. పైకి మాత్రం "ఏమయ్యేది, ముఖ్యమంత్రి మారిపోగానే మమ్మల్ని వదిలేసేవారు. అంతేగా?" అంది తేలిగ్గా.

    బామ్మ ఆమె దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తూ "ఏమే, ఇదంతా నీకు పిచ్చా? లేక భయమా? ప్రతీదానికి యేదో ఒక వాదన కల్పించుకుంటావేమిటే! లాభం లేదు. నిన్ను సైకియాట్రిస్టుకు చూపించాల్సిందే" అని గొణుక్కుంటూ, తనొక్కతే విహారి ఇంటికి బయల్దేరి వెళ్ళింది.

    రెండు నిమిషాల్లో బామ్మ, వర్ధనమ్మ స్నేహితురాళ్ళైపోయారు. రామదాసు చరిత్ర నుంచి రామభక్త హనుమాన్ సినిమా వరకూ మాట్లాడేసుకున్నారు. వర్ధనమ్మ కాళ్ళకు బ్యాండేజి పట్టీలు చూసి, "ఏమిటి" అని అడిగింది బామ్మ.

    "బాబు క్షేమంగా తిరిగొస్తే, విష్ణుగుడి కొండమీదకు కాలి నడకన వస్తానని మొక్కుకున్నా" అంది వర్ధనమ్మ.

    "మా అమ్మకి నేనంటే గుడ్డి ప్రేమ" అన్నాడు విహారి కల్పించుకుంటూ. లేకపోతే ఏమిటి చెప్పండి- ఆ గరుత్మంతుడే నన్ను రక్షించాడంటుంది!"

    "పోన్లే నాయనా ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు నాటకం మొదలెట్టబోయే ముందు 'వాతాపి' పాడినట్లే అనుకోరాదూ" అంది బామ్మ. ఘాటు దెబ్బ తగిలినట్లు అనిపించింది విహారికి. ఈ ముసలావిడ్ని చాలా అండర్ ఎస్టిమేషన్ చేశాను అనుకున్నాడు.

    "మీ మనవరాలు ఎలా వుందండీ? బావుందా?" అనడిగాడు.

    "ఏం బాగు నాయనా, దానికి బయటకు రావాలంటేనే చచ్చేటంత భయం. ఎవరితో మాట్లాడాలన్నా సవాలక్ష అనుమానాలు, కోటి సందేహాలు. దాంతో ఎలా వేగాలో, మామూలు మనుషుల్లో ఎలా పడెయ్యాలో తెలియటమే లేదు".

    విహారి లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో ఒక ప్యాకెట్ తో వచ్చి "ఇది నా కాంప్లిమెంట్ గా మీ మనవరాలికి ఇవ్వండి. మారుతుందేమో చూద్దాం" అన్నాడు.

    "ఏమిటి నాయనా ఇది" తీసుకుంటూ అంది బామ్మ.

    "అది సస్పెన్సులెండి" వినయంగా సమాధాన మిచ్చాడు విహారి.

    కొడుకు వేషాలన్నీ చూస్తున్న వర్ధనమ్మ, బామ్మ వెళ్ళిపోయాక అడిగింది "ఏరా? ఆ అమ్మాయిని ఈపాటికి చాలాసార్లు కలిసినట్లున్నావే. ఏమిటి విశేషం" అని. ఆమెకు కొడుకు తొందరగా ఓ ఇంటివాడవుతే చాలు. ఏ అమ్మాయి అయినా ఫర్వాలేదు. అందులోనూ ఈ మధ్య ఆస్థి వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు.

    విహారి తల్లి మనసు గ్రహించినట్లు తేలిగ్గా నవ్వేశాడు. "ఆ అమ్మాయి పోపు పెట్టని ముద్దపప్పు అమ్మా, అందం తప్ప ఇంకేమీ లేదు. అత్తగారితో మాట్లాడటానికి కూడా అయిదు పరదాలు అడ్డుపెట్టుకుంటుంది" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

                        *    *    *

 Previous Page Next Page